"ఉంది."
ప్రసాదరావు వెళ్ళబోయి, మళ్ళీ వెనక్కి తిరిగి అతడి చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. "వేణూ! నువ్వు చేసిన సాయం ఎంత గొప్పదో నాకు తెలుసు. ఇంకెవరయినా అయితే దీన్ని తమ స్వార్ధానికి ఎంతో బాగా ఉపయోగించుకునేవారు. ఒక రకంగా నా మేనకోడలు అదృష్టవంతురాలు" అన్నాడు.
వేణు మాట్లాడలేదు! జరిగిందంతా మర్చిపో! ఈ క్షణం నుంచీ మన కాంట్రాక్టు రద్దు."
"థాంక్స్!" ముక్తసరిగా అన్నాడు.
"నీ చెల్లెలికి పెట్టిన ఖర్చుకూడా తిరిగి ఇవ్వనక్కరలేదు."
"కృతజ్ఞుడ్ని!"
"ఇదంతా మీ పెళ్ళికి నా మేనకోడలికి నేను యిస్తున్న కట్నం అనుకో!" నవ్వాడు.
"క్షమించండి, అంత అవసరం రాదు."
"ఏం? ఎందుకు రాదు!"
"మూణ్నెళ్ళ క్రితమే ప్రేమని నేను వివాహం చేసుకున్నాను కాబట్టి." వేణు ఆ మాట అంటున్న సమయానికి ప్రసాదరావు రెయిలింగ్ దగ్గిర వున్నాడు. ఆ మాటలకి వెనుకనుంచి ఎవరో తోసినట్టు ముందుకు పడ్డాడు. నమ్మలేనట్లు వేణువైపు చూసి, "నిజమా?" అని అరిచాడు.
"ఒక సంస్కారవంతమైన అమ్మాయిని ఇటువంటి పనికి వప్పించటం నాకు సాధ్యంకాలేదు. ఎలాగయినా మీ పని పూర్తిచేయాలని, ఒక గుడికి తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాను. అఫ్ కోర్స్ సాక్ష్యాలు ఏమీ లేవనుకోండి! ఎలాగూ మోసంచేసి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, పెళ్ళి చేసుకున్నానంటే మాత్రం తప్పేముంది అనుకున్నాను" అన్నాడు.
తడారిన గొంతుతో ప్రసాదరావు "పె.... పెళ్ళి చేసుకున్నావా?" అన్నాడు తడబడుతూ!
వేణు తలూపాడు. "....ఒకమ్మాయిని మోసం చేయాలనుకున్నపుడు సగం చేస్తేనేం? పూర్తిగా చేస్తేనేం?.... ఇంతకాలం నుంచీ తను నాతో ఎందుకింత చనువుగా ఉంటుందనుకున్నారు? నాతో ఇలా వంటరిగా ఎలా రాగలుగుతుందనుకున్నారు? అప్పుడే పెళ్ళి చేసుకున్నాను కాబట్టి...."
కొద్దిసేపటికి ప్రసాదరావు సర్దుకున్నాడు.
"పోన్లే అయిందేదో అయిపోయింది. ఇపుడు మేం మళ్ళీ పెళ్ళి చేస్తాం. ఆకాశమంత పందిరేసి, భూదేవంత పీటవేసి మళ్ళీ...." అన్నాడు నవ్వుతూ.
"నేను చేసుకోను."
ప్రసాదరావు అదిరిపడ్డాడు.
"అవును. మన కాంట్రాక్టు ప్రకారం ఆ అమ్మాయికి గర్భం రావాలి. ఎలా వచ్చినా మీకు అనవసరం. అందుకనే చేసుకున్నాను తప్ప నాకేమీ ఇష్టంలేదు. ఇపుడు వద్దంటున్నారు కాబట్టి నా దారిన నేను వెళ్ళిపోతాను. ఈ పెళ్ళి కూడా కాంట్రాక్టు నాటకంలో భాగమే."
ప్రసాదరావు కంగారుగా- "కానీ నా మేనకోడలు నిన్ను ప్రేమిస్తూ వుందయ్యా! అదీగాక, ఎంత రహస్యంగా చేసుకున్నా పెళ్ళి పెళ్ళే కదా?" అన్నాడు.
