"వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ దిస్ నర్షింహా?"
జెన్నిఫర్ గొంతు! అదే ఉచ్చారణ!
ఉలిక్కిపడ్డాడు రవి. జెన్నిఫర్ ఇక్కడికెలా వచ్చింది? ఎవరితో మాట్లాడుతోంది?
అప్పుడు గమనించాడు, అటువైపు గోడకి గుండ్రని రంధ్రాలుండటం!
ఇలా వున్నాయి ఆ రంధ్రాలు ఒక క్రమంలో? ఆ రంధ్రాల్లోంచే వస్తోంది వెలుతురు లోపలికి.
ఆ రంధ్రాల్లోంచి బయటికి చూశాడు రవి. బయట ఏం జరుగుతుందో స్పష్టంగా కనపడుతోంది. విష్ణు, జెన్నిఫర్ షావుకారు శివయ్యతో బేరమాడుతున్నారు. శివయ్య నృసింహస్వామి విగ్రహాన్ని అమ్ముతున్నాడు. ఆ విగ్రహానికి ఒక చెయ్యి విరిగిపోయింది. ముక్కు దగ్గిర డోక్కుపోయింది.
"చిత్తం! ఈ విగ్రహానికి చాలా చరిత్ర వుందండీ! ఇది క్రీ.పూ. మూడో శతాబ్దం నాటిదండి! ఒకప్పుడు ఈ దేవునికి చాలా మహత్యం వుండేదట! ఎవరే ఆపదలో వుండి మొక్కుకున్నా. ఆ ఆపద విడిపోయేదంట! ముసల్మానులు దాన్ని నాశనం చెయ్యబోతే ఆళ్ళ కళ్ళు పోయాయంట! అక్కడితో దీన్నొదిలేసి పారిపోయారంట!"
శివయ్య పక్కా వ్యాపారి! భలే చెప్తున్నాడు కథలు? నృసింహస్వామి విగ్రహం జాగ్రత్తగా చూసీ చూడగానే అర్థమయిపోయింది రవికి. అది ప్రాచీనకాలం నాటిది కాదని.
వెంటనే అతనికి అక్కడున్న శిల్పాల రహస్యం బోధపడింది. అవన్నీ కూడా ఇలా ప్రాచీన శిల్పాలుగా చెలామణి చేయించడానికి ఒక పథకం ప్రకారం తయారుచేసినవి. అందుకే అక్కడక్కడ శిథిలమయినట్లుగా చెక్కారు. సరికొత్తగా చెక్కిన శిక్పాలని కొన్ని వారాలు వుప్పు వేసిన గోతులలో పాతిపెడితే అవి పాతకాలపు శిల్పాలలా కనిపిస్తాయట!
ఎక్స్ పర్ట్స్ తప్ప ఏవి కొత్తవో, ఏవి పాతవో గ్రహించలేరు. ఆ రకంగానో, లేక మరో రకంగానో కొత్తగా చెక్కిన శిల్పాలని పాత శిల్పాలలా కనపడేటట్లు చేసి చాకచక్యంగా స్మగుల్ చేస్తున్నారు.
ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోంది. ఇందాక కనిపించిన వ్యక్తి శిల్పి అయివుండాలి. చేతిలో వులి ఉంది. అతను ఏదైనా శిల్పాన్ని చెక్కుతూ అలికిడికి చెక్కటం మాని బయటకు వచ్చాడేమో!
ఇదంతా ఒక రాకెట్ కావచ్చు. దీనిలో దేవనారాయణ్, యజ్ఞనారాయణ్ ల చెయ్యికూడా వుందా. వాళ్ళ సహకారం లేకుండా శివయ్య ఒక్కడూ ఇంతకు సాహసించగలడా? వాళ్ళు చాటునుండి శివయ్యతో నాటక మాడిస్తున్నారో? లేక ఈ రాకెట్ లో ముగ్గురూ భాగస్వాములో!
"ధర చెప్పండి"
తనకు అలవాటైన ధోరణిలో ఆగ్నాపిస్తున్నట్లు అన్నాడు విష్ణు.
"చిత్తం! ఇంతకు ముందు ఒక పార్టీ యాభైవేలకి అడిగితే ఇవ్వలేదండి. డెబ్భై అయిదు వేలకి తక్కువ లేదండి. ఇట్లాంటి కళాఖండాలు మనకి కొందామన్నా దొరుకుతాయేంటండీ!"
"ముప్పైవేలు!"
"అన్నేయమండి! తమరు సులుగ్గా రెండు మూడు లక్షలకమ్ముకుంటారు. నాకు తెలవదేంటండీ!"
"నలభై వేలు!"
"కుదరదండి!"
"హి ఈజ్ గోయింగ్?" కొంచెం తత్తరపాటుతో అంది జెన్నిఫర్.
"యాభై! అంతకు మించి ఇవ్వను" కరుగ్గా అన్నాడు విష్ణు.
