Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 36


    "వేణూ! నేను చెప్పేది పూర్తిగా విను. ప్రేమ మా రాజ్యం కూతురు__"

    "వ్వాట్!" కళ్ళు చిట్లిస్తూ అన్నాడు సరిగ్గా వినపడనట్టు.

    "అవును వేణూ! ఇప్పుడే తెలిసింది. అది నా మేనకోడలు. రాజ్యం చనిపోయాక జగపతిరావు కూతుర్ని తెచ్చుకుని పెంచుకుంటున్నాడు." అతడు చెపుతూన్నది అర్ధం కావటానికి వేణుకి కొంతసేపు పట్టింది. అది కలకాదనీ, నిజమేనని నిశ్చయించుకున్నాడు. దానికి మరి కొంతసేపు పట్టింది. "అయితే ఇప్పుడు మనమేం చెయ్యనక్కర్లేదా?"

    "అక్కర్లేదు."

    "మన కాంట్రాక్టు రద్దయిపోయినట్లేనా?"

    "ఇంకా కాంట్రాక్టేమిటి వేణూ! అది నా మేనకోడలు... ఇంకా చాలా వుంది చెప్పటానికి. నేను ఇప్పుడే వస్తున్నాను. అక్కడే వుండు." 

    ఒక్కసారిగా భరించలేనంత ఆనందాన్ని కలిగించే విషయం ఏదైనా వింటే ముందసలు ఏమీ తోచదు. తరువాత అంచెలంచెలుగా ఆ సంతోషం మనసంతా వ్యాపిస్తుంది. వేణు పరిస్థితి ప్రస్తుతం అలాగే వుంది.

    ఫోన్ పెట్టేసి, కొద్దిసేపు అలాగే నిల్చున్నాడు.

    ఉప్పెనలా దూసుకొస్తుందనుకున్న తుఫాను వింజామరలా వెళ్ళిపోయింది!

    ఇక తనకీ ప్రేమకీ మధ్య ఏ అడ్డూలేదు. చేతులు రెండూ గాలిలోకి ఎగరేసి "హిప్ హిప్ హుర్రే" అని అరవాలన్న కోర్కెని అతి కాస్తం మీద అణుచుకున్నాడు.

    ....ఫోన్ దగ్గిర్నుంచి గదివైపు బయల్దేరాడు.

    వరండాకి ఆనుకొని చెట్లున్నాయి. అంచున వున్న పూలు గాలికి అందంగా అటూ ఇటూ వూగుతూ విశాలమైన రోడ్డుమీద విదేశీ ప్రెసిడెంట్ వెళుతుంటే జండాలు పట్టుకుని ఆహ్లాదంగా చేతులూపుతున్న చిన్నపిల్లల్లా వున్నాయి. అతడు ఆగాడు. అవి కంగ్రాట్స్ చెబుతున్నట్టు ఇంకింత వూగాయి. అతడు నవ్వుతూనే వున్నాడు. తలచుకున్నకొద్దీ ఆ నవ్వు మరింత ఎక్కువ అవుతూంది. బ్యాంకులో తనని ప్రసాదరావు చూడటం- ఆ తరువాత మిలటరీ కాంపౌండ్ లో మరణశిక్ష విధించినట్లు నాటకం ఆడటం- తనని పరీక్షించడంకోసం మరెన్నో ప్రయోగాలు చెయ్యడం- కాంట్రాక్టు కుదుర్చుకోవటం- ఆ ప్రసాద్ గాడి బారినుండి ప్రేమని బైట పడెయ్యటానికి చేసిన ప్రయత్నాలు- చివరికి ప్రేమని ప్రేమలోకి దింపే ప్రయత్నంలో తనే ప్రేమలో పడటం- ఆపైన మానసిక వ్యధ- కొట్టుమిట్టులాడటం.... అంతా సినిమా రీలులాగా గిర్రున తిరిగాయి.

    తనో వెధవ! తన గురువుగారు అంతకన్నా పెద్దవెధవ! అయినా ఇదేం పగ? అభం శుభం తెలియని అమ్మాయికి కడుపు రప్పించి వదిలెయ్యటం.... తృటిలో ఎంత పెద్ద ప్రమాదం తప్పిపోయింది!

