"అదంతా నా కర్ధమయిందిలే! ట్రెయిన్ లో వున్న నువ్వెలావచ్చావ్? ఆ విషయం చెప్పు."
"నేను వస్తున్న ట్రెయిన్ కి ముందే మరో ట్రెయిన్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వేపు ప్రయాణిస్తోంది- అని నాకు తెలుసు. ఆ ట్రెయిన్ లో బాంబు ఉందని భువనగిరి స్టేషన్ లో ఎవరో ఫోన్ చేసి చెప్పగా ఆపు చేశారు."
"నువ్వేనా అలా చెప్పించిందీ."
"అవును" బృహస్పతి నవ్వాడు. ".... కాబట్టి వెనక ఉన్న మా రైలుని అంతకుముందు స్టేషన్ లో ఆపుచేశారు. అక్కడ నా కోసం ఒక కారుని ఏర్పాటు చేసుకుని ఉంచాను." అని ఒక క్షణం ఆగి అన్నాడు. "....నిజానికి మా ట్రెయిన్ లోనే బాంబు ఉన్నట్టు చెప్పవచ్చు. కానీ ఆ హడావుడికి మా కంపార్ట్ మెంట్ లో మనుషులు లేస్తారు. అది ప్రమాదం...."
శ్రీహర్ష అప్రతిభుడై చూసి, "....నీకు బృహస్పతి అని ఎందుకు పేరు పెట్టారో నా కర్ధమయింది.... తర్వాతేం జరిగిందో నేనూహించగలననుకుంటున్నాను. కారులో హైదరాబాద్ వచ్చి, హత్యచేసి, మళ్ళీ వెళ్ళి ఏ బీబీనగర్ లోనో ఎక్కి వుంటావు కదూ!" అన్నాడు.
"అవును. కంపార్ట్ మెంట్ తలుపు తీసుకుని దిగింది నేనే కాబట్టి 'లాక్' తీసి దిగేశాను. అదృష్టవశాత్తూ ఆ రాత్రి మళ్ళీ ఎవరూ దాన్ని లాక్ చేయకపోవడంతో నా పని సులభమయింది. తిరిగి వెళ్ళి, బీబీనగర్ లో, ఏమీ ఎరగనట్టు ట్రెయిన్ ఎక్కేశాను."
"కానీ నాకో చిన్న అనుమానం!"
"ఏమిటది?"
"బీబీనగర్ లో ఎక్స్ ప్రెస్ ఆగదుగా!"
బృహస్పతి మళ్ళీ నవ్వాడు. "....నాతోపాటు ట్రైన్ లో నాకు సహాయం చేయడానికి ఒక అమ్మాయి ప్రయాణం చేస్తోంది. ఆ స్టేషన్ దగ్గరికి రాగానే అక్కడ ఛెయిన్ లాగింది. "ఇదంతా ఆ స్టేషన్ కి అరగంట ముందే నేను చేరుకుని ఎదురు చూస్తున్నాను. నేను లోపలికి వెళ్ళేసరికి కంపార్ట్ మెంట్ లో సంకల్పనాథ్ గాఢనిద్రలో వున్నాడు.... రాత్రి మందులో నిద్రమాత్రలు కలిపాను" బృహస్పతి చెపుతుండగా మధ్యలో కల్పించుకుని "ఆ అమ్మాయి ఎవరు?" అని అడిగాడు శ్రీహర్ష.
"చెప్పను."
"ప్రశాంత నివాళి?"
"చెప్పనన్నానుగా!"
"హిమసమీరా? సరళరేఖా?"
బృహస్పతి చిరునవ్వుతో "ఎందుకంత ఉత్సుకత? ఇంకో విషయం కూడా చెప్పనా? హోటలులో రాత్రి మూడింటికి సోడా సీసాల బిల్ సంపాదించినది కూడా ఆ అమ్మాయే! రాంభరత్ సంకతకం పెట్టింది ఆ బిల్ మీదే."
"అర్ధమయింది" ఎగ్జయిటింగ్ గా అన్నాడు. ".... ఆ అమ్మాయి నీ ఫ్రెండ్ హేమంత సంధ్య కదూ!"
