మెరుపుకన్నా వేగంగా రామ్ లాల్ కత్తి ముందుకొచ్చింది. సునాదమాల కెవ్వున అరిచింది.
19
వాతావరణంలో మార్పుని ప్రవల్లిక పసిగట్టింది. ఆఫీసు ఇంతకు ముందులా లేదు. ఏదో మార్పు వచ్చింది.
ఆమె దాన్ని పట్టించుకోకుండా వెళ్ళి సీట్ లో కూర్చుంది. రెండు నిమిషాల తర్వాత చీఫ్ నుంచి పిలుపొచ్చింది.
"మె ఐ కమిన్ సర్."
"ప్లీజ్..."
ఆమె వెళ్ళి ఎదుటి సీట్లో కూర్చుంది. చీఫ్ అదోలా వున్నాడు. "ఎంతవరకూ వచ్చింది నీ ఇన్వెస్టిగేషన్?"
ఆమె నవ్వింది. "ఇన్వెస్టిగేషన్ కేముంది సర్. నేరస్తులు ఎవరో తెలుసు, నేరం మోపటమెలాగో తెలియటంలేదు."
"ఆస్పత్రినుంచి పేషెంట్ ని తీసుకువెళ్ళి ఎక్కడ దాచావు ప్రవల్లికా?"
"తెలీదు సార్."
"మొన్న అడిగినప్పుడు కూడా అదే సమాధానం చెప్పావు. నేను దానిని అంతగా పట్టించుకోలేదు, చట్టబద్ధంగా ప్రతీ పనీ చేయలేనప్పుడు, కొన్ని అవుట్- ఆఫ్-ది వే తప్పదని నాకూ తెలుసు. ఆ దారిలోనే నువ్వూ వెళుతున్నావని వూరుకున్నాను. నీ సిన్సియారిటీ, అనంతానంతస్వామిపట్ల నీ వైరం నాకు తెలుసు. నేను ఆయన భక్తుణ్ని. కానీ నువ్వు చెప్పినదంతా నిజమైన పక్షంలో ఆయన్ని ఉరికంబం ఎక్కించటానికి ప్రయత్నించే మొదటి వ్యక్తిని కూడా నేనే."
ఆమెకు హాయిగా అనిపించింది. "థాంక్స్ సర్" అంది.
"కానీ మనం ఆలోచించిన దారిలో మన పైవాళ్ళు ఆలోచించాలని లేదు" ఆయన ఆగాడు. కొంచెంసేపు ఇబ్బందికరమైన నిశ్శబ్దం. దాన్ని చీలుస్తూ ఆయన అన్నాడు- "ఒక ముఖ్యమైన సాక్షిని ఆస్పత్రి నుంచి తప్పించి శత్రువులకు అప్పగించావు అన్న నెపంమీద డిపార్టుమెంట్ నిన్ను సస్పెండ్ చేస్తోంది ప్రవల్లికా- ఇదిగో ఆర్డరు,"
ఆమె విద్యుద్ఘాతం తగిలిన దానిలా నిశ్చేష్టురాలై అలాగే చూస్తూ వుండిపోయింది. మొదట కొంచెంసేపు ఆయన చెపుతున్నది మెదడు వరకూ చేరలేదు. చేరేక మనసు నితాంత శరాఘాత అవశేషమైంది. శరీరం మంచులో పెట్టినట్టు చల్లగా అయిపోయింది. గుండెల్లో దుఃఖం కళ్ళలోంచి రాలేదు. మరింత బాధపెట్టటానికా అన్నట్టు మనసులోనే వుండిపోయింది.
చుట్టూ ఫైల్స్ అలాగే వున్నాయి.
ఫ్యాన్ మామూలుగా తిరుగుతూనే వుంది.
పాత కర్టెను- కుర్చీలు- బల్లలు- ప్రభుత్వ బ్యూరోక్రసీకి నిదర్శనంగా అలాగే వున్నాయి.
"సారీ ప్రవల్లికా" అన్నాడు చీఫ్. ఆమె మాట్లాడలేదు.
