Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 36


    "నేను సెక్యూరిటీ గార్డుని. ఆ మాత్రం తెలియకుండా ఎలా వుంటుంది?" గర్వంగా చెప్పాడు.

    "వెరీగుడ్! అయితే నువ్వు నీ గన్ తో పరిగెత్తుకుని వచ్చావన్నమాట."

    "అవును."

    "మరి వెంటనే నన్నెందుకు కాల్చలేదు."

    సెక్యూరిటీ గార్డు గతుక్కుమని, వెంటనే సర్దుకుంటూ "లేదు! ఏం జరిగిందో ఇప్పుడు కరెక్ట్ గా గుర్తువచ్చింది. రివాల్వర్ తో నిలబడి వున్న నిన్ను చూడగానే నేను లోపలికి వెళ్ళి గన్ తెచ్చుకున్నాను. ఈలోగా నువ్వు పారిపోయావు."

    "నువ్వు సెక్యూరిటీ గార్డువి కదా! బయట రివాల్వర్ చప్పుడు వినిపించినా కూడా "సిరికింజెప్పుడు....' లెవల్ లో ఎలా బయటికి వచ్చావు?"

    "చూద్దామని వచ్చాను."

    "మంత్రిగారు పూర్తిగా చచ్చారో, కొన వూపిరితో ఉన్నారో చూడడానికి మీరు సాధారణంగా అలా వస్తూ వుంటారా?"

    కోర్టులో నవ్వులు. గార్డు మాట్లాడలేదు. బృహస్పతే అడిగాడు. ".... రివాల్వర్ చప్పుడు మూడుసార్లూ వెంట వెంటనే వినిపించిందా?"

    "అవును."

    "క్షణం కూడా ఆలస్యం లేదా?"

    "లేదు. వెంట వెంటనే వినిపించాయి."

    "నువ్వు తలుపు తీసేసరికి నేను ఏం చేస్తున్నాను"

    "అక్కడే నిలబడి వున్నావు"

    "నువ్వు చెప్పినట్టు వెంట వెంటనే మూడు సార్లు కాల్పులు జరిపాననుకో. తర్వాత ఆ చప్పుడు విని నిద్రలోంచి నువ్వు మేలుకుని, తలుపు దగ్గరకొచ్చి, దాన్ని తెరచి చూసేవరకూ నేనలాగే శిలా ప్రతిమలా నిలబడి ఉన్నానా?"

    సెక్యూరిటీ గార్డు బిక్క చచ్చిపోయి చూశాడు. బృహస్పతి కొనసాగించాడు.

    "నిన్ను చూడగానే, 'అప్పుడే స్పృహలో కొచ్చినట్టు' నేను వరండాలో పరుగెత్తడం మొదలెట్టానా? నువ్వు నన్ను వెంబడించడం మానేసి, గన్ కోసం లోపలికి పరుగెత్తావా?"

    గార్డు సమాధానం చెప్పలేదు.

    "అంతే యువరానర్! నా తరువాత సాక్షి హోటల్ రిసెప్షనిస్టు" అన్నాడు బృహస్పతి. రిసెప్షనిస్టు బోనెక్కాడు.

    "హత్య జరిగినరోజు పొద్దున్న అయిదు గంటలకి మీ హోటల్ లాబీలో నన్ను చూసినట్టు ప్రాసిక్యూషన్ సాక్షిగా మీరు చెప్పారు. అవునా?"

    "అవును. ఆ రోజు పొద్దున్న అయిదింటికి మిమ్మల్ని నా ముందునుంచి నడుస్తూ బయటికి వెడుతుండగా చూశాను" నిజాయితీగా చెప్పాడు.

    "అంత కరెక్ట్ గా ఎలా గుర్తుపెట్టుకోగలిగారు? మీ ముందునుంచి చాలామంది గాలిలో ఎగురుతోనో- గంతులేస్తూనో కాకుండా, నడుస్తూ వెడుతుంటారు కదా!"

    సరళరేఖ ఫక్కుమని నవ్వబోయి, డ్రెస్ లో వున్నానని గుర్తువచ్చి నవ్వాపుకుంది.

