దేవదారు చెట్ల గుబురులో నలుగురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వాళ్ళ చేతుల్లో తుపాకులున్నాయి.
రవి బైనాక్యులర్స్ అనిలకిచ్చి "మిస్ అనిలా! మీరు వాళ్ళని చూడండి! వాళ్ళలో ఎవరినైనా గుర్తుపట్టగలరేమో!" అన్నాడు.
అనిల చూసింది "వాళ్ళలో ఇద్దరిని గుర్తుపట్టగలను. వాళ్ళే నన్ను "దెయ్యాల కొంపకి వెళ్ళొద్దు" అని వెనక్కు పంపించింది. అయితే అప్పుడు వాళ్ళ చేతుల్లో తుపాకులు లేవు."
"దీన్నిబట్టి ఈ ఇంటిని ఎవరో కాపాడుతున్నారన్నమాట! పాడుబడ్డ ఇంటిని కాపాడవలసిన అవసరం ఏం వుంటుందీ? అదీ ఇంత జాగ్రత్తగా?"
"మనం ఎలా అయినా ఇంట్లోకి వెళ్ళలేమా?"
బైనాక్యులర్స్ తో ఇంటి పరిసరాలన్నీ జాగ్రత్తగా పరిశీలించాడు రవి.
దక్షిణం ద్వారం ముందు మాత్రమే, కొద్ది దూరంలో రహస్యంగా కాపలా వున్నారు. సన్నటి కాలిబాటి కూడా అటువైపే వుంది ఊళ్ళోకి. పడమటి వైపునుంచి వెళ్ళగలిగితే, కాపలావాళ్ళకి కనపడకుండా లోపలికి వెళ్ళొచ్చు. అలా వుంది ఆ ఇంటి నిర్మాణం.
కానీ, అటువైపు నుంచి దారిలేదు. కొండలతో నిండి వుంది. కౄరమృగాలున్న జాడలేదు. అంతేకాక కొండమీదే కాస్త చదునుగా వున్న ప్రదేశంలో అయిదారు గుడిసెలున్నాయి. వాళ్ళు ఊళ్ళోకి పోవటానికీ ఏదో దారి చేసుకుని వుంటారు తప్పకుండా.
తన ఆలోచన చెప్పాడు అనిలకి. అనిల కూడా చూసింది బైనాక్యులర్స్ లోంచి! ఇంట్లోకి వెళ్ళాలంటే పడమటి వైపునుంచే వెళ్ళాలి!
"వెళ్దాం" అంది అనిల తెగింపుతో.
"చాలా రిస్క్!"
"ఫరవాలేదు. ఇప్పుడు నేనున్న పరిస్థితికంటే భయంకరంగా ఏదో వుండదు. పోనీ, మీ రివాల్వర్ నాకివ్వండి, నేనొక్కదాన్నే వెళ్తాను."
నవ్వాడు రవి.
"మిమ్మల్ని అలా వెళ్ళనిస్తావనే అనుకుంటున్నారా?"
"నాకు భయంలేదు. నన్ను చంపరు మిమ్మల్ని"
ఆగిపోయింది అనిల భయంగా బెదురుగా చూసింది.
అల్లరిగా నవ్వాడు రవి.
"మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ప్రాణాలు దక్కించుకునే కంటే, మీ కోసం హీరోయిన్ గా చచ్చిపోయినా బాగానే వుంటుంది నాకు!"
అనిల కళ్ళు మెరిశాయి. మొదటిసారిగా అతని ముందు సిగ్గుపడింది.
స్పష్టంగా అనుకోకుండానే ఇద్దరూ కలిసే వెళ్ళటానికి నిర్ణయమైపోయింది. త్రిసికి అనుసరిస్తోంది మౌనంగా.
మనసులో ఏమనుకున్నా త్రిసికి మాట్లాడదు గనుక ఆమెతో చర్చించే ప్రస్తావన లేదు. కొండ దిగి చుట్టూ తిరిగి వెళ్ళాలి. చెప్పులతో నడుస్తుంటే కాలు జారుతోంది. చెప్పులు తీసేస్తే కత్తులమీద నడుస్తున్నట్లే వున్నాయి కొండరాళ్ళు.
