ఆమె అంత దిగులుగా వుండడం అతనెప్పుడూ చూడలేదు. అనునయిస్తున్నట్టు అతనన్నాడు- "నీ తండ్రి నీకు గైడ్ అయితే, నువ్వు నాకు ఇన్ స్పిరేషన్ వి ప్రవల్లికా. మామూలుగా నాటకాలు ఆడేవాడిని. ఈ రోజు ఈ శక్తులమీద యుద్ధం ప్రకటించేటంత ధైర్యాన్ని పొందానంటే అది కేవలం నీ వాళ్ళే. ఒక్కొక్క మనిషి జీవితబాట మారిపోవడానికి ఒక్కొక్కవ్యక్తి కారణం అవుతూ వుంటాడు. ఆ విధంగా నా ధ్యేయం మార్చింది నువ్వు. మనం మన లక్ష్యం సాధిస్తామన్న నమ్మకం నాకుంది. అప్పుడే మొదటి విజయం సాధించాం కూడా. ఈ సమయంలో నువ్విలా కృంగిపోవడం మంచిది కాదు. ప్లీజ్ చీరప్."
ఆమె పేలవంగా నవ్వింది.
"అవును. ఈ సమయంలో ధైర్యం అవసరం. దానికన్నా ముఖ్యంగా నీ సాయం నాకు చాలా అవసరం-"
"ఒక సి.బి.ఐ. ఆఫీసర్ గా నేను నీకు సాయపడలేక పోవచ్చు."
"ఏం? ఎందుకని?"
"ఉద్యోగం నుంచి నన్ను సస్పెండ్ కాబడ్డాను విహారి..."
అతడు స్థాణువై చూశాడు.
ఆమె జరిగిందంతా వివరంగా చెప్పింది- "... అనంతానంతస్వామి తానెంత గొప్పవాడో మరోసారి మనకు తెలియజెప్పాడు. A-5 ణి మనం దాచి ఉంచిన చోటు తెలియగానే అతని మరణం నిర్ధారణ అయిపోయింది. అది సంభవించకముందే నా సస్పెన్షన్ ఆర్డర్ టైప్ అయిపోయింది. 'ఫలానా వ్యక్తిని ఫలానాచోట దాచావు. అతడికి సరియైన రక్షణ లభించలేదు. అందువల్ల అతడు మరణించాడు. రూల్స్ కి వ్యతిరేకంగా నువ్వీ పని చేసినందుకు నిన్ను సస్పెండ్ చేస్తున్నాము-' అన్న సస్పెండ్ ఆర్డర్. A-5 మరణించక ముందే టైప్ చేయించి, నా కిప్పించి- తన సుపీరియారిటీని మరొకసారి నిరూపించుకున్నాడు."
విహారి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. నిస్సహాయతతో కాదు- కోపంతో, కసితో.
ప్రవల్లిక చెబుతోంది- "ఆ దృశ్యం నేను చూడకపోయినా నా కళ్ళముందు కదలాడుతోంది. కాళ్ళు లేక చక్రాలకుర్చీలో నిస్సహాయుడై కూర్చున్న నా తండ్రి ఆ రామ్ లాల్ చంపిన విధానం! అదృష్టం బావుండి సునాదమాల తప్పించుకుంది. ప్రత్యక్షసాక్షులు తప్పించుకున్నా తననేమీ చేయలేదన్న ధీమాతో రామ్ లాల్ ఆమె వెనుక పరుగెత్తలేదు. నా తండ్రిని కూడా పూర్తిగా చంపలేదు. అతడు చావు అనివార్యమని, తప్పదని తెలిసే స్థితివరకు పొడిచి, పొడిచి, ఆ తరువాత ఆ జీవచ్చవాన్ని కుర్చీలో అలాగే వదిలేసి, తన పని పూర్తిచేసుకు వెళ్ళిపోయాడు. ఏ న్యాయమూ ,సాక్ష్యమూ తనని ఏం చెయ్యలేదని అంత ధీమా అతడిది! అలాంటి దుర్మార్గుణ్ని ఎన్ని వేల ఉరికంబాలమీద, ఎన్ని వేలసార్లు ఉరితీయాలి?" ఆవేశంలో ఆమె అంటున్న మాటలు పూర్తికాలేదు. కారు స్టార్టయిన చప్పుడు వినిపించింది.
