Previous Page Next Page 
ఆత్మబలి పేజి 44


    తనలో చెడు ఏవిఁటి? ఎంతో శారీరక మానసిక క్లేశానికి తట్టుకొని చలపతిని మెట్రిక్ పాస్ చేయించటమా?
    అర్థం లేకుండా మాట్లాడే మావగారి మాటలకు కర్తవ్య నిర్వహణకై ఎదురుతిరగటమా?
    తీరుబడిగా లోకాభిరామాయణం ముచ్చటించుకునేవాళ్ళ కబుర్లలో పాల్గొనలేకపోవటమా?
    తన విజ్ఞానవృద్ధికి పుస్తకాలు చదువుకోవాలని తాపత్రయపడటమా?
    ఇది మంచీ, ఇది చెడూ అని నిర్ణయించుకోవటానికేవీ కొలత బద్ధలు లేవు. బహుశా అందుకనే కవికుల గురువు సత్పుతుషులకూ, సంస్కారులకూ "మ్రాణ మంతఃకరణ ప్రవృత్తయః" అన్నాడు.
    మిగిలిన ఏ విషయంలోను తన అంతరాత్మను తను నొప్పించలేదు. కాని, కేశవ విషయంలో తన అంతరాత్మ గగ్గోలు పెట్టేస్తోంది.
    కాళి మాటలు పూర్తిగా అబద్ధంకాదు.
    కేశవకు చలపతిపైగల ఈ ప్రేమ అవ్యాజం కాదు. అమాయకుడైన చలపతిని ఈ వ్యూహంలోంచి తప్పించాలని తను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయిపోయాయి.
    ఇంతకంటే స్పష్టంగా ఏం చెప్పాలి? న్యాయానికి చెప్పటానికైనా ఏముందీ?
    కేశవ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గిర్నుంచీ తను నిలిచినచోట నిలవలేకపోతూంది.
    తన అంతరాత్మ బాధతో సుడులు తిరిగిపోతూంది. మస్తిష్కం వేడెక్కిపోతూంది.
    మనసు మరిగిపోతూంది.
    ఇంత యమయాతన దేనికో తనకు తెలుసు.
    నిరంతర సాధనతో దీక్షగా కర్తవ్య పథంలో పయనిస్తున్న తన మనసు అంతరాంతరాలలో దేదీప్యమానంగా ప్రకాశించేమూర్తి ఆ కేశవే!
    తన ఆలోచనలకు తనే హడలిపోయింది ఉమ. ఛీ! ఛీ! తనిలా ఆలోచిస్తూందేవిఁటి? అందుకే మనసు కోతిలాంటిదన్నారు. ఒక్కక్షణం ఆలోచనలకు వదిలేస్తే వంకర ఆలోచనలన్నీ చేసెయ్యగలదు. మనసు సాగరం. దీన్ని మథిస్తే మహాభయంకరమైనవీ, చిత్రవిచిత్రమైనవీ, అపురూపమైనవీ, అమూల్యమైనవీ ఎన్నెన్నో వస్తాయి. తను భరించలేదు అవన్నీ.
    కేశవ రాక తన మనసును మధిస్తోంది.
    ముందు ముందు అమృతం మాటేమో తెలియదు కాని, ప్రస్తుతం భయంకర జ్వాలలతో ఘోరహాలాహలం తనను నిలువునా దహించేస్తూంది.
    అత్తగారి మాటవిని భర్త కేశవను ఇంటికి పిలవకుండా ఉంటే తనెంతో అదృష్టవంతురాలు.
    కాని, ఆ మరునాడే చలపతి కేశవను వెంటతీసుకొచ్చాడు. చలపతి ఇంటికొచ్చే సమయానికి వీధిగదిలో ఉండకుండా ఏ వంటింట్లోనో, పడకగదిలోనో ఉంటూంది ఉమ.
    ఆ కారణం చేత ఇదివరలో నూటికీ కోటికీ కలిగే ఉమ దర్శనం బొత్తిగా కరువయింది కేశవకు. కేశవను కూర్చోబెట్టి ఉమను టీ తెమ్మని కేకేశాడు చలపతి. ఉమ తనెళ్ళకుండా ట్రేలో టీ ఫలహారాలుంచి కాళితో పంపించింది. మరోపనీ, మరోపనీ అయితే ఆవిడ విసుక్కునేదే కాని, కేశవకు టీ ఇయ్యటానికి సంతోషంగా ఒప్పుకుంది. ఉమకు మారుగా తన చెల్లెలు 'టీ' తేవటం చలపతికి నిరుత్సాహం కలిగించింది.
