Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 41


    "చాలా జాగ్రత్తగా రా! ఎవరూ నిన్ను గమనించకుండా చూసుకో" అన్నాడు.

    అరగంట తరువాత ఆమె అక్కడికి ప్రవేశించింది. ఆమె మొహం వెలిగిపోతోంది.

    "ఏమిటి విశేషాలు?" అడిగాడు రాంభరత్.

    "చాలా వున్నాయి. ఆ నిధి ప్లాన్ అతడి దగ్గరే వుంది" అంది.

    "నాకు తెలుసు, నాకు తెలుసు" అన్నాడు రాంభరత్ చిన్న పిల్లాడిలా.

    "ఈ విషయమే సంకల్పనాథ్ కి చెప్తే అతడు నమ్మలేదు. పునర్జన్మలనేవి వున్నాయి. అది మూఢనమ్మకం కాదు. ఇంతకీ వాడు నిన్ను చేసుకుంటానన్నాడా?"

    "అతడికి అలాంటి ఉద్దేశ్యం ఏమీలేదు. మేమిద్దరం ఇప్పుడు మంచి స్నేహితులం. అతడు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె రేపే ఢిల్లీనుంచి దిగుతోంది. ఆ నిధి అతడు తీసుకోవాలా? ప్రభుత్వానికి అప్పగించాలా? అన్నది ఆ అమ్మాయి నిశ్చయిస్తుందట."

    రాంభరత్ తెల్లబోయి "అదేమిటి?" అన్నాడు.

    తనకి బృహస్పతికి మధ్య జరిగిన సంభాషణ తాలూకు వివరాలు చెప్తూ ప్రేమపట్ల అతడి అభిప్రాయాలు కూడా చెప్పింది.

    "ఒక ఆడదాని సలహామీద కోట్ల డబ్బు వదిలేసుకుంటాడా? నిజంగా ఇంత మూర్ఖులు కూడా వుంటారా?" కసిగా అన్నాడు హరిస్వామి.

    "నువ్వెప్పుడైనా జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రేమించి వుంటే నీ కర్ధమై వుండేది" వెక్కిరిస్తున్నట్టు అంది.

    "అసలు విషయం మానేసి మీరిద్దరూ చిన్న పిల్లల్లా దెబ్బలాడుకోకండి" విసుగ్గా అన్నాడు రాంభరత్ సాలోచనగా పచార్లు కొనసాగిస్తూ. "మంగళ్ సింగ్ ఈ విధంగా మారాడంటే ఆశ్చర్యంగా లేదూ?"

    "అతడు మంగళ్ సింగ్ కాదు. ఆ విషయం నాకు నిశ్చయంగా రుజువైంది" అంది రజియా.

    రాంభరత్ పచార్లు ఆపి "అతడు మంగళ్ సింగ్ కాదా?" అన్నాడు.

    "అతడికి ప్లాన్ దొరికింది మంగళ్ సింగ్ భార్య రత్నాబాయి దగ్గర. స్నేహితులిద్దరూ దెబ్బలాడుకుంటున్నప్పుడు ఆ విషయం నా ముందే బయట పడింది."

    హరిస్వామి విసుగ్గా "అతడు మంగళ్ సింగ్ అయితేనేం? గబ్బర్ సింగ్ అయితేనేం? మనం ఒక ముఖ్య విషయం మర్చిపోతున్నాం. అతడి దగ్గరున్న నిధిని అతడే వుంచుకోవాలా, ప్రభుత్వానికి అప్పగించాలా అన్న విషయం నిర్ణయించే వ్యక్తి అతడిని కలుసుకోబోతోంది. రజియా చెప్పినదాని ప్రకారం ఈ అమ్మాయి నిధిని ప్రభుత్వపరం చేయమనే అంటుంది. రేపు సాయంత్రానికి బహుశా బృహస్పతి ఈ విషయమై పత్రిక ప్రకటన ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు"

    "మరేం చేద్దాం?" రాంభరత్ అడిగాడు.

    "ఆ విషయం నాకొదిలి పెట్టండి. దీన్ని నేను సెటిల్ చేస్తాను" రజియా లేస్తూ అంది.

    "ఎలా?"

    "నే చెప్తానుగా" తలుపు దగ్గరికి నడుస్తూ నవ్వింది.

