Home » Yandamuri veerendranath » అతడే ఆమె సైన్యం


    "ఆ రోజు మీరు అన్న మాటలు నాకు ముందు చాలా కోపాన్ని తెప్పించిన మాట వాస్తవమే. కాని ఆ రోజునించి నేనా విషయమే ఆలోచిస్తున్నాను. నిన్న మీరు చేసిన పనితో నా కళ్ళు తెరుచుకున్నాయి సార్! రాత్రంతా ఆ విషయమే ఆలోచించాను. నా భార్యని లేపి మాట్లాడాను. ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. నిజానికి ఇది నేను మీ కిస్తున్న బహుమతి కానేకాదు. నాకు నేనుగా చేసుకుంటున్న ప్రాయశ్చిత్తం. ఈ రోజునుంచి నేను లంచం ముట్టుకోనని ప్రమాణం చేస్తున్నాను. నా భార్య ఉద్యోగం చేస్తుంది. వచ్చే దానితో తృప్తిగా బ్రతుకుతాం. నలుగురు పిల్లల్ని కన్నందుకు శిక్ష మేమే అనుభవిస్తాం. ఇదే నేను తీసుకున్న నిర్ణయము. ఈ విషయం చెప్తే మీరు సంతోషిస్తారన్న భావంతోటే వచ్చాను" అన్నాడు. ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.

    "నువ్విచ్చిన ఈ బహుమానం ఎన్నటికీ మర్చిపోలేను విశ్వేశ్వర్. నాకెంతో ఆనందంగా వుంది" సిన్సియర్ గా చెప్పాను.

    "మీ ఉద్దేశాలని మీలోనే దాచుకునేకంటే పదిమందితో చెప్తే ఒకరిలోనయినా ఆలోచన కలుగుతుంది" అన్న అనుపమ మాటలు గుర్తొచ్చాయి.

    ఆదర్శాలు, ఆశయాలు- ఆలోచన, తర్కాలతో తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. క్రియగా ఆచరణలో పెట్టినప్పుడు మానసిక తృప్తి కలుగుతుంది. ఇలాంటి ఫలితం లభించినప్పుడు కలిగే సంతృప్తి జీవితం ధన్యమైందనే భావాన్ని కలిగిస్తుంది. ఒకనాడు నేనే చేసిన పాపాలకు ఈ రోజు నిష్కృతి లభించినట్లుగా ఫీలయ్యాను.


                  *    *    *    *


    సాయంత్రం ఆరు గంటలవుతోంది. అనుపమ ఇంటి బయట తోటలో అరేంజిమెంట్స్ చేస్తున్నాం.

    గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ఈ రోజే ఆగింది. వాతావరణం చల్లగా వుంది వసంతకాలగమన చిహ్నంగా చుట్టూ పచ్చదనం పరుచుకుపోయింది.

    ఈ రోజు అనుపమ తన స్నేహబృందాన్ని ఆహ్వానించింది. అప్పుడప్పుడు వాళ్ళిలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారట. నాలుగయిదు గంటలపాటు చర్చలు, కబుర్లు సాగుతాయి. కాని ఈ రోజు ముఖ్యంగా నన్ను అందరికీ పరిచయం చెయ్యడానికే పిలిచింది.

    "ఆరింటికల్లా అందరూ వచ్చేస్తారా?" అడిగాను. ఆమె స్నేహబృందాన్ని కలవాలని చాలా ఆరాటంగా వుంది నాకు.

    "లేదు. అందరూ ఉద్యోగస్థులు, వ్యాపారస్థులు, వీలుని బట్టి వస్తారు. రాత్రి డిన్నర్ కూడా వుందని చెప్పాను కాబట్టి ఏం టైంలోనయినా రావచ్చు" అంది.

    మొదటగా నవ్వింది వందన. డాక్టర్. గవర్నమెంట్ సర్వీసులో వుంది. అనుపమ పరిచయం చేసింది.

    "ఆపరేషన్ చేసొచ్చావా? అంత అలసటగా కనిపిస్తున్నావ్?" అడిగింది అనుపమ.

    నిజంగానే వందన ముఖంలో విచారరేఖలు కనిపిస్తున్నాయి. "వందన చాలా సెన్సిటివ్ వెంకట్! డాక్టరెందుకయిందా అనిపిస్తుంటుంది" అంది నాతో.