బృహస్పతి బిగ్గరగా నవ్వేస్తూ "....హేమంత ఎక్కడుందో, ఏ వుద్యోగం చేస్తోందో కూడా నాకు తెలీదు. వారంరోజుల్లో ఢిల్లీనుంచి వస్తోందని మాత్రం తెలుసు కాబట్టి.... తను కాదు."
* * *
"నిజంగానే నేనిదంతా నమ్మలేక పోతున్నాను" సంకల్పనాథ్ రే తల విదిలిస్తూ అన్నాడు.
"మీ కళ్ళముందు జరిగింది కాబట్టి నమ్మక తప్పదు" అన్నాడు బృహస్పతి. ".... కూపేలో మీరు నిద్రపోయాక, నేను వెళ్ళి మర్డర్ చేసి వచ్చాను. అయినా ఇప్పుడిదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే- దావూద్ హర్షద్ ని చంపితే, నా గొప్పతనం ఒప్పుకుంటానన్నావ్! అవసరమైనప్పుడు దాదాగిరీ, మరోవేపు తెలివితేటలూ, ఇవేగా రాజకీయ నాయకునికి ఉండవలసిన లక్షణాలు!! ఈ రెండూ నాకున్నాయని ఒప్పుకుంటావుగా!!! దావూద్ హర్షద్ లాంటి మాఫియా మనిషిని మూడోకంటికి తెలియకుండా చంపాను. అవునా?"
ఇంకా షాక్ నుంచి తేరుకోని సంకల్పనాథ్ మాట్లాడలేక పోయాడు. బృహస్పతి అన్నాడు. "....ఇప్పుడు నా రెండో విక్టిమ్ రాంభరత్! ఈ విషయంలో కూడా నువ్వేమీ జోక్యం చేసుకోనని వాగ్దానం చేసావ్ గుర్తుందా?"
"గుర్తుంది. నేనడ్డురాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో! కానీ ఇప్పుడూ అదేమాట చెపుతున్నాను. మనం - మనం ఒకటి!! అతడిమీద అనవసరంగా కక్ష పెంచుకోకు. నిజానికి అతడు నీకు చేసిన అవమానం చాలా చిన్నది."
"పదేళ్ళ క్రితం ఒక ప్రతిపక్ష నాయకురాలి చీర కట్టుకుని మద్రాసు అసెంబ్లీలో అధికార పక్షం వాళ్ళు లాగారు. ఆ కక్షతో ఆమె అవతలి పార్టీని సమూలంగా తుడిచిపెట్టి ముఖ్యమంత్రి అయింది. పాత కక్షల కారణంగా వైరివర్గాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించింది. అయిదు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రతిపక్ష పార్టీ ఆమెమీద ఎంత కక్ష కట్టిందంటే- తన పెంపుడు కొడుకునే వదులుకోవడానికి సిద్ధపడేలా చేసింది. కాబట్టి ఓ మంత్రివర్యా! అనుమానం అన్న పదానికి ఎవరి నిర్వచనం వారికుంటుంది. చంద్రగుప్తుడి లెవెల్ లో కక్ష తీర్చుకోబోతున్నాను. నువ్వు ఎవరివేపు నుంటావో నువ్వే నిర్ణయించుకో."
"కృష్ణుడిలా నేను తటస్థంగా ఉందామనుకుంటున్నాను."
"వెరీగుడ్! మొదటి హత్య చెయ్యడానికి పాంచజన్యం పూరించావు. అందుకు కృతజ్ఞతలు."
సంకల్పనాథ్ రే మొహం చిట్లించాడు. "....నేను పాంచజన్యం పూరించడ మేమిటి? స్పృహలో వుండే మాట్లాడుతున్నావా?"
"నీ కర్ధం కాదులే! నువ్వు స్పృహలో లేనప్పుడు నీ పాంచజన్యం నేను పూరించాను."
