కేశవ ఆనాడు ప్రత్యేకంగా ఉమను కలుసుకోవాలనే వచ్చాడు. ఆమె ప్రవర్తనతో బాగా పరిచయమున్న అతడు ఆమె తనతో స్థిమితంగా మాట్లాడుతుందని ఆశపెట్టుకోలేదు. అందుకే తను చెప్పదలచుకొన్నది ఉత్తరం రాసి తీసుకొచ్చాడు. దానినెలా అయినా ఉమ కందజేయాలని ఆశించాడు. తనను చూసీ చూడగానే ఉమ అలా లేచిపోవటంతో కింకర్తవ్యతా విమూఢుడయ్యాడు. కాని బలవత్తరమైన వ్యామోహం ఎలానైనా తన సందేశం ఉమ కందించమని అతనిని ప్రోత్సాహపరిచింది. ఉమ చదువుతూ చదువుతూ వదిలిన రఘువంశకావ్యం కంటపడింది. ఉమ తప్ప ఆ కావ్యం ముట్టుకునేవాళ్ళా ఇంట్లో లేరని కేశవకు తెలుసు. ఆ కారణం చేత తన ఉత్తరాన్ని ఉమ రఘువంశకావ్యంలో పెట్టి ఇవతలికొచ్చేశాడు.
అతడు వెళ్ళీ వెళ్ళగానే కాళి త్వరగా గదిలోకొచ్చి ఆ పుస్తకం తెరిచి ఆ ఉత్తరాన్ని తీసుకుంది.
ఉమ తప్ప ఆ ఇంట్లో పుస్తకాలు చదివేవాళ్ళు లేరన్న కేశవ ఊహ సరైనదే కాని, ఆ ఇంట్లో అతనికి తెలియని విషయం మరొకటుంది. ఆ ఇంట్లో ఒక వ్యక్తి తనను వెఱ్ఱిగా ప్రేమిస్తూ తనా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి తననే అనుసరిస్తూ ఉంటుందని.
ఆ వ్యక్తి కాళి.
కాళి ఆ రూపురేఖలలో పూర్తిగా అన్నపోలికే! కాని ఉమ సాంగత్యంవల్లా, పరిశ్రమవల్లా చలపతి మనసు వికసించి ఉమ సంస్కారం కంటే కూడా అధికమయిన సంస్కారాన్నలవరచుకోగలిగింది. కాని కాళి మనసు సహజమైన మాంద్యంతోపాటు తల్లి దగ్గిరనుండి వారసత్వంతో ఈర్ష్యను కూడా నింపుకొంది. అన్నివిషయాలనూ సంకుచిత దృక్పథంతో చూచేవాళ్ళ మధ్య మసలటం వల్ల సంకుచిత బుద్దే ఆమెకు ప్రాప్తించింది. దానికితోడు వన్నెల విసరకర్రల్లా ఉండే స్నేహితురాళ్ళను సంపాదించి వాళ్ళలా ఉండాలనే తాపత్రయం కొద్దీ వెఱ్ఱి మొఱ్ఱిగా అలంకరించుకుని తన వికారస్వరూపానికి మరింత వికారాన్నాపాదించుకుంటుంది. ఉమ పట్ల ఆరాధనతోనూ, కేశవపట్ల కృతజ్ఞతతోనూ నిండిపోయిన చలపతి మనసుకు కేశవ ధోరణిలో ఏ ప్రత్యేకతా కనిపించకపోయినా, ఏమీ లేకుండానే అనుమానించగల కాళికి మాత్రం కేశవ మనసు అర్థమయిపోయింది. అతనిదృష్టి నాకర్షించాలని ఎంత తాపత్రయపడినా తనను సరిగా తలెత్తికూడా చూడని కేశవ ఎదుటికి రావటానికి కూడా అంగీకరించని ఉమ కోసం అంతగా ప్రాకులాడటం కాళి మనసులోని సహజ ఈర్ష్యానలాన్ని మరింత ప్రజ్వరిల్లజేసింది. బుసలు కొడుతూ ఆమె మనసు కాటువేయటానికి సిద్ధంగా ఉంది. ఉమ ప్రవర్తన ఆమెకేనాడూ ఎడమీయలేదు. ఇన్నాళ్ళకు దొరికిన అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోదలచుకుంది. ఆ ఉత్తరాన్ని తనలో తనొకసారి చదువుకుని పళ్ళు నూరుకొంది. దాన్ని భద్రంగా దాచింది. ఇంటికొచ్చి అలవాటుగా గదిలో కెళ్ళబోతున్న చలపతిని దార్లోనే ఆపి పక్కకు పిలిచి ఉత్తరాన్ని చేతికిచ్చింది.
