"తనమీద ఇంట్లోవాళ్ళకి చాడీలుచెప్పే మగాడిని ఏ ఆడపిల్లా ఇష్టపడదు."
"మరేం చేయాలి?"
"నేను చెబుతాను" మృదువుగా నవ్వింది. "ప్రబంధలాంటి తెలివైన అమ్మాయిని సాధించాలీ అంటే ఆమె దృష్టిలో ఇమేజ్ పెరగాలి సుధీర్ పెరగాలి అంటే నేను సహకరించాలి చనువుగా నీ గురించి ప్రబంధ చెవిన వేస్తుంటాను. నువ్వేం మనసు పాడుచేసుకోకు."
సౌదామిని శక్తి గురించి తెలిసిన సుధీర్ లో నిస్త్రాణ చెరిగిపోయింది. ఆ శుభసమయం కోసం ఎదురుచూసే బుద్దిమంతుడిలా వెళ్ళిపోయాడు.
సౌదామిని అక్కడితో ఆగిపోలేదు. పుస్తకం ముందేసుక్కూర్చున్న ప్రబంధ దగ్గరికి వెళ్ళింది.
మాటా పలుకూ లేకుండా హాస్పిటల్ నుంచి వస్తూనే గదిలోకి దూరిన ప్రబంధని గమనిస్తూ వుండిపోయిందిగాని, ఏం జరిగిందో ఆరా తీయలేదు ఇప్పటిదాకా.
"అంత బలంగా ఆకట్టుకుందన్నమాట!" స్వగతంలోలా గొణిగింది సౌదామిని. "లేకపోతే యింతమంది ఆడిపోసుకుంటున్నా ఆమె దగ్గరకు వెళ్ళడమేమిటి?"
"లెట్ హిమ్ గో టూ డాగ్స్."
"పిచ్చిపిల్లా! బాధపడుతున్నావు కదూ?" లాలనగా తల నిమిరింది. "ఇదీ సహజమేనమ్మా నీ తత్వం నాకు తెలుసు. ఓటమిని అస్సలు భరించలేవు."
"పోనీయ్ ఆంటీ!"
"నిజంగా అలా సరిపెట్టుగోగల మనిషివే అయితే నీ గురించి నే నెందుకు బాధపడతాను? లాభం లేదు..." సాలోచనగా అంది. "నువ్వు ఓడిపోకూడదు. అతన్ని అంతగా ఆకట్టుకున్న ప్రణయకన్నా నువ్వే శక్తివంతురాలివి కావాలి."
చెప్పింది ఏం చేయాల్సిందీ. "నీ స్థాయి ఆడపిల్లను ఏ మగాడూ కాదనలేడు ప్రబంధా! నిన్ను సమీపించడానికే నిజానికి భయపడతాడు. ఒకవేళ ఆదిత్య ఆలోచన అదే అయితే సాధ్యమైనంత త్వరగా అది నువ్వు చెరిపేయ గలగాలి. రేపు అతన్ని కలుసుకుంటున్నావు. అవును ప్రబంధా! ఈరోజు నువ్వు రావటం గురించి అనిత అతడికి చెప్పి వుంటుంది కాబట్టి అతడిలో మార్పుని నువ్వు చూడబోతున్నావ్ నిజం!"
ప్రతి క్షణమూ ఆదిత్య ఆలోచనలతో ప్రబంధ నలిగిపోవాలని ఇటు అహంకారాన్ని రెచ్చగొడుతూ, అటు గెలుపుపైన ఆసక్తిని పెంచుతూ సౌదామిని ఆమెను భ్రాంతిలోకి నెట్టింది అనూహ్యంగా.
ఆ రాత్రి ప్రబంధ సరిగ్గా నిద్రపోలేదు. ఆదిత్యమీద ఆసక్తి కన్నా ప్రణయపైన గెలుపు సాధించాలన్న కోరికే ఆమె ఆలోచనల్లో చోటు చేసుకుంది.
నిర్ణయించుకుంది ఏం చేయాలో.
* * *
మధ్యాహ్నం మూడు గంటలు కావస్తూండగా యూనివర్శిటీ లైబ్రరీలో అడుగుపెట్టింది ప్రబంధ.
నిజానికి లంచవర్ లో అదిత్యని కలుసుకోవాలని ప్రయత్నించింది కాని అతడితోపాటు చాలామంది స్టూడెంట్స్ ఉండటంతో ఆగిపోయింది.
ఏది ఏమైనా ఈరోజు అతడితో మాట్లాడితీరాలి. ఫెయిలైతే సౌదామిని బాధపడుతుంది. ఇలా అనుకోగానే చాలా ఉత్సాహమనిపించింది.
ఎక్కడ ఎలా మాట్లాడాలీ అని క్లాసుకి వెళ్ళి ఆలోచిస్తుండగానే ఆదిత్య లైబ్రరీకి వెళ్ళడం కనిపించింది.
అంతే! సౌదామినికిచ్చిన మాటకోసం తను క్లాసు మధ్యలోనే లేచి బయటికి నడిచి లైబ్రరీలోకి వచ్చింది.
పెద్దగా అలికిడి లేదు. నలుగురైదుగురు స్టూడెంట్స్ తప్ప.
ఓ మూల ఒంటరిగా కూర్చుని చదువుకుంటున్నాడు ఆదిత్య.
ప్రబంధలో సన్నని తడబాటు గొడవ పడటానికైతే చాలా దూకుడుగా వెళ్ళగలిగేది కాని ఇప్పుడు వెళ్తున్నది అందుకు కాదు. అయినా వెళ్ళి ఏం మాట్లాడాలి?"
ఓ లిప్తపాటు సౌదామిని గుర్తుకొచ్చి 'పిచ్చి మొద్దులా కంగారేంటి' అని మందలించినట్లు అనిపించడంతో దూకుడుగా అతడిని చేరుకుంది.
చాలాసేపు నిలబడినా అతడు పట్టించుకోలేదు.
ఇప్పుడు మాట్లాడ్డమూ సౌదామినికోసమే అనుకుంటూ అతడి పక్కసీటులో కూచుంది- చిన్నగా కుర్చీ చప్పుడు చేస్తూ.
అప్పుడు చూశాడు ఆదిత్య ఆ చూపులు ఏ గుండె పొరల్లోనో చొచ్చుకు పోయినట్టనిపించి ప్రేమ గురించి మహాకవులు చెప్పిన కొటేషన్స్ అన్నీ సీరియల్ గా గుర్తుకొస్తుంటే- "హల్లో!" అంది తొట్రుపడుతూ.
మృదువుగా నవ్వాడు ఆదిత్య కూడా.
ఇప్పుడేం మాట్లాడాలీ అని ఆమె సంశయిస్తుండగానే అన్నాడు "థాంక్స్!" అని.
"దే... దేనికి?"
"నిన్న హాస్పిటల్ కి వచ్చారట."
"మరేం..." సౌదామినే చెప్పిందనలేదు. "మీ బామ్మగారికి బాగోలేదంటేనూ...చూడాలనిపించింది. మీరు లేరు."
"ఉంటే అప్పుడే థాంక్స్ చెప్పేవాడినిగా!" ఆదిత్య అందంగా నవ్వగలడు అని కూడా తేలిపోయింది. "ఏదన్నా నర్సింగ్ హోమ్ లో చేర్పించాల్సింది.