"ఏవిఁటీ?" మిన్ను విరిగి మీదపడ్డట్లు ఆశ్చర్యపోయాడు చలపతి తండ్రి.
చలపతి మౌనంగా నిల్చున్నాడు.
"మెట్రిక్ వందసార్లు ఫెయిలయి చావుదప్పి కన్ను లొట్టపోయినట్లు ఎలాగో ఈడ్చావు. ఏదో ఉద్యోగం చూసుకోక కాలేజి ఏవిఁట్రా?" పకపక నవ్వాడు తండ్రి.
చలపతికి గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్లయింది. చాటుగా ఉండి సంభాషణంతా వింటున్న ఉమకు హృదయంలో బాకులు దింపినట్లయింది. కొడుకు కాలేజీలో చదువుతానంటే సంతోషించి ప్రోత్సహించటానికి బదులు వెటకారం చెయ్యటమా? కన్నతండ్రి!!!
"ఈ బుద్ధి నీకు పుట్టిందేనా?" హేళనగా అడిగాడు తండ్రి.
ఉమ గుండెలు దడదడ కొట్టుకున్నాయి. చలపతి బుద్ధి మాత్రం వికసించినా, సమయోచిత సంభాషణలు జరపగలిగే పరిజ్ఞానం మాత్రం లేదు. ఉమ భయపడినంతా అయింది.
"ఉమ చదవమంది." బుద్ధిగా చెప్పాడు చలపతి.
ముసలాయన ఎగిరిపడ్డాడు. "అలా చెప్పు-దానిది గడుసు బుర్ర. నిన్ను కాలేజీలో చేర్పించి, ఆవంకనా, ఈ వంకనా డబ్బులు లాగి జల్సా చెయ్యొచ్చనుకుంటూంది. ముష్టి సంబంధం - ముష్టి సంబంధమాని! కాలేజి లేదు, గీలేజి లేదు. పో! నీలాంటి చదువంటని మొద్దుని సంవత్సరాల తరబడి కాలేజీలో కూర్చోబెట్టి డబ్బు విచ్చలవిడిగా విరజిమ్మేందుకు రాసులు పోసుకు కూర్చోలేదు. నీలాంటి చదువబ్బని చవటని కాలేజీలో చేర్పించే బదులు కొంపాగోడూ అయినా కట్టిస్తే అద్దెలతో అయినా బ్రతుకుతావు."
చలపతి తల వంచుకుని లోపలికొచ్చేశాడు.
బాధతో ఉమ హృదయం మెలికలు తిరిగిపోతూంది. కన్నతండ్రి కొడుకుని "నువ్వు చవటవి. మొద్దువి. పనికిరానివాడివి." అని పదేపదే అంటూంటే ఆ వ్యక్తిలో ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరగక ఏమవుతుంది? ఉన్నకొద్దో గొప్పో తెలివితేటలూ అణగారిపోయి చవటతనం ప్రస్ఫుటమవటానికి ఎంతకాలం కావాలి?
కొడుకును కాలేజీలో చేర్పించటం డబ్బు దండగా?
చదువుమీద దృష్టిలేని కొడుకు - చదువబ్బదని ఆశవదిలేసిన కొడుకు తనంత తను చదివి మెట్రిక్ పాసయి కాలేజీలో చేరతానన్నప్పుడు పొంగిపోవటానికి మారుగా దొంగెత్తులని చిరాకుపడతారా?
"ఉమా! నాన్నగారు..."
ధీనంగా ప్రారంభించబోయిన చలపతిని మధ్యలోనే ఆపేసింది ఉమ.
"విన్నాను."
"నాకు కాలేజీలో చదివే ప్రాప్తం లేదు."
"ఉంది."
"ఎలా?" విస్తుపోయి అడిగాడు చలపతి.
"నేను బి.యస్.సి. పాసయ్యాను. నేను ఉద్యోగం చేస్తాను. మిమ్మల్ని చదివిస్తాను. అందాకా నా గాజులు తాకట్టుపెట్టి కాలేజీలో చేరిపోండి."
చలపతికి నోట మాటరాలేదు.
"ఉమా!..." ఎన్నో చెప్పబోయి ఏదీ చెప్పలేకపోయాడు చలపతి.
"ఏం? మీకు చిన్నతనంగా ఉందా? మనమిద్దరం ఒకటి. మీరు పెడుతున్నప్పుడు తినడానికి నాకులేని చిన్నతనం, నేను పెట్టినప్పుడు మీకెందుకు? మీరు డిగ్రీ తీసుకోవాలని నా సంకల్పం. అదొక్కటే నా ఆశయం. నా ఆశయసిద్ధికి మీరు సహకరించరా?"