ఎప్పుడు వెళ్ళాడో తెలీదు కానీ- విహారి కారు స్టార్ట్ చేసి అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోయాడు.
* * *
అతడి రక్తం ఉడికిపోతోంది.
స్టీరింగ్ పట్టుకున్న చేతులు వణుకుతున్నాయి. ఒక రకమైన పిచ్చితనంతో కారుని అమితమైన వేగంతో పోనివ్వసాగాడు. ఎటు వెళుతున్నాడో తెలీదు. అప్రయత్నంగా అతడి చేతులు స్టీరింగ్ ణి ఆశ్రమంవేపు తిప్పాయి.
స్వామి లేకపోవడంతో పెద్దగా సంచారం లేదు. రోడ్డుకి ఇవతలపక్క ఒక వ్యాను కనబడుతోంది. ఆశ్రమం ద్వారంనుంచి బయటకొచ్చి వ్యానువేపు నడుస్తూ అస్పష్టంగా కనిపించాడొక వ్యక్తి. దూరంనుంచి కూడా ఆ భారీ శరీరం పోలిక తెలుస్తుంది.
ఆ వ్యక్తి రామ్ లాల్.
విహారి చేతులు స్టీరింగ్ చుట్టూ బిగుసుకున్నాయి .శరీరంలో ఒక్కసారిగా రక్తప్రసరణ హెచ్చింది. మరేమీ ఆలోచించలేదు. కారు వేగం పెంచి, సర్రున ఎడమవేపుకి కోశాడు.
* * *
రామ్ లాల్ చాలా సంతోషంగా వున్నాడు. ఎవర్నయినా చంపినప్పుడు గానీ, దారుణంగా హింసించినప్పుడుగానీ అతడికీ విధమైన సంతృప్తి లభిస్తూ వుంటుంది. ప్రతాపరావు, A-5ల మరణం అతడికి ఇలాంటి సంతృప్తే కలిగించింది. స్వామినుంచి పెద్ద మొత్తంలో లభించింది కూడా. ఆ ఆనందంలో ఇరవై నాలుగు గంటలపాటు ఆపకుండా తాగాడు. ఆ మత్తు ఇంకా వదల్లేదు.
ఒక బూతు పాటను పాడుకుంటూ రోడ్డుమీద కొచ్చాడు.
సరీగ్గా ఆ సమయానికి వెనుకనుంచి వచ్చింది కారు. అతడి మనసు ప్రమాదాన్ని సూచించింది. అతడూ సామాన్యుడేమీ కాదు. తరచూ మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చినవాడు.
వస్తూన్న కారుని చూసి ఒక్క ఉదుటున రామ్ లాల్ పక్కకి దూకాడు. అయితే దాన్ని ముందే వూహించినట్టు, కారు నడుపుతున్న వ్యక్తి మరింత ఎడుమ పక్కకి తిప్పాడు. పక్కకి దూకిన రామ్ లాల్ ఎవరిదో ఇంటి ప్రహరీ గోడకి కొట్టుకుని అదే వేగంతో ముందుకు తూలాడు. ఈ లోపులో ఫుట్ పాత్ ఎక్కింది కారు. జేబులోంచి పిస్తోలు తీయడానికి చేసే ప్రయత్నం రామ్ లాల్ వెల్లకిలా జారాడు. ఆ జారడంలో మోకాళ్ళ వరకు రోడ్డుమీద, శరీరం పైభాగం పుట్ పాత్ మీదా వుండిపోయింది.
మొహం పక్కకి తిప్పడానికి కూడా టైము లేనంత వేగంగా వచ్చింది కారు. అప్పుడు వేసింది అతడికి మొదటిసారిగా భయం. స్టీరింగ్ దగ్గిర విహారి కనపడ్డాడు.
వి....హా....రి...!