    రిసెఫ్షనిస్టు అన్నాడు. ".... మీరు వెళ్ళిన రెండు నిముషాలకి హంతకుడు తప్పించుకుని పోతున్నాడని నాకు కబురు వచ్చింది. నేను హోటల్ బయటికి పరిగెత్తుకుని వచ్చి చూశాను కూడా! మీరు అప్పటికే వెళ్ళిపోయినట్టున్నారు. కనబడలేదు."

    " 'కబురొచ్చింది' అన్నారు. అంటే.... ఎవరైనా స్వయంగా వచ్చి చెప్పారా?"

    "లేదు. సెక్యూరిటీ గార్డు ఫోన్ చేసి చెప్పాడు."

    "అంటే ....గార్డు నన్ను వెంబడించకుండా తన గదిలోకి వెళ్ళి మీకు ఫోన్ చేశాడన్నమాట!"

    "అబ్జెక్షన్ యువరానర్! గార్డు ఏం చేశాడన్నది రిసెప్షనిస్టుకి అనవసరం. ముద్దాయిని వెంబడించడంకన్నా ఫోన్ లో చెప్తే, ఆ సమాచారం త్వరగా అందుతుంది అని గార్డు భావించి వుండవచ్చు" అన్నాడు పి.పి.

    బృహస్పతి అడ్డు తగులుతూ ".... హోటల్ వరండాలో పబ్లిక్ గా నిలబడి కాల్పులు సాగించి, రివాల్వర్ తో వెళ్ళిపోతున్న ముద్దాయిని- తన దగ్గర గన్ ఉంచుకుని- అడ్డుకోకుండా- ఒక పోలీస్ సెక్యూరిటీ గార్డు- కిందనున్న సామాన్యమైన రిసెప్షనిస్ట్ కి ఫోన్ చేసి చెప్పాడట! నోట్ దిస్ పాయింట్ యువరానర్...." అంటూ మళ్ళీ రిసెప్షనిస్ట్ వైపు తిరిగాడు.

    "మీరు నన్ను చూసినప్పుడు నేను బెదురుతున్నట్టు కానీ, వేగంగా వెళ్ళిపోవాలన్న తొందరలో వున్నట్టు కానీ అనిపించానా?"

    "లేదు. తాపీగా వెళ్ళారు. అదే నేను మనసులో అనుకున్నాను కూడా!"

    "మరి తాపీగా వెళితే నన్నెందుకు పట్టుకోలేకపోయారు?"

    రిసెప్షనిస్టు కొంచెంసేపు ఆలోచించాడు. కోర్టులో సూది పడితే వినబడేంత నిశ్శబ్దం.

    "మీరు వెళ్ళిపోయిన కొంచెం సేపటి తర్వాత సెక్యూరిటీ గార్డు నుంచి ఫోన్ వచ్చింది."

    బృహస్పతి జడ్జివైపు తిరిగి "ఇప్పటివరకూ సాక్షులు చెప్పినదాంట్లో ఒకదాని కొకటి పొంతన కుదరడం లేదన్న విషయం మీకర్ధమై వుంటుంది. కారిడార్ లో నన్ను చూసిన గార్డు- ఆ విషయాన్ని కింద రిసెప్షనిస్టుకి ఎందుకు తొందరగా చెప్పలేదు?" అన్నాడు.

    జడ్జి బృహస్పతి చెప్పిన పాయింట్ నోట్ చేసుకుంటున్నాడు.

    "యువరానర్ ఈ కేసు మొదటినుంచీ సరిగ్గా దర్యాప్తు కావింపబడలేదు. మంత్రులకీ ఇందులో సంబంధం వుండబట్టి పోలీసుశాఖ కూడా తగిన శ్రద్ధ చూపించకుండా- వారు చెప్పిందే 'సత్యం' గా కోర్టులో ప్రవేశపెట్టింది. నిజానికి దావూద్, రాంభరత్ తెల్లవారేవరకూ ఒక గదిలో వున్నారు. హంతకుణ్ణి సెక్యూరిటీ గార్డు చూడలేదు. దావూద్ ని హత్యచేసి తన గదిలోకి వెళ్ళిపోయిన రాంభరత్ సెక్యూరిటీ గార్డుతో ఈ నాటకం ఆడించి- పాతకక్షల కారణంగా ఈ నేరాన్ని నా మీద తోసేశాడు. ఇదంతా నేనింత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే...."

