"అది ఖాళీ పుర్రెకాదు" అన్నాడు వెనుక నుంచి దార్కా ద్వారం దగ్గర నిలబడి. ఆమె అతడివైపు సాలోచనగా చూసింది. అతడు ఆమె దగ్గరగా వచ్చి ఆ పుర్రెని చేతుల్లోకి తీసుకుని, నుదురు దగ్గర వుండే చీలికని ఎడం చేశాడు. కొంచెం విడిపోగానే వేల్తో దాన్ని రెండుగా విడగొట్టేడు. కపాలం రెండుగా చీలిపోయింది. లోపల చిన్న స్పీకర్ కనపడగానే తులసి పెదవుల మీద చిరునవ్వు కదలాడింది. వంగి బల్లకింద చూసింది. ఆమె భావించినట్టే అక్కడో "కాయిల్" వుంది.
ఆమె లేస్తూ "పుర్రె మాట్లాడుతూందీ అంటే అందరూ పుర్రెని పరీక్షిస్తారు. నీ కెలా తెలిసిందో గానీ మా కందరికీ ్ది మామూలు పుర్రెలాగే కనపడింది." అంది.
దార్కా మాట్లాడలేదు. కపాలాల్తో తనకున్న అనుభవం ఆమెకు చెప్పదల్చుకోలేదు.
"అందులోనూ పుర్రెకు ఏ వైరు కనెక్షన్ లేకపోవడంతో అసలు బల్లని చూడాలీ అన్న అనుమానం ఎవరికీ రాదు. కానీ మాటలు పుర్రెలోంచే వస్తాయి. నిస్సంశయంగా పుర్రెలోంచే....... దానిక్కారణం తెలుసుకోవాలంటే ఫిజిక్సు తెలియాలి. నువ్వు ఫిజిక్స్ చదువుకున్నావా......?"
"లేదు........"
అతడి మాటలు పట్టించుకోకుండా తనలో తానే అనుకుంటున్నట్టు "ఇండక్షన్" అన్నది. "ఇండక్షన్ ద్వారా మాటలు పుర్రెలోంచే వినబడ్తాయి .నీకు ఫిజిక్స్ తెలియకపోతే దాని గురించి ఎంత చెప్పినా అర్ధంకాదు"
"కానీ సిద్దేశ్వరికి మానవాతీత శక్తులు వున్నాయి "అన్నాడు దార్కా. "నేను స్వయంగా చూసేను. లేకపోతే నమ్మేవాణ్ని కాదు."
"ఏది -? తలుపులన్నీ వేసుకుని ఇనప్పెట్టెలో కూర్చోవడమా" అని నవ్వింది తులసి. "ఆమె వళ్ళో వున్న దేవి విగ్రహంలోనే వున్నది ట్రిక్ అంతా. అందులోంచే ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేది."
"అదికాదు" అన్నాడు దార్కా "ఆమె నా చేతి లోంచి బూడిద తెప్పించింది."
"ఏమిటీ.....?"
అతను వివరంగా చెప్పాడు. చేతులు సాచి, పిడికిళ్ళు మూస్తే అందులో బూడిద
రావడం.........అంతా....
అంతా విని ఆమె నవ్వింది. అటూ యిటూ చూస్తూ "కొంచెం బూడిద వుంటే నేనూ చూపిస్తాను" అంది. అతడు చుట్టూ చూశాడు. ఏమీ దొరకలేదు. అతడిదృష్టి తులసి మొహంమీద నిల్చుండిపోయింది. గుండ్రటి మొహపు నుదుటి మధ్యలో గుండ్రటిబొట్టు - కుంకుమది.
అతడి దృష్టి బొట్టు మీదపడగానే, ఆమె అర్ధమైనట్టు కుంకుమ తడిమి చూసుకుంది. అతడు చేతులు సాచి నిలబడ్డాడు "అలాక్కాదు, అని ఆమె అరచేతులు కిందకి వుండేటట్టు సరిచేసి పిడికిళ్ళు ముయ్యి" అన్నది. అతడు ముయ్యగానే ఆమె, తన నుదుటినుంచి కొంచెం కుంకుమతీసి అతడి కుడి పిడికిలిమీద జల్లి "తెరువు రెండు చేతుల్నీ" అంది అతడు పిడికిళ్ళు తెరిచాడు. ఎడమచేతి మధ్యలో కుంకుమ వుంది మిలమిలా మెరుస్తూ.
అతడు దిగ్ర్బాంతుడై "ఎలా జరిగింది ఇది? అరె సిద్దేశ్వరి కూడా ఇలానే చేసిందే" అన్నాడు.
తులసి చిరునవ్వుతో "ఆశ్చర్యంగా నువ్వు సారీ -మీరు ఆలోచించలేదు కానీ, నేను చేసిన ప్రతీ పనిని జాగ్రత్తగా గమనించి వుంటే కుడి నుంచి ఎడమ చేతిలోకి కుంకుమ ఎలా వచ్చిందో అర్ధమవుతుంది" అంది.
అతడు కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆలోచించి, అంతా అర్ధమైనట్లు నవ్వేడు.
తులసి విస్మయంతో కళ్ళు పెద్దవిచేసి "ఫర్లేదు మీకూ తెలివివుందే" అని, వెంటనే అతడి మొహాన్ని చూసి నవ్వేసి, "సారీ" అన్నది. అప్పటికే అతడి మొహం చిన్న పిల్లాడలా రోషంగా ఎర్రబడింది.
అంతలో దూరంగా గోడ గడియారం గంటలు కొట్టటం వినిపించింది.