Previous Page Next Page 
ది సెల్ పేజి 5


                                      పోటీ కథ
    
    "కథల పోటీ.....కథల పోటీ" మధుమూర్తి పని చేస్తూన్నాడే గాని, అతని మనసంతా కథల పోటీ మీదే వుంది.
    తన పేరు, ఫోటో పేపర్లో చూడాలి. తను ఒక రచయితననే గుర్తింపు రావాలి.
    బ్యాంకు క్యాష్ కౌంటరు నుండి బయట పడటానికి యింకా గంట టైముంది.
    ఉదయాన లేచిన దగ్గర నుండి మధుమూర్తి అదే ఆలోచనలో పడ్డాడు. గడువు తేది రేపే. వున్న ఊర్లో పత్రికాఫీసు. డైరెక్టరుగా వెళ్ళి యివ్వవచ్చు. అయితే అసలింత వరకు కథకు ప్లాను దొరకనేలేదు. రకరకాల ఆలోచనలు అతని మనసును తొలుస్తూనే వున్నాయి. చేస్తుంది క్యాష్ ట్రాన్ శాక్షన్, ఎక్కువ తక్కువలొస్తే, ఉద్యోగము ఊడిపోతుంది. బాధ్యత గుర్తుకు వచ్చినప్పుడల్లా, టెన్ షన్ కు గురి అయ్యి టీ ఆర్డరు యిస్తూనే వున్నాడు.
    "హే భగవాన్, ఇంకో గంట ఎలాగోలా గడిచిపోతే బాగుండును" అనుకున్నాడు. కలం కాగితం మీద పెట్టందే ఆలోచనలు ఒక కొలిక్కివచ్చేటట్లు లేవు. టైము భారంగా కదిలింది. అమ్మయ్య అనుకోని అన్ని ఫార్మాలిటీసు పూర్తి చేసుకొని రోడ్డెక్కాడు.
    మామూలు కథ వ్రాయకూడదు. యింతవరకు ఆంద్ర ప్రదేశమంతటా రుచి చూడని-అబ్బే యావత్ ప్రపంచ మంతా రుచి చూడని సబ్జక్టు తీసుకొని వ్రాయాలి. ఆశయితే వున్నది కాని, ఆలోచనలు పుట్టటం లేదు. "కథలో వాస్తవాన్ని మరుగుపర్చకూడదు"
    "ప్రేమ కథ వ్రాయ కూడదు"
    "కథలో అశ్లీలతలు వుండరాదు"
    "ఎక్కువ పేజీలు  వ్రాయకూడదు. తక్కువ పేజీలు  వుండకూడదు"
    "హత్యలు ఆత్మహత్యలు వుండకూడదు"
    "మానభంగాలు వగైరాలుండకూడదు"
    "ఆర్ధిక విషయాల గురించి వ్రాస్తే, అర్ధ శాస్త్ర మంటారు"
    "రాజకీయాల గురించి వ్రాస్తే, రాజనీతి శాస్త్రము అవుతుంది."
    తనకు తెలిసిన కథా లక్షణాలు మొదలుగా నెమరు వేసుకున్నాడు. ఆలోచనలతో మధుమూర్తి బుర్ర వేడెక్కింది. అటు యిటు చూసి ఎవరు లేరని నిర్దారించుకొని, ఒకసారి గట్టిగా జుట్టు పీక్కున్నాడు.
    లాభం లేదు. మందు కొడితే గాని, కథ వ్రాయలేనేమో! ఏ ముహూర్తాన అనుకున్నానో, ఆదిలోనే హంస పాదులా వుంది. వ్రాయబోయే మొదటి కథ, అబ్బే మందు కొట్టి కథ వ్రాయటం మాట  అటుంచి గుర్రుపెట్టి నిద్రపోవచ్చు. యిక ఈ రాత్రి గోవిందా. దాంతో బారుకు వెళ్ళాలన్న ఆలోచన మానుకున్నాడు. మెదడుకు మేత పెట్టే పని ఏదైనా చెయ్యాలి. సినిమాకు పోతే, ఈ ఆలోచన బాగా నచ్చింది. అగ్రశ్రేణి నటీ నటులున్న రిలీజు పిక్చరు ఆడుతున్న హాలువైపు కాళ్ళు లాక్కెళ్ళాయి. క్యూలో హోరా హోరీ పోరాడి చివరకు టిక్కెట్టు సంపాదించి లోనికి జొరబడ్డాడు.