    "ప్రస్తుతం నేనూ బృహస్పతి మంచి స్నేహితులం."


                                                   25


    స్టేషన్ రష్ గా వుంది. అదే సమయానికి కొచ్చిన్ వెళ్ళే రైలు కూడా అవతలివేపు ప్లాట్ ఫారం మీద వుండటంతో అయ్యప్ప దుస్తుల్లో వున్న భక్తులు ప్లాట్ ఫామ్ మీద అంతా కిటకిటలాడుతున్నారు. అంతమంది వ్యక్తులు నల్లటి దుస్తుల్లో ఆ ప్లాట్ ఫామ్ మీద వుండటంతో ఆ దృశ్యం అదోలాంటి మోడర్న్ పెయింటింగ్ లా వుంది.

    ఢిల్లీ నుంచి వస్తున్న ఎక్స్ ప్రెస్ మరికొద్ది నిముషాల్లో రెండవ నంబరు ప్లాట్ ఫామ్ మీదకి వచ్చును" అని అనౌన్స్ మెంట్ వినిపిస్తుండగానే దూరంనుంచి రైలువస్తూ కనబడింది.

    బృహస్పతి ముందుకు నడిచాడు.

    కరెక్ట్ గా అతని ముందే ఏ.సి. కంపార్ట్ మెంట్ వచ్చి ఆగింది. ద్వారంలోంచి జనం హడావుడిగా దిగుతున్నారు. ఒక ఉధృతమయిన ప్రవాహంలా వుందా హడావుడి!

    వెనకగా నిలబడి వుంది హేమంత సంధ్య. ఆమె కాస్త ఎత్తరి అవడం వల్ల ముందున్న వాళ్ళ భుజాల మీదుగా- ఆమె మొహం కనబడుతోంది. బృహస్పతిని చూసి నవ్వింది.

    అతడూ కళ్ళతో నవ్వుతూ పలకరించాడు.

    ....మధ్యలో నది ఉధృతంగా ప్రవహిస్తూంటుంది. శాశ్వతంగా వుండే ఇరు తీరాలూ గంభీరమయిన మందహాసంతో ఆ 'తాత్కాలిక' ఉధృతిని పరిశీలిస్తుంటాయి. ఆ విధంగా ఇద్దరూ నిలబడి వున్నారు. మధ్యనున్న జనప్రవాహం మాయమైపోయింది. తనకేమీ హడావుడి లేనట్టు - ఎదుటివారి చూపే తమకి అపురూపమయిన సంతృప్తినిస్తున్నట్టు, ఒకరినొకరు చూసుకుంటూ వారు తమ ప్రపంచంలోకి వెళ్ళారు. ఏడాది ఎడబాటు తర్వాత కలయిక అది! వసంతమొచ్చి మామిడిని పలకరించిన అనుభూతి! 'ఒక కోయిల పాటకీ- తిరిగిపాడే పాటకీ- మధ్యనున్న దూరం- ఒక వసంతం' అనుకున్నాడు బృహస్పతి మనసులో.

    ద్వారం దగ్గిర జనం ఖాళీ చేశాక ఆమె నెమ్మదిగా ముందుకి వచ్చింది. కంపార్ట్ మెంట్ రెయిలింగ్ పట్టుకుని మెట్లు దిగుతోంది. అకస్మాత్తుగా వాతావరణంలో ఏదోచిన్నమార్పు. "కూలీ.... కూలీ...." అన్న అరుపులు సడెన్ గా తగ్గిపోయిన ఫీలింగ్. జనాన్ని అటూ ఇటూ విసురుగా తోసుకుంటూ ఒక వ్యక్తి ముందుకి వచ్చాడు. ఏం జరిగిందో గ్రహించే లోపులోనే అతడి చేతులు ప్రొఫెషనల్ గా వేగంగా కదిలాయి. చొక్కా వెనకనుంచి ఒక మెస్మరిస్ట్ బయటికి తీసినట్టు గన్ బయటికి తీశాడు. చుట్టూ వున్న జనం దాన్నింకా గమనించలేదు. అప్పుడే అతడి చేతిలోని ఆయుధం నిప్పులు కక్కింది.

