"అలాగే అన్నయ్యా! రమ్మని చెబుదాం ముందుగా పరమహంస గారికి చెప్పాలి కదా" అంది నిర్మల.
ఆ సాయంత్రం పరమహంస వచ్చాడు. నిర్మల అన్నయ్యను ముక్తసరిగా పలకరించాడు.
"నిర్మలా! ఈ రోజు ఏకాదశి. మనం పూజలో కూర్చోవాలి పద" అన్నాడు.
నిర్మల వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది. ఆయన వెనకే అనుసరించాడు! రెండు గంటలసేపు లోపల పూజ జరిగింది. సాహితి కోపంతో, బాధతో పెదవి నొక్కిపెట్టింది. బంధువులు ఎవరొచ్చినా ఇదే తంతుగా పరమహంస ప్రవర్తిస్తుంటాడు. అతడి ఈగో ఆ రకంగా తృప్తి పరుచుకుంటాడు.
భోజనాల సమయానికి ఇద్దరూ బయటకు వచ్చారు. నిర్మల మొహంలో అలసట, కళ్ళల్లో మాత్రం తృప్తి పెద్దమావయ్య ఆమెవైపు కాస్త అనుమానంగా చూడటం గమనించింది సాహితి. సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడి పోయింది.
భోజనాలు చేస్తుండగా ఆయన తిరిగి ఆ ప్రస్తావన తెచ్చాడు.
"అలాగా! మంచి సంబంధం అంటున్నారు. జాతకాలు చూడకుండా ఎలా చెప్పగలం? తెప్పించండి చూసి చెబుతాను" అన్నాడు పరమహంస.
"జాతకమా? మా ఇంట్లో ఇంతవరకూ అలాంటి ఆచారం ఏదీ లేదు పరమహంసగారూ!"
"ఇన్నాళ్ళూ జరిగినదాని గురించి నేను చర్చించటం లేదు. మీకు నమ్మకం లేకపోవచ్చు. నా అభిప్రాయం అడిగారు కాబట్టి చెబుతున్నాను. జాతకాలు కలవకుండా పెళ్ళిళ్ళు చేయడం అనర్ధాలకు దారితీస్తుంది. ఇది వాళ్ళిద్దరికీ సంబంధించినదే కాదు. పుట్టబోయే పిల్లలకు కూడా ఆ పైన మీ ఇష్టం" అన్నాడు.
నిర్మల కల్పించుకొని "అలా మాట్లాడకండి. మీరు చెప్పాక కాదనే ప్రశ్నేలేదు. మీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏ పనీ జరుగదు. అన్నయ్యా! వాళ్ళ దగ్గర జాతకం అడిగి తీసుకురా" అంది.
"అలాగేనమ్మా! ఉందేమో అడుగుతాను" అన్నాడాయన. ఉబలాటం అంతా తగ్గిపోయింది. ఈ ఇంట్లో తన స్థానం ఏమిటో అర్దమయినట్లనిపించింది. అయినా అంతగా పట్టించుకోలేదు. మంచి సంబంధమైతే వదులుకోకూడదనే ఉద్దేశ్యంలో వున్నాడు. మర్నాడే జాతకం అడిగి పట్టుకొచ్చాడు.
అయితే పరమహంస జాతకం చూస్తూనే కొట్టిపారేశాడు. "ఈ అబ్బాయి జాతకం అమ్మాయికి అసలు సరిపడదు. దోషం వుంది కూడా. ముఖ్యంగా మేనమామకి చెడు జరుగుతుంది" అనేశాడు.
"నాకేం జరగదు, అలాంటి నమ్మకం లేదసలు" అన్నాడాయన ధైర్యంగా.
"అదేంటన్నయ్యా అలాగంటావ్! ఈ సంబంధం వద్దు. వేరేది చూసుకొమ్మని వాళ్ళకి చెప్పేసేయ్" అంది నిర్మల.
ఆయన చాలా అసంతృప్తితో వెళ్ళిపోయాడు.
"అమ్మాయి జాతకం చూశా నిర్మలా! మరో రెండు, మూడేళ్ళ వరకూ పెళ్ళి ఘడియ లేదు. మనం శ్రమ తీసుకోవడం అనవసరం. ఈ విషయం మీ అన్నయ్యతో కూడా చెప్పు."