    సినిమా చూస్తున్నాడే గాని, మధుమూర్తి కి యింకా ఆలోచనలు తెగటం లేదు, "బుర్ర వేడెక్కింది, తలనొప్పి, వృధాప్రయాస, అనాసిన్, బోరు. యింకొద్దు, అనలొద్దు జోలికి పోకు, తేలికేం కాదు, కథ కంచికి, అందరూ రచయితలే చదివేవారు లేరు, వెళ్ళు యింటికి." అని మధుమూర్తి ఆలోచనా పరంపరలో వ్రాయబోయే పోటీ కథకు పెట్టాల్సిన పేర్ల జాబితా. సమయానికి యింటర్వెల్ అవటంతో మధుమూర్తి ఆలోచనలకు తాత్కాలికంగా స్టవ్ పడింది. సినిమా బోరు భరించలేక యింటి దారి పట్టాడు.
    వీధి దీపాలు, వచ్చేపోయే వాహనాల జోరు-దుమ్మూ ధూళి, డీజిలు ఇంజన్ల పొగ-కోలాహలంగా జనం. "జనాభా సమస్య మీద వ్రాసేయ్ కథ" అంది మధుమూర్తి మేధస్సు. కానీ ఈవరకే ఓ ఉధృతం వచ్చేసింది. ఆ ఛాన్సు సెన్సస్ డిపార్టు మెంటువారు తనకివ్వలేదు. ఇంక లాభంలేదు. మరి యింక ఏదో ఒకటి రాసేయాలి. కాలం వృధా చేయకూడదు. అసలు ఎలా వ్రాయాలి? ఏమి రాయాలి అని ఆలోచిస్తున్నాడు మధుమూర్తి.
    యింకా ఆలోచించటానికి టైము అయిపోయినట్లు యిల్లు దగ్గరకొచ్చేసింది. యింటిగుమ్మంవైపు చూసి మధుమూర్తి గుండెలో రాయి పడింది.
    యింటి తలుపులకు తాళముకప్ప వెక్కిరిస్తున్నట్లుగా ఉంది. దగ్గరకు వెళ్ళి చూశాడు. తాళముకప్ప మధ్యలో కాగితము ఉండచుట్టి ఉంది. కంగారుగా తీసి చదివాడు.
    "శ్రీయుతులు మధుమూర్తి గారికి,
    వ్రాయునది!
    ఉదయం ఎన్నింటికి బ్యాంకుకు వెళ్ళారు?
    ఇప్పుడు టైం ఎంత అయింది?
    ఇంతసేపు ఏమి చేసినట్లు,
    ఆ మాత్రానికే కొత్తగా యిల్లు ఎందుకు అద్దెకు
    తీసుకున్నట్లు?
    బ్యాంకులోనే ఓ మూల పడుకోవచ్చుగా!"
                                                                                                       ఇట్లు మీ శ్రీమతి.
    నోట్ : ఆఖరు బస్సుకు పుట్టింటికి బయలుదేరా...!
    వచ్చేది ఆషాఢమాసం, ఇకపై మీ ఇష్టం.
    
    అంతే నెత్తి మీద పిడుగు పడ్డట్లయింది. ఒలింపిక్ పోటీ అన్నట్లు బస్ స్టాండ్ వైపు పరిగెత్తాడు ఆఖరుబస్ మిస్ అవ్వకుండా మిసెస్ ను చేరటానికి రచయిత మధుమూర్తి.
    
                                                                    * * *

 Previous Page Next Page