"నీకు పిచ్చెక్కినట్టుంది. ఏం మాట్లాడుతున్నావో నాకు అర్ధంకావడంలేదు. అది సరే గానీ- దావూద్ హర్షద్ ని ఎలా హత్య చేశావో, మొత్తం నాకు చెప్పావు కదా! రైల్లో బాంబుతో సహా, మొత్తం విషయాలన్నీ తిరగదోడించి, కోర్టులో కేసు మళ్ళీ తెరిపిస్తే ఏం చేస్తావురా పిచ్చివాడా?"
"నువ్వే పిస్టల్ యిచ్చి, దావూద్ హర్షద్ ని చంపడానికి పంపించావంటాను."
"వ్వాట్?"
"నీ పాంచజన్యం నేను వూదడమంటే అదేరా పిచ్చివాడా?"
* * *
బృహస్పతి సంభోదించినట్టు సంకల్పనాథ్ పిచ్చివాడేమీ కాదు. ఎన్ని ఢక్కా మొక్కీలు తిని, ఎన్ని దాదాగిరీలు చేయకపోతే కేంద్రమంత్రి అవుతాడు? బృహస్పతి వేస్తున్న ఎత్తులన్నీ అతడికి తెలుస్తూనే వున్నాయి. తనమీద పగలేదు అని అతడు అనడం శుద్ధ అబద్ధం. రేప్ చేసిన దావూద్ హర్షద్ ని హత్య చేశాడు. అటువంటిది- రేప్ 'చేయించిన' తనని వదిలిపెడతాడనుకోవడం మూర్ఖత్వం. ఒక్కొక్క శత్రువునీ, నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నాడు. దావూద్ హర్షద్. రాంభరత్, తర్వాత ....తను!
అతడి కొకటే అర్ధంకావడంలేదు. దావూద్ ని పాత పగతో గొప్ప స్కీం వేసి చంపాడు సరే!
తనమీద 'పగ' తీర్చుకోవడానికి ఇంకే స్కీమ్ లూ అవసరంలేదే! డైరీలూ, ఫోటోలూ పత్రికల వాళ్ళకిస్తే చాలు.
తమ జీవితం సమూలంగా నాశనమైపోతుంది.
మరెందుకతనలా చేయడం లేదు?
అతడి దగ్గర నిజంగానే ఫోటోలు లేవా?
అతడి స్నేహితుడైన రావు- అతడి దగ్గర ఫోటోలున్నట్టు తనకి చెప్పాడని, చీకట్లో బాణం వేశాడు. అది వినగానే బృహస్పతి కలవరపడ్డాడు. దానితో- ఫోటోలు అతడి దగ్గరే నిశ్చయంగా ఉన్నాయనుకున్నాడు.
అదీ నాటకమేనా?
తను చీకట్లో బాణం వేశాడు. ఆర్తనాదం వినిపించింది. సరిగ్గా తగిలిందని సంబరపడ్డాడు. ఆర్తనాదం కూడా నాటకమే అయ్యే అవకాశం ఉందని ఊహించలేక, తనే చీకట్లోకి వెళుతున్నానన్న విషయం గమనించలేకపోయాడు.
ఈ ఆలోచన రాగానే సంకల్పనాథ్ రే నిటారుగా అయ్యాడు. ఈ కోణం నుండి ఇంతకాలం తనెందుకు ఆలోచించలేదు?
కొద్ది క్షణాల్లోనే అతడు నిర్వర్తించవలసిన తర్వాత కార్యక్రమాన్ని గురించి ఒక నిర్ణయానికి వచ్చాడు.
ఇలాంటి తాంత్రికపు టెత్తుల్లో అందెవేసిన చెయ్యి అయిన హరిస్వామి కోసం కబురు చేశాడు.