    "ఆపరేషన్ చెయ్యడం సరే అనూ! శవాలని పోస్టుమార్టమ్ చెయ్యడానికి పంపి వస్తున్నాను" అంది. చెప్తుంటే కంటనీరు తిరిగింది.

    "అదేమిటి వందూ! మరీ ఇంత సెంటిమెంటల్ గా ఫీలవుతున్నావేమిటి?" దగ్గరగా వచ్చి కూర్చుంది అనుపమ.

    "ఎలాంటి పాషాండుడికైనా కంటనీరు తెప్పించే దృశ్యం అది అనూ! అందరూ చిన్నపిల్లలు. ఐదునించి ఎనిమిదేళ్ళ వయసులో వున్నవాళ్ళు. కాళ్ళు, చేతులు విరిగి, తలలు బద్ధలయి.... ఒకరు కాదు, ఇద్దరు కాదు. దాదాపు యాభైమంది. అందులో ఐదుగురు చచ్చిపోయారు. మరో ఆరుగురి పరిస్థితి ప్రమాదకరంగా వుంది. సెంటిమెంటల్ గా ఫీలవక ఏం చెయ్యమంటావ్? ఎన్నో ఏళ్ళుగా చావుని చూసి అలవాటు పడిపోయాను నిజమే! కాని ఇవి మామూలు చావులు కావు. హత్యలు... భయంకరమైన హత్యలు" కాస్త ఆవేశంగా అన్నది వందన.

    "మీరనేది మన హైదరాబాద్ సంగతేనా? ఇది మరో పంజాబ్, కాశ్మీరు అయిపోతోందా?" అడిగాను ఆశ్చర్యంగా.

    "గన్ తో వరసగా అందరినీ కాల్చి చంపితేనే హత్యలు కావు వెంకట్ గారూ! ఈ హత్యలకు కారకులు ఎవరో వేలెత్తి చూపించడం కూడా కష్టమే. బహుశా పరిశోధించుకుంటూ పోతే మీరూ, నేనూ అందరం బాధ్యులమే అనిపిస్తుంది."

    "ఇంతకూ అదేమిటి వందూ?" అడిగింది అనుపమ.

    "స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది. నాలుగు క్లాస్ రూమ్ లు పూర్తిగా కూలిపోయాయి. పిల్లలు క్లాసుల్లో వుండగానే."

    "ఏ స్కూలు?"

    "మా హాస్పిటల్ దగ్గరలోనే వుంది చిన్న గవర్నమెంటు స్కూలు. ఒకప్పుడు రేకుల షెడ్డు. దాన్ని మార్చి బిల్డింగు కట్టి సంవత్సరంకూడా కాలేదు. రెందు రోజుల వర్షానికి కూలిపోయింది."

    "ఎంత దారుణం" అన్నాను. ఆ దృశ్యం తలుచుకుంటేనే బాధగా వుంది. "ఆ ఆరు గదులు వెయ్యడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బు లక్షా పాతికవేలు. అందులో మూడువంతులు ఖర్చుపెట్టినా గట్టి భవనమే కట్టి వుండవచ్చు. కాని అంత నాసిరకంగా కట్టి ఇంతమంది ప్రాణాలు తీశారు" అంది వందన.

    "ఆ కాంట్రాక్టరు ఎవరో అతడిని అరెస్టు చేశారటనా?"

    "చేశారన్నారు. కాని ఏం శిక్ష వేస్తారు? వాడు చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్నది ఆ పసిపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులూనూ."

    "ఏమిటి మొదలుపెట్టడమే నేరాలు, శిక్షలూనా? లాయర్ గారింకా వచ్చినట్లు లేదు. ఎవరి గురించి చర్చ?" నవ్వుతూ అడిగాడు అప్పుడే వచ్చిన వ్యక్తి. ఆయన పేరు రామ్మోహనరావు ఇంజనీరు. అనుపమ పరిచయం చేసింది.

    "మీ గురించే, ఐమీన్ మీ ఇంజనీర్ల పని గురించే. ఒక బిల్డింగు కడితే ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వవచ్చు నంటారు?" అడిగింది అనుపమ.

    "సంగతేమిటో చెప్పు. క్రాస్ ఎగ్జామినేషన్ వద్దు" అన్నాడు రామ్మోహన్.

    వందన జరిగిన విషయం చెప్పింది. అతడు కూడా చాలా బాధపడ్డాడు.

