ఇంటరాగేషన్
ఓ పోష్ లోకాలిటీ. ఆధునాతనమైన భవంతి. ఆ భవంతి వరండాలో స్థంభానికి ఓ ఆల్సేషియన్ డాగ్ కట్టివుంది.
డైనింగు రూములోనుంచి మాటలు వినిపిస్తున్నాయి.
"ఇంకో లడ్డు తినండి" అంటూ అడిగి అడిగి భర్తకు కొసరుతూ వడ్డిస్తోంది ఆండాళ్ళమ్మ.
"వద్దు, వద్దు" అన్నాడు లక్ష్మీపతి.
"పరమాన్నం తినలేదేం?" ఆండాళ్ళమ్మ ప్రశ్న.
"అబ్బా! కడుపు నిండుగా ఉంది. స్వీటు యింక తినలేను. కొద్దిగా అన్నం పెట్టు" అన్నాడు లక్ష్మీపతి. ఆండాళ్ళమ్మ భర్తకు అన్నం వడ్డించి, చికెన్ ఫ్రై ముక్కలు వేసింది. ఆయన అది తిని పళ్ళెంలో చేయి కడిగేశాడు ఆమె పెరుగు తీసుకొచ్చేలోగా. అయ్యో! పెరుగు వేసుకో లేదు, భర్త సరిగా భోజనం చేయలేదని బాధపడింది ఆండాళమ్మ. వరండాలో వాలుకుర్చీలో కూర్చుని చుట్ట ముట్టించి భుక్తాయాసం తీర్చుకోసాగాడు లక్ష్మీపతి.
సమయం రాత్రి 10-11 గంటలు దాటుతుంది. వసారాలో కూర్చుని డైనింగు రూమ్ వైపు ఆకలిగా చూస్తున్న కోటయ్య ఇంకా అమ్మగారు తినలేదు, తను తింటేగాని నాకు గుప్పెడు మెతుకులు పెట్టదు అని అనుకున్నాడు. పొద్దున్నెప్పుడో చద్ది తాగాడు నౌకరు కోటయ్య. లోపల కడుపులో ప్రేగులు ఆకలితో అల్లరి పెడుతున్నాయి.
ఆండాళ్ళమ్మ మజ్జిగ గ్లాసుతో భర్త దగ్గరకు వెళ్ళింది. లక్ష్మీపతి వాలుకుర్చీలో సరిగ్గా కూర్చోలేక మాటి మాటికి గుండెమీద చేయివేసి రుద్దుకుంటున్నాడు. "ఏమండి గుండె నొప్పా" ఆందోళనతో అడిగింది ఆండాళ్ళమ్మ. నొప్పితో బాధపడుతూ అవునన్నట్లు తల ఊపాడు లక్ష్మీపతి. ఆకలితో ఉన్న కోటయ్య ఆమాట వింటూనే ఆదరా బాదరాగా వాళ్ళ ఫ్యామిలీ డాక్టరు వద్దకు పరుగెత్తాడు డాక్టరు గార్ని తీసుకురావడానికి.
* * *
"ఆయనకేమీ ఫరవాలేదమ్మా. ఇంజక్షన్ ఇచ్చాను కదా! కాసేపటిలో నిద్ర పడుతుంది. నేను మళ్ళీ ఉదయాన్నే వస్తాను. ఈలోగా అవసరమనుకుంటే కబురుచేయండి" అంటూ డాక్టరు వెళ్ళిపోయాడు. ఆండాళ్ళమ్మ గబగబ వంటిల్లు సర్దుకుని భర్త మంచం ప్రక్కనే ఆందోళనగా కూర్చుంది. కాసేపటికి ఆమెకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. కోటయ్యకు నాలుగు ముద్దలు పడవేయాలనే విషయం మరిచింది. తెల్లవారుజామున ఆండాళ్ళమ్మ కేకలకు ఉలిక్కిపడి నిద్రలేచాడు పెరట్లో పడుకున్న కోటయ్య "దొంగ వెధవ! ఏమీ తెలియని నంగనాచిలా పడుకున్నాడు" అంటూ తిడుతున్నది ఆండాళ్ళమ్మ.
