చాలా గర్వమనిపించింది. అసలు అలాంటి సన్నివేశం ఆదిత్య చూస్తే బాగున్ననుకుంది కాని కనిపించడేం? "హార్ట్ ప్రాబ్లంతో చాలారోజులుగా ఉన్న ఓ ముసలావిడ... అంటే నా ఫ్రెండ్ ఆదిత్యకి బామ్మన్న మాట. ఆవిడ ఎక్కడ?"
డాక్టరు ఇరుకున పడిపోయాడు. ఆహ్దిత్యనే వ్యక్తి భారతదేశ రాష్ట్రపతి కాదు టక్కున గుర్తించి అతడి బామ్మెవరో చెప్పటానికి, ఇలాంటి నిస్సహాయస్థితికి కించిత్తు బాధపడుతూ "ఆవిడ పేరు తెలిస్తే..." అన్నాడు డాక్టరు నీళ్ళు నములుతూ.
అనితని ఆప్యాయంగా చూసిన ప్రబంధ అటుగా నడుస్తూ..." నా పేరు ప్రబంధ! ముఖ్యమంత్రిగారి అమ్మాయిని" తన గురించి అనితకు కూడా తెలియజెప్పి, పదిసెకండ్లలో బెడ్ ని చేరుకుంది.
ఇంత పెద్ద హాస్పిటల్లో తనకిష్టుడైన ఓ వ్యక్తి బామ్మకి ఇలాంటి కష్టం భరించలేనట్టు..." ఇంతకాలం కోమాలో ఉండటమంటే - హాస్పిటల్ కి ఫండ్స్ కొరతేమన్నా ఉందా...చెప్పండి....డాడితో మాట్లాడతాను."
ఇలాంటి చర్చకి అతడు ప్రిపేరైలేడు. "అది కాదు మేడమ్....ఆమెను చేర్చేసరికి జబ్బు బాగా ముదిరిపోయింది. పైగా వృద్దురాలు."
"అంటే వృద్దులకు జబ్బు చేస్తే ఇక నయంకాదని మీ అభిప్రాయమా!"
జవాబు చెప్పలేకపోయాడు డాక్టరు.
ఇంకా అవకాశం తీసుకుంది. "ఆ బెడ్ షీటేమిటి... మార్చి ఎంత కాలమైంది? హైజీనిక్ గా లేని పరిసరాల్లో పేషెంట్సుకి నయమెలా అవుతుంది."
"పొద్దుటే బెడ్ షీటు మార్చారు" అంది అనిత.
"అంటే వాష్ చేయని బెడ్ షీట్సుని ఉపయోగిస్తున్నారన్నమాట."
అయిదు నిముషాల వ్యవధిలో అక్కడున్న స్టాఫ్ ని దులిపేసిన ప్రబంధ చివరగా డాక్టరుతో అంది..." బామ్మగారికి ట్రీట్ మెంటులో ఏ లోపం జరిగినా చాలా గొడవవుతుంది గుర్తుపెట్టుకోండి. ఇకమీరంతా వెళ్ళొచ్చు."
ముఖ్యమంత్రి కూతురుగా గుర్తించడంతో, పైగా సర్ ప్రయిజ్ చెక్ కి వచ్చినట్లు ఆమె ఎడాపెడా వాయగొడుతుంటే అంతసేపూ నిశ్శబ్దంగా నిలబడ్డ డాక్టరు జవాబు చెప్పకుండా వెళ్ళిపోయాడు.
అనుభవజ్ఞుడైన డాక్టరేగాని, ముఖ్యమంత్రితో సరాసరి పేచీపడి తట్టుకునే అనుభవం లేదు మరి.
అతనికిదంతా కలలా వుంది.
ఆ స్థాయికి చెందిన అమ్మాయి అన్నయ్యకి స్నేహితురాలుకావడం చాలా గర్వమనిపించింది.
"ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చేర్పించాల్సింది అనితా!"
"మీ అన్నయ్య ఇందాకే వచ్చి వెళ్ళాడన్నమాట....!" తొలిసారి కలుసుకోవాలనుకుంటే ఇలా జరగడం బొత్తిగా నచ్చలేదు ప్రబంధకి. "ఇంటి దగ్గరే ఉంటాడేమో కదూ?"
"ఇంటి దగ్గర కాకపోతే ప్రణయగారి ఇంట్లో వుంటాడు" అమాయకంగా చెప్పింది అనిత.
మనసు చివుక్కుమంది ప్రబంధకి. ఇంతసేపూ ఉన్న ఉత్సాహం జావగారిపోతుంటే మరెటో చూస్తూ ఉండిపోయింది అరక్షణంపాటు.
నిజానికి ఆదిత్య ప్రణయ ఇంట్లో లేడు. ఇంజనీరింగ్ కి సంబంధించిన హోమ్ అసైన్ మెంటు పూర్తిచేసి హాస్టల్ కి వచ్చిన ఆదిత్య సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళాడు.
ఆ విషయం తెలీని ప్రబంధ ఉక్రోషంగా వార్డు బయటికి నడిచింది.
బయట చీకటిలో నిలబడ్డ సుధీర్ గుండె అసూయతో మండిపోయింది. తను ఇష్టపడే ప్రబంధలో హఠాత్తుగా ఇలాంటి మార్పు భరించశక్యంగా లేదు.
అరగంటసేపు ఎక్కడెక్కడో పిచ్చివాడిలా తిరిగిన సుధీర్ ఆ తరువాత శౌరికోసం ఇంటికి వచ్చాడు గాని, శౌరి లేడు.
ప్రబంధ లోపలి గదిలో ఉండటాన్ని గమనించిన సౌదామిని ఇంటి ఆవరణలోనే సుధీర్ ని పిలిచింది.... "మొహమేం అలా వుంది?"
చెప్పలేదు సుధీర్.
తను నడిపే నాటకంలో చాలా అవసరమైన పాత్ర సుధీర్ అందుకే రెచ్చగొడుతున్నత్తుగా అంది- "అంటే అతన్ని కలుసుకుందన్నమాట!"
"తెలీదు కానీ అక్కడికే వెళ్ళింది."
"పిచ్చిమొహం వేసుకుని కంగారుపడటం కాదు. నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన నా తమ్ముడు గుర్తుకొస్తున్నాడు కాబట్టి నువ్వంటే నాకు ఆపేక్ష సుధీర్. భయపడకు నేనున్నానుగా? అందుకని..." రహస్యంగా అంది. "ప్రబంధ కదలికల్ని ఓ కంట కనిపెట్టు."