    "ఎలా చెప్పగలుగుతున్నారు మిస్టర్ బృహస్పతీ?" జడ్జి అడిగాడు.

    "అదే సమయంలో నేను మరో మంత్రితో రైల్లో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి!"


                                           *    *    *


    ఇది జరిగిన పదిహేను రోజులకి జడ్జిమెంట్ వచ్చింది. మధ్యలో- మంత్రి సంకల్పనాథ్ రే సాక్ష్యం కూడా కోర్టు స్వీకరించింది. జడ్జి ఈ విధంగా తీర్పు యిచ్చాడు.

    "దావూద్ హర్షద్ హత్యకేసులో పోలీసు డిపార్ట్ మెంట్ చాలా నిర్లక్ష్యంగా పరిశోధించిందని చెప్పడానికి విచారిస్తున్నాను. హత్య జరిగిన సమయంలో బృహస్పతి తనతోనే వున్నాడని ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్పష్టం చేశారు. అయితే మరో మంత్రి చాలా అబద్ధాలు చెప్పారని కోర్టు విశ్వసిస్తోంది. సదరు మంత్రి యొక్క సెక్యూరిటీ గార్డు- తాను హంతకుణ్ణి కళ్ళారా చూశానని చెప్పిన సాక్ష్యం కూడా నమ్మదగినదిగా లేదు. పోతే.... తన కేసుని తనే వాదించుకుంటూ బృహస్పతి కొన్ని విషయాలని తార్కికంగా నిరూపించడానికి ప్రయత్నించాడు. నిజానికి ఈ బాధ్యత పోలీసులది. బృహస్పతిని నిర్దోషిగా విడుదలచేస్తూ, అతడు రాంభరత్ పై చేసిన అభియోగాన్ని లోతుగా పరిశోధించవలసినదిగా పోలీస్ డిపార్ట్ మెంట్ ని కోర్టు ఆదేశిస్తున్నది."


                    *    *    *


    "అన్యాయం .... అక్రమం.... ద్రోహం.... " అరిచాడు రాంభరత్.

    "ఇందులో అన్యాయం ఉంటే ఉండవచ్చేమో కానీ, అక్రమం ఏమీలేదు భరత్! ఏదో గొప్ప తెలివితేటలతో ఆలోచిస్తున్నాననుకుని, చాలా స్టుపిడ్ గా ప్రవర్తించావు" అన్నాడు సంకల్పనాథ్ రే.

    "దావూద్ ని బృహస్పతి చంపడం నేను కళ్ళారా చూశాను."

    "ఆ విషయం ఉన్నదున్నట్లు నువ్వు వెల్లడి చేయవలసింది. చెప్పానుగా- అవసరమైన దానికన్నా ఎక్కువ తెలివితేటలతో ఆలోచించావు. నీ బదులు సెక్యూరిటీ గార్డుని ప్రత్యక్ష సాక్షిని చేశావు. అదే నువ్వు చేసిన తప్పు."

    "ఆ మాఫియా మనిషితో రాత్రంతా నేను వున్నానంటే, అందరూ ఏమనుకుంటారోనని నేను భయపడ్డాను" అన్నాడు రాంభరత్.

    "మాఫియాకీ, రాజకీయాలకీ ఉన్న సంబంధం గురించి ప్రజలు కొత్తగా అనుకునేదేమీ లేదు. ఇప్పుడు అనవసరంగా ఇందులో ఇరుక్కుపోయావు. తన చెల్లెలికి జరిగిన దానికి ఆ బృహస్పతి చాలా గ్రాండ్ గా పగ తీర్చుకున్నాడు."

    "నా కిప్పటికీ అర్ధంకావడంలేదు. ఒకే సమయంలో బృహస్పతి రెండుచోట్ల ఎలా వుండగలిగాడు?"

    "తనలాగే వేషం వేయించి మరో వ్యక్తిని పంపి వుండాలి" అన్నాడు రే.

    "నీకు నిశ్చింతగా మతిపోయింది సంకల్పనాథ్! నేను కళ్ళారా చూశాను. అంతేకాదు, దావూద్ ని హత్యచేసిన తర్వాత నా వైపు చూసి నవ్వి, కన్నుకొట్టాడు కూడా!"

