Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 38


    చంద్ర తులసిని చూసి నవ్వి, మీ చెయ్యి బాగుపడనీయండి. బాగుపడుతుందిలెండి. అప్పుడు ఇంతకంటే మంచి ఉద్యోగమే చూపిస్తారు మీకు సూర్యంగారు" అంది. గతుక్కుమంది తులసి. తన మనసు చదివినట్లు మాట్లాడుతోంది! కానీ ఆ మాటల్లో ఆదరణే తప్ప ఎత్తిపొడుపు లేదు, ఈసడింపూ లేదు.
    తులసికి శుభ్రమైన పక్క ఏర్పాటుచేసి పడుకోబోయే ముందు వేడి వేడి పాలు గ్లాసుతో అందించింది చంద్ర.
    "ఇవి దేనికీ? కడుపునిండుగా అన్నం పెట్టారు."
    ఈ పాలు ఆకలి తీర్చటానికి కాదు. మీరు మానసికంగా చాలా అలిసిపోయారు. ఈ పాలు త్రాగితే సుఖంగా నిద్రపడుతుంది."
    తులసి ఆ పాలు త్రాగి పడుకుంది. చాల రోజుల తర్వాత కొద్దిపాటి సంతృప్తి తోచింది. సుఖంగా నిద్రకూడా పట్టింది.


