"మీ కివన్నీ ఎలా తెలుసు?" అడిగింది వందన.
"ఆయన చాలా చదివారు. ఆయన జ్ఞాపకశక్తికి ఆశ్చర్యపోయాను. ఉపనిషత్తులు, స్మృతులు గురించి అడుగు. బాగా చెప్తారు" అంది అనుపమ.
"వేదకాలంలో స్త్రీలకు సమాన హక్కులుండే వంటారు నిజమేనా?" అడిగింది వందన.
"సమాన ప్రతిపత్తి అంటూ లేదేమోగాని, ఆ తర్వాత కాలంలో వచ్చిన ఆంక్షలు మొదట్లో లేవు. 'స్వయం సామిత్రం నసుతే జనేచిత' అని ఋగ్వేదంలో వుంది. యువతి తనంతట తాను భర్తను వరించేది అని అర్ధం. వేదాల్లో కొన్ని సూక్తులు స్త్రీలే రచించారని తెలుస్తోంది. వాళ్ళలో గార్గి, రోమళ, ఆత్ రేయి, లోపాముద్ర మొదలయిన వారున్నారు. కానీ ఋగ్వేదంలో 1028 సూక్తుల్లో కేవలం పదివరకు మాత్రమే స్త్రీలు రచించినవిగా చెప్పబడుతున్నాయి. కాబట్టి పూర్తిగా సమాన ప్రతిపత్తి వుందని చెప్పలేం. స్త్రీని అబలగా వర్ణించింది మొదట ఋగ్వేదమే. ఇక స్మృతుల కాలానికి వచ్చేసరికి స్త్రీని పూర్తిగా అణచివేశారు. వేదాలను చదివే హక్కు కూడా లేదన్నారు."
"స్త్రీని పూజించమని చెప్పింది మను ధర్మశాస్త్రం కాదా?" అడిగింది అనుపమ ఆశ్చర్యంగా.
" 'నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అని చెప్పిందీ మనువే. స్త్రీలను పూర్తిగా అణచి వెయ్యమనే అర్ధం శ్లోకాలు ఎక్కువ మనుస్మృతిలోనే కనిపిస్తాయి. నా ఉద్దేశంలో పెళ్ళయిన స్త్రీని పుట్టింటివారు శుభసందర్భాల్లో పిలిచి వస్త్రభూషణాలిచ్చి సత్కరించాలనే సందర్భంలో చెప్పిన శ్లోకం' 'యత్రనార్యస్తు పూజ్యంతే' అన్నది."
"మీకు సంస్కృతం బాగా వచ్చా?" అడిగాడు ప్రొఫెసర్ రామారావు.
"లేదండీ! కొద్దిగా వచ్చునంతే. నేను చదివింది ఎక్కువగా తెలుగు అనువాదాలే."
"మీరేమీ అనుకోనంటే ఒక ప్రశ్న అడుగుతాను" అన్నాడు మనోజ్, శిల్ప తమ్ముడు.
"అడగండి సందేహం దేనికి?"
"మీరు ఆస్తికులా?" నేనూ, అనుపమ మొహాలు చూసి నవ్వుకున్నాం.
"ఆయన మానవతావాది మనోజ్! నాలాగే ఎలాంటి పూజలు, పురస్కారాలు చెయ్యరు. మానవసేవే మాధవసేవ అని పూర్తిగా నమ్మిన వ్యక్తి. తిరుపతి వెళుతుంటారు. దైవదర్శనానికి గాదు. ప్రకృతి రమణీయత కోసం. అంటే ఆయన గురించి నువ్వే ఒక అభిప్రాయం ఏర్పరచుకో" అన్నది అనుపమ.
"ఆస్తిక, నాస్తిక వాదాలని వదిలిపెట్టండి మనోజ్. ఎవరైనా చదవాల్సిన పుస్తకాలవి. పవిత్ర గ్రంథాలని నేను చెప్పడంలేదు. వాటిల్లో మనం నేర్చుకోవలసిన విషయాలున్నాయి. గుడ్డిగా వాటిగురించి అత్యున్నత అభిప్రాయాన్ని కలిగి వుండటం ఎంత తప్పో, చదవకుండానే వాటిని విమర్శించడం కూడా అంతే తప్పు. వాటిలోనే కాదు. ఏ పుస్తకం చదివినా, అందులో మనం నేర్చుకోవాల్సిన మంచి కొంతయినా కనపడుతుంది."
"ఆ గ్రంథాలను నేను నిరసించటం లేదు వెంకట్. చరిత్ర భాగాలుగా వాటిని చదవడంలో తప్పులేదు. కాని ఈ మూర్ఖపు ఆచారాలు, విగ్రహారాధనలు చూస్తుంటే చిరాకేస్తుంది. ఈ మధ్య మరీ పెరిగిపోతోంది. తను ఫలానా భక్తుడినని చెప్పుకోవడం, చూపించడం ఫ్యాషనైపోతోంది. మళ్ళీ చేసేవన్నీ వెధవ పనులే" చిరాగ్గా అన్నాడు మనోజ్.
"అందరూ అలాంటి వారేనంటే నేను ఒప్పుకోను మనోజ్. భగవదారాధనలో చిత్తశుద్ధి పొందేవాళ్ళు అనేకం" అన్నాడు రామారావు.
"వాళ్ళగురించి నేను మాట్లాడటం లేదు. చిత్తశుద్ది లేని శివపూజ ఎందుకని నేనడిగేది. పూజచేసి నుదుట బొట్టుతో కనిపించగానే వాళ్ళెంతో పవిత్రులని అందరూ గౌరవిస్తుంటారు. అలాంటివాళ్ళే ఎక్కువగా బ్లాక్ మార్కెటింగ్, స్మగ్లింగ్ లాంటివి చేసేది. మన దేశంలో సాధువులకి, బాబాలకి లెక్కలేదు. సాధువులకి గన్ ఫ్యాక్టరీలుండడం ఈ దేశంలోనే చూస్తాం. ఆడపిల్లలతో నగ్ననృత్యాలు చేసే బాబాలనీ చూస్తాం. వాళ్ళకి మామూలు కార్లు కూడా పనికిరావు. ఎ.సి. చేయబడ్డ రోల్స్ రాయిస్ లు, ఏరోప్లేన్లలో తప్ప తిరగరు. జ్ఞానమున్న ఎవడండీ వీటిని చూస్తూ వాళ్ళు దైవభక్తులని నమ్మేది? తోటి మనుషులకి కనీస గౌరవం ఇవ్వలేని మనం చెట్లనీ జంతువులనీ పూజిస్తామని గొప్ప చెప్పుకుంటాం వెంకట్ గారూ, నేను నాస్తికుడినే ఒప్పుకుంటాను" అన్నాడు మనోజ్.
" 'నాస్తికో వేదనిందకః' అన్నాడు మనువు. వేదాలను నిందించే వాళ్ళంతా నాస్తికులే అంటాడు. దానికి కారణం వుంది. వేదాలు పూర్తిగా యజ్ఞయాగాలకు ప్రాముఖ్యం ఇచ్చాయి. ప్రకృతి శక్తులకు దైవత్వం ఆరోపించడం ద్వారా దేవుళ్ళు ఏర్పడ్డారు. అప్పుడే వర్ణవ్యవస్థా పుట్టింది. అదంతా వేదకాలం. వేదాల్లో చెప్పినట్లుగా యజ్ఞాలను విపరీతంగా చేయించేవారు బ్రాహ్మణులు. ఆనాటి యజ్ఞాల్లో పశుబలులు అధికం. ఈనాడు 'గోవధా నిషేధం' గురించి ఇంత గొడవ చేస్తున్నారు. కాని ఆనాడు యజ్ఞపశువులు గోవులే. యజ్ఞకాండ విపరీత స్థాయికి చేరి పశుబలి అంతులేకుండా సాగింది. కొంతకాలం రంతిదేవుడు అనే రాజు యజ్ఞం చేయగా చనిపోయిన పశువుల చర్మాలతో చంబల్ లోయలోని నది అంతా నిండి పోయింది. ఆ నదికి చర్మణ్వతి అనే పేరు వచ్చింది. యజ్ఞాల వల్ల లబ్ధి పొందేది బ్రాహ్మణులు. ఖర్చు పెట్టేది క్షత్రియులు. నష్టపోయేది వైశ్యులు, శూద్రులు. అలాంటి పరిస్థితిలో విప్లవం పుట్టడం సహజం. దానితో బ్రహ్మవాదం పుట్టింది. 'ఆత్మయే పరమాత్మ' వేరే దైవాలంటూ లేరన్న భావంతో ఉపనిషత్తులు వ్రాశారు. మొట్టమొదటి ఉపనిషత్తు ఐతరేయం. దీని కర్త మహీదాసు. శూద్రకులంలో పుట్టినవాడు. ఆ విప్లవాన్ని భరించలేని బ్రాహ్మణులు, తమ ప్రాశస్త్యం కూడా తగ్గిపోతుందనే భయంతో వేదనిందకులు నాస్తికులు అన్నారు. చిన్న ప్రశ్నకు పెద్ద ఉపన్యాసం ఇచ్చినట్లున్నాను" సంకోచంతో ఆగిపోయాను.
"మరి మళ్ళీ ఈనాడు విగ్రహారాధన ఇంతగా పెరిగి పోయింది. ఆ మార్పుకి కారణం ఏమిటి?" అడిగాడు మనోజ్.
"ఆనాటి నుంచి ఈనాటివరకు ఎన్నో కొత్త సిద్ధాంతాలు, నమ్మకాలు ఏర్పడుతూనే వున్నాయి. మార్పు సహజం. ఏదీ స్థిరంకాదు. ఆ విషయాన్ని మన భారతీయ తత్వశాస్త్రం చదివితే తెలుస్తుంది. ఏదో ఒక ధోరణి తలెత్తడం, దానిమీద విరుద్ధ భావాలు ఏర్పడడం, ఆ భావ సంఘర్షణలోంచి కొత్తవాదం ఏర్పడడం అనేక సార్లు జరిగింది. అందుకే నేనంటాను. ప్రతి మనిషీ ఈ గ్రంథాలను కనీసం సంక్షిప్తంగా చదవాలి. జిడ్డు కృష్ణమూర్తి లాంటి తత్వవేత్తలు అదే చెప్తారు. 'ఎవరూ నీకు గురువుకాదు. నీకు నువ్వే గురువ్వి కావాలి' అని. ఆనాడు గౌతమబుద్ధుడూ అదే చెప్పాడు. 'ఎవరో గొప్పవారు చెప్పారని దేనినీ అంగీకరించవద్దు. సంప్రదాయ సిద్ధంగా, అనుశ్రుతంగా వస్తున్నంత మాత్రాన దేనినీ విశ్వసించవద్దు. గ్రంథస్థమై ఉన్నదని ఏ నిర్వచనాన్నీ స్వీకరించవద్దు. ఎవరి సత్య సిద్ధికోసం వారే శ్రమించాలి అని."
"వర్గవిభజన, వర్ణవ్యవస్థవల్ల సామాజిక అసమానత ఏర్పడి ఆ కారణాలవల్ల ఘర్షణ తలెత్తేదనుకుంటాను. అది సహజం కూడా కదా. కాని ఈనాటికీ అదలా కంటిన్యూ అవుతూనే వుంది. ఆ వ్యవస్థని మార్చడానికి ఎవరూ ప్రయత్నించనే లేదంటారా?" రామ్మోహన్ అడిగాడు. వందన, శిల్ప కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే మా సంభాషణని వింటున్నట్లనిపించింది.
"మనమంతా కలిసి సరదాగా గడపాలని అనుపమ ఈ గెట్ టు గెదర్ ఏర్పాటు చేసింది. మనం ఇలాంటి చర్చ సాగించడం బావుండలేదేమో. ఇది కాస్త సీరియస్ సబ్జెక్టు కదా" అన్నాను మొహమాటంగా. అలాంటి మహామేధావి వర్గం మధ్య నేను ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే సంకోచం పోవటంలేదు. అనవసరంగా అలాంటి టాపిక్ లోకి నేనే లాగడం నన్ను బాధపెడుతోంది. కనీసం ఈ మొదటిరోజు నేను శ్రోతగా మిగిలిపోతే బావుండేది."
"అలా ఎందుకనుకుంటున్నారు? రియల్లీ ఇటీజ్ వెరీ వెరీ ఇంటరెస్టింగ్. ఇన్నాళ్ళూ ఎప్పుడు కలిసినా ఇదిగో ఈ మనోజ్ హేతువాదం నాస్తికత్వం అని మొదలుపెట్టడం, ఈ ప్రొఫెసర్ గారు దానికి విరుద్ధంగా మాట్లాడడం జరుగుతుండేది. దేవుడు వున్నాడా, లేదా అనే ప్రశ్నకు ఒక స్థిరమైన జవాబు ఇన్నేళ్ళయినా వీళ్ళు ఇవ్వలేకపోయారు. కేవలం వాదనలు, ఉదాహరణలు విసుగెత్తేవి. ఈ రోజు మాత్రం ఈ చర్చ యిలా గంటల తరబడి సాగితే బావుండుననిపిస్తోంది. చెప్పండి వెంకట్! మీరు చెప్పినట్లుగా తత్వశాస్త్రాన్ని మేము చదవాలి. చదువుతాం. కాని ఈ రోజుని వృధా చెయ్యొద్దు. మాకు సంక్షిప్తంగా మీకు తెలిసింది చెప్పండి ప్లీజ్" అంది వందన.
"వెంకట్ కి నలుగురిలో కూర్చొని ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు. అందువల్ల మొహమాట పడుతున్నాడు. అంత కంటే ఏం లేదు. అతడికా అలవాటు మనం చెయ్యాలనే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశాను. నాకు తెలుసు మనోజ్ తప్పకుండా ఈ టాపిక్ మొదలుపెడతాడని" అంది అనుపమ.
మొహమాటపడడం కాదు. నన్ను నేను కించపరచుకుంటున్నానని తెలుసు. నేను మారాలి. మారి తీరాలి. నన్ను మనిషిని చేసిన అనుపమ మాట నిలబెట్టుకునేందుకైనా.
"విగ్రహారాధన. వర్ణవ్యవస్థ మితిమీరినందువల్లనేకదా బౌద్ధమతం తలెత్తింది?" చర్చ కొనసాగించమన్నట్లుగా మొదలు పెట్టాడు రామారావు.
"నిజం చెప్పాలంటే యజ్ఞయాగాదుల్ని అణిచివేయాలనుకున్న ఉపనిషత్కారాలు కూడా భగవంతుడిని పూర్తిగా కొట్టిపారేయలేదు. భగవంతుడు తనలోనుండే ప్రకృతిని సృష్టించాడు. ప్రకృతిని శూన్యంలోంచి సృష్టించాడు అనే సిద్దాంతాలు ఉపనిషత్తుల్లో కనిపిస్తున్నాయి. బృహదారణ్యకోపనిషత్తులో యజ్ఞవల్కుడికి, గార్గి అనే శిష్యురాలికీ జరిగిన సంభాషణ ఒకటుంది. 'దేవతలంతా ఇంద్రుడి నుంచి పుట్టారు, ఇంద్రుడు ఆదిశక్తి బ్రహ్మనుండి వచ్చాడు. బ్రహ్మ ఎక్కడినుంచి వచ్చినట్లు' అని గార్గి ప్రశ్నిస్తుంది. 'అధిక ప్రసంగం చేయకు. హేతువాదానికొక పరిమితి ఉంది' అంటాడు యజ్ఞవల్కుడు. 'చర్చలవల్ల లాభం లేదు. నోటికి వృధా శ్రమ' అని ఈ ఉపనిషత్తే చెప్తుంది. ఈనాటి ఆధునిక శాస్త్రం, అంటే మన విజ్ఞానశాస్త్రం ఏం చెపుతుంది? 'పదార్ధం వివిధ రూపాలుగా పరిణామం చెందుతూ వస్తోంది. నిర్జీవ పదార్ధమైన వాతావరణంలోంచి సజీవ పదార్ధమైన జీవకణం 'అమీబా" పుట్టింది. ఈ అమీబా నుండి అనేక పరిణామాల తర్వాత మనిషి జన్మించాడు. మనిషి మెదడులోంచి భావం ఉద్భవించింది' ఇది ఆధునిక భౌతికవాదం. కాని ఈ వాదాన్ని బుద్ధుడికి పూర్వమే చార్యాకులు ప్రచారం చేశారు. క్రీ.పూ.600... అంటే బుద్ధుడి పుట్టుకకు యాభై సంవత్సరాలు పూర్వమే ఈ చార్వాక మతం తలెత్తింది. వీళ్ళనే నాస్తికులు, లోకాయతులు అని కూడా అనేవారు. 'కర్మకాండ అంతా బ్రాహ్మణులు సృష్టించిందే. తమ భుక్తికోసం ఇలాంటివి కల్పించారు తప్ప దేవుడనేవాడు లేడు. పరలోకం అనేది అసలు లేదు అన్నది వీళ్ళ వాదం."