అతడు లేవబోయాడు. అదే సమయానికి కారు చక్రం అతని కాళ్ళ మీదకు ఎక్కడం, అతడు కెవ్వున అరవడం ఒకేసారి జరిగాయి.
రామ్ లాల్ లేవడానికి ప్రయత్నించాడు. కాళ్ళు సహకరించలేదు. దూరంగా వెళ్ళిపోతున్న కారు కనిపించింది, జేబులోంచి పిస్టల్ తీసి ట్రిగ్గర్ నొక్కడానికి ప్రయత్నించాడు. మైకం కమ్ముతున్నట్టు అనిపించింది. తిమ్మిరెక్కిన కాళ్ళనుంచి బాధ తెలియడం మొదలైంది. అది ప్రారంభం....
అలాగే వెనక్కి వాలిపోయాడు.
* * *
మళ్ళీ అతడికి స్పృహ వచ్చేసరికి ఆస్పత్రిలో వున్నాడు. చప్పున లేవబోయి శరీరం సహకరించక పోవడంతో అనుమానం వచ్చి కాళ్ళవేపు చూసుకున్నాడు.
రెండు కాళ్ళూ ట్రాక్షన్ లో పెట్టివున్నాయి, బ్యాండేజితో రెండూ తాడిచెట్టుల్లా వున్నాయి. బోదకాళ్ళు వచ్చిన వాడిలా కనపడ్డాడు. పైన ఇనుపరాడ్స్ కి రెండు తాళ్ళతో కట్టబడి వున్నాయి కాళ్ళు.
అంత భయంకరాకారుడూ నిస్సహాయంగా పడివున్నాడు.
వరండాలో డాక్టర్లు మాట్లాడుకుంటున్నది వినిపించింది.
"ఈ రెండు కాళ్ళ ఎముకలూ అతుక్కోవడానికి ఎంతకాలం పడుతుంది డాక్టర్?"
"కేవలం ఎముకలు విరిగితే ఫర్వాలేదు. నరాలు కూడా తెగిపోయాయి. అంప్యూటేట్ చెయ్యాలి!"
"మైగాడ్! అంప్యూటేట్?"
ఇద్దరు డాక్టర్లూ మాట్లాడుకుంటూ వరండాలో నుంచి వెళ్ళిపోయారు.
రామ్ లాల్ కి అర్ధం కాలేదు.
అంప్యూటేట్...
అంటే?
... అతడు అడగటానికి ప్రయత్నించాడు. కానీ ఎవర్ని అడుగుతాడు? ఎవరూ లేరు. అది ప్రభుత్వాసుపత్రిలో, ప్రైవేట్ నర్సింగ్ హోమో తెలియటంలేదు. మరో అరగంట వెయిట్ చేశాడు. ఎవరూ రాలేదు. దాన్నిబట్టి చూస్తే ప్రభుత్వాసుపత్రే అని అనిపిస్తోంది. కానీ గది ఖరీదైనదిగా తోస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో అంత ఖరీదైన గదులు ఉండవు.
అతడి అనుమానం తీర్చడానికా అన్నట్టు సిస్టర్ లోపలకు వచ్చింది.
"సిస్టర్! నేనెక్కడున్నాను?" అనడిగాడు.
"అమెరికన్ ఆస్పత్రి."
"అదీ సంగతి" అనుకున్నాడు. కానీ అంతలోనే లక్ష అనుమానాలు... తనని ఇక్కడ ఎవరు చేర్పించారు? తనకి ఇలా జరిగినట్లు, ఇక్కడ చేర్పించినట్టు తనవాళ్ళకి తెలుసా? తెలిస్తే విహారిని ఈపాటికి పైలోకానికి పంపించి వుండరా? బహుశా తెలిసి వుండదు ఈ సంగతి! తెలిసిన మరుక్షణం తను ఈ దేశపు అత్యంత ఖరీదైన ఆస్పత్రిలో వుండేవాడు కదా! అలా లేడంటే, ఇంకా తన వాళ్ళకి ఈ సంగతి తెలిసి వుండదు!
అతడు జేబులు తడుముకున్నాడు. పిస్టల్ లేదు. కాళ్ళకు బ్యాండేజి కడుతున్నప్పుడు తీసి వుంటారు.
