Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 35


    "ఓ గాడ్! పాపం! ఇంతమంది అమాయకులకి కంటిచూపు పోగొడితే ఎవరికేం వస్తోందీ?"
    "ఏం రాదు. కానీ, ఆ అమాయకుల మనసుల్లో భయం పేరుకుంటుంది. మరోసారి దిబ్బ తవ్వటానికి సాహసించరు"
    "దిబ్బ తవ్వటం వల్ల..."
    వాక్యం పూర్తి చెయ్యలేదు రవి. అతడికే అర్థమయిపోయింది.
    ఇక్కడేదో జరుగుతోంది! తమ స్వార్థ ప్రయోజనాల కోసం అనేకమంది కంటిచూపు పోయినా లక్ష్య పెట్టని కర్కోటకులున్నారిక్కడ! దేవి ఎవరో, ఎవరి పక్షమో, తనకెందుకు సహాయం చేస్తోందో అర్థం కావటం లేదు. దేవి చెప్పదు. తనే తెలుసుకోవాలి!
    "ఇవి నీకు బహుమతిగా ఇస్తున్నాను. నా పాదాల దగ్గిర ఉన్నాయి, తీసుకో!"
    అప్పుడు చూశాడు రవి, దేవి పాదాల దగ్గిర. స్కూటర్ నడిపేటప్పుడు పెట్టుకునే హెల్మెట్ లాంటిది ఒకటి. ఏ లోహంతో తయారుచేశారో తెలియని అయిదు పళ్ళేలూ ఉన్నాయి.
    "ఇవి దేనికి?"
    "హెల్మెట్ లాంటిది పెట్టుకుంటే నీకు దివ్యవాణి వినిపిస్తుంది. ఈ పళ్ళేలు నువ్వు ఆహారం తినటానికి! ఇకముందు ఈ పళ్ళాలలో తప్ప నువ్వు ఆహారం తీసుకోవద్దు!"
    "ఎందుకలా?"
    "ఈ ప్లేట్లలో ఏ రకమైన విషాహారం పెట్టినా ఇవి వెంటనే పగిలి ముక్కలయిపోతాయి."
    రవికి చటుక్కున అతను ఆగ్రా మ్యూజియంలో చూసిన ప్లేట్ గుర్తొచ్చింది. అది మొగలాయి రాజులు వాడిన ప్లేట్. దానికింద రాశారు. విషాహారము సోకితే రంగు మారిపోతుంది. లేదా పగిలిపోతుంది అని. సంభ్రమంతో చూశాడు ఆ ప్లేట్స్ వంక.
    "ఇవి చాలా ప్రాచీన కాలానివి. శాతవాహన కాలానివి కాకపోవచ్చును. కానీ ఆ తర్వాత రాజవంశీకులెవరో వాడినవి. అప్పుడు తప్ప ఇప్పుడు ఇలాంటి ప్లేట్స్ లేవు. ఇవి ఏ లోహంతో తయారుచేశారో, ఇంతవరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. నీకెలా దొరికాయి ఇవి?"
    "మంచి ఆర్కియాలిజిస్ట్ వే నువ్వు! అవును. ఇవి ప్రాచీన కాలానివే! క్రీ.పూ. ఒకటవ శతాబ్దికి చెందినవి. ఇక్కడ నువ్వు ఉపయోగించుకుని ఆ తర్వాత గవర్నమెంట్ కి అప్పగించుకోవచ్చు. చేతనయితే వీటిమీద ఒక పేపర్ కూడా రాసుకోవచ్చు. ఒక హెచ్చరిక! ఇక ముందు రాత్రి సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ హెల్మెట్ లేకుండా వెళ్ళకు! ఇంక నువ్వు వెళ్ళొచ్చు."
    "ఒక్క ప్రశ్న! ఈ ప్లేట్స్ నీకెలా దొరికాయి? ఎక్కడ దొరికాయి? అది ముఖ్యం నాకు!"
    అప్పటివరకూ మౌనంగా ఉన్న కాషాయాంబధారి కల్పించుకుని అన్నాడు "నువ్వు వెళ్ళొచ్చు" అన్నాడు. దేవి ఇంక మాట్లాడదు. మనం వెళ్దాం లెండి!"
    పాడుబడ్డ కోటని పరిశీలనగా చూస్తూ నడిచాడు. చాలాచోట్ల సొరంగమార్గాలున్నాయి. పాతకాలపు విరిగిపోయిన తలుపుల స్థానంలో ఇటీవలే బాగుచేయించినట్టుగా ఉన్న కొత్త తలుపులున్నాయి.