వేణు తీక్షణంగా చూశాడు. "ఎవరో మీ పట్ల చేసిన ద్రోహానికి ఒక అమాయకురాలిమీద పగ తీర్చుకోవటానికి సిద్ధపడ్డ మీరు- ఇపుడు ఆ అమ్మాయి మీ మేనకోడలు అయ్యేసరికి రహస్యమైన పెళ్ళిని కూడా సహించలేకపోతున్నారు. ఒక్కక్షణం నిజాయితీగా ఆలోచించండి. మీ ఆలోచన్లెంత దారుణంగా వున్నాయో_ మీ పగలు ఎంత కుత్సితంగా వున్నాయో! ఇవన్నీ గ్రహించే నేను యిందులోంచి ముందే తప్పుకుంటానంటే, నా మీద అన్నివైపులానుంచీ వత్తిడి తీసుకొచ్చారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు కూడా. ఆ అమ్మాయే నీ మేనకోడలు కాకపోయి వుంటే ఏమయిపోయి వుండేదో ఊహించండి. నా దార్న నేను పోయి వుండేవాణ్ని. మీరా ఎదురు మేడమీద కూర్చొని బైనాక్యులర్స్ తో ఆ అమ్మాయి హృదయ విదారంగా ఏడవటాన్ని చూస్తూ ఆనందించేవారు. అవునా?"
"చంపక్యా__ నన్ను చంపకు. ఇపుడు నువ్వు కాదంటే నేను నిజంగా ఆత్మహత్య చేసుకుంటాను. బుద్దొచ్చింది. కావాలంటే లెంపలు-" వేణు నవ్వి "అదేమీ అక్కరలేదు కానీ ముహూర్తాలు పెట్టించండి" అన్నాడు.
8
"నో- ఇది అసంభవం, నేనొప్పుకోను" అరిచింది ప్రేమ.
వేణు కదలలేదు. తాపీగా "ఎందుకొప్పుకోవు ప్రేమా?" అని అడిగాడు.
"అయ్యో!" అంటూ మొహం చేతుల్లో దాచుకుంది ప్రేమ.
"నీకెలా చెప్పను? అయినా....అయినా ఇంత జరిగాక ఈ మచ్చతో నేను.... నేను నీకెలా భార్యను కాను!" అంది.
అప్పటికి అరగంట నుంచీ వారిద్దరి మధ్యా వాగ్వివాదం జరుగుతూంది.
"ఇప్పుడేం జరిగిందనీ.... ఐదో ఆక్సిడెంట్.... అంతే!" తేలిగ్గా అన్నాడు.
"వేణూ!"
"అవును ప్రేమా! ఆ కోణంలోంచి ఆలోచిస్తే ఆరోజు మీరు గెస్టుహవుస్ కి వెళ్ళటం వెనకే నేను రావటం. ఆలస్యమవటం. ఇదంతా ఆక్సిడెంట్ కాదా? పోతే ఇంకోరకం ఆక్సిడెంట్ అయితే కాలగర్భంలో కలిసిపోతుంది. ఇది మాత్రం కాలంతోపాటు పెరుగుతుంది. పెరగనీ- తప్పేముంది?"
"ఎంత తేలిగ్గా చెపుతున్నావు వేణు?"
"ప్రేమా! ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు! పెళ్ళికి ముందు అపురూపసౌందర్యవతి అయిన భార్య పెళ్ళయ్యాక మశూచిపోసి వికృతంగా మారితే ఆమెని భర్త వదిలేస్తాడా? వదిలెయ్యడు వదిలెయ్యలేడు."
"ఎందుకు?"
ఆమె సమాధానం చెప్పలేదు.
"ఎందుకంటే అప్పటికే అభిమానం ప్రేమగా మారుతుంది కాబట్టి. ఇక్కడ మూడుముళ్ళు, పవిత్రత, బాధ్యత లాటి పదాలు విడిచిపెట్టు. వదిలెయ్యాలంటే ఈ మూడు ముళ్ళు_ బాధ్యత ఇవేమీ అడ్డురావు. కేవలం ప్రేమే అడ్డొచ్చి ఆపుతుంది. ప్రేమంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూచుకోవటం కాదు ప్రేమా! ఇద్దరు కలిసి సమస్యని ఒకే కోణంలో చూడగలగటం."
ఆమె దుఃఖం కూడా మర్చిపోయి అతడివైపు చూసింది. దగ్గరగా వచ్చి వెనుక నుంచి నెమ్మదిగా అంది_ "నా మీద నీకు కోపం రావడం లేదా వేణూ? అసహ్యం వేయటంలేదూ? ఇంత జరిగినా ఇదంతా చెప్పకుండా నీతో చెలిమి పెంచుకుంటూ వచ్చాను. ఒకవేళ ఈ విషయం ఈ రూపంలో బైటపడకుండా వుండి వుంటే నేనీ సంగతి ఎప్పటికీ చెప్పేదాన్ని కాదేమో అన్న అనుమానం నీకు రావటంలేదా? ప్రేమలో రహస్యాలుండకూడదంటారు. ఈ విధంగా నేను దీన్ని దాయటం మోసంకాదా? ఇది న్యాయమంటావా?"