    అతడు ఆకాశం కేసి చూశాడు. వర్షం కురిసి తేలికైన పిల్ల మేఘం "హలో" అంది. "హలో" అన్నాడు తిరిగి. అతడికి పిచ్చిగా వుంది. తన ఆనందాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియటంలేదు. లోపలున్న ఒక్క వ్యక్తికి అసలు దీని సంగతేమీ తెలీదు. చెప్తే తెల్లమొహం వేస్తుంది. అందుకే పువ్వుల్తోనూ మేఘాలతోనూ మాట్లాడుతున్నాడు. పక్కనున్న గెస్టుహౌస్ కుర్రవాడికి ఇదంతా, విచిత్రంగా వుంది. అతడు తన అయిదేళ్ళ సర్వీసులో ఇటువంటి జంటని చూడలేదు. అమ్మాయిని లోపల పెట్టి బైట తిరిగే మొగవాడిని. వేణు గుమ్మం దగ్గర నిలబడ్డాడు. వెంటనే లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళితే తన మొహంలో మెరుపు ఇట్టే తెలిసిపోతుంది. ఏమిటని అడుగుతుంది. ఉహు_ చెప్పటానికి ఇదికాదు సమయం. అమ్మో! చెపితే ఇంకేమన్నా వుందా....? ఇద్దరు పిల్లలు పుట్టాక- ఇంటిముందు తోటలో కూర్చుని ఓ సాయంత్రం వేళ టీ తాగుతూ చెప్పాలి. ఆ అమ్మాయిని తామిద్దరూ కలిసి ఎలా మోసం చెయ్యాలనుకున్నదీ చెప్పాలంటే, ముందు తన ప్రేమని నిజంగా ప్రేమ నమ్మాలి. దానికి అంతకాలం తప్పనిసరిగా పడుతుంది.

    అతడు మొహాన్ని చేతుల్తో రుద్దుకున్నాడు. మామూలుగా అయిపోయి, తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించాడు. లోపల గది నిర్మానుష్యంగా వుంది.

    ఆ గదికీ లోపల బాత్ రూమ్ కి మధ్యవున్న తలుపు తెరచి వుంది! అందులోంచి లోపల వాష్ బేసిన్ కనబడుతూంది. దానిముందు గొంతుపట్టుకుని వంగొని నిలబడి వుంది ప్రేమ. ఆమె మొహంమీద చెమట బిందువులు మెరుస్తున్నాయి. తెరిచిన తలుపు సవ్వడికి బలహీనంగా లేచి నిలబడింది. కాళ్ళలోకి సత్తువ తెచ్చుకుని విసురుగా అతడి దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళనిండా నీళ్ళున్నాయి. పెదవులు అదురుతున్నాయి. హిస్టీరియా వచ్చిన దానిలా_ "నువ్వే! అసలిదంతా జరగడానికి కారణం నువ్వే!" అంది అరుస్తున్నట్టు.

    అతడు స్థాణువు అయ్యాడు. ఏమీ అర్ధంకాలేదు. దగ్గరగా వస్తూ "ఏమైంది ప్రేమా?" అన్నాడు.

    "ఆ రోజు నువ్వు నన్ను రెచ్చగొట్టకపోతే ప్రసాద్ తో గెస్టు హవుస్ కి అలా వెళ్ళి వుండేదాన్ని కాదు. ఆ రాత్రి.... ఆ రాత్రి.... అయ్యో.... ఎలా చెప్పను?" ఆమె చేతుల్లో మొహం దాచుకుని బావురుమంది.

    అచేతనావస్థలో సుషుప్తంగా పడివున్న ఎండిన ఆకుల అడుగునించి నెమ్మది నెమ్మదిగా కదిలి ఒక నల్లతాచు బయటికి వచ్చినట్టు ఒక అనుమానం సన్నగా అతడి మనసులో కదిలి, క్షణాల్లో విశ్వమంతా వ్యాపించింది. తానే ఒక చిగురుటాకులా కదిలిపోయి, "....ప్రేమ!" అన్నాడు తడబడుతూ. తరువాత గట్టిగా "ప్రేమా...." అని అరిచాడు దిక్కులు పిక్కటిల్లేలా.

    ఆమె మాట్లాడలేదు. వెక్కి వెక్కి ఏడుస్తూ వుంది.

    వేణు మొహం రక్తం లేనట్టు తెల్లబడింది.

    ఆ రాత్రి గోవాలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. తనని కూడా రమ్మని ఆమె ఆహ్వానించటం, తను రావటం, పైగా ప్రసాద్ తో కలిసి అలా వెళ్ళటం తప్పని ఓ పెద్ద మనిషిలా హెచ్చరించటం, ఆ మాటలకి రెచ్చిపోయి ఆమె బ్యాగ్ పట్టుకుని విసవిసా వెళ్ళటం....