    "ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి ఇది మరొక ఉదాహరణ" అన్నాడు.

    "దీనికి కారణం ఎవరంటారు?" అడిగాను.

    "పని సవ్యంగా జరగాలంటే లంచాలు ఇవ్వడం కుదరదు. ఆ లాభం లేకుండా నాయకుల జేబులు నిండవు. వాళ్ళెందుకు నష్టపోవాలి చెప్పండి ఎలక్షన్ లో నిలబడి అయ్యా బాబూ అని ఓట్లు అడగడ, లక్షలు ఖర్చుపెట్టడం దేనికి? ప్రజా సేవ చేయడానికే అనుకుంటే పొరపాటు. వాళ్ళకు కావలసింది అధికారం. ఖర్చు పెట్టిన లక్షలకు తగినన్ని కోట్లు సంపాదించుకోవడానికి అధికారం. అది మనమే వాళ్ళకిస్తున్నాం" అన్నాను.

    "మనం అనకండి. నేనింతవరకు ఓటు వెయ్యలేదు. ఇక మీదట వెయ్యనేమో కూడా" అంది వందన.

    "ఎందుకని?" 

    "అదో ఫార్స్ గా అనిపిస్తుంది. ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తుల్లో ఒక్కరయినా దానికి అర్హత గలవారు అనిపించలేదు. పార్టీ పేరు మీద ఓట్లు పడతాయని ధైర్యం తప్ప ఆ నిలబడ్డవాడు రౌడీయో, గూండా నాయకుడు అయుంటాడు. పొట్టకొస్తే అక్షరమ్ముక్క రానివాడు. వాళ్ళు నన్ను రిప్రజెంట్ చేసేదేమిటి?"

    "కావచ్చు. కాని నాకనిపిస్తుంది. మనలాంటి విద్యావంతులయినా ఓటు తప్పకుండా వేసిరావాలి. లేదా దాన్ని చెల్లకుండా చేసిరావాలి. ఆ రకంగా మన ఓటు మనకి తెలియకుండా మరెవరో వేసే అవకాశం పోతుంది కదా."

    "అదీ పాయింటే" వప్పుకుంది వందన.

    మరో ముగ్గురు స్నేహితులు రావడంతో మా సంభాషణకి బ్రేక్ పడింది. వచ్చిన వాళ్ళలో ప్రొఫెసరు రామారావుగారున్నారు. ఆయన రిటైరయిన ఇంగ్లీషు ప్రొఫెసరు. అనుపమ భర్తకి బాగా దగ్గర స్నేహితుడు. ఎంతటి విరుద్ధ భావాలున్నా వాళ్ళ స్నేహం బాగా కొనసాగింది. ఆయన నాకు మా ఆఫీసులో ముందుగానే పరిచయం. పెన్షన్ కోసం వచ్చినప్పుడు మా వాళ్ళతో పెద్ద గొడవ పెట్టుకోవలసి వచ్చింది. నేనే కలగజేసుకుని ఆయన పని పూర్తిచేయించి పంపాను. ఆయన భార్య శిల్ప. ఆవిడ లాయర్. స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలపట్ల పోరాడే లాయర్. విమెన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ కోసం పనిచేస్తోందిట 'కోర్టులో తప్ప ఆవిడ ఇంకెక్కడా ఎక్కువ మాట్లాడదు. మాటల మనిషి కాదు. చేతల మనిషి' అని పరిచయం చేసింది వందన. వాళ్ళకూడా వచ్చిన వ్యక్తి మనోజ్. శిల్పగారి తమ్ముడు. ఫిజిక్స్ లో డాక్టరేట్ తీసుకున్నాడు. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో సైంటిస్టు. మా అందరిలోకి చిన్నవాడు.

    అందరం కలిసి టీ తీసుకున్నాం. అందరూ కలుపుగోలుగా మాట్లాడుతున్నారు. సరదాగా ఒకరిమీద ఒకరు జోక్స్ వేసుకుంటున్నారు. నేనొక్కడినే మౌనంగా వున్నాననిపించింది.