నడక ప్రయాసగా వున్నా చుట్టూ ప్రకృతి మాత్రం బాగుంది. దూరంగా జొన్నచేలు-విసిరేసినట్లుగా అక్కడక్కడ కొన్ని గుడిసెలు. కొండ ప్రాంతం కావటం వల్ల కాస్త చదునుగా ఉన్నచోటల్లా గుడిసెలు వేసుకున్నారు. ఎక్కడికక్కడ కాలిబాటలు.
ఎత్తుమీద నిలబడటం వల్ల దూరంగా వున్న దేవాలయం, దాని గోపురం ఎండలో మెరుస్తూ కనిపిస్తున్నాయి. కొంతమంది చిన్నపిల్లలు గొర్రెల మందల్ని మేపుతున్నారు. గొర్రెలని ఒక కంట చూస్తూనే ఏవో ఆటలు ఆడుకుంటున్నారు. అందరికీ గోచీలే! చిన్న నిక్కరు అయినా ఎవరి వంటిమీద లేదు. కుక్కలు యధేచ్చగా విహరిస్తున్నాయి.
చుట్టూ చూస్తూ నడవటంలో అనిల కాలు జారింది. నడుం చుట్టూ చేతులు వేసి పడకుండా పట్టుకున్నాడు. కళ్ళు మూసుకుని అతనిమీద వాలిపోయింది.
"భయపడ్డారా?" అన్నాడు.
అనిల సమాధానం చెప్పలేదు. ఒక నిమిషం తర్వాత అతని చేతులు విడిపించుకుంది.
"జాగ్రత్తగా చూసి నడవండి" హెచ్చరించాడు. అతనికీ ఉండుడి కాలు జారుతోంది. నలిగిన కాలిబాట లేకపోవటం వల్ల రాళ్ళూ రప్పలే కాక ముళ్ళ పొదలు కూడా వున్నాయి. జనసంచారం లేదు. వుండుండి ఎక్కడో ఒక కుక్క "భౌ"మని అరుస్తోంది.
ఇంటి పడమటి వైపుకి చేరుకున్నారు. బైనాక్యులర్స్ తో చుట్టూ చూశారు మళ్ళీ. తుత్తురకట్ట కప్పివున్న గుడిసెలు పదివరకూ వున్నాయి. కొద్దిదూరంలో కాపలా ఎవరూ లేరు. కాని, ఇటువైపు కొండ చాలా 'స్టీప్' గా వుంది. ఎక్కటం కష్టం. రవి ముందుకు నడిచి, ఒకచోట ఎలాగో కాలూనుకుని, అనిలకి చెయ్యందించి పైకి రావటానికి సహాయపడ్డాడు.
త్రిసికిని ఉద్దేశించి "మీరు ఇంత ప్రయాసపడటం దేనికి? మాతో రాకండి!" అన్నాడు రవి.
త్రిసికి సమాధానం చెప్పకుండా ముందుకు నడవటం చూసి ఆమెకు కూడా చెయ్యి అందించాడు. దాదాపు గంటసేపు ఎంతో ప్రయాసపడి, కొండ ఎక్కాక ఇంటి ఆవరణ చేరుకున్నారు. కళ్ళు పెద్దవిచేసి ఆ ఇంటిని చూసింది అనిల. ఏదో భయంతో ఆమె శరీరం జలదరించింది. అప్రయత్నంగా రవి దగ్గరగా వచ్చి అతని భుజాలు పట్టుకుంది గట్టిగా.
ఒక కిటికీ వుంది. అది లోపలినుంచి వేసివుంది. అటువైపు ద్వారం లేదు. రవి నెమ్మదిగా కిటికీ తలుపు తీసి చూశాడు. అంతే కోటి గంట లొక్కసారి మోగించినట్లు గణగణ శబ్దాలతో మార్మోగిపోయింది ఆ ప్రాంతమంతా!
ఏ వైపు నుంచో 'ఢాం' అని మోగింది తుపాకి. జవాబుగా మరోవైపు నుంచి 'ఢాం!ఢాం!ఢాం' అని మూడుసార్లు వినిపించింది తుపాకి మోత! కొండ అంచును ఢీకొని భయంకరంగా మార్మోగాయి ఆ ధ్వనులు!