    అందుకే ఆ అర్దరాత్రి బీచ్ గెస్టుహవుస్ లో విసురుగా తలుపు తీసుకుని బయటకొచ్చి తన కారు ఎక్కిందన్న మాట. ప్రసాద్ అంటే మండిపడుతూంది కూడా అందుకే!

    ఆమె వెక్కుతూ అంది- "ఏ సంఘటనయితే పూర్తిగా మర్చిపోదామనుకుంటున్నానో అది నన్ను వెంటాడుతుంది.

    ఏ జ్ఞాపకాల్ని వదిలించుకోవటం కోసం నీతో స్నేహం చేశానో అవి యిక మాయని మచ్చలాగా నాతోపాటే వుంటాయి. నా కళ్ళముందే పెరుగుతాయి. ఏం చెయ్యను- నేనేం చెయ్యను?" చేతుల్లో మొహం దాచుకుని ఆమె రోదిస్తూంది.

    అతడికేం చెయ్యాలో తోచలేదు. అనూహ్యమైన ఈ సంఘటనతో అతడి మెదడు మొద్దుబారిపోయింది.

    ఏ సంఘటనయితే కృత్రిమమైన ప్రేమ పేరిట సృష్టించిన ఆమెనీ, ఆమె కుటుంబానీ ఇరుకున పడేయాలనుకున్నాడో ఆ సంఘటన తమ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. ఇప్పుడొక ప్రశ్నగా మారి తమ ముందే రాక్షసుడిలా నిలబడి ప్రశ్నిస్తూంది!

    అతడు ఆమె దగ్గరగా వెళ్ళి, "పోనీ- ప్రసాద్ ని నిలదీసి అడిగి, పెళ్ళి చేసుకోమంటే...." అన్నాడు. అడిగాడేగానీ తన ప్రశ్న ఎంత అర్ధంలేనిదో అతడికి అప్పుడే తెలిసింది. అతడి అభిప్రాయం నిజమే అన్నట్టు చివ్వున తలెత్తి "వాడి సంగతి నా దగ్గిర పొరపాటున కూడా అనకు" అంది. వర్షించిన నీళ్ళస్థానే కళ్ళలో ద్వేషం ప్రజ్వరిల్లుతూండగా అతడి పేరు వినగానే ఆమెలో కనపడిన తిరస్కారం అతడిని మరి మాట్లాడనివ్వలేదు. అకస్మాత్తుగా అతడికి కొంచెం సేపు ఒంటరిగా వుండాలనిపించింది. అదొక అర్ధంలేని భావం. కానీ అతడికి అలాగే అనిపించింది. ఆమెని వదిలిపెట్టి బయటకు వచ్చాడు.

    క్షణాల్లో ఎంత మార్పు! రెండు నిముషాల క్రితం ఈ ప్రపంచం ఎంత ఆనందంగా వుంది!

    అవే పూలు.... అదే మేఘం!

    యుద్ధకాలంలో రాష్ట్రపతి ప్రసంగం కోసం నిశ్శబ్దంగా కూర్చున్న ప్రజల్లా పూలు- అతడేం చెప్తాడో అన్నట్టు వేచి వున్నాయి. అతడాకాశం వేపు చూశాడు. కదులుతూన్న మేఘం కూడా అతడిని పరామర్శించటం కోసం ఆగినట్టుంది. వంట్లో సత్తువనంతా ఎవరో పీల్చేసినట్టుంది అతడికి.

    ఒక్క చిరునవ్వు, వెయ్యి కన్నీటి చుక్కలు. ఇదేనా ప్రేమంటే.

    అతడు శిలా ప్రతిమలా నిలబడి వున్నాడు- నిశ్చలంగా.

    కానీ ఏదో కదులుతూంది! మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో, ఏ మూలో....

    తను- తను ప్రేమించిన అమ్మాయి- ఆ అమ్మాయికి వచ్చిన ఆపద- వీటి గురించి కాదు అతడు ఆలోచిస్తున్నది. ఎంతో క్రూరంగా కర్కశంగా తాము అమలు చేద్దామనుకున్న ప్లాను సఫలీకృతం అయి వుంటే కొన్నాళ్ళయ్యాక ఈ నిర్భాగ్యురాలయిన అమ్మాయి ఇలాగే ఏడుస్తూ వుండేది. అప్పుడు తను కూడా పక్కన వుండేవాడు కాదు. ఒకతే నిస్సహాయంగా నిర్భాగ్యంగా ఏడుస్తూ వుండాల్సి వచ్చేది. తనూ ప్రసాదరావూ పార్టీ చేసుకుంటూ వుండేవారు.