    అన్ని గదులకీ తలుపు లేవు. వెనుకటిలాగే కోట దాటి బయటికి రాగానే అగడ్తమీదుగా ఉన్న ఇనుప తలుపు పైకి లేచిపోయింది.
    వెనుకటిలాగానే ఆకాశమార్గానే కర్ర బెంచీ మీదనే ప్రయాణం చేశాడు. కళ్ళ గంతలతో ఈసారి దారిలో వినిపించే శబ్దాలన్నీ అతి జాగ్రత్తగా విన్నాడు. ఒకచోట కోతుల కిచకిచలు వినిపించాయి.
    సందేహం లేదు. ఎక్కడో నీటి వసతి ఉండి తీరాలి. ఇక్కడెక్కడా నదులు కానీ, కాలువలు కానీ లేవే? తెలుసుకోవాలి!
    కర్ర బెంచీ నేల మీదకి దిగింది. వెనుకటి లాగానే మూడు కాలి బాటల కూడలి దగ్గిర వదిలేసి వెళ్ళిపోయాడు కాషాయాంబధారి.
    నిర్జనంగా ఉంది నృసింహస్వామి లోయ. హెల్మెట్, ప్లేట్స్ ఉన్న సంచి కొద్దిగా బరువుగా ఉంది. నృసింహస్వామి విగ్రహాన్ని మరోసారి దగ్గిరనుంచి చూడాలని దేవాలయానికి గర్భగుడిలోకి అడుగుపెట్టబోతుండగా వినిపించింది హృదయ విదారకమిన రోదన ధ్వని-ఎవరో అబల ఆగి ఆగి ఏడుస్తున్న ధ్వని.
    ఒక్క క్షణం ఆగి లోపలికి వచ్చేశాడు. తన కళ్ళని తను నమ్మలేకపోయాడు. మోకాళ్ళలో తల పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న త్రిసికి!
    అడుగుల చప్పుడు విని త్రిసికి తల ఎత్తింది. కళ్ళు రెండూ మంకెన పువ్వుల్లా ఉన్నాయి. దారుణమైన వ్యధ స్పష్టంగా ప్రతిఫలిస్తోంది ఆ కళ్ళలో. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కొన్ని క్షణాలు మౌనంగా... త్రిసికిని అలా చూడలేకపోయాడు రవి.
    "ఎందుకు బాధపడుతున్నారు? నేను చెయ్యగలిగిన సహాయమేదైనా వుంటే చెప్పండి చేస్తాను"
    త్రిసికి తన కళ్ళు తుడుచుకుని, పేలవంగా నవ్వి అంది "పిసా ఇమందే సంర్క్భంతి. తుమ్హాణం అణుయరాణాంగ ఇద్దిటాక్ఖు సత్తరం అవేహి"
    ఏం మాట్లాడుతోంది త్రిసికి?
    "పిశాచాలు ఈ ప్రదేశాన్ని కాపాడుతున్నాయి. నీ అనుచరులకి పట్టిన గతి చూశావు కదా! త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో" చిత్రంగా త్రిసికి మాటలలో భావం స్ఫురించింది. రవికి ఇంతకుముందు లేనిది, ఇప్పుడు త్రిసికి మాటలలో భావం ఎలా స్ఫురించింది? ఇంతకూ త్రిసికి మాట్లాడుతున్నది ఏ భాష? ఎందుకిలా మాట్లాడుతోంది?
    త్రిసికి మాట్లాడుతున్నది ఏ భాషో ఇప్పటికీ రవికి అర్థం కావటం లేదు. ఆ భాషలో అతడు మాట్లాడలేదు. మరొకరు మాట్లాడుతుండగా కూడా వినలేదు. అలాంటప్పుడు ఆ మాటలకి అర్థం ఎలా స్ఫురించింది? ఆ విషయమే ఆలోచించగా ఆలోచించగా మెరుపులా స్ఫురించింది.
    చాలాకాలం క్రితం- గ్రాడ్యుయేషన్ లో ఉండగా మొదటినుంచీ ఆర్కియాలిజీలో ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా పాతకాలపు శాసనాలూ, ఆయా విశేషాలూ పరిశీలిస్తున్న రోజుల్లో-కేవలం శాసనాలు అర్థం చేసుకోవటం కోసం కొన్ని ప్రాకృత భాషా భేదాలు సరదాగా నేర్చుకున్నాడు. సంస్కృతంలో కాని, ప్రాకృతంలో కాని.