త్రిసికినీ, అనిలనీ చెరోచేత్తోనూ పట్టుకుని పిచ్చిగా పరుగుతీశాడు రవి. ఎటు వెళ్తున్నాడో తెలీటంలేదు. కాళ్ళకు ఏవి అడ్డు వస్తున్నాయో తెలీటంలేదు. ఎలాగో ఎక్కడైనా దాక్కోవాలి. కట్టు కప్పుతో వున్న గుడిసె కనిపించింది. వెనుక ముందు ఆలోచించకుండా దానిలో ప్రవేశించారు ఒగరుస్తూ. గోడకి జార్లగిల బడ్డారు. బట్టలు చాలా చోట్ల కొర్రులు పడ్డాయి. అరికాలులో నెత్తురు చిమ్ముతున్నాయి. రవి ఇంచుమించు ఈడ్చినట్లుగా త్రిసికిని, అనిలని పరిగెత్తించటం వల్ల ఇద్దరూ ఊపిరి అందనంతగా ఆయాసపడిపోతున్నారు. ఒక నిముషం తర్వాత కాని గుడిసె ఎవరిదో, ఎవరున్నారో చూడలేకపోయారు.
గెడ్డం పెరిగిన ఒక నడివయసు వ్యక్తి చేతిలో ఉలి పట్టుకుని ముగ్గురివంకా చూస్తున్నాడు. అతని చూపులు చాలా నిర్లిప్తంగా వున్నాయి త్రిసికి చూపుల్లాగే! అనుకోకుండా కొత్తవాళ్ళని చూసినందుకు ఆశ్చర్యమైనా లేదు ఆ చూపుల్లో.
రవి చటుక్కున ఆ వ్యక్తిముందు మోకాళ్ళమీద కూర్చుని రెండు చేతులూ జోడించాడు.
"మీరెవరో తెలీదు. కానీ మిమ్మల్ని కొందరు తుపాకులతో వెంటాడుతున్నారు. మీరెలాగైనా మమ్మల్ని కాపాడాలి. వివరాలన్నీ తర్వాత చెప్తాను" అన్నాడు.
ఆ వ్యక్తి సమాధానం చెప్పలేదు కానీ, లేచి అటువైపు గోడలోవున్న తలుపు తెరిచాడు. అతడు తెరిచేవరకూ అది తలుపు అని కానీ, అది గోడలో అమర్చి వుందనికానీ ఎవరికీ తెలీదు. అంత గాభరాలోనూ రవిలో ఆర్కియాలిజిస్ట్ ఆ విషయం గమనించాడు. తలుపు తెరిచి పట్టుకుని లోపలికి వెళ్ళమన్నట్లు సైగ చేశాడు ఆ వ్యక్తి.
ముగ్గురూ లోపల ప్రవేశించగానే తలుపు మూసుకుపోయింది. అది ఏదో సన్నని గుహలా వుంది. మసక వెలుతురు. ఆ కాంతికి కళ్ళు అలవాటు పడటానికి కొంతసేపు పట్టింది. అప్పుడు చూశారు ఆ గదిని లేదా గుహ లాంటి గదిని! అదొక 'గోడౌన్'లా వుంది. ఒకవైపు ఏవేవో కర్ర పెట్టెలున్నాయి. మరొకవైపు రకరకాల శిల్పాలు జాగ్రత్తగా పేర్చి వున్నాయి.
అవన్నీ కొత్తగా చెక్కినట్లుగా నటరాజస్వామి విగ్రహాలు అయిదారు రకాలవి. నరసింహస్వామి విగ్రహాలూ... చవితి వినాయకుడూ, శనగ వినాయకుడూ మొదలైన రకరకాల వినాయక విగ్రహాలూ- ఇలా ఎన్నో రకాలుగా వున్నాయి.
అయితే అన్ని విగ్రహాలు ముక్కు దగ్గిరో, నోటి దగ్గిరో చెక్కేసినట్లుగా వున్నాయి. కొన్నిటికి చేతులు సగం సగం విరిగినట్లుగా వున్నాయి. కొత్తగా చెక్కిన విగ్రహాలు ఇలా విరిగి వుండటం ఎందుకో అనుకున్నాడు రవి. పాతకాలపు విగ్రహాలు చేతికయినా ప్రతికృతులేమో?
శిల్పులు కొందరు ఇలా ప్రతి శిల్పాలు చెక్కుంటారు. చిత్రాలు చూసి గీసుకున్నట్లే అయినా ఇన్ని శిల్పాలు ఒక్కచోట ఇలా పోగు పడేసి వుంచవలసిన అవసరమేమిటి?