"కలలు మానసిక అనారోగ్యానికి చిహ్నం అంటారా?"
"నిస్సందేహంగా? కలలు లేని నిద్రపోగలిగిన వాడే యోగిలాంటి మనసు కలవాడు. అలాంటి అదృష్టవంతులు అతికొద్దిమంది!"
"అలాంటి వాళ్ళకేనా సంకల్పసిద్ధి ఉండేది? అంటే అనుకున్నది జరగటం..."
"ఈ శక్తి ఎంతో కొంత ప్రతి మనసుకీ ఉంటుందనుకుంటాను. ఉదాహరణకి దూరంలో ఉన్న ఆత్మీయులని కానీ, స్నేహితులని కానీ కలుసుకోవాలనుకుంటాం! కలుసుకోలేక లోలోపల పరితపిస్తాం. ఆ సమయంలో వాళ్ళు రావటమో, లేక ఉత్తరం రావటమో జరుగుతుంది. ఇలాంటి అనుభవం మీకెప్పుడూ కలగలేదూ?"
"చాలాసార్లు కలిగింది. ఒకదాన్ని చాలా గాఢంగా కోరుకోవటమూ, ఇక దాన్ని పొందలేమని నిరాశ చేసుకున్నాక చిత్రంగా ఆ కోరిక నెరవేరటమూ, ఈ అనుభవం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. నా స్నేహితుల్లో కూడా చాలామంది తమ విషయంలోనూ అలాగే జరిగిందన్నారు."
"మనసుకున్న శక్తి అనంతమైనది. దీన్ని మనం పదును పెట్టుకోవాలి. ఆపైన మన అదుపులో ఉంచుకోవాలి. అలాంటి మనసుతో మానవుడు సాధించలేనిది లేదు."
అనిల నవ్వింది.
"మనసుని అదుపులో పెట్టుకోవటమా? ఊహించగలరా అలాంటిది? గాలినైనా బంధించగలరేమో కాని..."
రవి కూడా నవ్వాడు.
"అందుకే మనం ఇలా ఉన్నాం! కష్టపడి చదివే ప్రతి విద్యార్థీ పరీక్షల ముందు, తాను పరీక్ష రాయలేకపోయినట్లో. ఎగ్జామినేషన్ హాలుకి టైమ్ కి వెళ్ళలేకపోయినట్లో, రాస్తుంటే పెన్ పాడయిపోయినట్లో... పూర్తిగా రాయకుండా వాచర్ పేపర్ లాగేసుకున్నట్లో కల కంటాడు తప్పకుండా. ఈ రకమైన కలలు అతనికి చదువులో ఉన్న ఆసక్తికి నిదర్శనాలు! ఏ కలా రాకుండా హాయిగా నిద్రపోయే విద్యార్థి అయితే గొప్ప స్కాలర్ కావాలి. లేకపోతే శుద్ధ మొద్దు కావాలి! అలాగే మనం కూడా మహా యోగులమో, లేక జడ పదార్థాలమో అయితే తప్ప కలలు రాకుండా ఉండవు."
"ఆ ఇల్లు నన్నెందుకుకిలా ఆకర్షిస్తోంది?"
"గత జీవితంలో మీరు మరిచిపోయిన ఏవైనా సంఘటనలు అందుకు కారణం కావచ్చు. ఒకసారి వెళ్ళి చూద్దామా?"
"లాభం లేదు నేను రెండు మూడుసార్లు వెళ్ళటానికి ప్రయత్నించాను. దారిలోనే ఎవరో అడ్డుకుని "దయ్యాల కొంపకి వెళ్ళటానికి వీల్లేదు" అని వెనక్కి మళ్ళించారు."
"మీరు ఒంటరిగా వెళ్ళటానికి ప్రయత్నించారా?"
"అవును"
"ఎంత సాహసం?"
"వచ్చేస్తుంది, అవసరాన్నిబట్టి..."
"ఒక పని చేద్దాం! రేపు బైనాక్యులర్స్ తో వద్దాం! దూరం నుంచే ఆ ఇంటిని చూసి ఎవరూ లేని వైపునుంచి వెళ్దాం!"
"బ్రిలియంట్ ఐడియా? కానీ, ఒకవేళ ఆ యింట్లో నిజంగా దెయ్యాలుంటే?"
రవి నవ్వాడు "ఈసారి ఆంజనేయస్వామిని నేను ఆవహింపచేసుకుంటాను."
త్రిసికి వచ్చింది అనిలని వెతుక్కుంటూ. అనిల ప్రక్కన రవిని చూసిన ఆమె ముఖంలో భయాందోళనలు స్పష్టంగా కనిపించాడు. అది అర్థం కాలేదు రవికి. త్రిసికి ఒక్కొక్కప్పుడు తననెంతో ఆదరంగా చూస్తుంది. ఉండుండి దేనికో భయపడినట్లు అయిపోతుంది.
"మనం టెంట్స్ కి వెళ్దాం!" అని లేచాడు. రవి, అనిల, త్రిసికి కూడా బయలుదేరారు.
టెంట్స్ లో చాలా కోలాహలంగా ఉంది.
