Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 37


    ఉలిక్కిపడింది ఇళ. కళ్ళు పెద్దవి చేసి లాయర్ని చూసింది. ఆ చూపుల్ని తప్పించుకుంటూ, నర్వస్ గా గొంతు సర్దుకుని, మళ్ళీ ప్రారంభించాడు.
    "జ్యోతి విషయం అద్భుతంగా ప్రారంభమైంది. అది ఎక్కణ్ణుంచి బయలుదేరిందో, ఎక్కడికి వెళ్తోందో, ఎందుకు వెళ్తోందో ఎవరికీ అర్థం కాలేదు. ఇళ దేవతాంశ కనుక ఆమె సత్యం నిరూపించటానికి దుర్గామాత జ్యోతి రూపాన కనిపిస్తోందని ప్రచారం జరిగింది. ప్రచారం ఎవరు చేశారో తెలీదు. కానీ, ఈ ప్రచారం వల్ల కలిగే లాభం ఇళకి మాత్రమే! భక్తులు మరింత ఎక్కువగా వస్తారు. మరిన్ని కానుకలు తెచ్చి ఇళకి సమర్పిస్తారు. జ్యోతి విషయంలో నిజం బయటపడితే నష్టం కూడా ఇళకే! ఎందుకంటే..."
    "యూ ఛీట్...."
    జనం మధ్యలోంచి గర్జన వినిపించింది. జనమంతా అటు చూశారు. ఇళ కళ్ళూ అటు తిరిగాయి. బోనులో చిక్కుకుపోయిన కొదమసింహంలాగ_ మోసంతో పాముల వాడి బుట్టలో యిరుక్కుపోయిన కాలనాగులాగ_ పిడికిలి బిగించి లేచి నిలబడ్డాడు. అతడి కళ్ళు ఇళ కళ్ళతో కలిశాయి.
    ఆమె కళ్ళలో ఒక అవగాహన_
    అతడి కళ్ళలో ఒక ఆక్రోశం_
    ఆమె చిరునవ్వులో లేత మెరుపు    
    అతడి కంఠంలో కాలకూటం_
    ఇదంతా ఒక తృటిలో...
    "ఆర్డర్! ఆర్డర్!" అరిచాడు జడ్జ్ కోపంగా. లాయర్ భయంగా చూసి మళ్ళీ తన వాదన ప్రారంభించాడు.
    "ఎందుకంటే... ఎందుకంటే... ఆమె కానుకలు తగ్గిపోయాయి. రాబడి తగ్గిపోతోంది. జ్యోతి పేరిట అతి ఘోరమైన వంచన జరుగుతోంది. హత్యలు జరుగుతున్నాయి. అయినా, ఒక అబలగా ఇళని క్షమించమని కోరుతున్నాను." తన వాదన ముగించి నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ కూర్చున్నాడు నామాలయ్య కుదిర్చిన లాయర్.
    "రాస్కెల్! అక్కడికి ఇళ ఏదో తప్పుచేసినట్టు క్షమించమని అడుగుతావురా!" నిలబడ్డ చోటినుంచి లాయర్ దగ్గరకి దూసుకెళ్ళి అతడి కాలర్ పట్టుకోబోయాడు చిచ్చు. వెంటనే పోలీసులు చిచ్చు రెండు చేతులూ తలోవైపు నుంచీ పట్టుకోబోయారు. విద్యార్థులు కోర్టు హాలు గేటు దగ్గర గుమికూడటంతో వదిలేశారు. చిచ్చు క్లాస్ మేట్స్ అతణ్ణి ఇంచుమించుగా ఈడ్చుకుపోయారు అక్కణ్ణించి.
    "కోర్టుని క్షమాపణ కోరుకుంటావా?" ఇళని అడిగాడు జడ్జ్. "నేను ఏ తప్పూ చేయలేదు. క్షమాపణ కోరవలసిన అవసరం లేదు" స్థిరంగా చెప్పింది ఇళ. ఈ సమాధానంతో జడ్జ్ కి ఒళ్ళు మండింది. అతడికి "బాబాలన్నా", "అమ్మలన్నా" ఏమాత్రం ఇష్టం లేదు. గౌరవం లేదు. హత్యలు జరిగాయని కానీ, ఒకవేళ జరిగితే అవి ఇళ చేయించిందని గాని, చెప్పటానికి ప్రత్యక్ష సాక్ష్యమేదీ లేదు గనుక, ప్రజలను మోసం చేస్తోందనే నేరం మోపి, అయిదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించాడు.