ఆ ఆర్డరు అందుకోవటానికి కూడా ఓపికలేనట్టు అలాగే కూర్చుని వుంది. గుండెల్లో జలపాతం హోరు, మెదడులో అగ్నిపర్వత విస్పోటనం. ఆమె రెండింటి మధ్యా బడబాగ్నిని దాచుకున్న నిశ్శబ్ధ కడలి గర్భం.
ప్రేమ విఫలమైనప్పుడు కూడా ఆమె ఇంత బాధపడలేదు. లక్ష్యం వేరే నిర్ణయించుకుంది. జీవితాశయం ఒక్కటే గమ్యంగా.... మానసికంగా సర్దుకుంది.
కానీ ఇప్పుడు?
ఉద్యోగం పోయింది.
కాదు శత్రువు జాగ్రత్తగా వలపన్ని పట్టుకున్నాడు. దొరికిన జంతువుని చంపలేదు. కాళ్ళు విరిచేసి నిస్సహాయం చేసి ఆనందిస్తున్నాడు. లేకపోతే చీఫ్ ఇంత తొందరగా తిరిగి పదవిలోకి రాడు. తనమీద ఏ సాక్ష్యమూ లేకుండా ఇంత బలంగా నేరం మోపబడి, సస్పెన్షన్ ఆర్డరు చేతికి రాదు.
...ఆమె లేచి నిలబడింది.
చీఫ్ అలాగే చూస్తున్నాడు. అతడిమీద ఆమెకి జాలేసింది. తిరిగి పూర్వపు ఉద్యోగం వచ్చినందుకు తిరుపతి వెళ్ళి వచ్చినట్టున్నాడు. ఆమె విఅపు జాలిగా చూస్తున్నాడు. ఆమెకి తనమీద తను జాలిపడాలో, అతడి మీద జాలిపడాలో అర్ధంకాలేదు.
ఆర్డరు తీసుకుంది.
ఎలెక్ట్ గా నిలబడి సెల్యూట్ చేసింది.
గదిలోంచి నిశ్శబ్దంగా బయటికి వచ్చింది.
విశాలమైన వరండా.
ఎత్తయిన మెట్లు.
విరిగిపోయిన చెట్టుకొమ్మ. ఆధారంలేక వాలిపోయిన కుర్చీ, పనికిరాని పాత సామాన్ల రూము... ఈ దేశపు యంత్రాంగంలా...
ఆమె అదే మూడ్ లో ఇంటికొచ్చింది.
ప్రతాపరావు ఇంట్లో లేడు. వెనుక దారిగుండా చిన్న ఇంటిలోకి ప్రవేశించింది. ఆ ఇల్లు నిశ్శబ్దంగా వుంది. తండ్రి అటువైపు తిరిగి కూర్చుని వున్నాడు.
ఆమెలో అప్పటివరకూ అణగదొక్కబడి వున్న కసి, ఉద్వేగం, ఉక్రోషం- అన్నీ ఒక్కససారిగా బయటపడ్డాయి. "నాన్నా..." అంది కోపంతో వణుకుతూన్న కంఠంతో.
"...దేశం నాకేమిచ్చిందీ అని కాదు- దేశానికి నేనేమిచ్చాను- అని ఆలోచించాలి అన్నారట చరిత్రకారులు. ఈ దేశం గురించి నీకేమైనా తెలుసా నాన్నా! ఇక్కడ బుద్ధుడు పుట్టాడట. ధర్మం నాలుగు పాదాలా నడిచిందట వెళ్ళిపోయింది నాన్నా, నడుచుకుంటూ ఎక్కడికో అది వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రతీ పవిత్ర నదీజలమూ లంచగొండి తనంతో నల్లగా కల్మషమైపోయింది. ఇక్కడ ప్రతీ పచ్చబొట్టూ రెడ్ టేపిజంతో ఎర్రగా పుచ్చిపోయింది. వీటికి అతీతంగా పనిచేద్దామనుకున్నందుకు ఈ దేశం ఇచ్చిన బహుమతి ఏమిటో తెలుసా నాన్నా?.... సస్పెన్షన్ ఆర్డర్" ఆమె దగ్గరగా వెళ్ళి అంది. "-చేసిన ప్రతి పనికీ లాభం ఉండనవసరం లేదు నాన్నా! కానీ గుర్తింపు ఉండాలనుకోవటం స్వార్ధం కాదుగా. చెప్పు నాన్నా" అంటూ కుదపబోయి ఆగిపోయింది.
