Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 35

  

         సాహితి వెళ్ళేసరికి పరమహంస పూజలో వున్నాడు. లక్ష్మి వచ్చి పలకరించింది. ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేసింది. వద్దు అంటున్నా బలవంతంగా కాఫీ తెచ్చి ఇచ్చింది.
   
    "ఏదయినా పనిమీద వచ్చావా? లేకపోతే అసలు రావులే".
   
    "అవునండీ! మమ్మీ చెక్ తీసుకుని డబ్బు తీసుకురమ్మంది".
   
    "ఎంత కావాలేమిటి? నా దగ్గరుందేమో ఇస్తాను. ఆయన పూజ ఇప్పట్లో తెమిలేలా లేదు."
   
    "అయిదు వేలు కావాలండీ."
   
    "అయిదు వేలే! అంత ఖర్చు పెడతారా మీ ఇంట్లో? ఏం చేస్తారు?" ఆశ్చర్యంగా అడిగింది.
   
    "ఏమోనండీ నాకు తెలియదు. మమ్మీ తీసుకురమ్మంది" ఇబ్బందిగా కదిలింది సాహితి.
   
    "ఖర్చులు కాస్త తగ్గించుకోవడం మంచిదేమో! ఉన్నది ఇద్దరు.....అంతమంది నౌఖర్లు దేనికి? నేను రెండువేలకి మించి ఖర్చు చెయ్యను. అయినా మీ అంకుల్ తిడుతూనే వుంటారు. మీ మమ్మీ అడిగితే అయిదూ, పదివేలూ యిచ్చేస్తారేమోలే-అయినా నాకెందుకు? వెళ్ళి ఏదో చెప్తావు. ఆవిడ ఈయనకు చెప్తుంది. వచ్చి నన్నే అంటారు" నిష్టూరంగా అంది. సాహితి తెల్లబోయింది. ఎవరు ఎవరిమీద ఆధారపడ్డారో ఆమెకు అర్ధం కాలేదు "....ఆయన్ని అడుగుతున్నది మా డబ్బే-కొన్ని లక్షల ఆస్థి! అంతా ఆయన చేతుల్లో పెట్టాం. అందులోంచి ఇమ్మని అడుగుతున్నాం" అందామనుకొని కంట్రోలు చేసుకుంది సాహితి.
   
    "ఏమిటో! రోజంతా కష్టపడతారు. తనకోసం ఓ వెయ్యి రూపాయలు ఖర్చుపెట్టుకొమ్మంటే వినరు.....రోజుకి అయిదారు గంటలు పూజలో వుంటారు కదా- ఆ గది ఏ.సి. చేయించుకోండి అంటే ఒప్పుకోరు. మీ మమ్మీనయినా చెప్పమను- ఆవిడ చెప్పిన మాట కాదనరు. డబ్బుకూడా ఆవిడ చెబితే బాగానే ఖర్చుపెడతారు."
   
    సాహితికి దుఃఖం ముంచుకొస్తోంది. తడి కత్తితో గొంతు కొయ్యడమంటే ఇదే కాబోలు.
   
    "నీ పెళ్ళి కూడా చెయ్యాలి కాబోలు, కాస్త పొదుపుగా వుంటే మంచిదేమో అయినా భయం లేదులే. మీ మమ్మీ అడిగితే ఎవరూ కాదనలేరు. మీ అంకుల్ నీ కోసం లక్షలు ఖర్చు పెట్టమన్నా పెట్టేస్తారు."
   
    సాహితి ఇక వినలేక పోయింది. చెప్పకుండా వచ్చి కార్లో కూర్చుంది. ఆమె సంగతి అర్ధం చేసుకున్నట్లు యింటివైపు పోనిచ్చాడు డ్రైవర్.
   
    సాహితి వచ్చేసరికి ఇంటికి ఫోన్ వచ్చినట్టుంది.
   
    "ఏమిటి సాహితీ! అంతవరకు వెళ్ళి అంకుల్ ని కలవకుండా వచ్చేశావా? ఇదివరకు ఒకసారి జరిగిన గొడవ సంగతి మర్చిపోయావా? ఎందుకలా చేశావు? నేనేం సమాధానం చెప్పుకోను?" అని నిర్మల వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది.
   
    "మమ్మీ! నువ్వెందుకు ఏడవటం? ఆవిడ ఎన్ని మాటలు అందో తెలుసా?"
   
    "ఎందుకు వెళ్ళినప్పుడల్లా ఆవిడతో వాదం వేసుకుంటావు?"
   
    "నేనేం వాదన వేసుకోలేదు. అసలు నోరు విప్పలేదు - ఆవిడే వాళ్ళ ఆస్థి అంతా మనం తింటున్నట్లు మాట్లాడింది. వినలేక వచ్చేశాను."
   