"సరే తీసుకోండి. ఇంత ప్రాచీనమైన విగ్రహానికి యాభై వేలంటే చాలా చవక. ఏ కొండ మీద ప్రతిష్ఠించి పూజలు మొదలుపెట్టినా, ఆ యాభైవేలూ అయిదు నెలల్లో వచ్చేస్తాయి. మీ మాట కాదనలేక ఇస్తున్నాను."
విగ్రహం చేతులు మారింది. డబ్బు శివయ్య చేతికొచ్చింది. విష్ణు, జెన్నిఫర్ వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లోనే జీప్ బయలుదేరిన ధ్వని.
శివయ్య కూడా కదిలాడు అక్కణ్ణుంచి-ఎక్కడికెళ్ళాడో?
"ఓ గాడ్!"
గుండెల మీద చెయ్యి వేసుకుని అంది అనిల. ఇంకా విభ్రమం నుంచి కోలుకోలేకపోతోంది.
"విష్ణుకి స్మగుల్డ్ బిజినెస్ వుందన్నమాట? జెన్నిఫర్ అతని ఏజంట్! అందుకే నేను వద్దంటున్నా జెన్నిఫర్ ని ఈ యెక్స్ కవేషన్స్ లో చేర్చాడు. ఆ అమ్మాయికి ఆర్కియాలజీలో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని నేనెప్పుడో గ్రహించాను" ఆలోచిస్తూ అన్నాడు రవి. ఏమీ మాట్లాడనిదీ, ఏ భావాలూ ప్రకటించనిదీ, త్రిసికి ఒక్కర్తే!
"చిత్రం! మనం ఇంటి గురించి తెలుసుకోవాలని బయలుదేరి విష్ణు గురించి తెలుసుకున్నాం"
"ఇంక ఇంటి సంగతి ఎత్తకండి. ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాం" అప్పటికీ భయంతో శరీరం అదురుతుండగా అంది అనిల.
"చూద్దాం. ఏదో ఒక ఉపాయం స్ఫురించక పోతుందా?"
ఆశ్చర్యంగా చూసింది అనిల. ఇంత జరిగినా ఇంకా ఇంటిని గురించి తెలుసుకోవాలనే అనుకుంటున్నాడా ఇతడు?
రవి మరొకసారి గుహలాంటి ఆ గదిని పరిశీలనగా చూశాడు.
"ఇది గోడౌన్ లా తోస్తోంది. ఎవరిదో? ఎవరికైనా వాళ్ళకి విగ్రహాల స్మగ్లింగ్ రాకెట్ తో సంబంధం ఉందనటానికి సందేహం లేదు. కర్ర పెట్టెలలో ఏముందో చూద్దాం?"
మోరల్ సపోర్ట్ కోసమన్నట్లు అనిల వైపు చూశాడు. ఒప్పుకుంటున్నట్లు తల ఊపింది అనిల. త్రిసికి కళ్ళలో కనిపించిన అసహనాన్ని ఇద్దరూ లెక్కచెయ్యలేదు.
ఒక కర్ర పెట్టెలో రకరకాల పెయింట్స్, బ్రష్ లూ ఉన్నాయి. మరో కర్రపెట్టెలో రివాల్వర్స్ ఉన్నాయి. వాటితోపాటు కేట్రిర్జెస్ (catridges) ఉన్న చిన్న అట్టపెట్టెలు కూడా ఉన్నాయి.
వాటిని చూడగానే ఒక్కక్షణం ఊపిరి ఆగిపోయినట్లయింది రవికి. ఇక్కడ తను ఊహించినదానికంటే ఏదో పెద్ద కుంభకోణమే జరుగుతోంది. అనిల కూడా భయంగా చూస్తోంది వాటిని. రవి రెండు రివాల్వర్స్ తీసి అనిల కొకటి, త్రిసికికీ ఒకటీ అందించాడు.
ఇద్దరూ భయంగా తీసుకున్నారు. అనిలకయితే కాళ్ళూ చేతులు చల్లబడిపోతున్నాయి. కేట్రిర్జెస్ (catridges) ఉన్న పెట్టెలు రెండు తన బ్యాగ్ లో వేసుకుని, ఒకటి అనిలకీ, మరొకటి త్రిసికికీ ఇచ్చాడు.
"నాకు రివాల్వర్ ఎలా లోడ్ చేసుకోవాలో తెలీదు. ఎలా ఉపయోగించాలో కూడా తెలీదు" భయంతో గొంతు పొడారిపోతుండగా అంది అనిల.
"ఫర్వాలేదు ఉపయోగించడం ఇచ్చినా రాకపోయినా రివాల్వర్ చేతిల్లో ఉంటేచాలు. ఎదుటి వాళ్ళని భయపట్టొచ్చు. నేను లోడ్ చేసి ఇస్తాను" చెప్పాడు రవి.
మరో కర్ర పెట్టె సీల్ చేసిన సీసాలలో ఏవేవో ద్రవాలున్నాయి. వాటిపైన లేబుల్స్ ఉన్నాయి.
"క్రిమి కీటకాలు కుట్టినప్పుడు విషం ఎక్కకుండా...."
"ఉధృతమైన వేడికి చర్మం కమిలిపోకుండా"