Home » Yandamuri veerendranath » అగ్నిప్రవేశం

   

         భరద్వాజకి ఆ రాత్రి చాలా విసుగ్గా వుంది. సాహితీ సమావేశాలకి వెళ్ళటమంటే అతడికి చచ్చేటంత భయం. ఏ వృద్దరచయితో అధ్యక్షత వహించి, సాహిత్యం ఎలా పాడైపోయిందో వివరిస్తూ వాపోతాడు. అక్కడికొచ్చే వాళ్ళంతా వ్రాయనివాళ్ళు, వ్రాయనివ్వని వాళ్ళు అలాంటి ఉపన్యాసకుల మధ్యలో అతని పేరు బలవంతంగా వేశారు.
   
    అతడికన్నా ముందు ముగ్గురు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడినదంతా నిజమే. ఈ సెక్సూ, వయొలెన్సూ వున్న రచనలు చదివి పాఠకులు పాడైపోతున్నారు. అయితే-వాళ్ళ ఉపన్యాసం వింటూ వుండగా అతడికో అనుమానం వచ్చింది. అది సాహితీసభ కాబట్టి అక్కడ శ్రోతలందరూ దాదాపు పాఠకులే మరి వారందరూ చెడిపోయినవారో లేక అ సభకి రాని (చెడిపోయిన) పాఠకులకోసం యీ వుపన్యాసకులు చెపుతున్నారో అతనికర్ధం కాలేదు.
   
    ఆ విషయాన్నే అతను తన స్పీచ్ లో చెప్పాడు. "ఏ సమస్యకైనా మూలకారణం వ్యక్తిత్వం లేకపోవటమే. ఏ రచయితా సమస్యకి పరిష్కారము చెప్పడు. మనుషులెలా బ్రతకాలో మాత్రమే చెపుతాడు....ఆ మాటకొస్తే సెక్సుకూడా ఒక సమస్యే."
   
    ఈ చివరి వాక్యానికి శ్రోతల్లోంచి విజిల్స్ వినిపించాయి. అర్ధరాత్రి ఇరానీ హోటల్లో టీ త్రాగుతూ విప్లవం గురించి చర్చించే పదిమందీ 'డౌన్ డౌన్' అని అరిచారు. ఆ గొడవ మధ్య అధ్యక్షులవారు అతడిని ఉపన్యాసం ఆపుచేయవలసిందిగా కోరారు. ఆ ఇరిటేషన్ తోటే అతడు మిగతా సాహితీ కార్యక్రమాలకు వుండకుండా మధ్యలో బయల్దేరి వచ్చేశాడు.
   
    తను చెప్పదల్చుకున్నది వాళ్ళకర్ధం కాలేదో, వాళ్ళకర్ధమయ్యేట్టు తను చెప్పటం లేదో తనకర్ధమయ్యేవరకూ ఆ రాత్రి తనివితీరా తాగాలని అతను నిర్ణయించుకున్నాడు. (అతని సందేహాలకు సమాధానం చెప్పే ఇద్దరు స్త్రీలు ఆ రాత్రి ఒకరు తరువాత ఒకరు తనకు తారసపడబోతున్నారని అతనికి తెలీదు). ఆ మానసిక పరిస్థితిలో అతడు బార్ వైపు వెళుతూ వుండగా, ఆ నిర్మానుష్యమయిన వీధిలో సాహితిని పట్టుకున్న రోమియోలు కనపడ్డారు.
   
    లైట్లు మీద పడేసరికి వాళ్ళు తమ ప్రయత్నం మానుకుని పక్కసందులోకి పరిగెత్తారు. అతను తన వాహనాన్ని ఆపుచేసి, షాక్ తో 'సూన్' అయ్యే పరిస్థితిలో వున్న సాహితిని ఎక్కించుకున్నాడు. "నువ్వు సాహితివి కదూ?"
   
    ఆమె సమాధానం చెప్పలేదు.
   
    "ఇంత రాత్రిపూట ఇటెక్కడి కెళుతున్నావు ఒంటరిగా?"
   
