Previous Page Next Page 
ఆత్మబలి పేజి 45


    ఉమ భయపడినట్లుగానే చలపతి కేశవతో మొదటినుండీ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పేశాడు.
    దిగ్భ్రాంతితో విన్నాడు కేశవ.
    గుండెలు పగిలే దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ తన గదిలోకి పారిపోయి పరుపు మీద వాలిపోయి కరువుతీరా ఏడ్చేసింది ఉమ.
    కేశవ వెళ్ళిపోగానే చలపతి గదిలోకొచ్చాడు. వెక్కివెక్కి ఏడుస్తున్న ఉమను చూసి మతిపోయి నిలబడ్డాడు. ఆందోళనతో "ఉమా!" అని మీద చెయ్యేశాడు.
    ఆ చేతిని విదిలించికొట్టింది ఉమ.
    "నేను మీకేం అపకారం చేశానని నన్నింత దారుణంగా అవమానిస్తున్నారు? ఇంతకంటే కొంచెం విషమిస్తే హాయిగా తిని విశ్రాంతిగా కళ్ళు మూద్దునే!" తీక్షణంగా అంది ఉమ.
    రాపడి నిలబడ్డాడు చలపతి.
    తన తల్లి భరింపరానంతగా సతాయించినప్పుడు, చెల్లెలు సూటిపోటి మాటలతో మనసు తూట్లు చేసినప్పుడూ కూడా ఉమ మౌనంగా కళ్ళు తుడుచుకుందేకాని, ఏనాడూ ఇలా ఆవేశం తెచ్చుకోలేదు.
    "ఏం జరిగింది ఉమా?"
    "ఆ కేశవతో మన సంసార విషయాలన్నీ చెపుతారా? ఇట్లాంటివి బయటపెట్టుకోవలసిన సంగతులేనా? ఎవరి కవమానం?"
    ఉమ కోపానికీ, ఆవేదనకూ కారణం తెలిశాక చలపతి తెప్పరిల్లాడు. ఉమ అభిమానవతి గనుక అంతగా బాధపడ్తూందనుకున్నాడు.
    "పొరపాటు జరిగిపోయింది ఉమా! ఆయన తన స్వవిషయాలన్నీ అరమరిక లేకుండా నాతో చెప్పటంతో నేనూ చెప్పేశాను. క్షమించు. ఇంకెన్నడూ ఎవరితోనూ చెప్పను."
    "ఇంకెవరితోనైనా చెప్పినా చెప్పకపోయినా ఒకటే!" తనలో తను గొణుక్కుంటూ తల కొట్టుకుంది ఉమ.


