Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 41


    "ఒకటి రెండు నిమిషాలు మంటలు సోకకుండా..." ఇలా ఉన్నాయి టేబుల్స్.
    అనిల, రవి కుతూహలంతో పరీక్షించారు వాటిని. రకరకాల రంగుల్లో ఉన్నాయి అవి.
    "ఈ ద్రవాలన్నీ ఏవో మూలికలతో తయారుచేసినవి కావచ్చు. గిరిజనులలో కొందరు ఇలాంటివి ఎంతో నేర్పుతో తయారుచెయ్యగలరు" అన్నాడు రవి.
    "గమ్మత్తుగా ఉంది. కానీ ఇలాంటివన్నీ ఇక్కడెందుకుంచారు?"
    "బహుశా ఇది సురక్షిత ప్రాంతం అని కావచ్చు. ఇందాక ఆ శిల్పి మనమీద దయతలచి, తలుపు తెరవబట్టి తప్ప లేకపోతే అక్కడ తలుపు ఉందని మనం తెలుసుకోలేం. ఎవరూ తెలుసుకోలేరు."
    "ఆ విషయం నేను గమనించాను. కానీ, ఇంత విలువైనవి ముఖ్యంగా రివాల్వర్స్, కేట్రిర్జెస్ (catridges) మొదలైనవి దాచుకోవటానికి దేవనారాయణ్, యజ్ఞనారాయణ్ ఇళ్ళలో స్థలం లేకపోయిందా? వాళ్ళ భవంతులు మీరు చూడలేదు, అవి దివాణాలు."
    "అడవి మధ్య, పైకి గుడిసెలా కనిపిస్తూ, ఇంత రహస్యంగా దాచవలసిన అవసరం ఏమిటి? ఇక్కడ ఏదో కుంభకోణం జరుగుతోందని మనం అనుమానిస్తున్నాం. అదేదో ఈ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతోందనుకుంటా! అవసరానికి అందుబాటులో ఉండాలని ఈ పరికరాలన్నీ ఇక్కడ దాచారేమో?"
    "కావచ్చు. మా ఇంటికీ, ఈ కుంభకోణానికీ కూడా ఏదైనా సంబంధం ఉందేమో. అందుకే అన్ని రక్షణ ఏర్పాట్లు. అందుకే దెయ్యాల పేరుతో ఎవరూ రాకుండా కాపలా!"
    "కరెక్ట్?"
    "బహుశా అందుకే దేవనారాయణ్ నన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాడేమో. వారసత్వంగా నాకు వచ్చే ఆ ఇంటి కోసం!"
    "కావచ్చు!"
    "అందుకే నన్ను చంపరు. చంపటం వల్ల ప్రయోజనం లేదు. అప్పుడు ఆ ఇల్లు మరొకరికి చెందే ప్రమాదం ఉంది."
    "అవునేమో?"
    "పెళ్ళయిపోయాక నన్ను చంపేసినా ఫర్వాలేదు. అప్పుడు ఇల్లు దేవనారాయణ్ కి చెందుతుంది. నా భర్తగా..."
    "అది కూడా సంభవమే!"
    "భగవంతుడా! నాకు ఈ రాక్షసుల బారినుంచి విముక్తి ఎలా దొరుకుతుంది?"
    "అధైర్యపడకండి! మనం ప్రయత్నిద్దాం! మీకు మీ ఇల్లు అంతా బాగా తెలుసా? అన్ని గదులూ..."
    "తెలుసు. అయిదారేళ్ళ క్రిందట మా కుటుంబంతో ఆ ఇంట్లో రెండు రోజులున్నాం."
    "అప్పటికి 'దెయ్యాలకొంప' అని రూమర్ లేదా?"
    "ఉంది. కానీ నాన్న లక్ష్యపెట్టలేదు. అమ్మ మాత్రం రోజూ ఆంజనేయస్వామికి పూజలు చేసేది."
