"నువ్వు అంగీకరించకపోవచ్చనే నేనూ అనుకున్నాను. అవునులే! ఒకరి ఇల్లాలివయితే నీ స్వాతంత్ర్యం ఏం కావాలి? అయినా నీకు పెళ్ళెందుకు? నువ్వెవరివో తెలిసి తెలిసీ మనసిచ్చిన నేను మూర్ఖుణ్ణి. నీలాంటిదానిని సవ్యమార్గాన నడిపించాలనుకొన్న నేను వెర్రివాడిని. ఇంకా ఏ ముఖం పెట్టుకుని మా ఇంటికొస్తానంటున్నావు? నువ్వు నా ఇంటికొస్తే పదిమందీ నన్ను గురించి ఏం చెప్పుకుంటారో నీకు తెలియదా? బరితెగించిన నీకు దేనికీ లక్ష్యం లేదు. కాని నాకు మానావమానాలున్నాయి. సంఘంతో నిమిత్తముంది. ఇన్నాళ్ళూ ఒక వ్యామోహంలో నిందలన్నీ సహించాను. ఇంకా దేనికీ అనవసరపు అపవాదులు నాకు? నామీది నీ ప్రేమ నింత తేలికగా తెంపుకోగలిగినదానివి ఆశ నెంతలో మరిచిపోగలవు? ఆశ కూడా నాలా హృదయమున్న వ్యక్తి. పాపం, నీ అభిమానాన్ని నిజంగా నమ్ముకొని కొన్నాళ్ళు వ్యథపడుతుంది. దానిని మరపించటం కొంత కష్టమే. అయినా నువ్విక దానికి దూరమవటమే మంచిది. అది నిన్నెంతత్వరగా మరిచిపోతే, దానికీ నాకూ కూడా అంత హాయి. నువ్వు నా ఇంటికి రానక్కర్లేదు. నీకోసం వ్యథపడేవారిని చూసి నవ్వుకోవాలని నీకెంత ముచ్చటగా ఉన్నా, ఆ ముచ్చట తీర్చలేను."
విసురుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు రావు.
అతడు వెళ్ళిన వైపుకే పొడారిన కళ్ళతో చూస్తున్న శోభకు ఏవో మాటలు వినిపించాయి.
"బంగారు పిచ్చుక వలలో పడలేదు కాబోలు! ఏడుస్తోంది. అయ్యో! ఎంత కష్టము! ఎంత కష్టము!"
"అయితే మూర్తిగాడిపని పూర్తిగా గోవిందాయేనా?"
"బొత్తిగా అంత అన్యాయం కాదేమో లేరా. మధ్యలో అప్పుడప్పుడు కాస్త పలకరిస్తుంటుందేమో?"
శోభ వెనక్కు తిరిగింది. ప్రత్యేకం శోభకు వినపడాలనే గట్టిగా మాట్లాడుకుంటున్న కొందరు యువకులు ఘొల్లున నవ్వారు. మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటూ శోభ ముందునుంచి నడిచి వెళ్ళిపోయారు.
రావుగారి మాటలు అక్షరాలా నిజాలు. తన రాకపోకలవల్ల ఆయనకు అపఖ్యాతి చుట్టుకొంటుంది. వేలెత్తి చూపటానికి వీల్లేని ఆయన జీవితంలో తను మచ్చలా తయారవుతుంది. భగవంతుడా! ఈ దారుణశాపాన్నుండి విముక్తి లేదా? ఒకనాడు ఏ ధైర్యంతో సంఘాన్నెదుర్కొందో ఆ ధైర్యం సన్నగిల్లిపోతూంది. మానవుడు సంఘజీవి. సంఘాన్ని కాదని బ్రతకలేడు. తను ఓడిపోయింది. పూర్తిగా ఓడిపోయింది. ఇంక చాలీబ్రతుకు. బ్రతుకులో ఏది మిగిలింది తనకూ?