"నాకేం తెలియదు. నీ ఇష్టం...." గొణిగాడు చలపతి. నిజంగానే అతనికంతా అయోమయంగా ఉంది. ఇంత బరువైన విషయాలు ఆలోచించటం అతనికి తెలియదు.
ఇంట్లో ఎవ్వరితోనూ సంప్రదించకుండానే ఉమ ఏవేవో ఉద్యోగాలకు అప్లికేషన్లు పడేసింది. ఇంటర్వ్యూలకు పిలుపులొచ్చాయి. అప్పుడింట్లో తెలిసింది. వాతావరణం ఒక్కసారి వేడెక్కింది.
"ఈవిడగారు ఉద్యోగాలకు పోతే, నేను సేవలు చేస్తూ కూర్చోగలనా?"
మూతీ ముక్కూ తిప్పుకుంటూ అంది కాళి.
"నోరుమూసుకో! నువ్వు దానికి సేవలు చేయడమేవిఁటి? పెద్దవాళ్ళనడగటం పెట్టడం లేదా? ఇంత తెగింపా?" కోడలి నుద్దేశించి అంది వర్ధనమ్మ.
"మీ అబ్బాయినడిగే అప్లయి చేశాను అత్తగారు" శాంతంగా అంది ఉమ.
"అంటే? నా లెక్కలేదన్నమాట! 'నా మొగుడొప్పుకున్నాడు; నువ్వెవర్తివి అడగటానికి' అంటావు. అంతేనా?"
"అదికాదండీ! నేనొకటంటే, మీరు మరొకటి మాట్లాడుతున్నారు."
"నాకు మాట్లాడటం రాదంటావు. నేను నీలా చదువుకోలేదు. నీలా తెలివితేటలు లేవు. నాకు మాట్లాడటం రాదు."
"అవునే! అది ఆడిందానికల్లా నోరుమూసుకు పడుండక 'ఇదికాదు. అద'ని చెప్పడానికి నువ్వెవరివే?" దీర్ఘాలు తీసింది కాళి.
"నువ్వెందుకు కల్పించుకుంటావు కాళీ!" చిరాకుపడ్డాడు చలపతి.
"చూశావా అమ్మా! వదిన మాటలు పట్టుకుని అన్నయ్య నన్నెట్లా తిట్టిపోస్తున్నాడో?" బావురుమంది కాళి. కూతురి దుఃఖం చూసేసరికి వర్ధనమ్మ హృదయం ద్రవించుకుపోయింది. చెమ్మగిల్లిన కళ్ళతో కూతుర్ని బుజ్జగిస్తూ "ఊరుకో తల్లీ! ఊరుకో! వాడిప్పుడు వెనుకటివాడు కాడు. భార్య చేతులలో కీలుబొమ్మ. ఏమనుకొనీ ప్రయోజనం లేదు. మనమాట లెక్కలేదు. నాన్నగారే కనుక్కుంటారులే!" అంది.
ఉమ గుండెలు గుభిల్లుమన్నాయి. రానున్న ప్రళయాన్ని ఊహించుకొని వణికిపోయింది. చలపతి తండ్రి ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులున్న ప్లీడరు. బాగా సంపాదించాడని అనుకొంటారు. కాని, ఈనాడు ఆ సంపాదనా లేదు; సంపాదించిన ధనమూ లేదు. కాని ఆనాటి డాబుదర్పాలూ అహంకారము మాత్రం మిగిలిపోయాయి.
ఇంట్లో ఆడవాళ్ళ గొడవలలో మొగవాళ్ళు కల్పించుకోవటం నిజంగా భావ్యంకాదు. అది చాలా చికాకు కలిగించే విషయం. చలపతి తండ్రి వర్ధనమ్మ మాటలు విని ఉమ మీద ఎగిరిపడుతూంటే సిగ్గుతో, జుగుప్సతో ఉమకు ప్రాణం పోయినట్లుండేది. గౌరవంకొద్దీ అంతవరకూ ఉమ మావగారి కెన్నడూ సమాధానం చెప్పలేదు. ఆరోజు సాయంత్రం ఓపిగ్గా వర్ధనమ్మ మాటలు విని తీవ్రంగా ఉమ దగ్గిరకు వచ్చాడు చలపతి తండ్రి.