Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 36


    "జ్యోతి అడవిలో ఏ మార్గాన వెళ్తోందో తెలుసు. బహుశా ఆ మార్గం గుర్తించగలను.
    "మీరా మార్గం చెపితే మనం విదుషి ఎలా మాయమయిందో తెలుసుకోవచ్చు."
    "అయితే నేను వెంటనే వస్తాను. ఆ ప్రాంతాలు చూపిస్తాను" ఎగ్జయిటింగ్ గా అంది. విదుషి ఆచూకీ తెలుసుకోవాలనే ఆరాటం అందరికంటే ఇళలోనే ప్రబలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
    "మీరెలా వస్తారూ? మిమ్మల్ని వీళ్ళు రానివ్వరు."
    "ఎందుకు రానివ్వరూ? మళ్ళీ వెంటనే వచ్చేస్తానని చెప్తాను."
    "ఎవరూ నమ్మరు."
    "నమ్మరూ? దుర్గ మీద ఒట్టు వేసి చెప్తాను."
    "దుర్గ మీద ఒట్టు అంటే ఎవరికి నమ్మకం?"
    నిర్ఘాంతపోయి చూసింది ఇళ. అప్పటివరకూ ఆ అమ్మాయి ఉంటున్న లోకమేదో తలకిందులయినట్లు అయిపోయింది. కొన్నాళ్ళ కిందట "నీ దుర్గ నన్నేమీ చెయ్యదు" అంటోన్న నామాలయ్య గుర్తుకు వచ్చాడు. తలదించుకు నిలబడిపోయింది. ఆ ముఖాన్నే చూస్తూ నిలబడింది సుహాసిని. "ఇళ అమాయకురాలు!" అని ఆమె అంతరాత్మ చెపుతోంది.
    "పోనీ మరోపని చెయ్యొచ్చు. నామాలయ్యగారికీ, రాణి గారికీ కూడా జ్యోతి వెళ్ళే దారి తెలుసు. వాళ్ళలో ఎవరినడిగినా మీకు జ్యోతి నడిచే దారి చూపిస్తారు."
    తెల్లబోయింది సుహాసిని. అంత నమ్మకమా వాళ్ళలో ఈ అమ్మాయికి? "లోకమెరుగని బాలా" అన్నట్లు ఉంది.
    "నామాలయ్య వచ్చాడా నీ దగ్గరికి?"
    అతడిని మన్నించి మాట్లాడలేకపోతోంది సుహాసిని. అతడి వివరాలన్నీ వింది.
    "వచ్చారు. నా తరపున వాదించటానికి లాయర్ని పెడతానన్నారు. నన్ను భయపడొద్దన్నారు. నాకేం భయం? ఏం జరిగినా, అంతా దుర్గాదేవి ప్రసాదం" ఇళ అమాయకురాలనే ఊహ దృఢ పడుతోంది సుహాసిని మనసులో! కొంతసేపు ఆలోచించి అంది.
    "నామాలయ్య మళ్ళీ నీ దగ్గిరకి ఎప్పుడొస్తాడూ?"
    "ఇవాళ సాయంత్రం రావచ్చు."
    "వస్తే పోలీసులకి జ్యోతి వెళ్ళే మార్గం చెపితే విదుషి జాడ తెలుసుకోగలరట! చెప్పమంటారా?" అని అడుగు. ఆయన చెప్పమంటే, ఆయనే నువ్వు విడుదల అయ్యే మార్గం చూస్తారు. లేదా ఆయన ఏమన్నాడో చెప్పు. నేను చెప్పేవరకూ నేను నీతో మాట్లాడిన విషయం నామాలయ్యతో చెప్పకు."
    కళ్ళు పెద్దవి చేసింది ఇళ. ఇదంతా ఏమిటో ఆమెకి అర్థం కావటంలేదు. అలాగే అన్నట్లు తలూపింది.


