Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 44


    "చెల్లి పెడసర స్వభావం తెలిసిన శౌరి ఇక మాట్లాడలేకపోయాడు. కేవలం అదొక్కటే కారణమనుకున్నాడు తప్ప, దీనివెనుక మరెవరిదో ప్రోత్సాహం ఉందని ఊహించుకోలేకపోయాడు.
    
    ఆ రాత్రి సౌదామిని ప్రబంధని దగ్గరకు తీసుకుంది. "తెలివైన అమ్మాయిని ప్రబంధా! నీ నిజాయితీతో నైతికంగా చాలా గెలుపు సాధించావు. బహుశా ఈ రాత్రికి నిద్రపోడు."
    
    ఆమె ఎవరిగురించి అంటుందో అర్ధంగాక "ఎవరు?" అడిగింది అమాతకంగా.
    
    "ఇంకెవరు? ఆదిత్య!"
    
    "ప్రబంధ చెంపలు కెంపులయ్యాయి- "అతనికి తెలిసిఉంటుందని నే ననుకోను."
    
    "ఎంత అమాయకురాలివి నువ్వు."
    
    నిజంగానే ప్రబంధ అమాయకురాలని బోధపడిన సౌదామిని వేడి చల్లారకుండా మరింత ఉత్సాహపరిచింది "నీ కథలో ముఖ్యపాత్ర అతడే అయినప్పుడు ఈకథనిలాంటి మలుపు తిప్పిన నిన్ను అభినందించకుండా ఎలా ఉంటాడు?"
    
    "కాని..." సాలోచనగా అంది ప్రబంధ. "సూరీ వాళ్ళంతా నన్ను అభినందించారు తప్ప తను రాలేదే!"
    
    "రావటానికి మొహం చెల్లితేగా?"
    
    "ఎందుకు మొహం చెల్లలేదో అడగలేదు ప్రబంధ.
    
    "అవును ప్రబంధా! ఒకనాడు నిన్నో అహంకారిగానే భావించిన ఆహ్దిత్య ఈ సంఘటనతో నీ ఔన్నత్యాన్ని అర్ధంచేసుకుంటాడు. నీ గురించి తను ఇంతవరకూ ఎంత అపార్ధం చేసుకున్నదీ తెలుసుకుని, నీకు పోటీగా నిలిచిన ప్రణయకంటే నువ్వెంత ఉన్నతురాలివో అర్ధంచేసుకుంటాడు. బహుశా నిన్ను ఇంకా తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడేమో కూడా!"
    
    మనస్సు చివుక్కుమంది ప్రబంధకి.
    
    "కాబట్టి నువ్వింకా ఎంత సహృదయురాలివైన వ్యక్తివో, సహృదయత కాదు అతడికోసం నువ్వెంత తపిస్తున్నావో తెలియజెప్పాలి. సహజంగా నువ్వు చొరవగల మనస్తత్వం కలదానివి కాబట్టి వెంటనే నువ్వో పని చేయాలి."
    
    "ఏమిటి?"
    
    "ఈ రాత్రికి అతన్ని కలుసుకోవాలి."    

    నిర్విన్నురాలై చూసింది ప్రబంధ.
    
    "పిచ్చిపిల్లా, రాత్రికి అంటే అంత కంగారుపడతావేం?"
    
    ప్రతి మాటలోనూ ప్రబంధలోని సున్నితమైన పొరల్ని స్పృశించే ప్రయత్నం చేస్తూ అంది సౌదామిని "వెళ్ళేది అతడి బెడ్ రూంకి కాదుగా? వెళ్ళినా పాపం ఏం చేయగలడని?"
    
    "కాస్త మొహమాటస్తుడనుకుంటాను."
    
    "చిట్టి తల్లీ! అదికూడా కనిపెట్టేశావ్!"
    
    ఈ అభినందన తన మేధని గుర్తించేది కావడంతో దీనికి ఆనందించింది ప్రబంధ.
    
    "ఆయన్ని కలుసుకోవాలన్నావుగా ఆంటీ?"
    