"అలాగా! అయితే చదువుకోనిద్దాం. ఇప్పట్లో ఏ సంబంధం చూడవద్దని అన్నయ్యతో చెప్పేస్తా" అంది నిర్మల.
"అంతేకాదు! సాహితి పెళ్ళి విషయం నాకే వదిలెయ్యమని చెప్పు. నేనుండగా మరొకరు సంబంధాలు చూడడమేమిటి" అన్నాడు సాహితి నోట్ బుక్ లో వ్రాసుకున్న విషయాలు అతడు మర్చిపోలేదు.
ఆ రాత్రే నిర్మల తన అన్నయ్యతో ఈ విషయం చెప్పింది. అయితే ఆయన ఈ విషయాన్ని అంత సులభంగా వదులుకోదల్చుకోలేదు. సాహితితో డైరెక్టుగా ప్రస్తావించి "ఆ కుర్రవాడిని చూపిస్తానమ్మా" అన్నాడు.
ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె తలూపింది. ఈ మాటలు పరమహంస విన్నాడని వాళ్ళకు తెలియదు.
మావయ్య ఒక వారం పోయాక ఆ కుర్రవాడి దగ్గరకు వెళ్ళాడు. అయితే వాళ్ళెవరిలోనూ ఇంతకుముందంత ప్రశాంతత కనబడలేదు. "ఆ సంబంధమా.....వద్దులెండి" అని తిరస్కరించారు మర్యాదగానే. మావయ్య మొహం కొట్టేసినట్టయింది. ఇక ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఒకప్పుడు అంత ఉత్సాహం చూపించినవాళ్ళు ఇప్పుడింత నిర్లిప్తత ఎందుకు ప్రకటించారో ఆయనకు అర్ధంకాలేదు. ఇది జరిగిన వారంరోజులకి సాహితికి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఇలా వుంది....
"సాహితిగారికి,
నమస్తే....నా పేరు గుణశేఖర్! గుర్తుండే వుంటాను. నేనూ, భరద్వాజగారూ మీ ఇంటికి వచ్చాం.... మీ మావయ్య గారు పెట్టిన పెళ్ళిచూపుల పరీక్షకి! ఈ ఉత్తరం వ్రాయటానికి ముఖ్యంగా ఒక కారణం వుంది. మీకీ మధ్య ఒక సంబంధం వచ్చింది.....ఒక లాయరు కుర్రవాడిది, గుర్తుండే వుంటుంది. ఆ అబ్బాయి, నేనూ స్నేహితులం.
ఇద్దరం ఒకే అమ్మాయి పెళ్ళి చూపులకి వెళ్ళటం గురించి ప్రస్తావన వచ్చి ఆశ్చర్యపోయాం. ఆ అబ్బాయి మీ సంబంధం మానివేసుకోవటానికి ఒక కారణం వుంది. కొద్ది రోజుల క్రితం వారికి వచ్చిన ఒక ఉత్తరం సంగతి ఎక్కడా చెప్పలేదు. మీ వెనుక జరుగుతున్న విషయాలు మీకు తెలియటం మంచిదన్న ఉద్దేశ్యంతో ఆ ఉత్తరం నాకు చూపించాడు. వాళ్ళు మర్యాదస్తులు కాబట్టి ఈ ఉత్తరం కాపీ మీకు పంపుతున్నాము. ఈ ఉత్తరం పంపుతున్నది మీతో పరిచయం పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో మాత్రం కాదు.
ఇట్లు - గుణశేఖర్."
ఆమె వణికే వేళ్ళతో ఆ రెండో ఉత్తరాన్ని విప్పింది. ఎవరో ఎడమచేతితో వ్రాసినట్టుంది ఆ వుత్తరం.
"శ్రేయోభిలాషి వ్రాయునది...... ఈ మధ్య మీరు చూసిన నిర్మలగారి సంబంధం అంత మంచిది కాదు. వారి అమ్మాయి సాహితి ప్రవర్తన గురించి చుట్టుప్రక్కల గానీ, కాలేజీలో గానీ ఎవరినడిగినా చెపుతారు. చివరకి గాంధీనగర్ క్వాలిటీ ఐస్ క్రీం షాపువాడిని కనుక్కున్నా చాలు."
