Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 41


    "టైములేదు. చీరె తీసుకొచ్చి చూపించాడు. నిర్ణయం ఆలస్యం అయితే జాకెట్ కూడా వస్తుందన్నాడు."

    "పనికన్నా ఈ అనుబంధాలు ముఖ్యం కాదు. అందులోనూ- ఏం జరగదని తెలిసి కూడా."

    అప్పటికే ఎర్రబడిన సూర్యారావు మొహం ఈ సమాధానంతో మరింత కందిపోయింది. "కొడుకునే చంపడానికి ప్లాన్ వేసినవాడివి. నీకు అనుబంధాల సంగతేం తెలుస్తుందిలే" అని, పరమేశ్వరం ఇట్నుంచి ఏదో అనబోయేలోపులో ఫోన్ పెట్టేశాడు.

    పరమేశ్వరం మొహంలో మారుతున్న భావాలు గమనించి స్వామి అడిగాడు. "ఏం జరిగింది?"

    "ఏమీలేదు. సూర్యారావు కూతుర్ని విహారి కిడ్నాప్ చేశాడట. సంతకం పెట్టడం ఒక్కరోజు ఆలస్యంచేస్తే చాలు కూతుర్ని వదిలేస్తానన్నాడట?"

    "అదేం కండిషన్?"

    "అదే నాకూ అర్ధంకావడంలేదు."

    "పరమేశ్వరం! నువ్వు తెలివైనవాడివి. నీ అంత తెలివైనవాడు ఇంకొకడు లేడు అని నా ఉద్దేశ్యం. నీ కొడుకు నీ కన్నా తెలివైన వాడిలా కనపడుతున్నాడు. అతడు ఏదో ఎత్తువేసి వుంటాడు. దాన్ని కనుక్కోలేవా?"

    "బహుశా సూర్యారావుకీ, మనకీ మధ్య విభేదాలు సృష్టించడానికి ఈ ప్లాన్ వేసి వుంటాడు."

    "ఒక్కరోజు ఆలస్యం అవడంవల్ల విభేదాలు వస్తాయని ఎలా అనుకుంటాడు?" అడిగాడు స్వామి.

    "మీరు అనుచరుల నుంచి స్పష్టమైన క్రమశిక్షణ ఆశిస్తారని అతడికి తెలిసి వుంటుంది. మినిష్టర్ కూతుర్ని కిడ్నాప్ చేయడమంటే మాటలు కాదు. అంత రిస్క్ తీసుకున్నాడు. కేవలం "ఒక్కరోజు" అంటే మినిష్టర్ కూడా పోలీసులకి ఫోన్ చేయడు. అందువల్లే "ఒక్కరోజు" కండీషన్ పెట్టి ఉంటాడు. కానీ, ఒక్కరోజు అనుకున్నది నాలుగురోజులు అవడంవల్ల విజయదశమి దాటిపోయి మీకు బాగా కోపం వస్తుందనీ, సూర్యారావుమీద యాక్షన్ తీసుకుంటారనీ అనుకుని వుంటాడు. ఆ విధంగా స్పర్ధ వస్తుందని భావించి వుంటాడు" పరమేశ్వరం సాలోచనగా అన్నాడు.  

    స్వామీ, పరమేశ్వరం దగ్గరికి వచ్చి భుజంతట్టి "గుడ్, అదే జరిగి వుంటుంది. కానీ, మనం అంత తేలిగ్గా బుట్టలో పడతామని అనుకుంటే నీ కొడుకు చాలా పొరపాటు పడ్డాడు" అంటూ నవ్వేడు.

    పరమేశ్వరం కూడా నవ్వి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

    నిజానికి జరిగింది అదికాదు. పొరపాటు పడింది వాళ్ళిద్దరే.


                                                   *    *    *


    "హల్లో"

    "సూర్యారావు స్పీకింగ్"

    "నేను విహారిని మాట్లాడుతున్నాను."

    "నువ్వు చెప్పినట్టే ఆ సంతకాలు పెట్టడం ఒక రోజుపాటు ఆపు చేశాను. ఇంకా నా కూతుర్ని వదలలేదేమిటి?"

    "ఇంకా ఒక్కరోజు పూర్తి కాలేదుగా సూర్యారావ్! ఇరవై నాలుగు గంటలు పూర్తికానీ, తప్పక వదిలేస్తాను."