    అతడు ఈ ఆలోచననే జీర్ణించుకోలేకపోతున్నాడు. తను చెయ్యదల్చుకున్నది తన కళ్ళముందే ఇంత వికృతరూపం ధరించి నిలబడితే, ఆ దృశ్యాన్ని చూడలేకపోతున్నాడు. తనమీద తనకే అసహ్యం వేసింది.

    ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది ఇలా??

    లోపల ప్రేమ ఏడుపు ఆగి ఆగి హృదయ విదారకంగా వినిపిస్తూంది. అది తప్ప అక్కడంతా ప్రశాంతంగా వుంది.

    అంతలో ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ప్రసాదరావు కారు వచ్చి ఆగింది.

    వరండాలో నిలబడివున్న వేణుని చూసి ఆత్రంగా కారు దిగాడు ప్రసాదరావు. దగ్గరకొస్తూ_ "ప్రేమ వుందా లోపల?" అని అడిగాడు.

    వేణు వెంటనే జవాబు చెప్పలేదు. కొద్దిగా ఆగి, "ఏమిటి అసలు విషయం?" అని అడిగాడు.

    ప్రసాదరావు కాస్త రొప్పుతున్నాడు. అప్పటివరకూ అనుభవించిన టెన్షన్ వల్ల వచ్చిన అలసట అది. అతడు తనకీ, జగపతిరావుకీ మధ్య జరిగిన సంభాషణ అంతా వివరంగా చెప్పాడు. చెప్పి, "చూసేవా ఎంతలో ప్రమాదం తప్పిపోయిందో? ఈ విషయమేగానీ ఒక నాలుగు నెలల తరువాత తెలిసివుంటే అప్పటికి పరిస్థితి మన చేతుల్లోంచి పూర్తిగా జారిపోయి వుండేది. అంతవరకూ ఎందుకు? నేను రావటం కొద్దిగా ఆలస్యమయి నువ్వు నీ పని పూర్తిచేసినా, అది వెనక్కి తీసుకోలేనంత తొందరపాటు చర్య అయివుండేది. ఇక దాన్నించి మనం బయట పడలేకపోయి వుండేవాళ్ళం" అన్నాడు.

    "ఎందుకు బయట పడలేకపోయేవాళ్ళం ప్రసాదరావుగారూ?" అడిగాడు వేణు.

    అతడంత తాపీగా ప్రశ్న వేయటంతో ప్రసాదరావు గతుక్కుమని "అదేమిటి వేణూ! నేను నీ వెనక వున్నానని ఆ అమ్మాయికి తెలుసు! జగపతిరవు ఎలాగూ మా పాత పగల గురించి చెప్తాడు. ఆ అమ్మాయి తెలివయినది....ఒకటీ ఒకటీ కలిపి చూసుకుంటుంది. నీకు జ్ఞాపకం ఉందా? నీకు ఉద్యోగం ఇవ్వవలసి వచ్చినప్పుడు ముందు మీ ఫ్యాక్టరీకి ఫోన్ చేసి నీ గురించి కనుక్కుని, ఆ తరువాత తండ్రికి రికమెండ్ చేసింది. అంత తెలివైనది ఆ అమ్మాయి. మరి అటువంటిది ఈ విషయాన్ని ఇక్కడే ఎందుకు వదిలి పెడుతుంది? లోపలికి తవ్వి నిజాన్ని బయటికి తీస్తుంది.

    "ఇప్పుడు మాత్రం ఎందుకు తీయదు?"

    "అమ్మాయి కాబట్టి_సాధారణంగా అంత దూరం ఆలోచించదు. మామూలు ప్రేమే అనుకుంటుంది. ఒకసారి అనుమానం వస్తే కష్టంకానీ, అసలు అనుమానమే రానంతవరకూ ఫర్వాలేదు. అయినా మనం కొంతకాలం వరకూ జాగ్రత్తగా వుంటే చాలు. అందరూ మర్చిపోతారు దీన్ని. అన్నట్టు ప్రేమ ఏది? తన మేనకోడల్ని చూడాలన్న తపన అతడి మొహంలో స్పష్టంగా కనపడింది.

    "ప్రేమ వెళ్ళిపోయింది."

    "వెళ్ళిపోయిందా?"

    "మీరు ఫోన్ లో వివరాలు చెప్పలేదు. పైగా ఇక్కడికి వస్తానన్నారు మిమ్మల్ని తను చూస్తే ప్రమాదం అని చెప్పి పంపించేసేను."

    "సరే, నేను వెళ్తాను. నీకు కారు వుందిగా?"

 Previous Page Next Page