" గుడ్ మాణింగ్ సర్! నేను ధీర.... మీ ఆవిడ ఫ్రెండుని."
ధీర గడగడా మాట్లాడేస్తుంటే ముందు నివ్వెరపోయాడు. ఒక ఆడది పరాయి మగాడి ముందు నవ్వడంగాని, అతిచనువుని ప్రదర్శించడం గానీ నచ్చని భాస్వంత్ చికాగ్గా చూస్తుంటే-
ఆమె గొంతు విని హాల్లోకి పరిగెత్తుకొచ్చింది ఆర్తి.
" నువ్వా ధీరా.... ఇదేనా రావటం?" అంది ఆనందాన్ని దాచేసుకుంటూ. అలా దాచుకోకపోతే భాస్వంత్ దృష్టిలోబరితెగించడమౌతుంది.
"సారీ" అప్పటికి తేరుకున్న భాస్వంత్ తప్పనిసరైనట్లు సభ్యతని అభినయించాడు. "పోల్చుకోలేకపోయాను."
ధీర మరింత రియాక్టయింది.
"ఘోరం సర్.... " ధీర విడిచిపెట్టలేదు "వయసులో వున్న ఆడపిల్లని. పైగా మీ ఆవిడంత అందగత్తెని. ఒక్కసారి నన్నెవరైనా చూస్తే అంత తొందరగా మరిచిపోలేరని నా ఫ్రెండ్సంతా అంటారే. అలాంటి నన్ను మీరు గుర్తుపట్టలేకపోయారూ అంటే నా 'ఇగో' ఎంత దారుణంగా దెబ్బతింటుందో ఆలోచించారా?"
"ఓకె! పొరపాటుని ఒప్పుకుంటున్నాగా" చిరాకుని అదిమి పెడుతూ "నాకు అవతల ఆఫీసులో అర్జెంటు పనుంది. మీరు మీ ఫ్రెడ్ తో హేపీగా స్పెండ్ చేయండి. బై....." అంటూ ఆమె జవాబుని ఆశించకుండా వెళ్ళిపోయాడు.
వెళుతున్న భాస్వంత్ని చూస్తూ ధీర వెంటనే ఓ జోక్ వేయాలనుకుందిగానీ అక్కడ ఎదురుగా సరస్వతమ్మ కనిపించడంతో ' ఎవరీ వృద్ధనారి' అన్నట్టుగా ఆగిపోయింది.
ఆర్తి కంపించిపోయింది.
వెంటనే వారించకపోతే ఏదో వాగి ధీర కొంప ముంచుతుంది.
"మా అత్తయ్యగారు" అంటూ పరిచయం చేసింది.
"అలాగా" ధీర చేతులు జోడించి. "ఇంతకు ముందు రెండుసార్లు వచ్చానుగాని మిమ్మల్ని కలుసుకోలేకపోయాను."
"చోద్యంగా వుండి అమ్మడూ" సరస్వతమ్మ అందుకుంది "పెళ్ళికి వచ్చినదానివి నేను భాస్వంత్ తల్లినని తెలీనట్లు అలాగా అనడం మహా చిత్రంగా వుంది."
సరస్వతమ్మ మాటలు ఆమె ఏమిటీ అన్నది సగం తెలియచెప్పేశాయి. "పసి పిల్లలు తప్పుచేసినప్పుడు పెద్దలు క్షమించి వదిలిపెట్టేయాలి."
"వదిలిపెట్టక నిన్ను పట్టుకుని వెలాడుతున్నావా తల్లీ" రోషంగా తన గదిలోకి నడబోతూ ఫినిషింగ్ టచ్ లా ఓక్షణం ఆగి అంది సరస్వతమ్మ " అయినా గంతకుతగ్గ బొంతునీ- మా కోడలుకి నిన్ను మించిన స్నేబితురాళ్ళెలా దొరుకుతారులే!"
ఆర్తి గుండె కలుక్కుమంది.
రాక రాక పరాయి ఊరు నుంచి చుట్టం చూపుగా వచ్చిన స్నేహితురాలి మీద కూడా దాచిచేస్తూంది అత్తయ్య. దుఃఖం ముంచుకొస్తుంటే ధీరని అక్కడనుంచి గదిలోకి లాక్కుపోవాలనుకుంది గానీ సున్నితంగా ఆర్తి పట్టు సడలించుకుంది.
యూనివర్శిటిలో సహాధ్యాయిగా ధీర ఎంత మొండిఘటమో, అవసరం వస్తే ఎదుటి మనిషని మాటలతో ఎంతగా ఉతికి ఆరబెడుతుందో తెలిసిన ఆర్తి " నా మాట విని లోపలికి రావే" అంది అర్థిస్తున్నట్లుగా.
"అదేమిటె పిచ్చి మొద్దూ!" ధీరనవ్వింది చాలా మామూలుగా.
"గంతకుతగ్గ బొంతనీ ఓ పాత చింతకాయ పచ్చడి టైపు సామెత చెప్పిన మీ అత్తయ్యకి నా వివరాలు చెప్పకపోతే ఏం బాగంటుందే...... చూడడం బామ్మగారూ! నేను మరీ అంత బొంతను కాను."
" కలెక్టరుగిరీ వెలగబెడుతున్నావా?"
"పోస్టు గ్రాడ్యూయేట్ ని అయిన నేను కావాలీ. అనుకుంటే కలెక్టర్ ని అయ్యేదాన్నే కానీ పదిమందికీ పాఠాలు చెప్పాలన్న ఉత్సాహం కలదాన్ని కావడంతో ప్రస్తుతం లెక్చర ర్ గా జాబ్ చేస్తున్నాను."
"పెడసరానికి కారణమేమిటో ఇప్పటికి బోధపడిందిగాని మరీ అంతలా పెట్రేగిపోవడం ఆడపిల్లకి మంచిది కాదని అర్థంచేసుకో తల్లీ."
ఆ తర్వత సరస్వతమ్మ ఇక అక్కడ నిలబడలేదు. మూతి మూడు వంకర్లు తిప్పుకుని తన గదిలోకి నడిచింది.
హఠాత్తుగా ఓ తుఫాను వెలసినంత ప్రశాంతత చోటుచేసుకుంది.
తలవంచుకున్న ఆర్తిని చూడగానే ధీరకి జాలేసిందేమో "పదగదిలోకి" అంది.
ఆర్తితోబాటు గెస్ట్ రూపంలో అడుగుపెడుతూనే అంది ధీర " అప్పుడెప్పుడో వచ్చినప్పుడు నీది లంకంత కొంపనుకున్నాను. కానీ యిప్పుడు మీ అత్తయ్యని చూశాక నువ్వున్నది లంకలో అని కన్ ఫాం చేసుకున్నానే! అయినా ఎలా వేగుతున్నావీ ముసలిదానితో?"
ధీర మాటలకి ఆర్తి భయపడింది.
ఒకవేళ ఆ ముసల్ది వింటే ఆతర్వత కూడా గొడవ జరుగుతుంది.
"సారీ ధీరా!" అంది ఆర్తి కళ్ళు తుడుచుకుంటూ.
"ఓసి పిచ్చిమొద్దూ! అ కంటతడేమిటే!"
"గెస్ట్ గా వచ్చిన నీకు ఇలాంటి అవమానం....."
" అరీ" అర్ధోక్తిగా ఖంచించింది ధీర. "అవమానం ఇందాక జరిగినట్లు అనిపించడంలేదే! ఇప్పుడు నీ కంటతడి చూస్తుంటే ఇన్సల్టింగ్ గా వుంది. ఛఛ..... నువ్వేమిటే ఇలా తయారయ్యావ్? పెళ్ళయి పట్టుమని రెండేళ్ళు కాలేదు, అప్పుడే ఈస్టేజ్ కి వచ్చేశావా?"
"లేదే నవ్వేసింది ఆర్తి. " నేను కంటతడి పెట్టుకున్నది నేనేదో దాంపత్య జీవితంలో యిబ్బంది పడిపోతున్నానని కాదు."
"ఆర్తి....." ధీరలో ఇందాకటి ఆకతాయితనం లేదు. సీరియస్ గా అంది. "నువ్వు సుఖంగా లేవని స్పష్టంగా తెలిసిపోయింది. దాచాల్సిన అవసరం లేదు."
"నీ మొహం.... " ఇంతా ఉత్సాహాన్ని అభినయించింది ఆర్తి .
"నాకేమే.... మంచి భర్త.... ఏ లోటూలేని ఇల్లు......"