* * *
ధాబా ముందున్న చెట్లకి బోదెలు తవ్వుతున్న బృహస్పతి దూరంనుంచి వస్తున్న పెద్ద శబ్దానికి తలెత్తి చూశాడు. రోడ్ మలుపులో ఒక లారీ వస్తూ కన్పించింది. మామూలు లారీలా లేదది.... దాని ఖరీదుకన్నా దాని అలంకరణ ఖరీదే ఎక్కువయి నట్లుంది. భూమిమీద నుండి ఇరవై అడుగుల ఎత్తువరకూ చెక్కతో తాపడం చేసినట్లున్నారు. డ్రైవర్ కి దారి కనబడటానికి వీలుగా మాత్రం అద్దాలున్నాయి. ఆ లారీ ఒక పెద్ద భోషాణం పెట్టెలా వుంది. లారీ పైభాన గురునానక్ ఫోటో - దానికింద 'గురుకృపా' అన్న అక్షరాలూ ఉన్నాయి. లారీ శబ్దంకూడా విచిత్రంగా వుంది. వచ్చి ధాబా ముందాగింది.
బృహస్పతి తిరిగి తన పనిలో పడ్డాడు. డ్రైవర్ సీట్లోంచి కాకుండా పక్క సీట్లోంచి దిగిన స్త్రీ, ధాబా వేపుకి వెళ్ళకుండా బృహస్పతి దగ్గరికి రావడంతో, అతడు తలెత్తాడు.
ఆమె చేతిలో పెద్ద కర్ర వుంది.
"నీ నోమ్ బరోహాస్ పతీ?"
బృహస్పతి మొహం చిట్లించి "ఏమిటి నువ్వు మాట్లాడేది? ఏ భాష?" అన్నాడు.
ఆ మనిషి సమాధానం చెప్పలేదు.
బృహస్పతికి ఏదో అనుమానాస్పదంగా తోచి, లేచి నిలబడ్డాడు. చేతిలో గునపం అలాగే వుంది. వచ్చిన మనిషి తన మొహంమీద నుంచి దృష్టి తిప్పకుండా అలాగే చూస్తూ ఉండడంతో, అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి, ".... ఎవరు నువ్వు?" అనడిగాడు. అటునుండి సమాధానము లేదు. చూపు మాత్రం బృహస్పతి మొహంమీద నుంచి పక్కకి జరగడం లేదు.
బృహస్పతి గునపాన్ని బలంగా నేలలో గుచ్చాడు. ".... నీకు చాయ్ కావాలంటే లోపలకు వెళ్ళు! వేడి వేడి చపాతీలు కూడా వున్నాయి."
"నీ నోమ్ బరోహస్ పతీ?"
"హౌస్ పతీ ఏమిటి? హోస్పేట్ లాగా" అన్నాడు చిరాగ్గా.
"హాస్ పేట్ నయీ. బరోహస్ పతీ!"
బృహస్పతి జుట్టు పీక్కోబోతుండగా, బయటినుండి అక్కడకు శ్రీహర్ష వచ్చాడు. పై సంభాషణ కొద్దిగా అతడి చెవినపడి, "నీ పేరేనా బృహస్పతి అని అడుగుతుంది బాస్. ఆ అమ్మాయి కాస్త పంజాబీ, కాస్త హిందీ, మరికాస్త భోజ్ పురి కలిపినట్టుంది. మరీవిడగారు ఏ ప్రాంతానిదో నాకయితే అర్ధంకావడం లేదు" అన్నాడు.
బృహస్పతి ఆమెవేపు తేరిపాక చూశాడు. ఏర్ పిల్లోలో గాలి సగంవరకూ ఊది, నడుం దగ్గర తాడుతో బిగించి కడితే ఎలా వుంటుందో ఎలా వుంది అమ్మాయిలో ఏమేమి బలంగా వుండాలని అబ్బాయిలు కోరుకుంటారో- అవన్నీ అనుకున్న దానికన్నా అంగుళం ఎక్కువ బలంగా.... ఏమేమి సన్నగా వుండాలనుకుంటారో అవన్నీ రెండంగుళాలు తక్కువ సన్నగానూ వున్నాయి. దాదాపు అయిదున్నరడుగుల పొడవున్నా ఇరవై ఆరేళ్ళు వచ్చిన అమూల్ బేబీలాగా పుష్టిగా ఉండడంతో ఆ ఎత్తు తెలీడంలేదు.