"అలాకాక మరెలా అంచనా వెయ్యటం? అంతర్యాలను తెలిసికోగలిగే శక్తి ఆ అంతర్యామికే ఉంది. ఆడపిల్లల్ని నానారకాలుగాను అల్లరిపెట్టాలని ప్రయత్నిస్తూ వాళ్ళు లొంగిరాకపోతే కసికొద్దీ దుష్ప్రచారం చేస్తూ, లొంగిపోతే లోకువకట్టి బ్రతుకును సర్వనాశనం చేసి తమదారి తాము చూసుకుంటూ విచ్చలవిడిగా సంచరించే రౌడీమూక లధిక సంఖ్యలో ఉన్న సమాజంలో నివశిస్తున్న నేను నడిరోడ్డుమీద ప్రేమలేఖ నందించటానికి ప్రయత్నించే మిమ్మల్నెలా గౌరవించను?"
కేశవ బాధగా నుదురు రాసుకున్నాడు.
"అయితే నేనే పొరపాటు చేశానా? కేవలం నా పొరపాటు కారణంగానే నా బ్రతుకును నేను నాశనం చేసుకున్నదే కాక మీ బ్రతుకును కూడా నరకం చేశానా?"
"అవును. అక్షరాలా అంతే! వెనుక నా బ్రతుకును నరకం చెయ్యటంకాదు. ఇంకా చేస్తున్నారు. అనవసరంగా మా ఇంటికెందుకొస్తున్నారు? ఇంకొకరి సొత్తయ్యానని తెలిశాక కూడా నాకోసం ఎందుకీ పాకులాట? మీ రాకపోకలు నాకెంత క్షోభ కలిగిస్తున్నాయో తెలుసా? మీకు పుణ్యముంటుంది. ఇంకెప్పుడూ మా ఇంటికి రాకండి. నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి."
"ఇది చాలా కఠినమైన శిక్ష. కాని, ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను తెలివితక్కువగా ప్రవర్తించి మిమ్మల్ని జారవిడుచుకున్నానంటున్నారు. అలాకాక నేను మరికొంత సవ్యంగా వ్యవహరిస్తే మీరు నాకు లభించేవారా? మీ మనసులో నాకు స్థానముందా?"
"ఈ ప్రశ్న ఇప్పుడప్రస్తుతం. దీనికి సమాధానమిచ్చే అర్హత నాకిప్పుడు లేదు."
"అప్రస్తుతమూ కాదు. అర్హతలేకపోనూలేదు. ఇప్పటికైనా పొరపాటు దిద్దుకుందామని అడుగుతున్నాను. సంఘం దృష్టిలో తప్ప ఆయనకు మీరు భార్యకారు. కనుక సమాధానమిచ్చే అర్హత మీకుంది."
"మీరు పొరపడుతున్నారు. సంఘం దృష్టిలోనే కాదు. మనసారా నేనాయనకు భార్యను."
కేశవ నిరసనగా నవ్వాడు.
"పచ్చి అబద్ధం! చలపతిని ఒకసారి చూసిన ఏ ఆడదీ అతణ్ని రెండవసారి చూడాలని కోరుకోదు. మీరు మీ విధిని నిర్వహించగలరేమోకాని అతడిని ప్రేమించలేరు."
ఆ మాటలకు కోపోద్రేకంతో కేశవను చాచికొట్టబోయిన ఉమ చేతిని చలపతి చటుక్కున పట్టుకున్నాడు.
చలపతిని చూసి కేశవ స్థాణువయిపోయాడు.
ఉమ కళ్ళలో నీళ్ళు నిండిపోయాయి.
"నిజం చెప్పినందుకు కొడ్తావా ఉమా?" అన్నాడు నిదానంగా చలపతి.
"అది నిజంకాదు" క్రింద కూలబడి ముఖం చేతులతో కప్పుకుని కాతర స్వరంతో అంది ఉమ.
"అక్షరాలా నిజం."
"చలపతిగారూ..."
దీనంగా ఏదో అనబోతున్న కేశవను మధ్యలో ఆపేశాడు చలపతి.
