Previous Page Next Page 
మహిమ పేజి 33


    "కరెక్ట్. నేను సుస్మితని కాదని బయట అమ్మాయిలతో ఎంజాయ్ చేసినన్నాళ్లు ఏదో గిల్టీ ఫీలింగ్. తను నన్ను ఎంత నిర్లక్ష్యంగా, హీనంగా చూసినా, నేను చేస్తున్నది తప్పు అన్న భావం లోలోపల పోయేది కాదు. నీవు చెప్పినట్టు ఈ ఆకర్షణల నుంచి తప్పించుకోలేక ఇరుక్కోవడం, మరో స్త్రీతో సంబంధం మగాడికి వరం కాదు శాపమే అని ఇప్పుడు అర్థం అయింది. ఇంట్లో దొరికే ప్రశాంతత ఎక్కడా దొరకదు. మహిమ, థాంక్యూ వన్స్ ఎగైన్! ఇంత చిన్న వయస్సులో ఇంత విచక్షణతో ఆలోచించే శక్తి ఎలా వచ్చిందోనని ఆశ్చర్యంగా ఉంది..." మెచ్చుకోలుగా అన్నాడు.
    "ఇంట్లో పెంపకం కొంత, చదువు ఇచ్చిన జ్ఞానం, పుస్తకాలు చదివిన విజ్ఞానం, లోకాన్ని పరిశీలించి ఆకళింపు చేసుకోగలిగే శక్తి... ఇవన్నీ ఎవరికి వారు నేర్చుకోవలసినవి" వినమ్రంగా అన్న మహిమని చూస్తూ.
    "మహిమా! నిజం చెప్పనా? ఇంత మంచి అమ్మాయిని ఊరికే పోనీయకూడదనిపిస్తోంది. మా ఇంటి కోడల్ని చేసుకోవాలనిపిస్తోంది" నవ్వుతూ అన్నాడు.
    ఒక్క నిమిషం తెల్లబోయింది మహిమ. ఆమె మొహంలో అరక్షణంలో ఎర్రబడింది. "కోడలా? ఉన్న కోడలిని ఏం చేస్తారు మరి..." అదో రకంగా చూస్తూ అంది.
    'ఏం, ఆ కోడలి స్థానం అలాగే ఉంటుంది. ఆ కోడలెక్కడికి పోతుంది?" మహిమ మొహం చూసి ఏదో అర్థమైనట్లు... "ఓ మైగాడ్! మహిమా నీవేం అర్థం చేసుకున్నావు? గాడ్! ఇంకా నీకు నామీద నమ్మకం కుదరలేదన్నమాట..." పెద్దగా నవ్వుతూ అన్నాడు. మహిమ తెల్లబోయింది. "రియల్లీ మహిమ. ఇంత తెలివైనదానివి అంత తెలివితక్కువగా ఎలా ఆలోచించావు..."
    "ఏమిటి మీరంటున్నది... ఇంటి కోడలేమిటి?"
    "ఓ గాడ్! మహిమా... నేను అన్నది విశాల్ గురించి. మా ఇంటి కోడలుగా చేసుకోవాలని...! యార్, నువ్వేం చెప్పినా జనం నిన్ను నమ్మరు అని చెప్పకనే చెప్పేశావు. మై బ్యాడ్ లక్..." వినోద్ వినోదంగా అన్నాడు.
    ఈసారి మహిమ క్షణంలో తేరుకుని "ఓ సారీ... సారీ! ఏమిటో నా బుర్ర అంత దూరం... అసలు విశాల్ గురించిన ఆలోచన రాలేదు. నన్ను కోడలిని చేసుకుంటాననగానే నాకు మతిపోయింది" సంజాయిషీ ఇచ్చింది.
    "భలేదానివే. మా విశాల్ పాపం నా ఎపిసోడ్ తర్వాత ఆడపిల్లలంటేనే భయపడిపోతాడు. వాడు ఉత్త మంచివాడు. గర్ల్ ఫ్రెండ్ ని చూసుకోవడం కూడా రాదు. నేను చూసిపెడతానని మాటిచ్చాను వాడికి. ఇంత చక్కగా ఎనలైజ్ చేసి నిన్ను 'గర్ల్ ఫ్రెండ్ గా వెళ్లు' అంటే తంతావు అన్న భయంతో, డైరెక్ట్ గా పెళ్ళి అనేశాను" వినోద్ సరదాగా మాట్లాడాడు.