సాహితి మొహం వివర్ణమైంది.
ఫిట్స్ రాకుండా అతికష్టం మీద ఆపుకుంది గట్టిగా అరవాలనుకుంది. అలాగే కూలబడిపోయింది.
పరమహంస ఆమెని గాంధీనగర్ క్వాలిటీ ఐస్ క్రీం షాపుకి చాలాసార్లు తీసుకెళ్ళాడు!
* * *
"నేను చాలా అదృష్టవంతుడిని. దేవుడు నన్ను చల్లగా చూస్తాడు. నాకొచ్చే సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతూ వుంటాయి. మిగతా వాళ్ళలో లేని స్పెషాలిటీ ఏదో నాలో వుంది." అనుకుంటూ వుంటారు కొంతమంది.
"నేను చాలా దురదృష్టవంతురాలిని. నాకున్నన్ని సమస్యలు ఈ ప్రపంచంలో ఎవరికీ వుండవు" అనుకొంటూ వుంటారు మరి కొంతమంది.
ఇద్దరి అభిప్రాయాలూ బేవార్సే.....ఎందుకూ ఉపయోగపడని అభిప్రాయాలు అవి. దీన్ని ఉదహరిస్తూ ఒక మంచి కథ వుంది. ఒక రాజుకి ఇద్దరు కొడుకులు. రాజుగారికి నయంకాని జబ్బు వచ్చి సంజీవినీ మూలిక కావల్సి వచ్చింది. ఇద్దరు కొడుకులూ పావురాలు ఎగరేసి చెరో దిక్కుకీ బయల్దేరారు. పెద్దకొడుకు పావురం ఒక కొండమీద ఆగుతుంది. 'ఇంత పెద్ద కొండ ఎలా ఎక్కగలను? దురదృష్టం నన్ను వెంటాడుతుంది' అని పెద్దకొడుకు క్రిందే విచారంతో ఆగిపోయాడు. ఇంకో పావురం పుట్టమీద వాలుతుంది. అదృష్టం పుట్టలో మూలిక రూపంలో వుందేమో అని రెండో కొడుకు దాన్ని తవ్వుతుంటే లోపల్నుంచి పామొచ్చి కాటేసింది.
ఎంతో నీతివున్న కథ ఇది!
సాహితీ, పావనీ....
ఇంకా ప్రపంచంలో చాలామంది తెలుసుకోవలసిన కథ ఇది.
* * *
"సాహితీ!"
కాలేజీకి వెళ్ళడానికి తయారవుతున్న సాహితి తిరిగి చూసింది.
"ఏం లేదు, అంకుల్ దగ్గరకెళ్ళి చెక్కు తీఉస్కుని, బ్యాంక్ వెళ్ళి డబ్బు పట్టుకురా" అంది నిర్మల.
"అదేమిటి మమ్మీ! నీ దగ్గర డబ్బులేదా?" సాహితి ఆశ్చర్యంగా అడిగింది.
"ఉహూ, లేదు. ఆ మధ్య రెండువేలు ఇచ్చారు. ఖర్చు అయిపోయింది. నీ ఫీజు కట్టాలన్నావా? పైగా నౌఖర్ల జీతాలివ్వాలి. నా దగ్గర అసలు లేదు. వెళ్ళిరా."
"నాకు ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టంలేదు. మరెవరినైనా పంపు. డ్రైవర్ కి ఇల్లు తెలుసుగా వెళ్ళమను."
"అలా బావుండదు సాహితీ! అంకుల్ కి ఇప్పుడే ఫోన్ చేశాను. నిన్నే పంపమన్నారు...... వెళ్ళకపోతే అన్నీ ప్రశ్నలు. నేను జవాబు చెప్పలేనమ్మా- వెళ్ళేసిరా" అంది నిర్మల.
"అలాగేలే" ఇష్టం లేకుండానే ఒప్పుకుంది సాహితి. ఇలా డబ్బుకోసం మరొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఆ యింట్లో ఇంతవరకు జరగనిది. మొత్తం డబ్బు ఆయన ఎక్కౌంట్ లోనే వేసి పెట్టుకున్నాడు.