    "ఆవిడలా అనుండదు. నువ్వే అపార్ధం చేసుకుంటున్నావు.....ఇదివరకు అలాగే చేశావు- మళ్ళీ వెళ్ళు సాహితీ! నా మీద ఏ మాత్రం అభిమానం వున్నా వెళ్ళిరా. లేకపోతే నా శవాన్ని చూస్తావు" ఆవిడ ఏడుస్తూ గదిలో కెళ్ళి గొళ్ళెం పెట్టేసుకుంది. సాహితి నిద్రలో నడుస్తున్న దానిలా తిరిగివచ్చి కార్లో కూర్చుంది. సవతులిద్దరూ యింత ఐక్యంగా తనలాంటి అల్పప్రాణి మీద విరుచుకు పడడం ఆమెని అయోమయంలో పడేసింది. ఈసారి లక్ష్మి కనిపించలేదు. హాల్లోనే పరమహంస వున్నాడు.
   
    "ఏమ్మా పూజలోంచి లేచి రావడం ఆలస్యం అయితే కోపం వచ్చేయాలా?" నవ్వుతూనే అని డబ్బు అందించాడు. "క్యాష్ వుందిలే పట్టుకెళ్లు-కాలేజీకి టైమవుతోంది."
   
    డబ్బు తీసుకొచ్చి నిర్మల చేతిలో పెట్టింది. అప్పటికే వార్త అందిందేమో ఆవిడ మొహం సంతోషంతో వెలిగిపోతోంది.
   
    సాహితి భోజనం అయినా చెయ్యకుండా కాలేజీకి వెళ్ళి పోయింది. మొదటి క్లాసే ప్రాక్టికల్స్ ఏం చేస్తోందో, ఏం చెయ్యాలో తెలియటం లేదు. పిప్పెట్ తో కాన్ సేన్ ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ ఆసిడ్ తీసింది. బీకర్ లో వెయ్యబోతూ ఆగింది. దాన్ని చేతిమీద పెట్టి పైనుంచి వేలు తీసింది బుసబుసమని చప్పడు ఆపైన మాంసం కాలుతున్న వాసన. అయినా సాహితి నోటివెంట బాధ బయట పడలేదు. ఆ గాయన్నే చూస్తూ ఇంటికి వచ్చింది. తన గదిలోకి వచ్చి ఏడుస్తూ కూర్చుంది. ఆ గాయాన్నే చూస్తూ ఇంటికి వచ్చింది. తన గదిలోకి వచ్చి ఏడుస్తూ కూర్చుంది. ఎప్పుడొచ్చాడో తెలీదు.
   
    "ఏడుస్తున్నావా! ఛ తప్పుకదూ!" అంటూ పరమహంస ఆమె దగ్గరగా వచ్చాడు. భుజాల మీదుగా చెయ్యివేసి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. "నీ గురించి నాకు తెలుసమ్మా ఇంకా పెళ్ళి మీదకు ధ్యాస మళ్ళలేదు. నీకు అది తప్పుకాదు. సహజం" ఆమె బుగ్గలమీద నీళ్ళు తుడిచాడు. "నా బంగారు తల్లివికదూ! అలా ఏడవకూడదు. ఇకపైన ఏమున్నా వచ్చి నాతో చెప్పాలి సందేహించకు" అంటూ చెయ్యి ఆమె వీపు మీదకు జార్చి అనునయంగా రాస్తూ నెమ్మదిగా అన్నాడు. "సాహితీ! నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ!"
   
    లక్ష వోల్టుల ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు, అంత బాధలోనూ ఆమె తలెత్తి చూసింది. అతడామెను చూడటంలేదు. శూన్యంలోకి చూస్తూ "నేను నీ నోట్ బుక్ లో చదివాను. నీ అభిప్రాయం తెలిసింది. అంతకుముందే దేవుడు కూడా నాకు చెప్పాడనుకో. నిన్ను అర్ధం చేసుకోగలిగేదీ, నిన్ను లాలించగలిగేది నేనే. నిర్మలకు ఈ విషయం నువ్వు చెప్పకు..... నేనే చెపుతాను. తాను కాదనదు.... దేవుడి నిర్ణయం అలా వుంటే తను మాత్రం ఎందుకు కాదంటుంది....?" అని వంగి ఆమె నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు. ప్రతిఘటించడానికి కూడా ఓపికలేనట్టు ఆమె శిలా ప్రతిమలా ఉండి పోయింది.
   
                              3
   
    సూర్యుడి ఆగమనానికి చిహ్నంగా తూర్పు దిక్కు దారంతా ఎరుపు తివాచీ పరుస్తోంది. విశ్వపతి యింటిముందు మొక్కల మధ్య కూర్చున్నాడు. పక్కనే ట్రాన్సిస్టరులోంచి మంద్రస్వరంతో భక్తిరంజని వినిపిస్తోంది.
   
