18
రత్నమ్మకు పెళ్ళయి కాపురానికి వెళ్ళిపోయినప్పటి నుంచీ చంద్రి, ఇటు తన తండ్రినీ, అటు అన్నమ్మనీ కనిపెట్టుకొని వుంటోంది.
నాగమ్మ తన అవసరం కొద్దీ చాలా మారిపోయింది - చంద్రి అన్నమ్మ దగ్గిరకు వెళతానన్నప్పుడు తిట్టటంలేదు సరికదా, "మీ అయ్యకాడ నేనుంటానులే! యెల్లు - " అని పంపుతోంది.
మొదట్లో వెంకడు తోటమీద, వచ్చిన డబ్బు తనకిస్తాడో, ఇయ్యడో అని భయపడింది నాగమ్మ - కానీ, వాడు ఏ రోజు కూరలమ్మగా వచ్చిన డబ్బు, ఆ రోజు చేతులో పోస్తోంటే, వెంకడంటే చాలా నమ్మకం కుదిరింది...."మా పెద్దోడు" అంటోంది వెంకణ్ని గురించి చుట్టుపక్కల వారితో మాట్లాడేటప్పుడు.
తన కుటుంబం ఈరకంగా కాస్త కుదుటపడటానికి జైహింద్ బాబే కారణమన్న కృతజ్ఞతాభావం నాగమ్మ మనసులో బలపడింది. జైహింద్ బాబుని ఆదరంగా చూస్తోంది. ఆ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు ఎప్పటిలా సాగటం మొదలయింది.
ఒకరోజు జైహింద్ బాబు వచ్చినప్పుడు "జయన్నా! పెద్దకి తప్పు కట్టేసి మా చెంద్రిని పెళ్ళాడియ్యి - " అంది నవ్వుతూ నవ్వుతూ అన్నట్లుగా.
"తప్పా! తప్పెందుకు కట్టాలి? ఏం తప్పు చేస్తున్నానని!" రోషంగా అడిగాడతను.
చంద్రి భయంగా చూసింది!
"అదేంటి జయన్నా! వరుస కాని పెళ్ళి చేసుకొని కట్టు తప్పితే తప్పుకట్టొద్దా!" అమాయకంగా అడిగింది నాగమ్మ!
"నాకిది తప్పుగా అనిపించడం లేదు - నేను తప్పుకట్టను" ఖచ్చితంగా అన్నాడు జైహింద్ బాబు.
నాగమ్మకు కోపం వచ్చింది! అది ఎంతయినా సహిస్తుంది కాని కట్టు తప్పుతానంటే సహించదు! అది తప్పు కాదంటే, అర్థం చేసుకోలేదు.
"అదేంటి నాగన్నా! పెద్ద సదువులు సదువుతున్నావు. రేపో మాపో, పెద్ద దొరనాటి ఉద్యోగం వస్తాది. ఈ మాత్తరం తప్పు కట్టలేవా?" అంది నవ్వుతూనే.
గతుక్కుమన్నాడు జైహింద్ బాబు. "ఏమిటిది?" అన్నట్లు చంద్రి వంక చూశాడు.
చంద్రి ప్రాధేయ పూర్వకంగా చూస్తూ రెండు చేతులూ జోడించింది.
జైహింద్ బాబు మనసంతా చికాకు పడిపోయింది. తను చదువు మానేసినట్లు నాగమ్మకింకా తెలీదు..... తను ఏదో చదువుకుని పెద్ద ఉద్యోగస్థుణ్నవుతాననే ఆశతోనే, చంద్రిని చేసుకోమని అడుగుతోంది. ఒకటి - మోసం చేసి పెళ్ళిచేసుకోవటం, రెండు-ఏదో తప్పుచేస్తున్నట్టుగా పెద్దకి తప్పుకట్టి, ఆ డబ్బుతో పెద్దలంతా తాగి తందనాలాడితే తన తప్పు పోయిందనుకోవటం. ఈ రెంటిలో దేనికీ జైహింద్ బాబు మనసు అంగీకరించటంలేదు. ఈ విషయంలో చంద్రి జైహింద్ బాబు ప్రాధేయపడవలసి వచ్చింది.
"బావా! అమ్మకి నువ్వు చదువుకున్నా. చదువులేకపోయనా ఒక్కటే! అమ్మకి కావలసిందల్లా నువ్వు మంచి ఉద్యోగంలో ఉండటం - బాగా డబ్బు సంపాదించటం. పెళ్ళయిపోయాక నువ్వు చదువు మానేసినట్లు తెలిసినా అంతగా బాధపడదు - ఇందులో మోసమేముంది? అసలు మనలో చదువుకున్న వాళ్ళెవరు?"
"ఇదే నా మనసుకి నచ్చటంలేదు. ఇంకా తప్పు కట్టమంటోంది మీ అమ్మ - మన వాళ్ళందరిలో మూర్ఖత్వాన్నీ, మూఢచారాలనీ, పోగొట్టాలని తాపత్రయపడే నేను, అందరికంటే మూర్ఖంగా పోయి తాగి తందనాలాడమని పెద్దకి తప్పు కట్టనా?"