    నవ్వింది అనిల.
    "దేవనారాయణ్ మీ నాన్నగారి దగ్గిర ఆ ఇల్లు కొనేసుకోవచ్చు గదా?" అడిగాడు రవి.
    "అవును. నాన్నగారు అమ్మాలనుకున్నారు కూడా! అప్పుడు ఏం జరిగిందో నాకు సరిగ్గా తెలీదు."
    "ఒక్కసారి మనం ఆ ఇంటి లోపలికెళ్ళి చూస్తేకానీ ఏమీ తెలుసుకోలేం."
    "ఎలా సాధ్యం అది?"
    రవి దృష్టి కర్రపెట్టెలతో పాటు ఉన్న టిన్స్ మీద పడింది. వాటితో ఉన్నది పెట్రోలు.
    "సందేహం లేదు. ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాలకు ఈ ప్రదేశం సెంటర్ కావచ్చు. అందుకే పెట్రోల్ సహితం ఇక్కడ నిలవ ఉంచుకున్నారు."
    అనిల మాట్లాడలేదు. ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నకొద్దీ ఆమె మనసులో దిగులు పేరుకోసాగింది.
    "నాకో ఆలోచన వచ్చింది" అన్నాడు రవి.
    "చెప్పండి?"
    "త్రిసికిని ఇక్కడ ఎవరూ ఏమీ చెయ్యరు. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేదు. అవునా?"
    "అవును."
    "అయితే త్రిసికి, ఆ ఇంటికి బాగా దూరంలో ఏ పొదచాటునో ఉండి, రెండు మూడుసార్లు రివాల్వర్ పేల్చాలి. సహజంగా ఆ ధ్వనికి ఇంటికి కాపలా ఉన్నవాళ్ళు అటు వెళ్ళటం సహజం. అప్పుడు మనం ఆ ఇంటి తలుపుల మీద పెట్రోలు పోసి అంటించెయ్యాలి. ఆ మంటలకి ఇంట్లో ఎవరైనా ఉంటే, బయటికి రాకతప్పదు. అంతేకాదు, ఎలక్ట్రిక్ కనెక్షన్స్ కూడా పాడయిపోతాయి. అప్పుడు వీలుచూసుకుని మనం ఇంట్లో ప్రవేశించాలి."
    "ప్లాన్ బాగుంది"
    "ఇందులో రిస్క్ లేకపోలేదు."
    "ఉండనియ్యండి"
    "త్రిసికి రివాల్వర్ పేల్చటానికి ఒప్పుకుంటుందా?"
    అనిల త్రిసికి ముఖంలోకి చూసింది. ఆమె కళ్ళలో అసహనం కనిపించింది.
    "త్రిసికీ, నువ్వు ఈ గ్రామ ప్రజల పాలిటికి దేవతవి అవునో కాదో కానీ, నా పాలిటికి మాత్రం దేవతలాగే ఉన్నావు. దయచేసి సహకరించు, ప్లీజ్! మాకు అపాయమని సందేహించకు. ఫర్వాలేదు. ఒక మంచి పనికి దేవతల ఆశీస్సులుంటాయి."
    త్రిసికి నవ్వింది. అదే ఆమె అంగీకారం.
    "ఒకటి రెండు నిమిషాలు మంటలు సోకకుండా" అని లేబుల్ ఉన్న సీసా తన బ్యాగ్ లో వేసుకున్నాడు రవి. అప్పుడు వెళ్ళి ఇదివరకు తాము వచ్చిన తలుపు తెరవటానికి ప్రయత్నించాడు. అది తెరుచుకోలేదు. ఆ ప్రదేశంలో గట్టిగా బాదాడు. భయంకరంగా ప్రతిధ్వనించింది కాని, తలుపు తెరుచుకోలేదు.
    అనిల భయంగా అంది- "ఏమిటిది? మనం ఇక్కడ బందీలమా?"