"ఉమాదేవీ!
ఇంత సాహసానికి పూనుకున్నందుకు క్షమించమని మరిమరి ప్రార్థిస్తున్నాను. మీతో ఒక్కసారి మాట్లాడాలని పరితపిస్తున్నాను. మాట్లాడవలసిన అవసరమూ ఉంది. మిమ్మల్ని చలపతిరావుగారి భార్యగా గుర్తించిననాడు విభ్రాంతితో మతిపోయింది. చలపతిరావు గారిని ఎందుకు చేసుకున్నారో అర్థం చేసుకోగల్గటం నా శక్తికి మించిన పనయింది. ఏది ఏమయినా మరొకరి ఇల్లాలయిన మీమీద ఆశలు పెంచుకోవటం భావ్యం కాదని నిస్పృహలో పడ్డాను. కాని, చలపతిగారి ద్వారా మీ సంసార పరిస్థితులు విన్నాక మీరు చలపతిరావుగారిని మీ ఇష్టప్రకారం చేసుకోలేదనీ, ఏవో బలవత్తరమైన పరిస్థితులకు లోనైఉంటారనీ అర్థం చేసుకున్నాను. ఈ కారణంగానే మీతో ఒక్కసారి సావకాశంగా మాట్లాడే అవకాశం ఇప్పించమని ప్రార్థిస్తున్నాను. రేపు సాయంత్రం మీకోసం పబ్లిక్ గార్డెన్స్ లో ఎదురుచూస్తుంటాను. ఒక్కసారి నాకీ అవకాశం ఇప్పించమని మరి మరి ప్రార్థిస్తున్నాను. మీకోసం బ్రతుకంతా నాశనం చేసుకున్న నన్నీమాత్రం కనికరించగలరని ఆశిస్తున్నాను.
నా సాహసానికి మన్నించమని మరోసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
ఉత్తరం పూర్తిచెయ్యగానే చలపతికి లోకమంతా గిరగిర తిరుగుతున్నట్లుగా అనిపించసాగింది. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ కాళిని "ఈ ఉత్తరం నీకెలా వచ్చిందీ?" అన్నాడు.
కాళి సంగతంతా వివరించి "ఇట్లాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఎన్నాళ్లుగా సాగుతున్నాయో?" అంది.
"నోర్ముయ్యి. ఈ ఉత్తరాన్నిబట్టి ఇదే మొదటి ఉత్తరమని అర్థంకావటంలా?" అన్నాడు విసుగ్గా.
కాళి బిత్తరపోయింది.
"వదిన మాయమాటలు నమ్మి బుట్టలో పడుతున్నావు. ఎంత అలుసియ్యకపోతే ఇలా ఉత్తరం వ్రాస్తాడూ?" కసిగా అంది కాళి.
"ఇంకా వాగావంటే తంతాను. ఉమ ఏనాడూ కేశవ ఎదుటపడలేదు. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఉమ చాలా విశిష్టమైన వ్యక్తి. తన ప్రవర్తనను నేను శంకించలేను. కాని, ఈ ఉత్తరాన్ని బట్టి వివాహానికి ముందే కేశవ ఉమకు పరిచయస్థుడని తెలుస్తోంది. ఆ పరిచయ స్వరూపమేవిఁటో అర్థంకావటం లేదు.
కాళి కోపంగా వెళ్ళిపోయింది.
ఉమ కారణంగానే కేశవ తన బ్రతుకును వ్యర్థం చేసుకున్నాడుట! కేశవను కాదని తనను కోరి వివాహం చేసుకుందా! అసంభవం. ఏ యువతీ అట్లాంటి పిచ్చిపని చెయ్యదు. కేశవ సూచించినట్లు ఉమ పరిస్థితుల ఒత్తిడివల్లనే వివాహం చేసుకుందా? తననిన్నాళ్ళూ ఉమ దూరంగా ఉంచటానికి తను బాగుపడాలన్న అభిలాష ఒక్కటే కారణం కాదేమో?
"అలా ఉన్నారేం?" టీ అందిస్తూ వడిలిపోయిన భర్త ముఖాన్ని చూసి అంది ఉమ!
"ఉమా! నన్నెందుకు పెళ్ళి చేసుకున్నావు?" గంభీరంగా అడిగాడు చలపతి.
ఆనాడు కేశవ రాకతో మనసంతా చికాగ్గా ఉంది ఉమకు. అప్రస్తుతమయిన ఈ ప్రశ్నతో మరింత చికాకు కలిగింది.