ఆ సంవత్సరం పదోక్లాసులోనూ, ఇంటర్ లోనూ, డిగ్రీ క్లాసుల్లోనూ కూడా చాలా తక్కువమంది పాసయ్యారు. కొన్ని కొన్ని కాలేజీల్లో డిగ్రీక్లాసుల్లో 0% రిజల్ట్స్ కూడా వచ్చాయి. అందరూ హాహాకారాలు చేశారు. కానీ వి.సి. చలించలేదు. ఇలాంటిది తప్పదు. హద్దుమీరిపోయి విజృంభించిన దుష్టశక్తులను అదుపులో పెట్టేటప్పుడు మొదట్లో అందరూ దారుణంగా దెబ్బతినవలసిందే!
ఇంటర్నల్ ఎస్సిస్ మెంట్ ఉండటంవల్ల తల్లి భయానికి మురళి మొదటి నుంచీ శ్రద్ధగానే చదివాడు. కాపీలు కొట్టడానికి అవకాశమే లేకపోవడంవల్ల తనకు వచ్చిందేదో బుద్ధిగా వ్రాశాడు. అంచేత డిగ్రీ మొదటి సంవత్సరం మురళి పాసయ్యాడు. కానీ కాపీలుకొట్టి తప్ప ఏ విధంగానూ సొంతంగా రాయలేని రవి ఫెయిలయ్యాడు. తను ఫెయిలయి, మురళి పాసవటంతో మురళి మీద చాలా ఈర్ష్య కలిగింది రవికి.
"ఇప్పుడు పాసయ్యావు, ఎలాగయితేనేం-ఆనాడు ఇంటర్ లో నేను నీపక్కన కూచుని నీచేత పరీక్ష రాయించకపోతే, ఎక్కడ ఉండేవాడిని?" అన్నాడు.
మురళి బిక్కచచ్చిపోయి తల దించుకున్నాడు.
"నీకు చంద్రశేఖరంసార్ తెలుసుగా. ఆయన దగ్గిరకు తీసుకెళ్ళు. ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అడుగుదాం!" అన్నాడు రవి.
మురళి భయపడిపోయి "అమ్మో! ఆ సార్ మా ఫేమిలీ ఫ్రెండ్! నేను రాను" అన్నాడు.
"మీ ఫేమిలీ ఫ్రెండ్ అనే రమ్మంటున్నాను. కృతఘ్నుడా! చేసిన మేలు అంతలోనే మరచిపోతావా? రా!" అని మురళి చెయ్యి పట్టుకుని ఈడ్చుకుపోయాడు. చేసేదిలేక చచ్చినట్లు వెంట వెళ్ళాడు మురళి ఏడుపుమొహంతో.
చంద్రశేఖరసార్ ఇద్దర్నీ ఆదరంగా ఆహ్వానించి- "కంగ్రాట్యులేషన్స్ మురళీ! పాసయ్యావటగా! శ్రద్ధగా చదివితే ఎందుకు పాస్ కారయ్యా! ఏం రవీ? నీది పోయింది కదూ! ఫరవాలేదు. ఇదీ ఒక పాఠం-ఈసారి బాగా శ్రద్ధగా చదువు- మామూలుగా కాదు, క్లాసులో పాసవుతావు" అన్నాడు.
ఇంత జరిగినా రవిలో పొగరు తగ్గలేదు.
"నేను బాగా రాశాను సార్! వాళ్ళు ఎందుకు ఫెయిల్ చేశారో అర్ధం కావటంలేదు. మీరు కాస్త హెల్ప్ చెయ్యాలి. అందుకే వచ్చాం!" అన్నాడు.
రవిని తెల్లబోయి చూశాడు చంద్రశేఖర్.
"రవీ! నువ్వు బాగా వ్రాశావో, లేదో నీ పేపర్లు దిద్దినవాళ్ళకు తెలుస్తుంది. నాకెలా తెలుస్తుందీ? నీకు ఏది కరెక్టో, ఏది కాదో కూడా తెలియదు కనుక నీ అజ్ఞానాన్నిబట్టి బాగా వ్రాశాననుకుంటావు. బాగా వ్రాస్తే ఒక్కనాటికీ ఫెయిలవరు...."
"అలాకాదు సార్! మీరు కాస్త హెల్ప్ చెయ్యాలి...." మొండిగా అన్నాడు రవి. రవి అభిప్రాయం చంద్రశేఖర్ కి అప్పటికి అర్ధమయింది.
లాభంలేదు రవీ! కొత్త వి.సి దగ్గర ఈ రకం 'హెల్ప్' అనే మాట అనటానికి కూడా ఆస్కారం లేదు." అన్నాడు కచ్చితంగా.
రవికి మండిపోయింది. అతనికి అన్ని విషయాల్లోనూ ఒకటే అజ్ఞానం. చంద్రశేఖరం సార్ తనకు సహాయం చెయ్యగలిగే చెయ్యటం లేదనుకున్నాడు. చంద్రశేఖర్ మీద ఏదో కసి పెరిగింది. కోపంతో వెళ్లిపోయాడు.
పరీక్షలు చాలా స్ట్రిక్ట్ గా జరిగిన ఆ సంవత్సరంలో.... యూనివర్శిటీలో అన్ని కాలేజీలలోనూ-రిజల్ట్స్ చాలా పూర్ గా ఉన్న ఆ సంవత్సరంలో__చంద్రశేఖర్ విద్యార్ధులందరూ ఒక్కరు కూడా తప్పకుండా పాసయ్యారు. ఆ కాలేజిలో తెలుగులో 100% రిజల్ట్స్ వచ్చాయి. విద్యార్దులందరూ గుంపుగావచ్చి "సార్! మీరు చెప్తున్నాప్పుడే పాఠం మా మనసులకి హత్తుకుపోయేలాగ చెప్పారు-అంతే కాదు-ఏ ప్రశ్న ఎలా ఇచ్చినా, ఏరకంగా సమాధానం రాయాలో వివరించారు. ప్రతి టాపిక్ కు పాయింట్స్ లా స్కెచ్ క్రింద ఇచ్చి మాకు పరీక్షల ముందు గుర్తుపెట్టుకోవటానికి వీలుగా నోట్స్ ఇచ్చారు. అందుకే మీ దగ్గర చదువుకున్న మేమందరమూ పాస్ అయ్యాం!" అని తమ అభిమానాన్నీ, కృతజ్ఞతనూ వెల్లడించుకున్నారు. లెక్చరర్ గా తన కృషికి ఫలితం చాలనుకొని మనసారా ఆనందించాడు చంద్రశేఖర్.
15
కుమార్ హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గరనుండీ, కుమార్ సరోజల మధ్య సాన్నిహిత్యం మరింత ఎక్కువయింది. తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా కలసిపోయిన సరోజమీద సుమతికి కూడా మాతృత్వపు మమకారమే! అంచేత సరోజ ఆ ఇంటి కోడలిలాగే మసలుకోసాగింది.
"నేను హాస్పిటల్ లో ఉన్నప్పుడు నువ్వు చాలా సేవచేశావు, నీ ఋణం తీర్చుకోలేను" అన్నాడు కుమార్ సరోజతో అభిమానంగా.