    "అప్పుడొక అనుకోని సంఘటన జరిగింది. సాధారణంగా పాసివ్ గా కేవలం ఒక సాక్షిలా వుంటూ దేనిలోనూ కల్పించుకోని త్రిసికి అటువైపు గోడలో ఒకచోట గమ్మత్తుగా తట్టింది. ఒక తలుపు బయటికి తెరుచుకుంది. అంతకుముందు లోపలికి వచ్చిన ద్వారానికి సరిగ్గా ఎదురుగా వుంది ఈ ద్వారం.
    ఏదీ ఆలోచించకుండా ఆ ద్వారంలోంచి బయటపడ్డారు రవి, అనిల. త్రిసికి వారి తర్వాత వచ్చింది. తనతో పెట్రోల్ టిన్ తీసుకురావటం మరిచిపోలేదు రవి. ఈ తలుపు కూడా వెనుకటి తలుపు లాగానే గోడలో ఒక భాగంగా అమరి వుంది. బాగా తెలిసినవాళ్ళు తప్ప అక్కడ తలుపు వుందని గ్రహించలేరు. గోడలలో వున్న ఈ తలుపులు ఒకవైపు నుంచే తప్ప రెండోవైపు నుంచి తెరుచుకోవని గ్రహించాడు రవి.
    బయటికి రాగానే చుట్టూ చూశాడు. అది ఒక గ్రామదేవత గుడి. ఎల్లమ్మ కావచ్చు, పోలేరమ్మ కావచ్చు. ఆ విగ్రహాలన్నీ ఇంచుమించు ఒకలాగే వుంటాయి. ముఖానికి దిట్టంగా పసుపు, కళ్ళచుట్టూ నల్లని కాటుక రేఖలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టూ.
    సౌమ్యంగానే వుంది ఆ విగ్రహం. పాత పట్టుచీరలు కట్టబెట్టారు. ముక్కుకు సత్తి, చెవులకి కుండలాలూ మొదలైన ఇత్తడి నగలున్నాయి. రెండు పక్కలా ఇద్దరు మరుగుజ్జు స్త్రీలున్నారు. యక్షిణులు కావచ్చు. విగ్రహం కంటే రవి దృష్టిని ఆకర్షించింది. గోడలకున్న ముత్స్యావతార శిల్పాలు!
    గ్రామ దేవతల గుళ్ళలో సాధారణంగా దశావతారాల శిల్పాలుండవు. ఉంటే పోతరాజు మొదలైన శిల్పాలుంటాయి! అలాంటిది ముత్స్యావతారాలు మాత్రమే ఒక వరుసలో ఉండటానికి కారణమేమిటి? అతడి మనసులో ఒక అనుమానం తోచింది. దగ్గరగా వెళ్ళి చూశాడు. అతడి అనుమానం నిజమయింది. మత్స్యావతారాలు చెక్కిన శిల్పి ఎవరోకాని, అతి చాకచక్యంగా చేపల పొలుసుల మధ్య రంధ్రాలను కప్పేశాడు. పైకి చేప పొలుసులలాగా కనిపిస్తాయి. దగ్గిరగా చూస్తేకాని ఒకదానికీ, మరొకదానికీ మధ్య రంధ్రమున్నట్లు తెలీదు. అటువైపు గోడకున్న రంధ్రాలను ఇటునుంచి ఈ శిల్పాలు కప్పేస్తున్నాయి. పరీక్షగా చూస్తే ఇటీవలి కాలంలో చెక్కినవే అని అర్థమయిపోతుంది.
    రవికి చటుక్కున "సూర్యనేత్రం" గుహలో వున్న మత్స్యావతార శిల్పాలు గుర్తొచ్చాయి. అవి కూడా ఇటువంటివే కావచ్చు. అందుకే లోపలి గుహలోకి వెలుతురు ఏదో దట్టమైన తెరగుండా వచ్చినట్టు వుంది. ఈసారి చూడాలి.

 Previous Page Next Page