"ఏమిటమ్మగారు? ఏం జరిగింది?" అని అడిగాడు కోటయ్య ప్రొద్దున్నే అమ్మగారు తనను తిట్టడానికి కారణం ఏమైవుంటుందో ఆలోచించటానికి ప్రయత్నిస్తూ. "బాయిలర్ ఎక్కడ దాచావురా దొంగ వెధవా?" కోపంగా అరచింది ఆండాళ్ళమ్మ. బాయిలర్ మామూలుగా వుండే స్థానం వైపు చూసాడు కోటయ్య. అక్కడ లేదు. మంచినీళ్ళతో కడుపు నింపుకుని, రాత్రి పడుకున్న కోటయ్య నీరసంగా జవాబు చెప్పలేనట్లు చూసాడు. ఆండాళ్ళమ్మ కేకలకు చుట్టుప్రక్కల వాళ్ళు చేరారు. "వీడిలా ఎందుకు చెప్తాడు. పోలీసుల దగ్గర గాని అసలు విషయం కక్కడు" అని ప్రక్కింటి ఆవిడ ఒక ఉచిత సలహా పారేసింది.
ఆ చుట్టుప్రక్కల వాళ్ళ ప్రోద్భలంతో కోటయ్యను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్ళారు. క్రిందటి రోజల్లా ఏమీ తినకపోయేసరికి నీరసంతో కోటయ్యకు అడుగులు పడటం లేదు. దానితో అతను స్టేషనుకి రావటానికి భయపడుతున్నా డనుకుని ఈడ్చుకుంటు తీసుకువెళ్ళారు. కుప్పలా పడివున్న కోటయ్య ముఖంమీద నీళ్ళు చల్లాడు ఒక కానిస్టేబులు. కాసేపటికి కోటయ్య కళ్ళు తెరచి చూసేసరికి యమభటుల్లా ఎదురుగా పోలీసులు కనిపించారు.
"ఏరా కోటయ్య! ఏదో పేదోడినని అమ్మగారు దగ్గరకి తీస్తే మూడుపూటలా తిన్నది చాలక దొంగతనాలు మొదలు పెట్టావా? ఎక్కడదాచావో చెప్పేయి బాయిలర్" అని ఉపోద్ఘాతంగా అడిగాడు హెడ్ కానిస్టేబుల్. కోటయ్య కడుపులో ప్రేగులు ఆకలికి కేకలు పెడుతుంటే కడుపు లుంగ చుట్టుకుపోతున్నట్లువుంది. శోష వచ్చేటట్లుంటే హెడ్ వేపు చూచి కళ్ళు మూసుకున్నాడు. "వాడిలా ఎందుకు చెప్పాడు. లాఠీకి పని చెప్పాల్సిందే" అంటూ రెండంటించాడు హెడ్.
"రాత్రి" మా వారికి వంట్లో బాగోలేదండి. అదే ఛాన్సనుకుని బాయిలర్ కొట్టేశాడు వెధవ. మళ్ళీ ఏమీ ఎరుగనట్లు పెరట్లో పడుకున్నాడు" ఆండాళ్ళ,మ్మ చెప్తుంటే వింటున్నారు పోలీసులు. కోటయ్యలాంటి వాళ్ళతో ఎలా చెప్పించాలో పోలీసులకు బాగా తెలుసు. కోటయ్యను కార్కానాలో పెట్టారు. ఇంటరాగేషన్ మొదలు పెట్టారు. వారి దెబ్బలు ఎడాపెడా తగులుతున్నాయి. కోటయ్య ప్రాణం గిలగిల లాడింది. బూతు కాళ్ళతో కూడా ప్రయోగం చేస్తున్నాడు. హెడ్ అప్పుడప్పుడు దెబ్బలకు తట్టుకోలేకపోతున్నాడు కోటయ్య. అంతలో సబ్ ఇన్ స్పెక్టరు స్టేషనుకి వచ్చాడు. విషయం తెలుసుకున్న యస్. ఐ. కొట్టడం ఆపమని చేతితో సైగ చేసి, "ఏరా నిజం ఏమిటో చెప్పు" అని గర్జించినట్లుగా అడిగాడు. యస్.ఐ ని చూస్తూనే పెద్దపులిని చూచినట్లుగా వణికిపోయాడు కోటయ్య. నీరసంగా చెప్తానన్నాడు, తలవూపాడు కోటయ్య. దొంగతనాలకి కొత్తలా వున్నాడు వెంటనే నిజం వప్పుకున్నాడను కున్నారు పోలీసులు. యస్.ఐ. ఆదేశంతో కోటయ్యను లాకప్పులో పడేసి అందరూ భోజనాలకి వెళ్ళిపోయారు. యధావిధిగా కాంట్రాక్టుకుర్రాడు కోటయ్యను పెట్టిన సెల్ ముందు ఒక అన్నం ప్యాకెట్టు పెట్టి వెళ్ళిపోయాడు. యిక స్టేషన్ లో ఉన్న సెంట్రివచ్చేపోయేవాళ్ళకు యస్. ఐ గారు ఎప్పుడు వచ్చేది చెబుతూ ఫోన్లు వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి ఫోను దగ్గర కూర్చున్నాడు.
* * *