    ఆ సమయానికి హేమంత సంధ్య రెండో మెట్టుమీద వుంది. ఒక బలమైన సుడిగాలి ప్రమతంగా వున్న గొడుగుని వెనక్కి తోసినట్టు, ఒక కెరటం బలంగా వచ్చి కొట్టినట్టు ఆమె తూలింది. బాలెన్స్ తప్పడంతో నెమ్మదిగా ముందుకి ఒరిగిపోయింది. ఆమె పూర్తిగా ప్లాట్ ఫామ్ మీదకి జారే లోపులో బుల్లెట్లు ఆమె శరీరాన్ని ఛిద్రం చేశాయి. 

    ప్రయాణీకులు హాహాకారాలు చేస్తున్నారు. ఒక పెద్ద విస్ఫోటనం వినగానే చెట్టుమీద పక్షులు చెల్లాచెదురయినట్టు కకావికలుగా పరుగెడుతున్నారు. ఒక స్త్రీ హిస్టీరిక్ గా అరుస్తోంది. ఒక చంటిపిల్ల గుక్కపట్టి ఏడుస్తోంది. ఉన్మాద స్థితిలో పరుగెడుతున్న జనం అస్తవ్యస్తమై పోయిన సామాన్లని కూడా పట్టించుకోవడంలేదు. మహార్ణవమయిన వరద- మొత్తమంతటినీ తనతో పాటు తీసుకోపోతే, మధ్యలో మిగిలిన మర్రిచేట్టులా ఒంటరిగా నిలబడి వున్నాడు బృహస్పతి. కదిలి ఆమె దగ్గరికి వెళ్ళడానికి కూడా అతడి కాళ్ళు సహకరించలేదు. ఆలోచించటానికి మెదడు సాయపడటం లేదు.

    ఎదురుగా హేమంత సంధ్య పడి వుంది. అతడు అచేతనంగా ఆమెవైపే చూస్తున్నాడు. ఆమె నెమ్మదిగా రెప్పలు పైకెత్తి అతడివేపు చూసింది. శరీరంలోంచి బయటికి పోతున్న ప్రాణాలు నయనాల వరకు వచ్చి ఆగాయి. వీడుకోలు చెపుతున్నట్టు ఆమె కనురెప్పలు అల్లల్లాడాయి.

    అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు అతడు నెమ్మదిగా కదిలాడు. దగ్గరగా వెళ్ళి మోకాళ్ళమీద కూచున్నాడు. దుఃఖం లేదు. వేదన లేదు. ఏదో బలమైన శక్తి హృదయాన్ని అడకత్తెరలో నొక్కి పట్టిన ఫీలింగ్!

    ఆమె తలని తన వళ్ళోకి తీసుకున్నాడు. 'వెళ్ళొస్తాను మిత్రమా' అన్నట్టుంది ఆమె చూపు.

    అప్పుడు కదిలిన కన్నీటిచుక్క ఆమె నుదుటిని అభిషిక్తం చేసింది. ఏదో చెప్పాలన్నట్టు ఆమె పెదవులు అస్పష్టంగా కదిలాయి. అతడామెని మరింత దగ్గరగా తీసుకున్నాడు. బలహీనమైన స్వరంతో అతడి చెవి దగ్గర ఆమె ఏదో గొణిగింది. "....ఆగస్ట్ 15.... పొద్దున తొమ్మిదింటికి.... సంకల్పనాథ్.... పాకిస్తాన్...."

    ఆమె ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా తల వాలిపోయింది.

    అదే సమయానికి ఆమె తండ్రి అక్కడికి చేరుకున్నాడు. అతడి చేతిలోని ఫ్లవర్ బొకే ఆమె మీదుగా పట్టాలమీదికి జారిపోయింది.