"ఓసి బిసా"...గ్రూప్ మ్యూజిక్ జెన్నిఫర్ టేప్ రికార్డర్ లోంచి వినిపిస్తోంది. ఆ మ్యూజిక్ కి అనుగుణంగా డాన్స్ చేస్తోంది జెన్నిఫర్. శరీరంలోని ప్రతి కండరమూ ఆమె అదుపులో ఉన్నట్లు సునాయాసంగా వంపులు తిరిగిపోతోంది. మెరుపుకన్నా వేగంగా కదులుతూ లయకు అనుగుణంగా సున్నితంగా శరీరాన్ని ఊపుతూ రిథమిక్ గా స్టెప్స్ వేస్తోంది. సాధారణంగా జెన్నిఫర్ ని చీదరించుకునే అనిల సహితం ఆ టాలెంట్ నీ, శరీర లాఘవాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.
గమ్మత్తుగా 'ఓసి బిసా' గ్రూప్ 'రఘుపతి రాఘవ రాజారాం' పాట అందుకుంది.
"రగ్గుప్పతి రాగవ రాజారాం!
పతీత పావని షీతారామ్!
ఈష్వర్ అల్లా తేర్రోనామ్!
సబ్ కో షన్మతి దేవనారాయణ్ బొగువాన్!"
సాహిత్యం మారలేదు, రాగమూ మారలేదు. కానీ గిటార్, సింథ సైజర్ మొదలైన పాశ్చాత్య వాయిద్యాల నేపథ్యంలో మారిన ఉచ్ఛారణలో ఆ పాట భావం మారిపోయింది. వ్యక్తీకరణ మారిపోయింది. ఆత్మ ఎగిరిపోయింది.
ప్రశాంత భక్తి భావనని వెదజల్లవలసిన ఆ పాట ఏదో మైకంతో నిండిన ఉద్రేకాన్ని రగిలిస్తోంది. బాగా ఎబ్బెట్టుగా కనిపించే లోనెక్ టైట్ స్టెప్స్ వేస్తుంటే కోదండపాణి శ్రీరామచంద్రుడికి విస్కీగ్లాస్ అందిస్తున్నట్లుగా ఉంది.
మనుష్యులకే కాదు. సంగీతానికయినా, సాహిత్యానికయినా, మరి దేనికయినా ప్రధానమైనది ఆత్మ మాత్రమే! ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పాట, ఆ డాన్సూ, ఒక మహాయోగి శరీరాన్ని కామినీ పిశాచం ఆవహించినట్టుగా వున్నాయి.
ఆ విచిత్ర విపరిణామాన్ని కళ్ళప్పగించి చూసింది అనిల.
ఆ మరునాడు తవ్వకాల పనులు లేవు. కూలీలకు మరో రోజు విశ్రాంతి ఇచ్చాకే పని ప్రారంభించాలనుకున్నాడు రవి. జెన్నిఫర్, విష్ణు జీప్ లో ఎక్కడికో వెళ్ళిపోయారు.
ఉదయమే టెక్నీషియన్స్ ఇద్దరు ముగ్గురు టౌన్ కి వెళ్ళారు. బైనాక్యులర్స్ తీసుకుని అనిల, రవి ఇంటిని దూరం నుంచి పరీక్షగా చూడటానికి బయలుదేరారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంట్లోకి కూడా వెళ్ళి చూడాలని వాళ్ళ సంకల్పం.
అనిల వెంట త్రిసికి కూడా బయలుదేరింది యధాప్రకారంగా, "రావొద్దు!" అనాలనుకున్నాడు రవి. అనలేదు. ప్రయోజనం లేదని అతని మనసుకు తెలుసు. భావరహితంగా ఉండాలని త్రిసికి ఎంతగా ప్రయత్నించినా, ఆమె కళ్ళల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయి. ఏదో ప్రమాదాన్ని పసికట్టి చెదిరిపోతున్నట్లుగా ఉన్నాయి ఆమె చూపులు.
ఎత్తైన కొండ ప్రాంతం చూసుకుని, అక్కడి నుంచి ఇంటిని బైనాక్యులర్స్ లోంచి చూశాడు రవి. ముందుగా చాలా పాతకాలపు కట్టడం పైకప్పు మీద బంగాళా పెంకులు చాలాచోట్ల చెదిరిపోయి కనిపిస్తున్నాయి. రాతి గోడలు, కిటికీలున్నాయి. తలుపులు మూసి వున్నాయి.
అవి లోపలినుంచి మూసి ఉన్నాయో, లేక గాలికి దగ్గిరగా చేరాయో తెలీటంలేదు. ద్వార బంధాలు చాలా విశాలంగా ఉన్నాయి. తలుపులు కూడా చాలా దృఢంగా ఉన్నాయి. ఏ చెక్కతో చేశారో కానీ ఏమాత్రం పాడు కాలేదు. తలుపులు కూడా వేసి ఉన్నట్లుగానే ఉన్నాయి.
వానలు ఎక్కువగా పడని ప్రాంతం కనుక గోడలమీద ఎలాంటి చారికలూ లేవు. దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. చాలా పెద్ద ఇల్లు, మూడువేల చదరపు గజాల పైగానే ఉంటుంది వైశాల్యం. అంతకుమించి బయటి నుండి ఏమీ తెలీటంలేదు. బైనాక్యులర్స్ ఆ ఇంటి పరిసరాలవైపు మళ్ళించాడు.