                                           *    *    *    *


    ఎర్ర రంగులో ఉన్న జైలు బస్ చుట్టగట్టి ఇనుప ఊచలు! బాధ భరించలేక గట్టిగా అరచిన లాంటి శబ్దంతో ఇంజన్ స్టార్టయింది. అప్పటికే ఆ బస్ లో దాదాపు డజను మంది ఆడవాళ్ళు కుక్కుకుని ఉన్నారు. బస్ లో లాఠీ పట్టుకున్న మహిళా కానిస్టేబుల్ కూడా ఉంది. ఆవిడకి ఈ ఉద్యోగం ఇష్టంలేనట్లుగా ఉంది. ఆ చికాకంతా కళ్ళతో ఖైదీల మీద చూపిస్తోంది. బస్ లోనే ఊచల కానుకుని, మూసిన గేట్ దగ్గరగా తుపాకీ పట్టుకున్న పోలీస్ గార్డ్ ఉన్నాడు. అతడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అంతమంది నిస్సహాయులైన ఆడవాళ్ళని ఒకచోటు చూస్తోంటే సంబరంగా ఉన్నట్లుంది అతనికి! తుపాకీతో ఎవరినైనా కొట్టడమో! లేక కాల్చడమో చెయ్యాలని ఉబలాటపడి పోతున్నట్లుంది అతడు తుపాకీ పట్టుకున్న ధోరణి. ఇళ తన సాటి ఆడవాళ్ళ ముఖాల్లోకి చూసింది. పైకి ఏమీ అనకపోయినా, అలా ముఖాల్లోకి చూస్తూ ఎదుటివాళ్ళ భావ సంచలనాన్ని గమనించటం ఇళకి అలవాటు. కొందరి ముఖాలు నిర్లక్ష్యంగా వున్నాయి. మరికొందరివి విసుగ్గా ఉన్నాయి. కొందరు మాత్రం నిరాశా నిస్పృహలతో కృంగిపోయినట్లు కనిపిస్తున్నారు. వాళ్ళందరి-కాదు-తమ అందరి జీవితాలూ, ఇక పూర్తయిపోయినట్లే! తామంతా ఇక సమాజం చేత వెలివేయబడ్డ మనుష్యులు. పశువుల్లాగా సెల్స్ లో బతకవలసిన వాళ్ళు, నంబర్లుగా తప్ప మనుష్యులుగా మిగలని వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఏమి నేరాలు చేశారో? లేక వాళ్ళలో కూడా ఎవరైనా తనలాగ అన్యాయంగా బంధించబడ్డ వాళ్ళున్నారా?
    బస్ లో వేడిగా నిట్టూర్పు సెగలు వ్యాపిస్తున్నాయి. ఇద్దరమ్మాయిలు ఏదో మాట్లాడుకోబోతుంటే, మహిళా కానిస్టేబుల్ "హుష్! నోరు మూసుకోండి!" అని అరచింది.
    "రాస్కెల్" అంటూ లాయర్ మీదకు ఉరుకుతున్న చిచ్చు రూపం కళ్ళముందు మెదిలింది. కళ్ళు మూసుకుంది. అంతే కాలం ఆగిపోయినట్టయింది.
    లాఠీ కాళ్ళమీద పడిన దెబ్బకి బాధతో కళ్ళు తెరిచింది. "ఏమే నిన్నే! అమ్మవారూ! బస్ దిగండి దయచేసి!" కొరకొరలాడుతూ వెటకారంగా అంది మహిళా కానిస్టేబుల్.
    విశాలమైన ఆవరణలో ఆగి వుంది బస్. చుట్టూ ఎత్తయిన గోడలు. పాడుబడినట్టుగా, ఏడుస్తున్నట్టుగా ఉన్న రాతి గోడలు! బయట ప్రపంచాన్నుంచి, ఈ వేదనామయ లోకాన్ని అగాధాలలోకి విసిరేస్తూ మూసివున్న ఇనుప గేటు.
    బస్ దిగింది ఇళ. నరకం ఏదో పై లోకాలలో ఉందా! ఈ లోకంలోనే ఉందా?
    "నడవండి". మళ్ళీ మహిళా కానిస్టేబుల్ అరుపు. స్థబ్దంగా నిలబడ్డ ఇళ కాళ్ళమీద దెబ్బ. నడిచింది.
    ఏదో ఆఫీస్ గది. బల్లలు! కుర్చేలు! కాకీ యూనిఫారాలతో ఆడవాళ్ళు, మొగవాళ్ళు. బాగా లావుగా కాకీ యూనిఫారంలో ఉన్న ఆవిడ లేచి నిలబడింది. అంత లావుగా ఉన్న ఆవిడ టైట్ యూనిఫారంలో చాలా ఫన్నీగా ఉంది. పోలీస్ సర్వీస్ లో చేరిన కొత్తలో బాగా ఎక్సర్ సైజ్ చేసి ఉంటుంది. సీనియర్ అయ్యాక అన్నీ మానేసింది.
    "పోలీస్ వృత్తిలో వుంటే మాత్రం ఆడవాళ్ళంకామా? పిల్లలు, ఇంటి పని, ఇక్కడ ఈ వెధవపని. ఇంకా ఎక్సర్ సైజెస్ ఎక్కడ చెయ్యగలనూ?" అంటూంది తోటివాళ్ళతో! భర్త తాగకుండా ఇంటికి వచ్చి సజావుగా ఉన్నరోజు ఖైదీలతో చాలా జోవియల్ గా మాట్లాడుతుంది. భర్త తప్పతాగి ఇంటికి వచ్చి నానా అల్లరి చేసినప్పుడు, ఉత్తమ ఇల్లాలి లాగా ఇంటిదగ్గర ఆ గోలంతా భరించి, ఆరోజు తన వృత్తి ధర్మాన్ని అతి జాగ్రత్తగా నిర్వహిస్తూ ఖైదీలకి తన తడాఖా చూపిస్తుంది. ఈరోజు ఆవిడ మంచి జోవియల్ మూడ్ లో ఉంది. కొత్తగా వచ్చిన ఖైదీల ముందు ఉపన్యాస ధోరణిలో మాట్లాడటం ఆవిడకి చాలా ఇష్టం. ప్రతి అక్టోబర్ రెండవ తేదీనా జైళ్ళలో సహితం ఫంక్షన్స్ జరుగుతాయి. కానీ ఆ ఫంక్షన్స్ లో మాట్లాడే ఛాన్స్ సూపరింటెండెంట్ కే దక్కుతుంది. లేదా అంతకంటే పై ఆఫీసర్లు వస్తారు. అంచేత ఆవిడకి మాట్లాడే అవకాశం కొత్త ఖైదీలు వచ్చినప్పుడు మాత్రమే!

 Previous Page Next Page