"న్యాయాన్యాయాల ప్రసక్తి వస్తే నా తరపునుంచి నీకూ అంతే అన్యాయం జరిగింది ప్రేమా!"
ఆమె తలెత్తి చూసింది.
"ఒకవైపు జరిగిన నిజం చెప్పలేక, మరొకవైపు కొద్దికొద్దిగా ప్రేమలో కూరుకుపోతూ ఇన్నాళ్ళూ ఎంత మానసిక ఘర్షణ అనుభవించానో నేను ఊహించగలను ప్రేమా! ఎందుకంటే.... ఎందుకంటే.... నేనూ అదే పరిస్థితిని ఇంతకాలం అనుభవిస్తూ వచ్చాను కాబట్టి."
"వేణూ!" ఆమె కంఠంలో విస్మయం ధ్వనించింది.
"అవును ప్రేమా! ఇంతవరకూ వచ్చాక, ఇక దాచేదేముంది? ప్రేమలో రహస్యాలుండవు. అంతా విని నీవు ఎలా అర్ధం చేసుకున్నా నీ ఇష్టం" అంటూ చెప్పడం ప్రారంభించాడు. ఒక్కొక్క విషయమే అతను చెపుతూ వుంటే, అతడి కంఠం మంద్రస్థాయిలో వినిపించసాగింది.
మొట్టమొదట బ్యాంకు దగ్గిర ప్రసాదరావు పరిచయమవటం, తనకి మిలటరీ క్యాంపులో పరీక్ష పెట్టటం- అంతా వరసగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇద్దరిమధ్యా కాంట్రాక్టు, జగపతిరావుని ఆస్పత్రిలో చేర్పించి, ఆ నెపంతో ప్రేమ అభిమానాన్ని సంపాదించటానికి ప్రయత్నించటం, గోవా ప్రయాణం ప్రసాద్ అడ్డు తొలగిపోవడం, చివరికి గెస్టుహవుస్ లో అనుకున్న పని పూర్తి చేయబోతూ వుండగా, ప్రసాదరావు పరుగెత్తుకు వచ్చి, ఆమె తన కోడలే అని తెలియబర్చటం వరకూ చెప్పి, "ఇప్పుడు చెప్పు ప్రేమా?" అన్నాడు.
"నీ తప్పేముంది? ఒక మొగవాడి చేతుల్లోంచి తప్పించుకోలేకపోవటం. అంతేగా! కాని, నా విషయానికొస్తే.... ఒకానొక స్టేజీలో నిన్ను నిజంగా ప్రేమించటం మొదలుపెట్టాక, ఎన్ని నిద్రలేని రాత్రులు ఈ సంగతంతా నీకు చెప్పేయాలని అనుకుంటూ వచ్చానో, ఒకవైపు నిండా ప్రేమలో మునిగిపోతూ, మరోవైపు నిన్ను మోసం జేయటానికి ప్రయత్నిస్తూ_ చివరివరకూ వచ్చాక, చేయలేక మధనపడుతూ.... ఇదంతా చెప్తే నీకు అర్ధమవుతుందా ప్రేమా? నమ్మగలవా?" అన్నాడు ఆమెవైపు సూటిగా చూస్తూ.
ఆమె వణికే వేళ్ళతో అతడి చేతుల్ని పట్టుకుని, "నమ్ముతాను వేణూ!" అంది.
అతడు తేలిగ్గా ఊపిరి వదులుతూ "ఏ నిజాయితీతో నువ్వామాట అంటున్నావో, అంతే నిజాయితీతో నేనూ నిన్ను నమ్ముతాను ప్రేమా...." అన్నాడు. "....ఇంతకాలం ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందా అని ఆలోచిస్తూ వచ్చాను. నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలే అని బాధపడుతూ వచ్చాను. అన్నిటికన్నా ముఖ్యంగా, ఇంత మనస్పూర్తిగా నిన్ను ప్రేమించి చివరికి నీ దృష్టిలో ఒక హీనచరితుడిగా మిగిలిపోవాల్సి వస్తుందే- అని బాధపడ్డాను. అది నీ దురదృష్టం కాదు. నన్ను నిరూపించుకోవటానికిదంతా భగవంతుడిచ్చిన అవకాశం."