ఏదో ఆవేశంతో గబగబ రైలుపట్టాలవైపు నడిచింది శోభ. తన పుస్తకాల సంచీ భుజానికి తగిలించుకుని స్కూల్ నుంచి వస్తూ కనిపించింది అన్నకూతురు రాణి. చటుక్కున ఆగిపోయింది శోభ. తనమీద ఆధారపడిన కుటుంబమంతా కళ్ళకు కట్టింది. తన బ్రతుకు తనకోసం కాదు. తన కుటుంబం కోసం. 'తనది' అంటూ తనకేం లేదు. ఈ సంగతి ఏనాడో నిర్ణయమయిపోయింది. మధ్యలో ఆ సంగతి మర్చిపోయి తనకూ తనదైన జీవితం ఉందని అనుకోబోయింది. స్త్రీ సహజమయిన అనురాగమూ, వాత్సల్యమూ తనలోనూ నింపుకోబోయింది. అందుకే ఇంత ఘోర నరకాన్ని అనుభవించవలసి వచ్చింది. తనవాళ్ళకోసం బ్రతుకుతున్న తనకు మరణించే హక్కు కూడా లేదు. తను బ్రతకక తప్పదు. వెనక్కు తిరిగి యాంత్రికంగా ఇంటివైపు అడుగువేసింది శోభ.
29
వంటా వడ్డనా అన్నీ పూర్తిచేసి చాపపరుచుకుని నడుం వాల్చింది ఉమ. పరిశ్రాంత శరీరం తనకు తెలియకుండానే రెప్పలను వాల్చేస్తూంది. చేతిలో పట్టుకున్న రఘువంశకావ్యం జారిపడి ఆ చప్పుడుకు రెప్పలు విడివడ్డాయి. నవ్వుకొంది. ఎడతెరిపిలేని పని- పనివల్ల అలసట. ఏ కొంచెం సమయం దొరికినా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. కాని ఏపనీ చెయ్యాలనిపించదు. తనకు తెలివి ఉంది. చదువుకోవాలనే జిజ్ఞాస ఉంది. సంస్కృతం నేర్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తూంది. కాని తరం కావటం లేదు. తెలివీ, ఆసక్తి ఉంటే చాలదు. అవకాశం కూడా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఈ అవకాశాలు అందరికీ లభించవు. వంటింటి గుడుగుడుగుంజంలో సమిష్టి కుటుంబపు బంజాటంలో తలమునగా పడ్డాక బయటపడడం ఎంత కష్టం? ఎన్ని ప్రతిభాసంపదలున్నా అణగారిపోవలసిందే! ఏవో పిచ్చి పిచ్చి దెబ్బలాటలు, దెప్పి పొడుపులు, అర్థంలేని ఆవేశాలు, నిందారోపణలు, వీటితో మనసు చికాకుపడిపోయి ఆలోచనాశక్తి క్షీణించిపోతుంది. ఆంద్రదేశంలో మధ్యతరగతి కుటుంబాలలో మూడువంతులింతే! ఈ స్త్రీలకు మనోవికాసానికికాని, విజ్ఞానాభివృద్ధికాని అవకాశాలు రావా? శోచనీయమైన స్థితి ఎక్కడంటే ఈ ఆడవాళ్ళలో నూటికి తొంభై మంది తమ రంగులరాట్నంలాంటి జీవితాన్ని సంతోషంతో, గర్వంతో స్వీకరిస్తున్నారు. కళలలో ప్రవేశమున్నవారు సహితం 'సంసారంలో పడ్డాక ఇవన్నీ ఎక్కడ సాగుతాయి?' అనే ధోరణిలో పడిపోతున్నారు. సాగకపోవటమే సహజంగా అంగీకరిస్తున్నారు. ఆ కారణంగా అభివృద్ధిలోకొచ్చే అవకాశాల గురించి ఆలోచించవలసిన అగత్యం కూడా లేకుండా పోతూంది.
బరువుగా మూసుకుపోతున్న కనురెప్పలను బలవంతాన విప్పుకొంటూ మళ్ళీ రఘువంశకావ్యాన్ని చేతిలోకి తీసుకుంది ఉమ. అంతలో ఏదో అడుగులచప్పుడు వినిపించి తలెత్తింది. ఎదురుగా కేశవ నిల్చున్నాడు.
త్రాచుపామును చూసినట్లు తృళ్ళిపడి గబుక్కున అక్కడి నుండి లేచిపోయింది ఉమ.
ఏ సమయంలో అంటే ఆ సమయంలో ఇంట్లోకి రాగలిగే చనువూ, స్వతంత్రమూ కేశవకి చలపతి కలిగించాడు.
అయితే మాత్రం? ఈ సమయంలో చలపతి ఉండడని కేశవకు రూఢీగా తెలుసు. మరెందుకొచ్చినట్లు? అందులోనూ సరాసరి తమ గదిలోకి ఎందుకొచ్చినట్లు? ఏవిఁటి తనకీ అగ్నిపరీక్ష? ఈ బారి నుండి ఎలా బయటపడగలదు? వణికిపోతూ వంటగదిలో తలుపు తీసుకుని నిలబడింది ఉమ.