"నాకేం చెప్పక్కర్లేదు కేశవరావుగారూ! నేను మిమ్మల్ని తప్పుపట్టటంలేదు. ఉమ నా భార్య అనుకున్నన్నాళ్ళూ మీరామెపట్ల మమకారాన్ని చంపుకోవటానికే ప్రయత్నించారు. కాదని తెలిశాకే మమకారాన్ని పెంచుకున్నారు. కాళి దయవల్ల మీ ఉత్తరం నేను చదివాను. ఉమ చదివుంటే అప్పుడే చించిపారేసేది. మీ ఇద్దరి పూర్వ పరిచయస్వరూపమేవిఁటో తెలుసుకోవాలనుకున్నాను. అందుకే నేను వెనుక వస్తానని మభ్యపెట్టి ఉమను ముందుగా ఇక్కడకుపంపి మీ సంభాషణంతా విన్నాను. మీరిద్దరూ భార్యాభర్తలు కావాలని మనసారా కోరుకుంటున్నాను. అదే న్యాయం."
కేశవ అచేతనంగా నిలబడిపోయాడు. ఉమ పరిసరాలను మరిచి వెక్కివెక్కి ఏడ్చెయ్యసాగింది. ముగ్గురిలోనూ కాస్త చైతన్యం ఉన్న చలపతే పదిమందీ తిరిగే ప్రదేశంలో తామలా ఉండటం భావ్యంకాదని టాక్సీని కేకేశాడు. టాక్సీ చప్పుడు వినిపించటం ఆగిపోయిన తర్వాత లేచి యాంత్రికంగా స్కూటర్ స్టార్టు చేశాడు కేశవ.
31
కేవలం తనవారిని ఆడుకోవటంకోసం వారమంతా యాంత్రికంగా పనిచేసి ఆదివారంనాడు చాపమీద పడుకుని ఏదో నవల తెరిచింది శోభ.
పుస్తకం తెరిచిందేకాని అందులో అక్షరాలకు బదులు ఆశ, రావు కనిపించసాగారు. రాక రాక వచ్చిన అపూర్వావకాశాన్ని చేజేతులా వదులుకొంది. వదులుకోక ఏం చెయ్యాలి? తను చెయ్యని నేరానికి తనను బాధ్యత వహించటమంటే ఎలా? భవిష్యత్తులోనయినా సక్రమంగా ప్రవర్తిస్తానని మాటియ్యాలిట! అంటే తన విషయంలో గట్టి అపనమ్మకం పాతుకుపోయిందన్న మాట! అనుమానం అసలు రాకుండా ఉండాలేకాని వచ్చాక ప్రతీమాటా ప్రతి చేష్టా అనుమానం కలిగించేవిగానే ఉంటాయి. అనుక్షణమూ సందేహాలతో నడిచే సంసారంకంటే నరకం మరొకటుండదు.
కాని ఆశనెలా మరచిపోవటం? తన కోరిక కాదన్నందుకు కసికొద్దీ రావు తమ ఇంటికి రావటానికి వీల్లేదన్నాడు. ఏవిఁటో విచిత్రంగా తమ ఇద్దరిమధ్యా గాఢమైన అనుబంధం అల్లుకుపోయింది. మొదట రావుగారిలో తనకున్న ఆకర్షణకొద్దీ ఆశను దగ్గరకు తీసింది. చివరికి రావుగారికన్నా ఆశే ఎక్కువయి పోయింది. ఆశను చూడకుండా ఎలా బ్రతకటం? ఒక్కసారి నిర్మలమైన ఆ చిరునవ్వుచూస్తే, అమాయకమైన ఆ కబుర్లువింటే తన చికాకులన్నీ మాయమయిపోతాయి. కొంపదీసి ఆశ మనసుకూడా తనపట్ల విరిగిపోలేదు కదా! అమ్మో! వద్దు. వద్దు. అట్లాంటి ఆలోచనకూడా భరించలేదు.
"అత్తయ్యా! నీకోసం ఎవరో వచ్చారు." అంది రాణి.
చేతిలో పుస్తకం మూసేసింది శోభ. ఎవరు? రావుగారా? అంత అదృష్టమా? తడబడే అడుగులతో బయటిగదిలో కొచ్చింది.
మూర్తి!!
ఏదో భయంకర పిశాచాన్ని చూసినట్లనిపించింది. దారుణమైన కోపంతో ఏవగింపుతో ఆమె సర్వాన్గాలు వణికాయి.
"ఎందుకొచ్చారు?" అతి నెమ్మదిగా అత్యంత కఠినంగా అంది.