    వాళ్ళందరూ విద్యలోనూ, అంతస్థులోనూ అన్ని విధాలా నాకంటే అధికులు. అనుపమతో పరిచయం కాకముందు ఇలాంటి సర్కిల్ లో కూర్చోవడానికి కూడా సంశయించేవాడిని. ఈ రోజు వాళ్ళతో సంభాషణకి దిగాలన్నా సంకోచమే. ఈ రకమైన ఆత్మన్యూనతా భావమే నాలాంటి చాలామందిని అణచివేస్తుంది. మనిషికి కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది? అంతస్థు భేదం లేకుండా ఒకే స్థాయిలో వుంచే వాతావరణం స్కూల్లోనే వుండాలి. ఆ ఉద్దేశ్యంతోటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లవాడు ఎంత తెలివిగలవాడైనా లిటిల్ ఫ్లవర్. గ్రామర్ స్కూళ్ళలో చదివే అబ్బాయితో పోల్చుకుని తను తక్కువవాడిననే భావంతో పెరుగుతాడు.

    "రామ్మోహన్! లక్ష్మిగార్ని తీసుకురాలేదేం?" అడిగాడు ప్రొఫెసర్ రామారావు.

    "ఆవిడ నాకంటే పెద్ద ఇంజనీరయిపోయింది. ఈ రోజు చాలా బిజీ. తర్వాత వస్తానంది."

    "ఏమిటి ఇంకో కల్లు కట్టిస్తున్నారా?" అడిగింది వందన.

    "అబ్బే! నేనేదో మామూలు బిల్డింగులు కట్టి రిటైరయ్యాను. ఆవిడ డైరెక్టుగా స్వర్గానికి నిచ్చెనలు కడుతోంది. ఈ రోజు పొద్దుటినుంచి పూజలు, ఉపవాసం."

    "అలా వెక్కిరిస్తారేం? మీరు నాస్తికులు కాబట్టి మీకూ పుణ్యం రావాలని ఆవిడ ఇద్దరి తరఫునా రెట్టింపు పూజలు చేస్తుందేమో" అన్నాడు రామారావు.

    "అందుకే నేను రోజుకి నాలుగుసార్లు భోంచేస్తున్నాను. రెండుసార్లు నా తరఫునా, రెండుసార్లు ఆవిడ తరఫునా. ఇక ఆవిడ ఉపవాసం చేస్తోందని దిగుల్లేదు."

    "ఈ మధ్య లక్ష్మి మరీ భక్తిలో మునిగిపోతోంది. వారంలో నాలుగు రోజులు ఉపవాసం వుంటుంది. చాలా చిక్కిపోయింది" అంది శిల్ప రామారావుగారి భార్య.

    "మీరు ఆవిడని వారించకూడదూ? అసలే ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రం" అంది వందన.

    "నేను చెబితే వినేరకం కాదు. నేను గట్టిగా అన్నాననుకో. నువ్వే నామీద అరుస్తావు సమాన హక్కుల గురించి. ఆవిడా అంటుంది ఉపవాసం చేసుకునే హక్కు నాకు లేదా అని."

    "లేదని చెప్పండీ" అన్నాను. అందరూ నావైపు చూశారు.

    "నేను జోక్ చెయ్యడంలేదు. స్త్రీ భర్త అనుమతి లేకుండా ఎలాంటి ధర్మమూ చేయడానికి వీలులేదు. ఉపవాసాలు, వ్రతాలు కూడా భర్త అనుమతి తీసుకునే చెయ్యాలనీ స్త్రీ ధర్మాల్లో వుంది. భర్త అనుజ్ఞ లేకుండా చేసే వ్రతాలు రాక్షసులకు చేరతాయని స్మృతుల్లో కూడా చెప్పారు."

    "నిజంగానా! అయితే ఈ విషయం లక్ష్మికి చెప్పాలి" అన్నాడాయన ఉత్సాహంగా.

    " 'స్త్రీ భిర్భర్త్రవచః కార్యమేష ధర్మః పరఃస్త్రీయః స్త్రీకి భర్త ఆజ్ఞ పాలించుట అన్నింటికంటే శ్రేష్టము అని మనువు చెప్పాడు. పరాశురుడు అదే చెప్పాడు. అంతేకాదు- అనవసరంగా తపస్సులు చేసి భగవంతుడికి నివాసమయిన దేహాన్ని కృశింప చేయడం తప్పు అని. గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు స్త్రీగా ఆవిడకు స్వాతంత్రం లేదని, ఇవ్వద్దని నేను చెప్పడంలేదు. ఆవిడ ఆరోగ్యం దృష్ట్యా మీరు కట్టడి చేయడంలో తప్పులేదని చెపుతున్నాను."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra