Previous Page Next Page 
తులసి పేజి 36

    "ఎలా వుంది ఫ్రెండ్..... "

    "టప్ టపా టప్" దూరంగా ఎక్కణ్నుంచో వస్తున్నట్టూ వుంది ఆ స్వరం. సన్యాల్ సన్నగా నవ్వేడు.

    టెలివిజన్ తెరమీద గ్రాఫ్ కనబడ్తుంది. కంప్యూటర్ చేరవలసిన పాయింట్ కన్నా ఎడమవైపుకి వెళుతున్నట్టు గమనించి చూపుడు వేల్తో కొద్దిగా పక్కకి జరిపేడు. అతడు దాన్ని తలలో కొద్దిగా కదుపుతూ వుంటే బయట టెలివిజన్ లో అది కనబడుతూంది.

    రెండు నిమిషాల్లో అతను చేరవలసిన స్థానాన్ని చేరుకున్నాడు. గ్రాఫ్ లో వున్న పాయింట్ కి, మెదడులో వున్న కంప్యూటర్ పాయింట్ కి చేరుకోగానే -ఏడు టెలివిజన్ తెరల్లోనూ ఒకే పదం కనిపించింది.

    CORRECT

    సన్యాల్ సిమెంట్ తో తల రంధ్రాన్ని పూడ్చేసేడు. భూమిలోంచి కొత్తిమీర మొక్కలు పొడుచుకొచ్చినట్లు, రోగి తలలోంచి వైర్లు బయట కొచ్చి వున్నాయి.

    సన్యాల్ సంతృప్తిగా నిలబడి ఊపిరి పీల్చుకోవటంతో ఆపరేషన్ స్టేజీ వన్ విజయవంతమైనట్టు పండిత్ గ్రహించేడు. గాఢంగా ఊపిరి వదులుతూ సన్యాల్ గుండె నిమురుకోవడం చూసి, "ఏమైంది" అని అడిగేడు పండిత్.

    "సన్నటి నొప్పి -అప్పుడప్పుడొస్తూంది" నవ్వేడు సన్యాల్.

    ఫర్లేదు గుండెకి బదులు బర్చర్ వాల్వ్ పెట్టొచ్చు. రేడియో ధార్మిక శక్తితో అది నడుస్తూంది. అప్పుడు గుండె నిరంతరం కొట్టుకునే అవసరం ఉండదు. ఆ ఎనర్జీ అంతా శరీరానికి మిగిలిపోతుంది. దాంతో మనిషికి విపరీతమైన శక్తి వస్తుంది. గంటకి యాభై మైళ్ళ వేగంతో పరిగెత్త గలిగే శక్తి వస్తుంది. అప్పుడు సిటీబస్ లు అక్కర్లేదు. ఈ లోపులో STAGE 5 COMPUTER system వస్తుంది. అనాసిస్ టాబ్లెట్ పరిమాణంలో మెదడు తయారు చేయబడుతుంది. ఇంగ్లండులో వున్న స్నేహితుడు అతడి మెదడులో ఈ టాబ్లెట్ ని చొప్పించుకుని పరిదోరుజపాటు లండన్ అంతా చూసి, దాన్ని భారతదేశం పంపిస్తే - ఆ టాబ్లెట్ ని ఇక్కడ మన మెదడులో చొప్పించుకుంటే ......పదిరోజుల పాటు లండన్ చూసిన అనుభూతి కల్గుతుంది. అంటే..... భౌతికమైన అనుభవానికీ, మానసిక అనుభూతికీ మధ్య తేడాని కంప్యూటర్ తగ్గించేస్తుంది. మనిషి ఇంట్లో కూర్చుని ఈ భావనా తరంగాల సాయంతో గాలిలో ప్రయాణం చెయ్యవచ్చు. (నారదుడిలా) తెలివైన వాళ్ళ మెదళ్లు తెలివి తక్కువ వాళ్ల మెదడుని ట్యూన్ చేస్తే బార్య హేమమాలినిలా కనబడ్తుంది. ఇంకా ముందుకెళితే - ఇంట్లో కూర్చునే మెదడుని సినిమా హాలుకి పంపిచవచ్చు. స్మశానంలో కూర్చుని ఎక్కడో హాయిగా పని చేసుకుంటున్న వాడిని క్షణాలమీద చంపవచ్చును........

    అంతే చేతబడి...
    .....................
    ......................

    "ఏమిటి ఆలోచిస్తున్నారు"

    పండిత్ తడబడి "ఏం లేదు" అన్నాడు.

    "ఇంకా చిన్న పని మిగిలివుంది......." అన్నాడు సన్యాల్. ఔను -మెదడులో అమర్చిన కంప్యూటర్ కు సరిపోయే శక్తినిచ్చే పని ఇంకా మిగిలివుంది. పండిత్ చిన్న పాకెట్ లాటికి డాక్టర్ కి అందించేడు. అందులో ముప్పైఏడు గ్రాముల రేడియో ఆక్టివ్ ఐసోటోపు ప్లూటోనియం -  239 వుంది. పైకి అది మామూలుగా కనబడుతోంది. కానీ, అది బహిర్గతం చేసే వేడితో పదిమందికి సరిపడా వంట చెయ్యవచ్చు.

    సన్యాల్ రోగి భుజం దగ్గిర చర్మాన్ని కోసి, ఆ పాకెట్ ని శరీరంలో అమర్చేడు. తల దగ్గిర్నుంచి సన్నటి గీతలా చర్మాన్ని కోసి, వైర్లని భుజం దగ్గిర కలిపేడు.

    పండిత్ కి తెలుసు -ఈ రోగి మరణించినపుడు జాగ్రత్తగా ఈ శరీరంలోంచి ఆ రేడియో ఆక్టివ్ పాకెట్ తీసెయ్యాలని..... లేకపోతే రోగి చచ్చిపోయిన తరువాత, ఆ పాకెట్ గానీ విడిపోతే ఆ శవాన్ని పాతిపెట్టిన ధార్మిక శక్తికి స్మశానంలో ప్రవేశించినవాళ్ళు కూడా శవాలుగా మారతారు -రేడియో.

    మరో రెండు నిముషాల్లో సన్యాల్ రోగి భుజం దగ్గిర చర్మం కుట్టేశాడు. ఆ తరువాత పెద్ద కంప్యూటర్ దగ్గిరనుంచి రోగి మెదడుకి సూచన్లు యివ్వసాగాడు. ఒకటి రెండు -మూడు-

    అలా ఒక్కో సూచనా పంపిస్తూంటే -రోగిలో చలనం లేదు. ఆపరేషన్ ఫెయిలయిందా అని అనుమానపడ్డాడు పండిత్. ముప్పైరెండు ఎలక్ట్రోడ్ నుంచి పంపిన సూచనకి రోగి కొద్దిగా కదిలేడు. సన్యాల్ పెదవులమీద విజయవంతమైన చిరునవ్వు వెలిసింది రోగి చెవి దగ్గరగా వంగి "నీ పేరు" అన్నాడు. రోగి పెదవులు అస్పష్టంగా కదిలినయ్ మాటరాలేదు! ముప్పైమూడో ఎలక్ట్రోడ్ ప్రయత్నించి - తిరిగి అడిగాడు "నీ పేరు"

 Previous Page Next Page