                                                         19


    తల్లిని కనిపెట్టిచూసే బాధ్యత సుమతికి అప్పగించి, తాను రాయవెల్లూరుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది తులసి. కృష్ణారావు తులసిని నీలకంఠం ఇంటికి తీసికెళ్ళాడు. ఆ సమయంలో నీలకంఠం ఇంట్లో లేడు. సుమతి సాధారణ మర్యాద పాటించకుండా, ముఖం చిట్లించి, "మళ్ళీ ఈ కృష్ణారావుతో కలిసి తిరుగుతున్నావా?" అంది.
    తులసి వెటకారంగా నవ్వే కృష్ణారావు చూపులు తప్పించుకుంటూ అతనికి కూచోమని కుర్చీ చూపించి, ఆ కుర్చీలో పేరుకున్న దుమ్మును దులిపి పాతబట్టతో తుడిచి, తను కింద చాపమీద కూలబడింది. సుమతికి ఏదో తిక్కరేగసాగింది.
    "తులసీ! నీకు పెళ్ళికాలేదు. అంచేత ఎలా తిరిగినా చెల్లుతుంది. నా సంగతి అలా కాదు. కృష్ణారావు మన ఇంటికి వస్తున్నాడని తెలిస్తే నా మొగుడు నన్ను బ్రతకనివ్వడు" అంది కృష్ణారావు ఎదురుగుండానే.
    కృష్ణారావు సిన్సియర్ గా ఆశ్చర్యపోతూ, "అదేమిటండీ! నేను మిమ్మల్ని మరొక దృష్టిలో ఎందుకు చూస్తాను? అసలు మరొకరు ఎవరయినా మిమ్మల్ని మరొక దృష్టితో ఎందుకు చూస్తారు?" అన్నాడు.
    ఈ మాటలు సుమతికెంతో కష్టం కలిగించినట్లు ముఖం మాడ్చుకుని, "మా ఇంటికి వచ్చి నన్నే అవమానిస్తున్నావా?" అంది.
    "నేను మిమ్మల్ని అవమానించానా? 'మిమ్మల్ని చూస్తే ఎవరికైనా మరొక భావం రాదు' అన్నాను. అది అవమానించటమా? ఏం తులసీ?"
    తులసికి ఆపుకుందామన్నా ఆగకుండా నవ్వు వచ్చేసింది. చీటికీ మాటికీ వచ్చే ఫిట్స్ కారణంగా బక్కచిక్కిపోయి, సహజంగా శుచీ, శుభ్రం లేకపోవటంవల్ల జిడ్డు ఓడుతూ కట్టుకుందామన్నా మంచి చీర లేకపోవటం వల్ల రంగు వెలిసిపోయిన ముతక చీర కట్టుకుని, చిరునవ్వు అనేది మరచిపోవటం వల్ల ముఖం చిటపటలాడించుకుంటూ, కృష్ణారావు తనను అవమానించాడని బాధపడే అక్కను చూస్తోంటే, నవ్వుతో పాటు అంతులేని జాలి కూడా కలిగింది తులసికి....
    "అక్కా! నువ్వు కొంచెం రోజులపాటు అమ్మని చూసుకోవాలి. అది చెప్పడానికే వచ్చాను...." అంది మాట మారుస్తూ.
    "నేను అమ్మని చూసుకోవాలా! ఏం? నీ తిరుగుళ్ళతో అమ్మని చూసుకోవటానికి తీరుబడి చిక్కటంలేదా?"
    తులసికి మండిపోయింది. అయినా నిగ్రహించుకుని, "అదికాదు. నేను నా చెయ్యి బాగుచేయించుకోవటానికి రాయవెల్లూరు వెళ్తున్నాను. అమ్మని నువ్వు చూసుకోకపోతే ఎలా?" అంది.
    "రాయవెల్లూరు వెళ్తున్నావా? కృష్ణారావుతో నేనా?"
    "అవును."
    "ఇలా తిరిగితే, నీకు పెళ్ళి అవుతుందనేనా?"
    "నాకు బావలాంటి మొగుడు దొరకడంటావా? పోనీలే."
    "అయ్యో! అయ్యో! ఎంతమాటన్నావే! నా కర్మ నీకెందుకు పడుతుందే? చదువుకున్నదానివి. అందాల రాణివి...." చేతులూపుకుంటూ, దీర్ఘాలు తీస్తూ మాట్లాడేస్తోంది సుమతి.
    ఏ పరిస్థితుల్లోనయినా, తన పరిసరాలను, సంగతి సందర్భాలనూ హాయిగా మరిచిపోయి, తన ధోరణిలో కొట్టుకుపోగలదు సుమతి.
    "అదిసరే! అమ్మకి కాస్త రోజూ అన్నం పట్టికెళతావుగా? ఆస్పత్రి తిండి తినలేనని గోలపెడుతోంది అమ్మ...."
    "ఎలాగే? నా మొగుడు ఒప్పుకోడుగదే! ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు మొగుణ్ణి ఎదిరించి, 'నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను.' అంటున్నారనుకో. కానీ నేనింకా ఆ దశకి రాలేదు. ఆయన మాట కాదని నేనేం చెయ్యలేను."
    ఆ మహాపతివ్రతని కొంతసేపు మతిపోయినట్లు చూశాడు కృష్ణారావు.
    "అయితే, ఏం చెయ్యమంటావు? బ్రతికి ఉన్నంతకాలమూ నన్నిలా కుంటిచేత్తో ఉండమంటావా?" ఏడుపు గొంతుతో అరుస్తున్నట్లుగా అంది తులసి.
    "ఏమిటీ? నీ చెయ్యి కుంటి చెయ్యిగా ఉండిపోవాలని నేను కోరుకుంటున్నానా? అను! అను! అందరి మాటలూ పడటానికే నేను ఉన్నాను. నీ చెయ్యి బాగయితే సత్యనారాయణ వ్రతం చేసుకుంటానని మొక్కుకున్నాను.
    "మొన్న ఏకాదశినాడు అమ్మకి గుండెజబ్బు తగ్గాలని ఉపవాసం ఉన్నాను, నా మొగుణ్ణి ఎదిరించి నన్నేం చెయ్యమంటావే! ఆ మొగ మహారాజు నన్నూ, నా పిల్లల్నీ వీధిలోకి నెడితే నాకూ, నా పిల్లలకి తిండి నువ్వు పెడతావా? ఈ కృష్ణారావు పెడతాడా?"

 Previous Page Next Page