అతడి ఆలోచనల్ని చెదరగొడుతూ "రండి, మీరే నాకు సాయం చెయ్యాలి. నర్సులు లేరు" అన్నాడు సన్యాల్.
ఆ మహా యజ్ఞంలో పాల్గొనడానికి తనూ వంగేడూ పండిత్.
సన్యాల్ కత్తితో రోగి జుట్టు గీసెయ్యసాగాడు.
దాదాపు ఏడు సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ అతడిని పిచ్చి వాడిని చేయడం కోసం అప్పుడు గుండు చేసేడు. అతడిని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యడం కోసం మరో ప్రొఫెసర్ ఇప్పుడు ఇదే పని చేస్తున్నాడు.
పండిత్..... నిజానికి ఈ ఆపరేషన్ కి ఆరుగురు కావాలి. కంప్యూటర్ కి కావాల్సిన వివరాలు అందించేవాడితో సహా ఏడుగురు. నువ్వు ముగ్గురి పని చెయ్యాలి. నేను నలుగురి పని చేస్తాను సరేనా......."
పండిత్ అసంకల్పితంగా తలూపేడు. ఆ గదిలో ఏడు టెలివిజన్ స్క్రీన్ లు వున్నాయి. అన్నిటికి వేర్వేరు పరికరాలు కాకుండా ఇ.సి.జి. శ్వాస, రక్త ప్రసరణం, రెకల్ టెంపరేచర్, పెరిఫెరల్ ఆల్జీరియల్ ప్రెజర్ అన్నీ ఒకే టెలివిజన్ లో కనబడడం డాక్టర్ కి సాయం చేస్తూంది. సైన్సు సాధించిన మరో అద్బుతమైన విజయం అది. ఇంకా కొంతకాలం పోతే డాక్టర్స్ అవసరం లేకుండా కంప్యూటర్లే ఆపరేషన్ చేస్తాయేమో.
పండిత్ వాచీ చూసుకున్నాడు.
సన్యాల్ గుండు గీయడం పూర్తి అయింది. రోగి కుర్చీలో నస్త్రాణంగా......రిలాక్స్ డ్ గా పడుకుని వున్నాడు. అతడి గుండు మీద నల్ల ఇంకుతో "X" మార్కు వేశాడు. రోగి శరీరానికి టెలివిజన్ కంప్యూటర్లు వైర్లు అమర్చటానికి అయిదు నిమిషాలు పట్టింది. మనిషి శరీరం నుంచి వైర్లు బయటకొచ్చినట్టు వుంది.
ఉన్నట్టుండి టెలివిజన్ పని చేయడం ప్రారంభించింది. గుండె చప్పుడు -వంకర గీతల్లో స్పష్టంగా కనబడుతూంది. శ్వాస తాలూకు వివరాలూ, టెంపరేచర్ -అన్నీ తెరమీద కనబడ్తున్నాయి. అయిదు సెకన్లకొక సారి టెలివిజన్ లో బొమ్మ కనబడుతూంది.
అనెస్తిటిస్టు లేడు సన్యాలే ఎనస్టీషియా యిచ్చాడు. సూది గుచ్చీ గుచ్చగానే టెలివిజన్ తెరమీద Operation Begun అన్న పదాలు వాటంతటవే రావడం అపూర్వమైన దృశ్యం.
"ఎక్స్ -రే" అన్నాడు సన్యాల్. కాలితో మీట నొక్కేడు. ఏడు టెలివిజన్స్ లోనూ రోగి కపాలం ఏడు భిన్న కోణాల్లో కనబడింది.
నన్యాల్ చేతిలోకి 2 యం.యం డ్రిల్ తీసుకున్నాడు. వడ్రంగి స్క్రూ బిగించే ముందు చెక్కకి కన్నం పెట్టటం కోసం వాడే బర్మాలా వుందది సన్నటి శబ్దంతో రోగి తలమీద రెండు రంద్రాలు చెయ్యబడ్డాయి.
ఒకప్పుడు ఇదంతా ఒక తలనొప్పి వ్యవహారం. సరిగ్గా ఎక్కడ ఆపరేట్ చెయ్యాలో మాటిమాటికి ఎక్స్ రేని సంప్రదించడం. ఇప్పుడలా అవసరంలేదు. అసలింకొంత కాలం పోతే లేసర్ బీమ్ ల సాయంతో శరీరం కొయ్యకుండానే అన్ని ఆపరేషన్ లూ చెయ్యవచ్చేమో.
సన్యాల్ పండిత్ వైపు తిరిగి. ఇవ్వమన్నట్టు సైగచేసేడు.
పండిత్ ట్రే వైపు చూసేడు.
ట్రే మధ్యలో వుంది -పోస్టల్ స్టాంప్ అంత బిళ్ళ వుంది. సాలె పురుగులా దాని నుంచి ఇరవై వైర్లు బయటికి వచ్చినయ్. పండిత్ కి తెలుసు. పైకి బిళ్ళలా కనబడ్తున్నా దాన్ని మైక్రోస్కోప్ లో చూస్తే కొన్ని వందల కనెక్షన్లు కనబడతాయని
ఇంకొద్ది క్షణాల్లో ఆ బిళ్ళ అతడి శరీరంలో ఒక అంగంగా శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటుందని. అతడి చితిమీద అతడితో పాటు అంతమై పోతుంది.
కపాలపు రంధ్రంలోంచి ద్రవం కొద్దిగా బయటకు వచ్చింది. మెదడుని భద్రపరచడానికి ఒక ఇనప్పెట్టెలాటి కపాలాన్ని సృష్టించి అది చాలదని తెలుసుకుని, ఈ ద్రవాన్ని కూడా పోసినట్లున్నాడు దేముడు.
పండిత్ ఒకటి గమనించేడు.... మనిషిని నవ్వించేది, ఏడిపించేదీ, బాధల్ని రవాణా చేసేది అయిన మెదడు. తనకి కలుగుతున్న బాదల్ని మాత్రం గమనించలేదు.
చిన్న తపాళా బిళ్ళ ఆకారంలో ఉన్న కంప్యూటర్ ని సన్యాల్ చేతుల్లోకి తీసుకున్నాడు. రోగి తల రంధ్రం గుండా లోపలికి చొప్పించేడు. రోగి కొద్దిగా కదిలేడు