"కానీ, నాకు నమ్మశక్యం కావటంలేదు వేణూ! ఎలా.... రేప్రొద్దున్న ఈ 'నిజం' పెరిగి పెద్దదయి మనల్ని భయపెట్టదా? చర్చించి సులభంగా వాస్తవం వుంటుందా? ఈ రోజున్న ఆవేశం...."
"ప్రేమా!" ఆమె మాటల్ని మధ్యలో ఆపుచేస్తూ అతడు అన్నాడు కొద్దిక్షణాలు నిశ్శబ్దం. అతడు కిటికీ రెక్కమీద చేయివేసి చూస్తున్నాడు. కదిలే మొక్కలకేసి, వర్షంలో తడిసి, నిశ్చలంగా వున్న గడ్డికేసి చూస్తూ అతడు అన్నాడు- "కనిపించేదంతా నిజంకాదనీ, మిధ్య అనీ కొందరంటారు. అదీ నిజంకాదు. ఒకప్పుడు నేనూ, ప్రసాదరావూ ఎన్నో పుస్తకాలు చదివాము. ఎందరో రచయితలు ప్రేమ ఫలితాన్ని ఎంతో విషాదంగా వర్ణించారు. ప్రేయసికి పెళ్ళయితే తాగుబోతులయిన వారు, ప్రియుడికోసం త్యాగం చేసిన ప్రియురాళ్ళు.... ఇవన్నీ నాచేత ఆ రోజుల్లో చదివించాడు. ప్రేమించటం ఎలాగో నేర్పించాడు. నాకెక్కువ లొకజ్ఞానం లేదు. నాకు సాహిత్యం గురించి కూడా ఎక్కువ తెలియదు. కానీ, నాకు తెలిసిన పరిధిలో నేననుకునే దేమిటంటే మనిషికి ఇంత మెలోడ్రమటిక్ గా బ్రతికే అవసరం లేదని, నిజజీవితంలో నిజంగా ఇంతింత పెద్ద పరిష్కారాలు కావాలా ప్రేమా? ఆలోచించు__ నీకు పుట్టబోయే పాప మనతో పాటు పెరిగి పెద్దదవుతుంది. అంతే దట్సాల్! ఇంత చిన్న విషయానికి తల బ్రద్దలు కొట్టుకోవలసిన అవసరం ఏముంది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే నీతోపాటు నీ మంచీ, నీ చెడు అంతా స్వీకరిస్తున్నానన్న మాట! సంపూర్ణమైన ప్రేమకి నిర్వచనం ఇంతకన్నా వేరే ఇంకొకటి వుంటుందని నేననుకోను."
నీళ్ళు నిండిన కళ్ళతో ఆమె అతడి దగ్గరగా వచ్చి లతలా అతడ్ని అల్లుకుపోయింది.
సరిగ్గా అదే సమయానికి ఫోన్ మ్రోగింది.
తామీ గెస్టుహౌస్ లో వున్నట్టు ఇంకా ఎవరికి తెలిసిందా అనుకుంటూ రిసీవర్ ఎత్తి "హలో" అన్నాడు.
"నేనయ్యా ప్రసాదరావుని" అట్నుంచి కంగారుగా వినిపించింది. "చాలా ఘోరం జరిగిపోయింది."
"ఏమిటి?"
జగపతిరావుకి వ్యాపారంలో యాభై లక్షలదాకా నష్టం వచ్చిందట మనిషి దివాళా తీసాడు.
రిసీవరు గట్టిగా పట్టుకుని వేణు "ఏమిటి?" అరిచాడు.
"ఈ విషయం జాగ్రత్తగా ప్రేమకు చెప్పు. కుటుంబం పూర్తిగా వీధిన పడ్డట్టే.... ఈ వార్తవిని తట్టుకోగలదో లేదో.... పోనీ నువ్వు చెప్పలేకపోతే ఇంటికి తీసుకురా. నేను చెపుతాను."
"అక్కర్లేదు. నేను చెపుతాను."
"పైసా ఆస్తిలేని అమ్మాయి గురించి ఇంకా నీకెందుకయ్యా ఈ బాదరబందీ అంతా మాకొదిలెయ్."
"మీకు నిశ్చయంగా మతిపోయింది. నేను వెంటనే వస్తున్నాను" అంటూ ఫోన్ పెట్టేశాడు. "ఏం జరిగింది" అప్పటివరకూ అటే చూస్తున్న ప్రేమ అడిగింది.