"మీ మాటలకు అడ్డొస్తున్నాననుకోకండి. ఈ చార్వాకుల పుస్తకాలు ఏవయినా దొరుకుతున్నాయా? చదవాలనుంది" అడిగాడు మనోజ్.
"ఉహూ! అలాంటివేం లేవు. ఆ శ్రద్ధ వాళ్ళు ఎక్కువగా తీసుకున్నట్లనిపించదు. లేదా తర్వాత వీటి వ్యతిరేకులు వాటిని ఎవరికీ అందకుండా నాశనం చేసుండాలి. ఏమైనా చార్వాకమతాన్ని ఖండిస్తూ వ్రాయబడ్డ విమర్శక గ్రంథాలద్వారా ఈ మతం గురించి వివరాలు తెలుస్తున్నాయి. ఈ పుస్తకాల్లో ముఖ్యమైనది 'సర్వదర్శన సంగ్రహం'. ఈ మత బీజాలు బృహస్పతి అనే ముని వ్రాసిన సూత్రాల్లో వున్నట్లు ఈ గ్రంథం చెప్తోంది. మహాభారతంలో కూడా ఒక కథ వుంది. చార్వాక మతాన్ని ఉద్ధరించిన వారంతా ఎక్కువగా బానిసలే. ఆనాటి తిరుగబాటుదార్లు. కాని వీరి తత్వంలో కొన్ని బలహీనతలున్నాయి. సాధారణ తర్కాన్నికూడా వీళ్ళు పూర్తిగా ఖండించారు. ఈ జన్మ కూడా శాశ్వతం కాదు. కాబట్టి సాధ్యమయినన్ని సుఖాలు అనుభవించు అన్నారు. ఏ రకంగానయినాసరే పంచేద్రియాలయిన కన్ను, ముక్కు, చెవి, చర్మం, నోరు ద్వారా సంపాదించే ఇంద్రియం జ్ఞానం గురించి భావవాద తార్కికుల చెప్పిన వాదాన్ని కూడా వీళ్ళు పూర్తిగా ఖండించారు. వీరివల్ల అరాచకత్వం పెరిగిపోతోందని ఆనాటి రాజులు వీళ్ళని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించారు. దీనికి ఉదాహరణ భారతదేశంలో ఒక కథ వుంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు ఊరేగింపుగా హస్తికకు తిరిగి వస్తున్నాడు. చార్వాకుడనే విప్లవకారుడు ఎదురుగా వెళ్ళి, "నీ పేరు ధర్మరాజు. కాని నువ్వు చేసిందంతా అధర్మమే' అని విమర్శించాడు. అతడిని అక్కడే బంధించారు. పురోహితులు, మంత్రులు చెప్పగానే ధర్మరాజు అతడికి అక్కడే మరణదండన విధించి చంపించాడు. ఇది కథ మాత్రమే కావచ్చు. ఏమైనా చార్వాకులు అణచివేయబడ్డారు. చార్వాకులు మనకు చేసిన మరొక ఉపకారం, ఆయుర్వేదం. అది వాళ్ళు కనిపెట్టిందే. చార్వాకమతం తర్వాత బాగా ప్రచారంలోకి వచ్చింది భౌద్ధమతం. సామాజిక అసమానత, దుఃఖం గౌతముడిలో ఆలోచనలు రేకెత్తించాయి. 'జిజ్ఞాస' అనేది మనిషిని దేవుడిగా చేయగలదని బుద్ధుడి చరిత్ర ఋజువు చేస్తుంది.