    ఆమె దానికి కూడా సమాధానం చెప్పలేదు. ఆమె యింకా అయోమయం నుంచి తేరుకోలేదు. ఇల్లనే పంజరంనుంచి స్వేచ్చా ప్రపంచంలోకి అడుగు పెట్టాననుకుంటున్న మొదటి క్షణంలో ఇంత ప్రమాదం జరగటం ఆమెని బాగా దెబ్బతీసింది.
   
    ఆమె మానసిక స్థితిని గమనించి, అతనేమీ మాట్లడకుండా డ్రైవ్ చేయసాగాడు. చాలా సేపటికి ఆమె తేరుకుంది. అప్పటికి కారు నగర పొలిమేరలు దాటి కరీంనగర్ రోడ్డు మీదకు ప్రవేశించింది.
   
    "ఎక్కడికెళుతున్నాం మనం?"
   
    "హమ్మయ్య! మాట్లాడావు కదా" అన్నాడతను. "....ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, అందుకే నువ్వు సర్దుకునే వరకూ ఇలా తీసుకొచ్చాను. ఎక్కడికెళ్ళాలో చెప్పు?"
   
    "నాకు తెలీదు."
   
    "ఇంట్లో పోట్లాడి వచ్చేశావా?" అనుమానంగా అడిగాడు.
   
    "ఉండలేక వచ్చేశాను."
   
    'ఎక్కడుందామని?"
   
    ఆమె ఆ ప్రశ్నకి కొంచెం సేపు మౌనంగా వుండి, ఆ తర్వాత నెమ్మదిగా "నేను చచ్చిపోతాను" అంది.
   
    "చాలా మంచి నిర్ణయం - కానీ ఎందుకు?"
   
    "మీకర్ధం కాదు, నాకున్నన్ని సమస్యలు ఎవరికీ వుండవు."
   
    "చాలా చిత్రం కదా."
   
    "ఏమిటీ?"
   
    "నాకున్నన్ని సమస్యలు మరెవరికీ వుండవని సరిగ్గా అరగంట క్రితం నేనూ అనుకున్నాను. నేను మాట్లాడే సభలో జనం అల్లరిచేసి, వేదిక దిగేవరకూ వూరుకోలేదు. చచ్చిపోదాన్నంత ఆవేశం కలిగింది. అందుకే వెళుతున్నాను."
   
    "మీరు నిజంగా చెప్తున్నారా?"
   
    "అవును".
   
    "నా సమస్యకూ మీ దానికీ ఏమయినా సంబంధముందా? నా దానిముందు మీదెంత?"
   
    "ఇదే మాట మా వంటవాడికి చెప్తే అతనూ అలాగే అంటాడు. అతనికిద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు, నేనిచ్చే అయిదొందలూ ఎందుకూ సరిపోదు. పెద్దకూతుర్ని మొగుడొదిలేశాడు. ఆవిడకు ముగ్గురు పిల్లలు. కొడుకు ఒక లోఫర్. పది రోజులకొకసారి వచ్చి తండ్రిని కొట్టి, డబ్బులేమన్నా వుంటే లాక్కుపోతాడు. రెండో కూతురికి క్యాన్సరు. ఇంకో ఆరు నెలల్లో పోతుందని డాక్టర్లు చెప్పారు......"
   
    "ప్లీజ్! ఆపుచేయండి."
   
    "అతనికి మధ్య మధ్య కడుపులో నులితిరిగే నొప్పి వస్తూంటుంది. మొన్నొకరోజు నాకో కొత్త విషయం తెలిసింది. నాల్రోజుల్నుంచీ ఇంటిల్లిపాదీ పస్తులున్నా అభిమానంతో చెప్పలేదు. తన ఇంట్లో ఉపవాసం చేసే వాళ్ళను తల్చుకుంటూ మా ఇంట్లో పార్టీ కోసం బిర్యానీ వండటం...."
   
    "ఆపండి."
   
    "నేను చెప్పొచ్చేదేమిటంటే, ఈ ప్రపంచంలో చాలామంది తమ కున్నన్ని సమస్యలు మరెవరికీ వుండవని అనుకుంటా వుంటారు. తమ తమ కష్టాన్నీ తమ దగ్గరవాళ్ళే అర్ధం చేసుకోవటం లేదనీ, తాము కాబట్టి ఇన్ని కష్టాల్ని భరిస్తున్నామనీ, ఇంకొకరయితే ఎప్పుడో చచ్చిపోయేవారనీ అనుకుంటూ వుంటారు. ఇలాంటి మనుష్యుల ఆలోచన 'నేను' చుట్టూ తిరుగుతూ, ఇక ముందుకు వెళ్ళదు. ఆ పరిధి దాటగలిగితే అంతా ఆనందమే అన్న చిన్న విషయమే తెలుసుకోరు. ఆ పరిధి దాటినవారికి మాత్రమే 'మూడ్ పాడవటం' అంటూ వుండదు."
   
    "నదిలో కొట్టుకుపోతున్నవాడికి ఒడ్డున కూర్చుని మైక్ లో యీత నేర్పినట్టుంది మీ ఉపన్యాసం."
   
    "గుడ్ స్టేట్ మెంట్! మంచి రచయిత్రివవుతావు. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు నువ్వు. ఇంత అర్దరాత్రి పూట ఇలా ఇల్లు వదిలేసి ఎందుకు వస్తున్నావు? మీ పెంపుడు తండ్రి నీ చేతకూడా లక్ష్మీపూజ చేయిస్తానన్నాడా?"
   
    ఆమె ఆశ్చర్యంతోతలెత్తి "మీకెలా తెలుసు?" అనడిగింది.

    "అతన్ని మొదటిసారి చూస్తుంటే మీ ఇంట్లో ఆడచీమని కూడా వదిలిపెట్టడనిపిస్తూంది."
   
    అప్పుడు చెప్పటం మొదలుపెట్టింది సాహితి. కాస్త వేడికే వెన్న కరిగినట్టు ఆమె మనసులో అప్పటివరకూ పేరుకున్నభావాలు మాటల రూపంలో బయటకు రావటం ప్రారంభించాయి. తన తల్లి బుగ్గలమీద పళ్ళ గుర్తులనుంచి మొదలుపెట్టి అతడు తనని కూడా ఏ విధంగా "కోరాడో" వరకూ వివరించి, "ఇప్పుడు చెప్పండి ఎవరికైనా యింత పెద్ద సమస్య వస్తుందా? నేను చచ్చిపోవాలనుకోవటంలో తప్పేమయినా వుందా?" అనడిగింది.
   
    "ఇప్పుడు ఆస్థి ఎవరి పేరు మీద వుంది?"
   
    అంతా విని అతడు వేసిన ఈ మొదటి అసంబద్దమైన ప్రశ్నకు ఆమె ఆశ్చర్యపోయి "తెలీదు" అంది.
   
    "నువ్వు మేజరువి కాబట్టి కొంత ఆస్థి నీ పేరుమీద పెట్టమని అడగొచ్చు."
   
    ఆమె అదిరిపడి "ఏమిటి మీరు మాట్లాడుతున్నది!" అంది.
   
    ఆమె ప్రశ్న పట్టించుకోకుండా అతడు కొనసాగించాడు. "ఆ ఇంటిలోనే నువ్వు విడిగా వుండొచ్చు. నీ అనుమతి లేకుండా నీ తల్లిగానీ, పెంపుడు తండ్రిగానీ నీ గదిలోకి రాకూడదని నిర్దేశించవచ్చు."
   
    "మీరిదంతా హేళనగా అంటున్నారా? నిజంగా చెపుతున్నారా?"
   
    అతడామె మాటలు పట్టించుకోకుండా "నీ పెంపుడు తండ్రికీ నీ తల్లికీ జరిగిన వివాహం సంగతి నీ బంధువులకి చెప్పొచ్చు. పేపర్లో ఫోటో వేయించవచ్చు. పాంప్లెట్ల ద్వారా అతని గురించి 'ప్రచారం' చేయవచ్చు." అన్నాడు.
   
    "మా అమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది."
   
    "మీ అమ్మకెప్పుడూ ఏడవటం, ఆత్మహత్య చేసుకుంటాననటం తప్ప వేరే పనేమీ లేదా?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra