ఆమె బరువుపదాల ఒరిపిడి ఏ గుండెలోతుల పొరల్ని పగలగొట్టిందో ఆమె చూపుల్లో వెలితి శాశ్వతాశాశ్వతాల మధ్య సంధికాలాన్ని పట్టి బిగించిన ఏ సంకెళ్లను ఛేదించిందో అమాంతం ఆమె చెంపల్ని చేతుల్లోకి తీసుకుని పెదవులపై బలంగా ముద్దుపెట్టుకున్నాడు.
భావం కాదు, అనుభవం అంతకన్నా కాదు. సంభవానికి, అసంభవానికి మధ్య లిప్తల్లో నూరేళ్ళ ఆయువుని నింపే ప్రయత్నం.
"యూ లవ్ మి సోమచ్" గొణిగింది లూసీ పదాల్ని కూడగట్టుకుంటూ "డోంట్యూ."
"యస్ లూసీ" స్వప్నంలోలా అన్నాడు. "ఐ లవ్యూ. అడోర్యూ"
"ఎందుకంటే నాకు సైతం వినిపించని నా గుండె చప్పుళ్ళమధ్య-
నువ్వో చిరుసవ్వడివి కాబట్టి.
ఎందుకంటే నీ నిశ్వాసం నిన్నటిదాకా నాకు శ్వాసగా మారి--
బ్రతుకుపై ఆశ కల్పించింది కాబట్టి.
ఎందుకంటే నేనేమైనా కానీ నా బ్రతుకు సంద్రాన నువ్వే ఓ--
చుక్కానిలా నిలిచావు కాబట్టి.
ఎందుకంటే మరణంలాంటి నా రణంలో నీ యవ్వనాన్ని---
తోరణంలా మలిచి అందించావు, కాబట్టి.
అన్నిటికన్నా ఎందుకంటే గాయపడ్డ నా గుండె గాయాలను--
మాయంచేసే పాటగా నే పోయేదాకా
నువ్వు గుర్తుంటావు కాబట్టి...
భావుకుడిలా చప్పుడుచేసే స్వగతంలా చెప్పుకుపోయాడు.
ఎన్నాళ్ళకెన్నాళ్ళకి..ఎంత పరవశంగా వుందని... ఇది చాలదూ ఇలాగే తనువు చాలించటానికి. "నిజంగా నన్ను...అంతగా ప్రేమిస్తున్నావా" లూసీ గొంతు వణికింది.
"నిరూపించుకోటానికి నన్నేం చేయమంటావ్."
"చెప్పింది చేస్తావా."
"ఐ స్వేర్."
"అయితే నన్ను షూట్ చెయ్"
ఉలిక్కిపడ్డాడు.
"నేను జోక్ చేయడంలేదు డాళింగ్. నీ చేతుల్లో, ఇప్పుడే నీ సన్నిధిలో చచ్చిపోవాలనుంది ప్లీజ్.
అర్థమైంది శ్రీహర్షకి. లూసీ పరిహాసంగా అడగలేదు.
"నేను అడుగుతున్నది నవ్వులాటగాకాదు శ్రీహర్షా. నీచేతిలో నీ దేశం ఆడపిల్లలా తాళి కట్టించుకున్నదాన్నిగా. అందుకే పుణ్యస్త్రీగా నీ చేతుల్లో చచ్చిపోవాలనుంది."
"లూసీ..." కంపించిపోయాడు.
"ప్లీజ్... నన్ను ప్రేమించడమే నిజమైతే నా మరణాన్నీ కాలానికి వదిలేయకు" వేదనకాదిది... వేధింపు. "యస్ మైడియర్. నా బ్రతుకు నీదిగా సమర్పించుకున్నాను. నా మరణం కూడా నీ మూలంగానే జరగాలి నా మాట విను. నాకు మరణభిక్ష పెట్టు. నీ చేతుల్లో సుమంగళిగా చచ్చిపోయే అదృష్టాన్ని దక్కించు."
రివాల్వర్ అందుకుంది.
అదికాదు.
అతను విభ్రాంతిగా చూస్తుండగానే రివాల్వర్ అతడి చేతిలో వుంచింది.
"డోంట్ ఇరిటేట్. ఇది పాపంకాదు శ్రీహర్షా... వరం... నే కోరుకున్న వరం. ఎలానూ బ్రతకనిదాన్ని... నీ చేతిలో రాలిపోవాలని కోరుకుంటున్నదాన్ని... నన్ను చంపెయ్... ఆ తర్వాత..." మెడలో తాళిబొట్టు అతడి చేతికందించింది. "నువ్వు చెప్పిన ఆ నిశ్చల గోదావరిలో... నీ ఒడిలాంటి అక్కడి వెచ్చని ప్రకృతి సమక్షంలో నేను శాశ్వతంగా విశ్రమించిన సాక్ష్యంగా ఈ తాళిబొట్టుని కలిపి... నా బ్రతుకు పునీతమయిందీ అన్న సంతృప్తి నాకు మిగుల్చు... గోదారి... నీతో కలసి వెళ్ళి చూడాలనుకున్నాను. ఇంకేం కుదురుతుంది? అందుకే ఈ ఒక్కకోరిక మాత్రం తీరక..."
యంత్రంలా చూస్తున్నాడు శ్రీహర్ష.
క్రమంగా అతడి స్తబ్ధత పేరుకుపోతోంది.
* * *
బోలెవార్డ్ వీధిమలుపుని తిరిగిన కెనడియన్ క్రైంబ్యూరో కార్ల వేగం తగ్గింది కొద్దిగా. ముందు కారులోవున్న పొలిసిటర్ జనరల్ వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ అది.
"ఇక్కడ కార్లను ఆపేద్దాం" పోలీసు సూపర్నెంటు బర్రిస్ అన్నాడు నెమ్మదిగా.
ఇంటర్ పోల్ లయిజన్ ఆఫీసర్సుతోపాటు సాయుధులైన ఇరవైమంది బయటకువచ్చి చుట్టూచూశారు.
కెనడాలోని రెండో పెద్దనగరమైన మాంట్రియల్ రోడ్లు నిర్జీవంగా వున్నాయి.
బారులుగా వెలుగుతున్న విద్యుద్దీపాలు అర్థరాత్రి మించని మేఘాల్లో మెరుపుల్లా చీల్చుతూ మొదలయ్యే తుఫానును వీక్షిస్తున్నట్లుగా వున్నాయి.
సూపర్నెంట్ బర్రీస్ ఆదేశాలను అందించాడు తన సిబ్బందికి.
ఎత్తయిన ఓగోడను ఆనుకుని నిలబడ్డ సొలిసిటర్ జనరల్ చలిలో వణికిపోతూ 'ప్రొసీడ్' అన్నాడు.
అవసరమైతే షూట్ చేసి చంపే ఉద్విగ్నతతో షా వున్న ఇంటి చుట్టూ వలయంలా నిలబడ్డారందరూ.
ఒకటి రెండు మూడు...
క్షణాలు భారంగా నడుస్తున్నాయి.
ఓ టెలిఫోన్ స్తంభంవారగా నిలబడ్డ బర్రిస్ పోర్టబుల్ మైక్ అందుకున్నాడు.
మరుక్షణంలో హెచ్చరికలా 'షా'కి తన ఆదేశాన్ని అందించేలోపే...
అప్పుడు వినిపించింది ఆ ఇంటిలో రివాల్వర్ పేలిన చప్పుడు...
అలర్టయి పోయారంతా.
ఏంజరిగిందో ముందు అర్థంకాలేదు సూపర్నెంటు బర్రీస్ కి.
చేతుల్లోని ఆయుధాలు ఏ క్షణంలో అయినా నిప్పులు కక్కేట్లు సిద్ధంగా ఉన్నాయి.
"మిస్టర్ షా..."
బర్రీస్ కేకతో నిశిరాత్రి వణికింది.
"కెనెడియన్ మౌంటెడ్ పోలీస్ సర్వసన్నద్ధంగా నిన్ను చుట్టుముట్టారు సరెండర్ కా..."
జవాబు లేదు...