గుండెల్లోంచి కారిన రక్తంతో నాడి తడిసిపోగా, ఆయన ముందుకు కూలిపోయాడు.
చేతిలో మెడల్ అలాగే వుంది ఆమెని గుర్తించినట్టు! "నాన్న- నాన్న-" ఆమె మాటలు గొంతులో కొట్టుకుంటున్నాయి. మోకాళ్ళ మీద వంగి, తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుంది.
'ఒక సైనికుడు మరణించినంత మాత్రాన యుద్ధం ఆగిపోదు' అన్నట్టు ఆ మెడల్ వూగుతోంది.
ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూంది. .... యిది మూడో దెబ్బ. భాగస్వామి విషయంలో ఓడిపోయినప్పుడు ఉద్యోగంనుంచి ఓదార్పు పొందుదామనుకుంది. ఉద్యోగం పోయినప్పుడు తండ్రి నుంచి స్ఫూర్తి పొందుదామనుకుంది. ఆమె కతడు తండ్రే కాదూ. గైడ్ కూడా..
...ఆమె దాదాపు పది నిమిషాలపాటు అలాగే వుండిపోయింది. నెమ్మదిగా తేరుకుని చుట్టూ చూసింది.
పక్కగదిలో రక్తపు మడుగులో A-5 పడి వున్నాడు.
* * *
సునాదమాల విహారి వేపు భయంగా చూసింది. అతడి మొహం కందగడ్డలా మారి వుంది. కోపం, విషాదం అన్నీ మిళితమై వున్నాయి.
అరగంట క్రితం గడిచిన సంఘటన ఒక సజీవ చిత్రంలా ఆమె ముందు ఇంకా కదులుతూనే వుంది.
మృత్యువుని అంత సమీపంలో చూడవలసి వస్తుందని ఆమె వూహించలేదు. ఆమె చూస్తూ వుండగానే పక్క మనిషి రక్తం జివ్వున చిమ్మింది. "రన్... మాలా... రన్" అని అరిచాడు ప్రతాపరావు. మరోసారి కత్తి అతనిలో దిగింది. ఆమె బయటకు పరుగెత్తింది. అప్పుడే స్పృహ వస్తున్న A-5ని రామ్ లాల్ చంపటమే ఆమెకు తెలుసు. విల్లువదిలిన బాణంలా ఆమె రోడ్డుమీద కొచ్చింది. ఇంటికెలా చేరుకుందో ఆమెకే తెలీదు. స్పృహ తప్పింది. కళ్ళు తెరిచేసరికి విహారి వున్నాడు.
"నాకేం తెలీదు- నాకేం తెలీదు" అందామె భయంగా. "నేను జాగ్రత్తగానే వెళ్ళాను. ఆయన తన మెడల్ చూపిస్తూండగా వెనుక నుంచి ఎవరో వచ్చి-"
"నాన్సెన్స్! నీకూ, నాకూ ఆ ఇద్దరికీ తప్ప మరెవరికీ ఆ చోటు తెలీదు." పక్కనున్న ముక్కాలి పీటని బలంగా కాలితో తన్నాడు. ఆ కొట్టడంలో కోపమూ, నిస్సహాయతా, తమ మనిషి చనిపోయాడన్న కసీ వున్నాయి.
విసురుగా వెళ్ళి పీట కొట్టుకోవడంలో బల్ల కదిలింది. దానిమీద ఉన్న తాయెత్తు క్రిందపడింది.
సున్నితమైన జాయింటు వున్న అంచు నేలకి తగలటంతో, అది రెండుగా విడిపోయింది.
స్వామి బలమైన కోట లోపలికి వెళ్ళడానికి మరో ద్వారం తెరుచుకున్నట్టు- లోపల్నుంచి మైక్రోఫోన్ బయటపడింది.
ఒక్కసారిగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ముందు తనే తేరుకున్నాడు.
వంగి ఆ తాయెత్తుని చేతుల్లోకి తీసుకున్నాడు. అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆ తాయెత్తు ఒక మెగాటన్ బాంబులా కనపడింది. ఇంతకాలం తమ రహస్యాలు ప్రత్యర్ధులకి ఎలా తెలుస్తున్నాయో ఇప్పుడు అర్ధమైంది.
"ఏమిటది?" అడిగింది సునాదమాల.
అతడు మైకుని చేత్తో మూసి "మైక్రోఫోన్-" అన్నాడు.
"అంటే?" అంది అర్ధంకానట్టు.
"మైక్రోఫోన్ అంటే తెలీదా?"
"నాకు ఫోన్ ఎలా పనిచేస్తుందో కూడా తెలీదు."
విహారి ఆమెవేపు కన్నార్పకుండా చూశాడు. ఆమె నిజం చెబుతూందో, ఇంకా అబద్దమాడుతుందో అర్ధంకాలేదు.
సడెన్ గా అతడు రిలాక్స్ అయ్యాడు. స్వామి తాలూకు ఒక ముఖ్యమైన రహస్యం బయటపడింది అన్న సంతోషం అది! నవ్వి, "ఫోన్ ఎలా పనిచేస్తుందో తెలియకుండానే ఇంతకాలం నాకు ఫోన్ చేశావా?" అని అడిగాడు వెక్కిరిస్తున్నట్టు.
సునాదమాల మొహం ఎర్రబడింది. "ప్రతిసారీ మీరు తప్పు నా మీదకే తోసేస్తున్నారు. నేనెక్కడికి వెళ్తున్నదీ వాళ్ళు పట్టుకుంటే అది మీరిచ్చిన తాయెత్తు ద్వారానే... ఆ విషయం తెలుసుకోకుండా నా మీద అనవసరంగా నెపం మోపారు. అలాగే ఈ ఫోన్ ల సంగతి కూడా... మొదట్లో అయితే అబద్ధం చెపుతాననుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆ అవసరం ఏముంది? మీ బరువు సంగతి, ఆ తెల్లచీరెల సంగతి నాకసలు తెలీదు. చెప్పమంటే ఇంకో వందసార్లు ఈ సంగతి చెపుతాను" అంది రోషంగా. అతడామెవైపు కన్నార్పకుండా చూసి-
"నీ కుడిచెయ్యి బొటనవేలు చూపించు" అన్నాడు.
ఆమె ఆశ్చర్యంగా "ఎందుకు?" అంది.
"ముందు చూపించు చెప్తాను."
ఆమె బొటనవేలు ఎత్తి చూపించింది.
"మైగాడ్ లేదే...." అన్నాడు.
"ఏమిటి లేదు?"
"ఆ రోజుల్లో ఫోన్ చేసినప్పుడు, వేలుమీద మచ్చ వుందని చెప్పావు, పైగా అలా కుడిచేతి బొటనవేలు మీద పుట్టుమచ్చ వున్న ఆడాళ్ళకి ప్రేమించిన ప్రియుడే మొగుడవుతాడని పుక్కిట పురాణం కూడా చెప్పావు."
"ఎడమచేతి బొటనవేలు, కాలివేళ్ళు కూడా చూపించమంటారా?" అమాయకంగా అడిగింది.
అతడు కోపం అణుచుకుని "అవసరంలేదు" అన్నాడు. అన్నాడే గానీ, అతడి మనసంతా కన్ఫ్యూజింగ్ గా తయారైంది. మరి తనకి ఫోన్ చేసింది ఎవరు?
* * *
"లేదు విహారీ! ఆయన నాకు తండ్రి మాత్రమేకాదు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్- అన్నీ...స్వవిషయంలో ఓడిపోయినా, వృత్తి ధర్మంలో ఎదురుదెబ్బలు తిన్నా ఆయనే నాకు ధైర్యం చెప్పేవారు. ఆయన లేని లోటు తీరదు-" విషాదంగా అంది.