"వద్దు. తప్పుకట్టకు - మనం వీళ్ళందరినీ వదిలి ఎక్కడికైనా పోదాం, పద"
"చంద్రి!"
"నాకు తెలుసు బావా! నువ్వు అత్తయ్యని వదలి రాలేవని బాగా తెలిసే ఆమాట అన్నాను. నేను మాత్రం రోగిష్టి తండ్రినీ, వెర్రిబాగుల అమ్మనీ వదలి రాగలనా? మనం మన వాళ్ళతోనే ఉండాలనుకుంటే, మన సంఘాన్నెదిరించి బ్రతకలేం బావా! ఒక్క మాట అంటాను - స్థిమితంగా విను. మూర్ఖత్వాలూ, మూడాచారాలూ మనలోనేనా ఉన్నాయి? ఎంతో చదువుకుని ఎంతెంతో సంస్కారవంతులనుకునే వాళ్ళలో ఎలాంటి మూర్ఖత్వాలున్నాయో తెలుసునా? నా చిన్నప్పటి స్నేహితురాలు ఇప్పుడు బి.ఏ. పాసయింది. తననెంతో విశాలహృదయమని నిరూపించుకోవటానికి నన్ను వాళ్ళింటికి రమ్మంది. స్నేహం కోసం ఆశపడి వెళ్ళాను. వెళ్ళినప్పటినుంచి వచ్చేవరకూ "నువ్వు నాకంటె చాలా తక్కువ దానివి సుమా!" అన్నట్లే ప్రవర్తించింది. తను కమ్యూనిస్ట్ నని చెప్పుకుంటుంది. డబ్బుమీద ఇంతా అంతా ఆశ కాదు. కూచున్న కొంచెంసేపూ ఒఠ్ఠిపల్లెటూరి అప్పలమ్మలా, చీరల గురించీ, నగల గురించీ తప్ప మరొక దాని గురించి మాట్లాడలేదు. దేవుడు లేడంటుంది. ఎవరో బాబా వచ్చాడని చూడటానికి పోయింది. ఆ బాబా తనలో దేవీ కళ ఉందన్నాడని తలుచుకుని తలుచుకుని మురిసిపోయింది. సంస్కారపు ముసుగుల్లో దాక్కున్న నిజస్వరూపాలిలాటివి! ఎక్కడోదాకా ఎందుకూ? మన సరళమ్మ సంగతే చూడు, ఆవిడ నిరాశ్రయురాలై నడివీధిలో నిలబడితే ఒక్కరు ఆదుకోలేదు! తన బ్రతుకు తెరువుకోసం మిలటరీ కేంటీన్ లో వంట మనిషిగా చేరిందని ఆ కులాల వాళ్ళందరూ సరళమ్మని వెలేశారు! ఇప్పుడు చెప్పు - మూఢాచారాలున్నది మనలోనేనా? మూర్ఖత్వం మనవాళ్ళకేనా ఉన్నది? ఇంకా మనవాళ్ళ మూర్ఖత్వంలో అమాయకత్వం వుంది. ఆ పై వాళ్ళ మూర్ఖత్వంలో ప్రాణాలనైనా కరకర నమిలి మ్రింగాలనే కక్షలూ, కార్పణ్యాలూ ఉన్నాయి! మనలో ఎన్ని మూడాచారాలున్నా, కష్టసుఖాల్లో ఒకరినొకరు ఆదుకునే సమతాభావం ఉంది! వాళ్ళలో తోటివాళ్ళు కష్టాలపాలయితే లోలోపల ఆనందించే వారే తప్ప ఆదుకునే వారుండరు!"
జైహింద్ బాబు ఆశ్చర్యంగా విన్నాడు!
"నువ్వింత జాగ్రత్తగా ఈ విషయాలన్నీ ఆలోచిస్తావా, చంద్రీ!"
"ఆలోచిస్తాను బావా! ఈ మధ్యకాలంలో ఎలాగో ఒకలాగ స్నేహితుల దగ్గిరనుండి పుస్తకాలు సంపాదించి చదవటం, వాటి గురించి ఆలోచించటమే నా పని!..... బావా! ఈ లోకాన్నంతా నువ్వొక్క రోజులో మార్చలేవు! పరంపరగా వచ్చే మూర్ఖత్వాల నుండి బయటపడి స్వతంత్రంగా ఆలోచించటానికి మనిషి ఎంతో విశాల హృదయుడై వుండాలి. మహా సాహసి కావాలి. అలాంటివాళ్ళు కోటికొక్కరుంటారు..... ప్లీజ్ బావా! లేనిపోని ఆలోచనలతో నన్ను దూరం చేసుకోకు. ప్రస్తుతానికి తప్పు కట్టేసి నన్ను చేసుకో! ఆ తరువాత ఇద్దరమూ కలిసి అర్థంలేని ఈ ఆచారాలు ఎలా రూపుమాపాలో ఆలోచిద్దాం"