    "ఈ రాత్రి నా కూతురు నీ దగ్గర వుండడం ఇష్టంలేదు. నా మీద నమ్మకం వుంచి వదిలెయ్యి."

    "నా మీద మీరూ నమ్మకం వుంచండి. రేప్రొద్దున వదిలేస్తాను. ఈ లోపులో నాకో చిన్న సాయం కావాలి."

    "ఏమిటది?"

    "ఇప్పుడు మీరెక్కడికి వెళ్తున్నారు?"

    "గెస్ట్ హౌస్ కి. ఇంతకీ నీ పని ఏమిటో చెప్పలేదు."

    "నాకు అర్జెంటుగా అయిదువేలు కావాలి."

    "మిస్టర్- నీ కోర్కెలు ఒక్కటొక్కటే పెరుగుతున్నాయి. నేను ఇవ్వను."

    "చాలా అవసరం."

    "రేపు ఇంకా అడగవని నమ్మకం ఏమిటి?"

    "సూర్యారావ్! నావి చాలా చిన్న కోర్కెలు. అడగదల్చుకుంటే మొదటే యాభైవేలు అడిగి వుండేవాడిని. చెప్పు, అడిగితే ఇచ్చేవాడివి కావా..."

    సూర్యారావు మాట్లాడలేదు.

    "రాత్రికి వస్తాను. అయిదు వేలు సిద్ధంగా వుంచు."

    "నా కూతురు-"

    "రేప్రొద్దున్నే క్షేమంగా వస్తుంది" ఫోన్ కట్ అయింది.

    సూర్యారావుకి అర్ధం కాలేదు. ఎందుకంత అర్జెంటుగా అతను అయిదువేలు అడిగాడు? అతనన్నట్టు అనుకోని అవసరం వచ్చిందేమో!...నిజంగా బ్లాక్ మెయిలర్ అయితే అయిదువేలతో సరిపెట్టడు.

    సూర్యారావు గెస్ట్ హౌస్ లో బయలుదేరాడు.


                       *    *    *


    బయట ఉరుముతోంది.

    గెస్ట్ హౌస్ ముందు రిక్షా ఆగింది. అందులోంచి సునాదమాల దిగింది. కాస్త భయంగా వుంది. కానీ అయిదు నిముషాల క్రితంవరకూ విహారి ఆమెకి ధైర్యం నూరిపోసి పంపాడు.

    ఆమె లోపలికి వెళ్ళబోతూంటే వాచ్ మెన్ అడ్డగించాడు.

    "సూర్యారావుగారి కోసం, ఈ టైముకి రమ్మన్నారు."

    వాచ్ మెన్ కాస్త తటపటాయించి తలూపాడు.

    సూర్యారావు మధ్య హాలులో కూర్చుని వున్నాడు. ఊహించని విధంగా ఎవరో అమ్మాయి రావటంతో ఆశ్చర్యపోయి "ఎవరు నువ్వు" అని అడిగాడు.

    "మా... మా.... మా బావ పంపించాడు" అంది. అప్పచెపుతున్నట్టు.

    "ఎవరు మీ బావ?"

    'విహారి' అందామె బెరుకుగా చూస్తూ. ఆమె నుదుట చెమట పట్టింది. "మీరు ఐదువేలు ఇస్తారు, తీసుకురమ్మన్నాడు."

    "తనే రావొచ్చుగా, నిన్ను పంపాడేం?"

    ఆమె గుటకమింగి, "నేను వెళ్ళిపోతాను" అంది.

    "అదేమిటి?"

    "నాకు భయమేస్తోంది."

    సూర్యారావు బిగ్గరగా నవ్వాడు. "నీకూ మీ బావకీ ఈ దొంగతనాలూ అవీ కొత్తగా వున్నట్టున్నాయే?"

    సునాదమాల మాట్లాడలేదు.

    "అసలు మీ బావకి కిడ్నాపింగ్ అంటే అర్ధం తెలుసా? నేను నిన్ను యిక్కడ అట్టేపెట్టి, నా కూతుర్ని వదిలేవరకూ నిన్నొదల్ను అంటే ఏం చేస్తాడు?"

    "నాకు తెలీదు. నేను వెళ్ళిపోతాను."