అతడు కళ్ళు మూసుకున్నాడు.
విహారీ గుర్తొచ్చి కళ్ళల్లో రక్తం పాకింది. అతడినెలా చంపాలా అని రకరకాల చిత్రవధల గురించి ఆలోచించాడు.
అతడి గదిలో చప్పుడవటంతో కళ్ళు తెరిచాడు. నర్స్ ఏదో సర్దుతోంది.
"అంప్యూటేట్ అంటే ఏమిటి?" అనడిగాడు. అంత నిశ్శబ్దంలో అతడి భయంకరమైన గొంతు హఠాత్ గా వినబడటంతో నర్స్ ఉలిక్కిపడింది. అతడు మళ్ళీ అడిగాడు.
"డాక్టర్ ని పిలుస్తాను" అంటూ వెళ్ళబోయింది.
"ఆగు" కర్కశంగా అన్నాడు. "అంప్యూటేట్ అంటే ఏమిటి?"
నర్సు భయపడుతూ ఏదో చెప్పబోతూ వుండగా గుమ్మం దగ్గర అలికిడయింది. పదిమంది స్టూడెంట్స్ టీచర్ తో కలిసి బిలబిలమంటూ లోపలికి వచ్చారు. ఈ రోజు అంతర్జాతీయ రోగుల దినం- పేషెంట్స్ ని పరామర్శించటానికి వచ్చాం. పిల్లలూ అంకుల్ కి విషెస్ చెప్పండి" అంది టీచర్ హడావుడిగా కళ్ళజోడు సర్దుకుంటూ.
"బెస్టాఫ్ లక్ అంకుల్...." ముక్తకంఠంతో అంటూ పూలు జల్లారు.
"మైగాడ్! అలా శవంమీద జల్లినట్టు జల్లకూడదు పిల్లలూ! కాళ్ళ దగ్గర జల్లాలి. ఇప్పుడీ శవం గురించి... సారీ రోగుల గురించి వివరిస్తాను. అరటిపళ్ళు కుళ్ళిపోతే ఏం చేస్తాం?"
"పారేస్తాం టీచర్!"
"గుడ్... అలాగే కాళ్ళకి రక్తాన్ని తీసుకెళ్ళే నరాలు తెగిపోతే నరాలు కుళ్ళిపోతాయి. వాటిని వెంటనే తీసెయ్యకపోతే ఆ విషం శరీరమంతా పాకుతుంది. అలా కుళ్ళిపోకముందే శరీరభాగాన్ని తీసెయ్యడాన్ని 'అంప్యూటేట్' అంటారు. ఏమంటారూ?"
"అంప్యూటేట్" పిల్లలు కోరస్ గా అన్నారు.
ఆకాశం బద్ధలయినట్టు అనిపించింది. రామ్ లాల్ సన్నగా వణికేడు. కళ్ళముందు పొరలు తొలగిపోతున్నట్టు అనిపించింది. అయితే వాటి వెనుకనుంచి బయటపడిన యదార్ధం శరీరాన్ని చల్లబరిచింది. అతడి కళ్ళముందు భవిష్యత్తు భయంకరంగా కనబడింది.
"ఉట్టి ఎముకే విరిగిందో నరాలు కూడా తెగాయో ఎలా తెలుస్తుంది టీచర్?" ఒక స్టూడెంట్ అడిగాడు.
"మన శరీరంమీద దెబ్బ తగిలితే 'అబ్బా' అంటాం కదా! అంటే అక్కడ రక్తం బాగా ప్రవహిస్తుందన్న మాట! అందుకే దెబ్బ తెలుస్తుంది. రక్తం లేనిచోట కొట్టినా స్పర్శ తెలీదు."
రామ్ లాల్ కాలిమీద విష్ణు సాచిపెట్టి కొట్టాడు. గది గోడలు కదిలేలా అరిచాడు రామ్ లాల్.
"అదేమిటి టీచర్ అలా అరుస్తున్నాడు?"
"అంటే? విరిగిన ఎముకున్న పైన కొట్టావన్నమాట. క్రింద కొట్టి చూడు అరవడు."