    గేటు దగ్గర రిక్షా ఆగిన చప్పుడుకి కళ్ళు తెరిచాడాయన. పావని, భాస్కరరామ్మూర్తి సామానుతో దిగుతున్నారు. సంతోషంతో విశ్వపతి కళ్ళు చెమర్చాయి. అల్లుడు తన కోరిక తెలిసినట్లు పావనిని తీసుకురావడం అతడిలో కృతజ్ఞతాభావం కలిగించింది. దగ్గరకు వచ్చి పావనిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. పావని కాస్త చిక్కిపోయినట్లు కనిపిస్తోంది. అయినా ఆమె కళ్ళలో సంతోషపు వీచికలు చూస్తే కడుపు నిండి పోతోంది.
   
    "ఉత్తరం వ్రాస్తే స్టేషనుకి వచ్చేవాడినిగా."
   
    "బావుంది మామయ్యా! మేమేమన్నా చిన్నపిల్లలమా లేక ఇదేమన్నా కొత్త ప్రదేశమా? మిమ్మల్నందరినీ చూడాలనిపించి వచ్చేశాము" అన్నాడు మూర్తి. ఆ సమాధానం విశ్వపతి సంతోషాన్ని రెట్టింపు చేసింది.
   
    "మంచి పని చేశారు. చాలా సంతోషం" ఆయన హడావిడి చేస్తున్నాడు.
   
    రెండు రోజులు హాయిగా గడిచిపోయాయి. మర్నాడు మొదలుపెట్టాడు భాస్కరరామ్మూర్తి.
   
    "పావనీ! మీ నాన్నగారు యిప్పుడు కాస్త తేరుకున్నట్లున్నారు కదూ."
   
    "అవునండీ! కాలం మాన్పాల్సిన గాయం కదా. సంవత్సరం కావస్తోంది అమ్మ పోయి."
   
    "అబ్బ అదికాదు. ఆర్ధికంగా కాస్త బావున్నట్లు వున్నారు కదూ, కొత్త సామాన్లు కొన్నారు. అప్పులు కూడా తీర్చేసినట్లున్నారు."
   
    "అవునండీ! నా పెళ్ళికి ఖర్చుపెట్టలేదుగా. దాంతోటే చాలా కోలుకున్నారనుకుంటా. ఆ విషయంలో మీ ఉపకారం ఎప్పటికీ మర్చిపోలేనిది" మనస్ఫూర్తిగానే అంది పావని.
   
    "అదికాదు పావనీ! అప్పట్లో ఏదో వద్దన్నాను. కారణం వేరే వుందనుకో నాకేదో డబ్బు వస్తుందని నమ్మాను. దానితోటే పెళ్ళికి చాలా ఖర్చు పెట్టాను. అప్పులు చేశాను. ఇప్పుడవన్నీ ఎలా తీర్చాలో తెలియడంలేదు. అప్పుల వాళ్ళనుంచి తప్పించుకు తిరగడం గగనమైపోతోంది. అసలీ ప్రయాణం పెట్టుకుంది కూడా వాళ్ళకు భయపడే. నీకు తెలియదు పావనీ ఎంత నరకం అనుభవిస్తున్నానో" అతడి కంఠం రుద్దమయింది.
   
    "అయితే యిప్పుడెలాగండీ?" పావని భయంగా అడిగింది.
   
    "మీ నాన్నను అడగటం తప్ప వేరే మార్గం కనిపించటం లేదు."
   
    "నాన్ననా? ఆయన దగ్గర అంత డబ్బు ఎక్కడిది?"
   
    "చూడు పావనీ! మీ నాన్నను యిబ్బంది పెట్టటం నా వుద్దేశ్యం కాదు. ఓ పాతికవేలు కట్నం కావాలని పెళ్ళికి ముందుగా అడిగితే ఏం చేసేవాడు?"
   
    పావని ఆలోచించింది "తప్పకుండా ఇచ్చేవాడు" ఒప్పుకుంది. అందరూ లక్షల్లో అడిగారు మరి.
   
    "అదే నేననేది. అవసరం వస్తుందని తెలియదు కాబట్టి అప్పుడు అడగలేదు. ఇప్పుడు యిబ్బందిలో వున్నాను. అడగటంలో తప్పేమిటి? అప్పటికే అక్కయ్య వాళ్ళను అడిగాను. 'ఆదర్సానికి పోయి కట్నం తీసుకోక యిప్పుడు మమ్మల్ని అడుగుతావేం' అని కోప్పడ్డారు. ఇప్పుడిక ఎవర్ని అడగను చెప్పు."

 Previous Page Next Page