                                            *    *    *    *


    ఇళ కోసం పళ్ళూ అవి తీసుకుని ఎంతో ప్రేమ చూపిస్తూ వచ్చాడు నామాలయ్య. ఇళ చెప్పిన మాటలు విని కంగారుపడిపోతూ 'అయ్యయ్యో!' నువ్వు కొంపతీసి జ్యోతి వెళ్ళే మార్గం చెప్పేశావా?" అన్నాడు. తన కంగారులో నామాలయ్య లాకప్ లో ఉన్న ఇళ ఆ మార్గం లేదనీ, డ్రాయింగ్ వేసి చూపించేటంత పరిజ్ఞానం ఆమెకి లేదని మరిచిపోయాడు. కంగారు పడిపోతున్న నామాలయ్య ముఖంలోకి నిదానించి చూసింది ఇళ. ఆమె అమాయకురాలే కానీ, తెలివి తక్కువది కాదు. విదుషి మాటలతో మేల్కొన్న ఆమె మనసు సుహాసిని మాటలతో ఈ లోకంలోకి వస్తోంది.
    "చెప్పలేదు. మీరు చెప్పమంటే చెప్దామని. అయినా చెపితే నష్టమేముందీ? పోలీసులు విదుషి అక్క ఆచూకీ తెలుసుకుంటారు, అంతేగదా!"
    "నువ్వూ, నీ విదుషి అక్కా!" ఇళమీద చిరాకు పడబోయి, అంతలో సర్దుకున్నాడు నామాలయ్య.
    "అది కాదమ్మా! ఈ పోలీసులు చేసేదేమీలేదు కానీ, మన ఊరిమీద పడి మనందరినీ చికాకు పెడతారు. చివరికి ఎవరు పది రూపాయాలు చేతిలో పెడితే వాళ్ళమాట వింటారు. నీకెందుకూ? నువ్వు విడుదలై వచ్చాక నేను చూస్తాగా ఆ విషయాలన్నీ!"
    చాలా అనునయంగా అన్నాడు నామాలయ్య.
    చాలా సంగతులు తెలుస్తున్నాయి ఇళకి! అన్నిటికంటే నామాలయ్యతో ఎలా మాట్లాడాలో తెలుస్తోంది.
    "అలాగే! ఎవరితోనూ ఏమీ చెప్పను" అంది బుద్ధిగా.
    "అసలు నువ్వు ఎవరితోనూ మాట్లాడకు. మౌనవ్రతంలో ఉండు. నీలాంటి దేవతామూర్తులు అలాగే ఉండాలి!"
    తలదించుకుని తలూపింది ఇళ. తల ఎత్తితే నామాలయ్య లాంటి గడసరి తన కళ్ళలో తన మనసు తెలుసుకుంటాడేమోనని భయపడింది.
    సుహాసినితో జరిగింది చెప్పింది ఇళ.
    "నామాలయ్య ఏదో చేస్తున్నాడు. అది తెలుసుకోగలిగితే బాగుండును" అంది ఆలోచనగా.
    ఈ మాటలతో ఇళ నిర్దోషి అని పూర్తిగా నమ్మింది సుహాసిని.
    "నామాలయ్య నిన్ను విడిపిస్తానని అంటున్నాడా?"
    "అలా అనే అంటున్నాడు. నన్ను విడిపిస్తే మళ్ళీ నా పేరుతో డబ్బు సంపాదించుకోవచ్చు గదా! అందుకని విడిపిస్తాడేమో!"
    "గాడ్! నువ్వు చకచక ఎదిగిపోతున్నావు."
    "నామాలయ్య నన్ను విదిపిస్తే, నేను మళ్ళీ ప్రమధపురికి వస్తే, తప్పకుండా మీకు అక్కడి అడవిదారి చూపిస్తాను. విదుషి అక్కని ఇప్పటికైనా కాపాడగలిగితే అంతకంటే కావల్సిందేముందీ?"
    చెమ్మగిల్లాయి ఇళ కళ్ళు.
    "చూద్దాం! ఏం జరుగుతుందో? నువ్వు మాకు సహకరిస్తానంటున్నావు కదా! అదిచాలు! చిచ్చుతో చెప్తాను ఈ సంగతి! రెండు రోజుల్లో నీ కేసు విచారణకి వస్తుంది. ధైర్యంగా నిజం చెప్పు."
    "అబద్ధం ఎందుకు చెప్తానూ?" ఆశ్చర్యంగా అడిగింది ఇళ.


                                    16


    జనంతో కిక్కిరిసి ఉన్న కోర్టు హాలుని గర్వంగా కలయజూస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు నామాలయ్య కుదిర్చిన ఇళ తరపు ప్లీడరు.
    "ఇళ దేవతాంశతో జన్మించింది. ఈ విషయం ప్రమధపురిలో నమ్మారు. పదేళ్ళు నిండని పసి వయస్సులోనే నామాలయ్యగారి అబ్బాయి జబ్బు నయం చేసింది. ఆ తర్వాత ఎందరి రోగాలనో కుదిర్చినట్లు చాలామంది చెపుతున్నారు. ఈ విషయంలో నిజానిజాల సంగతి ఆ దేవతకే తెలియాలి. కోయ జనానికి బావి త్రవ్వటానికి స్థలం చూపించింది ఇళ. అక్కడ నీళ్ళు పడ్డాయి మరి! మంచంమీద నుంచి లేవలేని దశలో అర్థరాత్రి వేళ లేచి అడవిదారిలో నడిచి, అంతకు ముందు ఎవరూ చూడని కొండదేవతని చూపించింది కూడా ఇళే! ఈ విషయమూ ఊళ్ళో అందరికీ తెలుసు. నిజానికి అప్పటినుంచే జనం అమ్మాయిని దేవిగా ఆరాధించటం ప్రారంభించారు. గుడి, భక్తులు, పూజలు, దక్షిణలు మొదలైన తతంగమంతా ఎక్కువైంది. తన కొడుకును కాపాడిందనే విశ్వాసంతో ఇళని భక్తిగా చూస్తున్నాడే తప్ప నామాలయ్యకి ఈ హడావుడితో సంబంధం లేదు."

 Previous Page Next Page