    "కానీ అతను నాతోనే వున్నాడు రాంభరత్! పొద్దున్నే నాతోపాటు అందరూ చూస్తుండగా అతను కూడా దిగాడు. అందుకే కోర్టులో నేను అబద్ధం చెప్పలేకపోయాను. చెప్తే నీలాగే పట్టుబడిపోయి వుండేవాడిని."

    రాంభరత్ మాట్లాడలేదు. ఆ గదిలో గాఢమైన నిశ్శబ్దం వ్యాపించింది. ఇద్దరూ తమ తమ ఆలోచనల్లో నిమగ్నమై వున్నారు. రాంభరత్ పరిస్థితి మరీ అధ్వానంగా వుంది. తను చెప్పిన అబద్ధపు సాక్ష్యం అంతా తు.చ. తప్పకుండా పేపర్లలో వచ్చేసింది.

    తను హత్య చేయకపోయి వుండవచ్చు కానీ తప్పుడు సాక్ష్యం చెప్పాడు. అదే పామై మెడకి చుట్టుకుంది. ప్రజలంతా తనే హత్య చేసినట్టు నమ్ముతున్నారు. అతడు ఆ ఆలోచనలో వుండగానే సంకల్పనాథ్ అన్నాడు. "....అతడు నాతో రైల్లో వున్నదీ నిజమై, నువ్వు చూసిందీ నిజమై- అతడే కానీ ఈ హత్య చేసివుంటే - మనందరం అతడికి కృతజ్ఞులమై వుండాలి."

    "ఎందుకు?"

    "అతడింకా రాజకీయాల్లో ప్రవేశించనందుకు! ప్రస్తుత పరిస్థితిలో అతడికున్న క్రిమినల్ తెలివితేటలకి, అతడేగానీ రాజకీయాల్లో ప్రవేశించి ఉండివుంటే- ప్రాంతీయ పార్టీ ఎంపీల్ని కొనేసి, తాంత్రిక స్వాములతో సత్సంబంధాలు ఏర్పరచుకుని, లేదా టెలిఫోన్ వ్యవహారాల్లో కోట్లు సంపాదించి, అయిదు సంవత్సరాల పాటు నిరాటంకంగా ప్రధానమంత్రి పదవిలో వుండేవాడు" మెచ్చుకుంటున్నట్టు అన్నాడు రే. రాంభరత్ ఆ మూడ్ లో లేడు. "అతడీ హత్య ఎలా చేశాడో నా కర్ధం కావడంలేదు" అని స్వగతంగా అన్నాడు.


                                            *    *    *


    "చాలా సింపుల్!" బృహస్పతి నవ్వేడు.

    "ఎలా చేశావ్?" ఆశ్చర్యంగా అడిగాడు శ్రీహర్ష.

    "నువ్వసలే జర్నలిస్టువి. ఈ విషయం పత్రికల్లో ప్రచురించనంటే చెప్తాను."

    "నీ చెల్లెలి మీద ప్రమాణం చేస్తున్నాను. ఎక్కడా రాయనులే, చెప్పు. ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను."

    బృహస్పతి చెప్పడం ప్రారంభించాడు.

    "నాగపూర్ వెళ్ళేముందే, దావూద్ హర్షద్ హైదరాబాద్ లో ఒక హోటల్ లో ఉన్నాడని నిర్ధారణ చేసుకున్నాను. రాంభరత్ ఆ రాత్రి అతనితో ఆ గదిలోనే వుండడం యాదృచ్చికం. అతను నన్ను చూశాడు. అయితే- అలా.... తను చూసినట్టు కాక, ఎదుటి గదిలో వున్న గార్డు నన్ను చూసినట్టు సాక్ష్యం చెప్పించడంతోనే అతను దొరికిపోయాడు. రివాల్వర్ చప్పుళ్ళకి- నిజానికి రాంభరత్ తప్ప- ఎవరూ నిద్రలేవలేదు. అందుకే రిసెప్షన్ దగ్గర వరండాలో తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. కేసు బలహీనమవడానికి ఇది కూడా సహాయపడింది."

 Previous Page Next Page