    "మీరు త్వరగా పెళ్ళిచేసుకోండి కేశవరావుగారూ! మీ శ్రీమతిని చూసయినా మా ఉమ నేర్చుకుంటుంది" అన్నాడు.
    కేశవ నవ్వాడు. "పెళ్ళికూతురు దొరకొద్దూ!"
    "మీకు పెళ్ళికూతురు దొరక్కపోవటమేవిఁటీ? మీరు 'ఊ' అంటే లక్షమంది కన్యలు మీ కాళ్ళమీద పడతారు" అక్కడే కూర్చున్న కాళి చటుక్కున అంది.
    కేశవ ఆమెవంక విచిత్రంగా చూశాడు.
    నిరసనతో కూడిన చిరునవ్వు అతని పెదవులమీద విరిసి మాయమయింది.
    "నా కాళ్ళమీద ఎందరుపడితే ఏం ప్రయోజనం? నేను కాళ్ళమీద పడిన కన్య నాకు దొరక్కపోయాక..."
    "అదేవిఁటి?" కుతూహలంగా అడిగాడు చలపతి. కాళి చిన్నపుచ్చుకుని లేచిపోయింది.
    "అవునండీ! నేను చదువుకునే రోజుల్లో వినయమూ, విజ్ఞానమూ, సౌందర్యమూ తన సొత్తుచేసుకున్న ఒక కన్యను ప్రేమించాను. కాని, ఆమె ప్రేమ పొందగలిగే అదృష్టవంతుడిని కాలేకపోయాను. అదేవిఁటో ఆమె నన్ను తిరస్కరించినా, ఆమె మూర్తి నా హృదయంలో హత్తుకుపోయింది. తిరిగి ఆమెలా నన్ను మెప్పించేవారు దొరికేవరకూ నాకు వివాహేచ్చ కలుగదు. అట్లాంటివాళ్ళు దొరకరు. అందుకనే ఇలా ఉన్నాను."
    "మిమ్మల్ని తిరస్కరించిన ఆ మందభాగ్యురాలెవరండీ?"
    "అలా ఎందుకంటారు? నేను మందభాగ్యుణ్ణి కనుకనే ఆమె తిరస్కారానికి మాత్రమే నోచుకోగలిగాను. ఆమెను చేపట్టగలిగే మహాదృష్టం మరొకరికి దక్కింది."
    అప్రయత్నంగా నిట్టూర్చాడు కేశవ.
    "మీకంటే ఆ ఇంకొకరిలో ఏం ఎక్కువ చూసిందావిడ? అతను మీకంటే అందగాడా? విద్యావంతుడా? ధనికుడా?"
    "భగవంతునికి తెలియాలి."
    ఈ సంభాషణలో ప్రతి అక్షరమూ ఉమకు వినిపిస్తోంది. వినిపించాలనే మాట్లాడాడు కేశవ. ఉమ మనసులో దేవదానవ సంగ్రామం చెలరేగుతోంది.
    తనకంటే అన్నివిధాలా అధికుడయిన కేశవ తనతో అంత ఆత్మీయంగా మాట్లాడేసరికి అప్రయత్నంగా చలపతి తన మనసులో బాధకూడా బయటకు కక్కేశాడు."పెళ్ళికాక మీరూ, అయి నేనూ ఇంచుమించు ఒకే జీవితం గడుపుతున్నాం లెండి."
    ప్రక్కన కూర్చున్న కేశవా, లోపల కూర్చున్న ఉమా ఒక్కసారే తృళ్ళిపడ్డారు.
    "ఏవిఁటండీ" అత్యంతాశ్చర్యంతో అన్నాడు కేశవ.
    గబగబ బయటికొచ్చి చలపతి నోరు నొక్కెయ్యాలనిపించింది ఉమకు. కాని, అప్పటికే ఆమెకళ్ళు కన్నీళ్ళతో నిండి ఉన్నాయి. చెక్కిళ్ళు కన్నీటి చారికలు కట్టాయి. అట్లాంటి ముఖంతో వాళ్ళిద్దరిలో ఎవరిముందుకూ రాలేదు.

 Previous Page Next Page