    ఇక ఇంట్రెస్ట్ లేక ఆ స్టడీ అక్కడితోనే వదిలేశాడు. ఆ పరిజ్ఞానం ఇంకా ఏదో పూర్వజన్మ స్మృతిలాగ తన మస్తిష్కపు అడుగు పొరలలో ఉండి ఉంటుంది. త్రిసికి చాలా అరుదుగా చిన్న చిన్న వాక్యాలు మాట్లాడుతుంది. అందుచేత వెంటనే అర్థం స్ఫురించలేదు. తన మనసు తనకు తెలీకుండానే ఆ మాటల అర్థం గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటుంది.
    ఒక్కొక్కసారి, మనం ఏదో కథ లేక పాట వింటాం. అది ఎక్కడో ఇదివరకు విన్నట్లే అనిపిస్తుంది కానీ, ఎక్కడ, ఎప్పుడు విన్నామో మరిచిపోతాం! ఆ విషయం వదిలేస్తాం. కానీ, ఒకటి రెండు రోజుల తర్వాత ఏ పని చేస్తున్నప్పుడో సడన్ గా మనకు స్ఫురిస్తుంది. అది ఎక్కడ, ఎప్పుడు విన్నామో!
    అంటే, అప్పటివరకూ మనకు తెలీకుండానే మన పని మనం చేసుకుంటూనే, మనసులోపలి పొరలలో ఎక్కడో దాని గురించి ఆలోచిస్తున్నామన్నమాట!
    త్రిసికి మొదటినుంచీ మాట్లాడిన మాటలు గుర్తుతెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు రవి.
    మొట్టమొదటిసారిగా కొండ గుహలోకి వెళ్ళి వ్యాళాసుర, వ్యాఘ్రాసుర శిల్పాలను చూసి వచ్చినప్పుడు మాట్లాడింది.
    "మూద్దా! మహారాణీ పడిసురాణీ అమ్హి? అణవేమి తుమం! కహింపినిగ్గస్స! అణ్ణహపమెజె బవిస్సఇ!" ఈ వాక్యాలకు అర్థం, బహుశా -
    "మూర్ఖా! నేను మహారాణి పద్మరాణిని-ఆజ్ఞాపిస్తున్నాను. వెంటనే ఇక్కడినుంచి వెళ్ళిపో? లేకపోతే ప్రమాదం తప్పదు" ఈ మాటలు రెండు మూడుసార్లు అంది త్రిసికి. అంచేత చాలా బాగా గుర్తుకొస్తున్నాయి. డైరీలో రాసుకున్నాడు కూడా.
    పద్మరాణి ఎవరు? త్రిసికి తాను మహారాణి పద్మరాణినని చెప్పుకోవటం ఏమిటి? కొంచెంసేపు ఆలోచించగానే స్ఫురించింది. పద్మరాణి "పులిముగ్గు" నవలలో సుశర్మ మహారాజు భార్య పేరు పరిసరాలు మరిచిపోయి గట్టిగా నవ్వేశాడు రవి.
    విశ్వనాధ నవలలో యదార్థం కంటే కల్పన ఎక్కువ. సుశర్మ మహారాజు చరిత్ర ఏ శాసనాలలోనూ స్పష్టంగా తెలియటం లేదు. ఇంతవరకు మగధరాజు ఆంద్ర శాతవాహనరాజుల చేతులలో ఓడిపోయాడు అని తప్ప-అలాంటిది విశ్వనాథ ఇటీవలి కాలంలో కల్పించి రాసిన సుశర్మ భార్య పేరునే తన పేరుగా త్రిసికి చెప్పుకోవటం ఏమిటి?
    లేక సుశర్మ భార్య పేరు పద్మరాణిగా విశ్వనాథ ఊహించటానికి పురాణాలలో ఏమైనా ఆధారాలున్నాయా? మొత్తం మీద దీని సారాంశం, కొన్ని వేల ఏళ్ల క్రిందటి సుశర్మ మహారాజు భార్య ఆత్మ ఈ ప్రదేశంలో తిరుగుతూ, ఇక్కడ పిశాచాలను కాపలా పెట్టి ఈ ప్రాంతాలను కాపలా కాస్తోంది.

 Previous Page Next Page