                                        28


    మానసికంగానూ, శారీరకంగానూ కూడా విపరీతంగా అలిసిపోయి ఆఫీస్ వదలి రెండడుగులు వేసిన శోభకు తననెవరో పిలిచినట్లయి, వెనక్కు తిరిగి రావును చూసి అయోమయంగా నిలబడింది. ఆనాటి అవమానంతో చివరకు ఆశను చూడాలనే కోరికను కూడా అణచుకొని మనసులో అనుక్షణమూ జరిగే సంఘర్షణ వలన హింసనంతా నిబ్బరంతో భరిస్తూ తనను తానొక యంత్రంగా మార్చేసుకుంది శోభ. రావును చూసి వారంరోజులు మాత్రమే అయింది. అయినా, ఎన్నో యుగాలయినట్లుగా ఉంది. ఒక్కసారిగా రావును చూడగానే శోభ సంభ్రమానికి తట్టుకోలేకపోయింది. కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి. నడిరోడ్దనే పరిజ్ఞానం నశించిపోయింది. తనను చూడగానే శోభ ముఖంలో ప్రతిఫలించిన ఉద్వేగమూ, భావావేశంతో ఆమె కళ్ళల్లో తిరిగిన కన్నీరూ రావును బాగా కదిలించివేశాయి. నోటమాటరాక నిలబడ్డ శోభను జాలిగా చూస్తూ "కారులో కూర్చో! నీతో కొంచెం మాట్లాడాలి. అలా ఎక్కడికైనా పోదాం" అన్నాడు.
    నిర్జీవంగా నడిచి కారులో కూర్చుంది.
    ఇంకా తనతో మాటలేమున్నాయి రావుకు?
    ఏ గతాన్ని బలవంతాన అణచి ఉంచి ఆలోచనలే మాని ఈ వారం రోజులుగా యాంత్రికంగా బ్రతుకుతుందో ఆ గతం రావు దర్శనంతో తిరిగి కళ్ళముందుకొచ్చి మనసును సలిపింది.
    పార్క్ ముందు కారాపి వెనుక డోర్ తెరిచాడు. శోభ కారు దిగి రావు వెనుకనే పార్క్ లోకి నడిచింది. పావుగంట మౌనంగా గడిచింది. అనేక ఆలోచనలతో అలిసిపోయి ఏ ఆలోచనా చేయలేక రావు మాటల కోసం ఎదురుచూస్తూ కూర్చుంది శోభ. తను చెప్పదలచుకున్నదానిని ఎలా చెప్పాలో తెలియటంలేదు రావుకు.
    "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అర్థంచేసుకున్నాను శోభ. ఆశపై నీకు గల మమకారాన్ని కూడా నమ్ముతున్నాను."
    తన చెవులను తను నమ్మలేకపోయింది శోభ. ఆమె కళ్ళలో కోటి చందమామలు వెలిగాయి.
    "కాని ఒక్కమాట..."
    శోభ ముఖంలోకి నిదానించి చూస్తూ అన్నాడు రావు.
    ప్రశ్నార్ధకంగా చూసింది శోభ.
    "నీ గతాన్ని క్షమించగలను. అది పూర్తిగా మరచిపోవటానికే ప్రయత్నిస్తాను. కాని, ఇంకముందయినా నువ్వు డాక్టర్ మధుసూదనరావు భార్యనన్న సంగతి గుర్తుంచుకోవాలి. వెనుకటి స్నేహితులు నీ జీవితంలోకి రాకూడదు. అలా మాటియ్యగలిగితే నిన్ను పెళ్ళి చేసుకుంటాను."
    "నామాట నమ్మండి. మీరు క్షమించవలసిన గతమేదీ నాకు..."
    రావు పెదవులమీది వెటకారపు నవ్వు శోభ నోటిని కట్టేసింది.
    క్షణం క్రితం తన నావరించిన ఉల్లాసం మంచులా విడిపోగా ఉసూరుమంది శోభ.
    రావుకు తనమీద అనుమానం భల్లూకంలా పట్టుకుంది. ఆ పట్టు వీడదు. తన బ్రతుక్కీ మోక్షం లేదు.
    తన సూచన వినగానే శోభ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతుందనీ, ఆరాధనతో, కృతజ్ఞతతో తన పాదాలమీద వాలిపోతుందనీ ఆశించిన రావుకు, శోభ అలా తలవాల్చుకు కూర్చోవటం ఎంతో నిరుత్సాహాన్నీ, ఆశ్చర్యాన్నీ కలిగించింది.
    "మాట్లాడవేం శోభా!"  
    "మీ త్యాగానికి నా ధన్యవాదాలు. కాని అది స్వీకరించే అర్హత నాకు లేదు. మీకు నాలో నమ్మకం లేనప్పుడు మీ అర్ధాంగిగా బ్రతకలేను. కాని ఒక్క ప్రార్ధన. ఆశపై నాకు గల మమకారంలో విశ్వాసం ఉందన్నారు. అది చాలు. ఆశకు ఉపాధ్యాయినిగా, ఆయాగా మీ ఇంటికి రాగలిగే అవకాశాన్ని మాత్రం కలిగించండి. చాలు!"
    శోభ మాటలు రావుకు పిడుగుల్లా తగిలాయి. ఈ వారం రోజుల విరహంలో శోభ తనకెంతకావాలో, శోభను వదిలి ఉండటం ఎంత దుస్సాధ్యమో అర్ధమయింది రావుకు. అందుకే ఎన్నెన్నో అభ్యంతరాలు మనసులో చెలరేగుతున్నా, అన్నీ అణచి శోభను తనదానిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన త్యాగానికీ తన ఔదార్యానికీ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవ్వటానికి మారు ఈ నిర్లక్ష్య తిరస్కారం రావు అహానికి అఘాతమయింది. ప్రతీకార జ్వాలలతో మనసు భగ్గుభగ్గుమనగా వెటకారంగా నవ్వాడు.

 Previous Page Next Page