    ఆయన దూరంనుంచే ఈ విధ్వంసాన్ని చూశాడు. అయితే కాల్పులు సాగించిన వ్యక్తి కూడా నల్లటి దుస్తుల్లో వుండడంతో ఆయనొక్కక్షణం కన్ ఫ్యూజ్ అయ్యాడు. ఆ వ్యక్తి ఎంత ప్రొఫెషనల్ అంటే- అక్కడ ప్లాట్ ఫామ్ మీద ఆ రోజు అయ్యప్ప భక్తులు వుంటారని ముందే వూహించి, తను కూడా అదే రకం దుస్తులు వేసుకున్నాడు. క్షణాల్లో తుపాకీని ఆ దుస్తుల వెనక మాయంచేసి, జనంలో కలిసిపోయాడు. ఆయన జేబులోంచి రివాల్వర్ తీసి షూట్ చేయబోయేంతలోనే మధ్యలో అడ్డుగా చెల్లాచెదురుగా పరుగెడుతున్న జనం వచ్చారు. దానితో ఆయన ఈ ప్రయత్నం విరమించుకుని కంపార్ట్ మెంట్ దగ్గరికి వచ్చాడు.

    అప్పుడు తెలిసింది ఆయనకీ కాల్పులు సాగించింది తన కూతురిమీదేనని!

    కాల్పులు ఎవరిమీద సాగుతున్నాయో అప్పటివరకూ ఆయన గమనించలేదు. నేర పరిశోధన శాఖలో పనిచేసిన అనుభవంతో ఆయన దృష్టంతా అప్పటివరకూ నేరస్తుడి మీదే నిలిపాడు. అతడు తప్పించుకోవడంతో అప్పుడు తన దృష్టి మరల్చాడు. అదే సమయానికి ఏదో చెపుతూ బృహస్పతి చేతుల్లో మరణించిన కూతురు కనపడింది.

    "హేమా!" దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు.

    జనం రణగొణ ధ్వనుల్లో ఆ స్వరం కలిసిపోయింది.


                                            *    *    *


    మరీ చిన్న హాల్ కాదది. దాదాపు యాభైమంది దాకా ఆఫీసర్లు అక్కడ సమావేశమై వున్నారు. వాళ్ళ సీనియర్ మిగతా వారి నుద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పడానికి వీలుగా వారు కూర్చున్న టేబిల్స్ మీద అక్కడక్కడా మైకులున్నాయి.

    ప్రెసిడెంట్ ఛెయిర్ లో సి.బి.ఐ. చీఫ్ కూర్చుని వున్నాడు. తన సీనియర్ అసిస్టెంట్ చెబుతున్న దానిని అప్పుడప్పుడూ నోట్ చేసుకుంటున్నాడు. ఆగస్ట్ పదిహేను నాడు జరగబోయే ప్రమాదం గురించి వారు చర్చిస్తున్నారు.

    ఆ ప్రమాదం ఎక్కడ జరుగుతుందో, ఎలా జరుగుతుందో అర్ధం కావడం లేదు. రోజులు దగ్గరపడుతున్నాయి. ఆ రోజు సమావేశానికి అదే ముఖ్య కారణం.

    మీటింగ్ మధ్యలో హఠాత్తుగా బృహస్పతి అక్కడ ప్రవేశించాడు. దగ్గరి వాళ్ళయినా సరే ఆ క్షణం అతణ్ణి చూస్తే గుర్తుపట్టలేరు. మాసినగడ్డం, ఎర్రబడ్డ కళ్ళు, పీక్కుపోయిన మొహం- సర్వం కోల్పోయిన మనిషి ఉన్మత్తుడైతే ఎలా వుంటాడో- అదేస్థితిలో వున్నాడు.

    చేస్తున్న పనేమిటో తెలీకపోవడం ఉన్మాదానికి పరాకాష్ట. చుట్టూ సంభవిస్తున్న పరిణామాలనీ పరిస్థితుల్నీ చూస్తూ సగటు భారతీయుడు ఇంకా ఉన్మాది కాలేదూ అంటే- ఇంకా ఏదో ఆశ అతడ్ని నిలబెడుతోందన్నమాట. అటువంటి ఆశ కూడా కోల్పోయిన మనిషిలా వున్నాడు బృహస్పతి.

    ఏ విధమైన హెచ్చరిక కాకుండా లోపలి గాలిలా దూసుకు వచ్చిన వ్యక్తిని చూసి అక్కడున్న జనం కన్ ఫ్యూజ్ అయ్యారు. వారికి ఏమాత్రం ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా- సెక్యూరిటీ గార్డు రోస్టర్ లోంచి పిస్టల్ లాక్కుని వారికి గురిపెట్టాడు. ఆఫీసర్లు అప్రయత్నంగా లేచి నిలబడ్డారు.

 Previous Page Next Page