    "ఇంతకీ విశాల్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? నిర్మొహమాటంగా, సిగ్గుపడకుండా నీ అభిప్రాయం చెప్పు."
    "ఏ ఆడపిల్ల అయినా మంచి కుటుంబం, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, డబ్బు, సంస్కారం అన్నీ ఉన్న అబ్బాయి గురించి ఏమనుకుంటుందో నేనూ అదే అనుకున్నాను" నిబ్బరంగా అంది.
    "అయితే ఓకే. మా విశాల్ అని కాదు కాని, వాడు జెంటిల్ మేన్! నిజంగా చెప్తున్నా. వాణ్ణి చేసుకున్న అమ్మాయి సుఖపడుతుంది. వాడికి ఆమంచి చదువు, సంస్కారం, నీలా తెలివి, సమర్థత అన్నీ ఉన్న అమ్మాయి దొరకాలి. అన్నీ ఉన్న అమ్మాయి ఎదుట ఉంచుకుని వేరే వెతకడం ఎందుకు? నా ఆలోచన సరైనదే గదా... ఇప్పుడు నీకు ఓకేనా కాదా ముందది చెప్పు' జాలీగా అన్నాడు.
    "ఓకేనా అని నన్నడగడం కాదు. ఓకే చెప్పాల్సింది నా పేరెంట్స్" మహిమ ఆ ప్రస్తావనకి ఉబ్బి తబ్బిబ్బై పోకుండా నిబ్బరంగా అంది.
    వినోద్ మహిమ వంక మెచ్చుకోలుగా చూసి "మళ్లీ మార్కులు కొట్టేశావు నీ జవాబుతో. ఇంత చక్కగా, నా పెళ్ళి విషయం నా పేరెంట్స్ ఇష్టం అని ఎంత బాగా చెప్పావు. రియల్లీ, యూ ఆర్ ఇంప్రెస్ డ్ మి..."
    "నేను కొన్ని నిజాలని వంటబట్టించుకున్నాను. అమ్మాయి పెళ్ళి విషయంలో తల్లిదండ్రులు ఆలోచించినంతగా ఎవరూ ఆలోచించలేరు. కూతురి భవిష్యత్తు గురించి వారికంటే ఆరాటం ఎవరికుంటుంది. అమ్మ నాన్న అన్నీ చూసి చేస్తారని నా నమ్మకం. పెళ్ళి సంబంధాల విషయంలో ఆఖరి నిర్ణయం వారిదే. నాకు నచ్చినవాడైనా, వాళ్లు మెచ్చని వాడిని నేను చేసుకోను. కన్నవాళ్లకంటే నా మేలు ఎవరు కోరతారు".
    "గ్రేట్! నేను నాన్నగారితో మాట్లాడి, మీ నాన్నగారితో మాట్లాడమని చెపుతాను".
    "అంతా మీరే మాట్లాడుతున్నారు. మీ తమ్ముడు లక్ష్మణస్వామి, రాముల వారి మాట జవదాటడా?" హాస్యంగా అంది.
    "నేనేం అంత చవటదద్దమ్మనా? నీ పేరు చెప్పగానే వాడి కళ్లల్లో మెరుపు, నిన్ను చూడగానే వాడి మొహంలో వెలుగు, నీ గురించి మాటల్లో వాడి అడ్మిరేషన్... ఇవన్నీ గుర్తించకుండానే... నాన్నగారికి నీ సమర్థత, తెలివి మీద కుదిరిన గురి ఇవన్నీ వర్కవుట్ చేయకుండానే... ఈ ప్రస్తావన తెస్తానా? మా ఇంటికి కోడలిగా రాదగిన అమ్మాయివి నువ్వే. నువ్వు మా కుటుంబంలో సుఖ సంతోషాలు నింపుతావు..."

 Previous Page Next Page