    "అవును అదే చెప్పబోతున్నాను" అరక్షణం నిశ్శబ్దం తరువాత అంది సౌదామిని "సామాన్యంగా తొలిసారి మగాడిని, అదీ తనకు ఇష్టమైన వాడిని కలవాలీ అంటే, ఏ ఆడపిల్లయినా చాలా కంగారుపడుతుంది. అందులో కారణంలేకుండా అయితే మరీనూ పిచ్చిపిల్లా! నాకు ప్రతిక్షణమూ నీ గురించే ఆరాటం కదా! అందుకే చాలా సమాచారం సేకరించాను. చూడు.... ప్రతి మనిషికి సున్నితమైన కేంద్రాలు కొన్ని ఉంటాయి. అలాంటిదే ఆదిత్య వాళ్ళ బామ్మకూడా." చెప్పింది ఆమె ప్రస్తుత పరిస్థితి గురించి.
    
    "హఠాత్తుగా ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించావనుకో.... ఆశ్చర్యపోతాడు. కాస్త మనసు విప్పి మాట్లాడేవనుకో, రాత్రంతా నీ గురించే ఆలోచిస్తాడు. ఆ పరిచయంతో రేపు యూనివర్శిటీలో మరోసారి మాట్లాడొచ్చు. అలా మాట్లాడుకుంటూ పోతే కొన్నాళ్ళకి మాటలు కరువవుతాయి. అప్పుడిక మీరు కాదు, మీ మనసులు మౌనంగా కబుర్లు చెప్పుకుంటాయి."
    
    సౌదామిని అనాలిసిస్ నచ్చిందేమో, రాత్రి ఏడున్నర కావస్తుండగా హాస్పిటల్ కి ప్రయాణమైంది ప్రబంధ.
    
    ఆమె వెళ్ళిన అయిదు నిముషాలకి సుధీర్ ఇంటికిరావటం కాక తాళీయమే అయినా దాన్నీ అవకాశంగా వాడుకుందామె.
    
    "శౌరి లేడా?" అని సుధీర్ అడగ్గానే..." ప్రబంధ కూడా లేదు. హాస్పిటల్ కి వెళ్ళింది ఎవరో ఆదిత్యట. అతని బామ్మకి బాగోలేదట." అంటూ చిన్నగా బాంబు పేల్చింది సౌదామిని.
    
    నిశ్చేష్టుడైన సుధీర్ శౌరికోసం ఎదురుచూడలేదు. హాస్పిటల్ కి పరుగెత్తాడు.
    
    మరో ఆరని నిప్పురవ్వ రగులుకుందిక్కడే!
    
                                                             * * *
    
    'కెజిహెచ్' కార్డియాలజీ వార్డులోకి అడుగుపెట్టింది ప్రబంధ. తన రాజసానికి తగ్గట్టు బుట్టనిండా ఆపిల్స్ పట్టుకొచ్చింది. పేషెంట్స్ ని చూడటానికి వట్టిచేతులతో వెళ్ళకూడదన్న సూత్రమొక్కటేకాదు ఆమె పాటించింది. సాధ్యమయినంతవరకూ ఆదిత్యని ఇంప్రెస్ చేయాలని కూడా.
    
    ఆదిత్య కనిపించలేదు.
    
    రాత్రి ఎనిమిది కావస్తుంటే విజిటర్స్ సందడి లేదు.
    
    ద్వారం దగ్గరే ఓ వార్డుబోయ్ ఆపటానికి ప్రయత్నిస్తే... రోషంగా తనెవరన్నదీ చెప్పిన ప్రబంధ అంతటితో ఆగలేదు.... ఎవరైనా పిచ్చివేషాలు వేస్తే హాస్పిటల్ సూపరిండెంటుని సస్పెండ్ చేయిస్తానంది.
    
    వార్డుబోయ్ అప్పటికే పరుగున వెళ్ళి డ్యూటీ డాక్టరుని కలిసి ముఖ్యమంత్రి కూతురి ఆగమనం గురించి చెప్పాడు.
    
    అక్కడ పేషెంట్స్ పరిస్థిథీ, మూలుగులూ చూస్తుంటే చిరాకు కాదు. కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంటే నిలబడిపోయింది పేషెంట్ ఖచ్చితంగా ఎవరో తెలీక.
    
    పరుగున వచ్చిన ఇన్ ఛార్జి డాక్టరు "గుడీవినింగ్ మేడం" అంటూ ఓ విఐపిలా ప్రబంధని సంబోధించాడు.

 Previous Page Next Page