ఈ సారి రోగి నోటినుంచి స్పష్టంగా మామూలు మనిషిలా మాటలు వెలువడ్డాయి.
"నా పేరు.........."
"ఊ........నీ పేరు?"
"శ్రీనివాసపిళ్ళయ్"
రక్తం అంటుకున్న చేతుల్తోనే ప్రొఫెసర్లిద్దరూ షేక్ హాండ్స్ తో అభినందించుకున్నారు. సైన్సు చరిత్రలో అదొక అద్భుత విజయం అని వాళ్లకి తెలుసు. అంతలో ఉన్నట్టుండి టెలివిజన్స్ లో అకస్మాత్తుగా గీతలు అదృశ్యమయ్యాయి. పండిత్ ఆందోళనగా సన్యాల్ వైపు చూసేడు. సన్యాల్ కంప్యూటర్ వైపు చూసేడు. కంప్యూటర్ దానంతట అదే ఆ డాక్టర్ కి ఆఖరి సందేశం పంపింది. టెలివిజన్ తెరమీద ఎలక్ట్రానిక్ అక్షరాలు మెరుస్తూ క్షణంపాటు కనబడ్డాయి.
"కంగ్రాచ్యులేషన్స్" అని
పండిత్ వాచీవైపు చూసుకున్నాడు - 7-19.
* * *
"తరువాత ఏమైంది" అబ్రకదబ్ర టెన్షన్ తో అడిగాడు.
పండిత్ వెంటనే జవాబు చెప్పలేదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం పెట్టుకోవడం అంత సులభం కాదు. అయినా అచ్చుపుస్తకంలో పేజీల్లా అతడి జ్ఞాపకపు పుటల్లో స్మృతులు తిరుగుతున్నాయి.......
సన్యాల్ కాగితం మీద వ్రాసుకున్నాడు.
రోగి పేరు -శ్రీనివాసపిళ్ళయ్.
ఆపరేషన్ కుడివైపు టెంపోరల్ లోబ్ లో ఎలక్ట్రోడ్ అమర్చటం నష్టమైన రక్తం 250 సి.సి. రికవరీ, 12 గంటలు. అతడు వ్రాయటం పూర్తిచేసి పండిత్ వైపు తిరిగి "థాంక్యూ ప్రొఫెసర్" అన్నాడు. "మీరు చేసిన సాయానికి కృతజ్ఞతలు."
పండిత్ కి తెలుసు. నిజానికి తను చేసింది ఏమీలేదని. పెద్దవాడు గారడీ చేస్తూంటే సాయంచేసే చిన్నపిల్లవాడిలా నిలబడ్డాడు తను. అంతే.
"ఇంక మనం చెయ్యవలసిందేమీలేదు. ఆ రాత్రికి......రోగికి ప్రొద్దున్నగ్గానీ మెలకువరాదు. మీరు విశ్రాంతి తీసుకోండి" అన్నాడు సన్యాల్.
ఇద్దరూ చెరో రూములోకి వెళ్ళి పడుకొన్నారు.
పండిత్ ఆలోచించసాగేడు.
అతడికి ఎప్పుడో చదివిన విషయం జ్ఞాపకం వచ్చింది.
ఒక ఆస్పత్రిలో ఒక పదేళ్ళ కుర్రవాడు అడ్మిట్ చెయ్యబడ్డాడు. అతడు తల దువ్వుకునేటప్పుడు జుట్టు మధ్యలో నొప్పిగా వుండేది. తరువాత అక్కడ వాపు బయల్దేరింది.
న్యూరోలాజికల్ పరీక్షలో ఏమీ బయట పడలేదు. ఎక్స్ రేలో తేలింది. అతడి తలలో 6సెం.మీ. మేకు వున్నట్టు
ఒక సైక్రియాటిస్టు ఎంతో శ్రమతో ఆ కుర్రవాణ్ని అనునయించి విషయం రాబట్టేడు. ఎన్నో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు అందులో బయటపడ్డాయి.
ఆ కుర్రవాడికి ఒక సాధువు దగ్గరకి ప్రతిరోజూ వెళ్లే అలవాటు వుంది. ఆ సాధువుకి తనకి తెలిసిన మంత్ర విద్యని ఈ కుర్రవాడి మీద ప్రయోగం చెయ్యదల్చుకున్నాడు. డీప్ హిప్నాసిస్ లో ఆ కుర్రవాణ్ని ప్రవేశపెట్టి మేకు దిగకొట్టేసేడు.
మరి ఆ సాధువుకి మానవాతీత శక్తులు వచ్చాయో లేదో తెలీదు కానీ, డాక్టర్లు చాలా కష్టపడి ఆ కుర్రవాణ్ని రక్షించవలసి వచ్చింది.
బాగా అలసిపోవడం వల్ల పండిత్ కి వెంటనే నిద్రపట్టింది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి బాగా తెల్లవారిపోయింది. కిటికీలోంచి ఎండ నిటారుగా పడ్తూంది. తన నిద్రకి తనని తనే తిట్టుకుంటూ బైటరూములోకి వచ్చేడు. సన్యాల్ తలుపు దగ్గరికే వేసివుంది. అతడూ లేవలేదు.
పండిత్ ఆపరేషన్ రూములోకి వెళ్ళాడు. అదే ఇన్ టెన్సివ్ కేర్ రూముగా కూడా ఉపయోగపడ్తుంది. సన్నటిగాలి ఎయిర్ కండిషనర్ లోంచి చల్లగా వీస్తూంది.
రోగిని చూడడం కోసం కుర్చీని నెమ్మదిగా తిప్పి -పండిత్ స్థాణువై అలానే నిలబడిపోయాడు.
శ్రీనివాసపిళ్ళై కుర్చీలో లేడు.
పండిత్ దాదాపు పరుగుబెడ్తున్నటటు సన్యాల్ గదిలో ప్రవేశించాడు. దగ్గరికి వేసివున్న తలుపుల్ని దభేలున తెరచి "డాక్టర్" అని అరిచాడు. సన్యాల్ లో కదలికలేదు. అతడిని కదిపి లేపటానికి మీద చెయ్యి వేసిన పండిత్, మరోషాక్ తగిలినట్టు చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు.
సన్యాల్ శరీరం చల్లగా తగిలింది.
ఒక అవయవం బదులుగా కంప్యూటర్ ని అమర్చగలిగిన ఆ డాక్టర్ గుండె అనె మరో అవయవం పనిచెయ్యని కారణంగా అచేతనుడయ్యాడు.
* * *