    "వద్దులే. ఇదిగో అయిదువేలు, తీసుకో-" అంటూ కట్ట అందించాడు. మెరుపుల మధ్య ఫ్లాష్ వెలిగింది.

    ఆమె ఆ డబ్బు చేతిలో పట్టుకుని అతనివైపు కన్నార్పకుండా చూసి- "థాంక్స్" అంది. బయటనుంచి మెరిసిన మెరుపు వెలుగులో ఆమె అద్భుతంగా వుంది. ఆకాశ దేశాన నీలిజెండా లెత్తినట్టు- సంధ్యాదేవి మెడలో గొలుసు కదిలినట్టు- చరణ మంజీర హేమ గాత్రి.... సంజవెన్నెల చెంగల్వరాత్రి.... కాంక్షాధనుస్సు వొంగి.... కనులు ఎరుపుటల పొంగి.... శరత్పూర్ణిమలో ఎవరెస్టు శిఖరాలు రెండు- ఆరంగుళాల పైన ఆమె చిరునవ్వు- సముద్రంమీద జాబిల్లి సంతకంలా...

    "అలా చూడకండి. మీ అయిదువేలూ తీసేసుకోండి. నేను వెళ్ళిపోతాను" టేప్ రికార్డర్ ఆన్ చేయగానే మొదటిమాట ఆమెది అది.

    నిజానికి అలా చూడలేదు సూర్యారావు. ఇప్పుడు చూశాడు. ఉరుమే తారామంజీరమై మెరుపే హనన్మందార మాలయై-చీకటి కాంక్షా కాశ్మీరాంబరమై, తొలి రేవున లంగరెత్తిన వడి కోర్కె... హిమస్నాత పారిజాతాల వెనుక కదలిక....

    "ఈ అయిదువేల కోసమే వచ్చాను. మీరు నా మీద చెయ్యి వేశారంటే అరుస్తాను" ఆమె భయంగా అంది. అహం దెబ్బతిన్న సూర్యారావు అనాలోచితంగా నవ్వాడు. "అరచినా ఇక్కడ ఎవరికీ వినపడదు."

    "ఒక చిన్న పదవికోసం నేను ఇక్కడికి వస్తే- దాన్ని మీరిలా ఉపయోగించుకోవటం అన్యాయం..." అంటూనే అతడివేపు అడుగువేసింది. కోనేట్లో స్నానమాడిన గాలి గుడిగంట మ్రోగించటానికి దక్షిణం దిక్కుగా పయనించినట్టు ఒక మధురమైన పరిమళం అతన్ని చుట్టుముట్టింది. వర్షపు చినుకు గుమ్మం తలుపు తట్టినట్టు, పడకగదిలో అగరొత్తి పలకరించినట్టు, పూల పైటని చెట్టుమీద నుంచి తొలగిస్తూ గాలి తెమ్మెర నవ్వినట్టు-

    భ్రమించి-

    అతనామె చెయ్యి పట్టుకున్నాడు. మరో ఫ్లాష్ వెలిగింది. అదే గుర్తు!

    అంతే!

    స్టీన్ గన్ సోల్టర్ పేరాచ్యూట్ తో జెట్ విమానం నుంచి దూకినప్పుడు కదిలే మెళకువల కదలిక ఆమెను ఆదేశించింది- కోకకులవధూక మతికాంతి నలతాంత రతికాంతర నితాంత రతికాంత రణకాంత సుతనుకాంత... చిలిత కలిత కలకంఠ కాకలీ విభాసురము వొల్చు.... అన్నట్టు ఆమె రియాక్టయింది. ఒక చెయ్యి తన జాకెట్ వైపు, మరొక చెయ్యి మెడవేపు వేగంగా వెళ్ళినయ్.

    తను చేస్తున్నది లజ్జారహితమైన పని అని ఆమెకు తెలుసు. కానీ ఆమె కనులముందు చనిపోయిన తన విష్ణు స్నేహితుడు వినీల్ కదిలాడు. పద్మాకర్ శవం కదలాడింది. పదవీ కాంక్షకోసం ప్రజల్ని పావులుగా వాడే పరాన్న భుక్కుమీద ప్రతిఘటన కోసం పదిహేడు సంవత్సరాల యవ్వనం పేపర్ లో పడితేనేమి?

    ఆమె చెయ్యి జాకెట్ ని చింపుకుంది. ఆమె కుడి స్థనం సువర్ణ కలశంలా మెరిసింది. గోరు మెడను గీరుకుంది. రక్తచందనం మెడకు పూసినట్టయింది.

    ఒకప్పుడు ఆమె పరాయి పురుషుడి నీడ పడితేనే వెళ్ళి స్నానం చేసే అమ్మాయి. పోస్టుమాన్ చెయ్యి తగిలితేనే కొబ్బరిపీచుతో రుద్దుకునే అతివ అటువంటిది తనకు అప్పగించిన కార్యాన్ని వంటరిగా నిర్వర్తించింది. వేల వేల అజ్ఞాత సైనికులు తమ దేశంకోసం ఎలా ప్రాణాలొదిలిందీ, అన్యాయాన్ని ఎదుర్కోవటం కోసం మహనీయులు ఎంత కష్టపడిందీ, ఆ క్రితం రాత్రి విహారి ఆమెకు సూర్యారావు కూతురికీ కూచోబెట్టి చెప్పాడు. విప్లవం ఎప్పుడో ఎక్కడనుంచో రాదు. మననుంచే రావాలి. మనిషిలో మార్పుకూడా అంతే. ఒక మంచి సహచరుడి మాటలవల్ల వస్తుంది. అకస్మాత్ గా వస్తుంది. ఈ రోజు ఆమె ప్రదర్శించిన ధైర్యాన్ని కొద్దిరోజుల క్రితం చెపితే- ఆమె కలలో కూడా నమ్మి ఉండేది కాదు. అంత ఎదిగింది ఆమె.

    "హెల్ప్.... హెల్ప్.... హెల్ప్.... రక్షించండి" అని ఆమె అరిచింది. అప్పటికే ఏదో అనుమానం వచ్చిన సూర్యారావు బిత్తరపోయాడు. అంతలో తలుపులు హఠాత్ గా తెరుచుకోవడం ,సూర్యారావు షాక్ నుంచి తేరుకునే లోపుగా నల్గురైదుగురు వ్యక్తులు బిలబిలా లోపల ప్రవేశించటం వెంట వెంటనే జరిగిపోయాయి.


                       *    *    *


    మరుసటిరోజు పేపర్ లొ ఈ వార్త హెడ్ లైన్స్ లో వచ్చింది.

    అత్యాచార ప్రయత్నంలో కేంద్రమంత్రి అరెస్టు. లంచంతోపాటు మానాన్ని కూడా దోచుకోవడానికి ప్రయత్నించిన మంత్రి సూర్యారావు.

    వివిధ రకాల హెడ్డింగ్ లు పెట్టి పేపర్లు ప్రకటించాయి. సునాదమాల ఫోటో కూడా ప్రచురించబడింది.

    "సునాదమాల అనే యువతి, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి స్వంతంగా ఒక చిన్న పరిశ్రమ పెట్టుకుందామని మంత్రిని కలుసుకుంది. ఆమెని సాయంత్రం గెస్ట్ హౌస్ కి అయిదువేలు పట్టుకుని రమ్మన్నాడు మంత్రిగారు. చిన్న పరిశ్రమకి అంత పెద్ద వ్యక్తి అవసరం లేదని తెలియనంత అమాయకురాలు ఈ కోర్కెకి భయపడి పోలీసులకి చెప్పింది. డి.ఐ.జి. స్వయంగా పూనుకున్నాడు. వలవేసి సూర్యారావుని పట్టుకోవటం జరిగింది. సూర్యారావుకీ, సునాదమాలకీ మధ్య సంభాషణ టేప్ రికార్డు చేయబడింది. "..... అలా చూడకండి. మీ అయిదువేలు తీసుకోండి" "... అరిచినా ఇక్కడ ఎవరికీ వినపడదు" అన్న మాటలు వున్న టేపును డి.ఐ.జి. స్వయంగా పత్రికా విలేఖరులకి వినిపించారు" అన్న వార్తతో పాటు మాల ఫోటో- పెద్ద పెద్ద కళ్ళు- కళ్ళనిండా భయం, చిరిగినా జాకెట్- ఆమె చెయ్యి పట్టుకున్న సూర్యారావు... అంతకన్నా ఏం కావాలి? అరెస్టు- బెయిల్ మీద విడుదల. మంత్రివర్గం నుంచి సస్పెండ్ అవటం- అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.

 Previous Page Next Page