తలిదండ్రులు కట్నాలిచ్చుకోలేక తమ కూతుళ్ళను ఎవరికో ఒకరికి కట్టబెడుతున్నారు.
ఏ ఆచారాలు ఎలా మారినా బలి అవుతున్నది మాత్రం స్త్రీలే!
ఈనాడు ముక్కు పచ్చలారని వకుళను ఆదుకోగలిగిన వాళ్ళెవరు?
అంతర్జాతీయ మహిళా సంవత్సరమన్నారు. మహిళా మహోదయమంటున్నారు! ఎక్కడ ఆ మహిళా మహోదయం? రవీంద్ర భారతిలోనా?
వకుళ పెళ్ళయిపోయింది. మొదటిసారిగా భర్త దగ్గిరకు వెళ్లివచ్చిన వకుళ మనసులో మిగిలినవి భరింపరాని చీదర, జుగుప్స, మాత్రమే!
"ఇదా, పెళ్ళంటే? అందరూ పెళ్లిళ్ళు ఎలా చేసుకుంటున్నారు?" అని ఆశ్చర్యపోయింది భయంతో శరీరం వణుకుతుండగా, ఆ పసిపిల్ల.
ఆ మరునాడు భర్త దగ్గిరకు వెళ్ళలేక తల్లి పక్కనే పడుకుంది వకుళ...వకుళ అవస్థను అర్ధంచేసుకున్న తల్లి జాలితో వకుళను బుజ్జగింపుతో జోకొడుతూ తన దగ్గిరే పడుకోబెట్టుకుంది.
ఆకొన్న సింహంలా తిరిగాడు డాక్టర్ పినాకపాణి..."వకుళా!" అని గర్జిస్తున్నట్లుగా పిలిచాడు. వకుళ మరింతగా వణికిపోతూ తల్లిని మరింత గట్టిగా కరుచుకుంది.
చేసేదిలేక అప్పటికి ఊరుకున్నాడు పినాకపాణి... కానీ అలా భర్తను ఎక్కువకాలం తట్టుకోలేకపోయింది వకుళ.
"వకుళా! తమ్ముడికి జీతం కట్టాలి. కాస్త మీ ఆయన్నడుగు! అంది వకుళ తల్లి.
వకుళకు శరీరంలో రక్తం నీరయిపోతోంది. అయినా "అడగను" అనలేకపోయింది తల్లితో..."పాపం, తమ్ముడు చదువుకోవద్దూ?"
భయపడుతూ భయపడుతూ అడిగింది భర్తను.
"తమ్ముడికి జీతం కట్టాలి!"
చీదరించుకుంటూ చూసాడు డాక్టర్ పినాకపాణి.
"ఛ! వెధవసంత! బోలెడు కట్నంతో లెక్కలేనన్ని సంబంధాలు వస్తూంటే నేరకపోయి ఈ ముష్టి సంబంధం చేసుకున్నాను."
శరీరం అణువణువూ దహించుకు పోతోంటే తల వంచుకు నిలబడింది వకుళ.
"ఇంద తీసుకో!"
పదిరూపాయల కాగితం అందించాడు. దాన్ని అందుకోబోయిన వకుళ చేతిని పట్టుకుని మీదికి లాక్కున్నాడు, కిక్కురుమనలేదు వకుళ... ఏం చెయ్యాలో, ఎలా ప్రతిఘటించాలో కూడా అర్ధంకాక బలిపశువులా ఉండిపోయింది.
పదిరూపాయలు! ఒక్క పదిరూపాయలు! ఆ కాగితాన్ని తల్లిచేతిలో పెట్టి బాత్ రూంలోకి వెళ్లి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది.
ఆ కుటుంబపు అవసరాలు అక్కడితో ఆగేవికావు. ఎప్పుడూ ఏదో ఒకటి.
ఒకసారి తల్లికి కీళ్ళనొప్పులెక్కువవుతాయి. డాక్టర్ కి చూపించుకోవాలి!
మరొకసారి చిన్న చెల్లెలు పుట్టినరోజు. కొత్తబట్టలు కొనాలి! పేరంటం కూడా చెయ్యాలి.
ఇలాగే ఏదో ఒకటి...అన్నింటికీ వకుళ తన భర్తను అడగవలసిందే! ఎప్పుడు అడిగినా అతడు చీదరించుకోక మానడు! చిన్నబుచ్చక మానడు! అడిగినంత ఇయ్యకపోయినా, ఎంతో కొంత తోచినంత ఇస్తాడు. ఇచ్చినదానికి పదిరెట్లు వకుళను చిత్రవధ చేస్తాడు.
వకుళకు నెల తప్పింది. తల్లి పరమానందంతో సీమంతం చేసింది. ఎంతో చురుగ్గా ఉండే వకుళ__ఏమీ చదవకపోయినా క్లాస్ లో ఫస్ట్ మార్కులు తెచ్చుకునే వకుళ...ఆలోచించటం పూర్తిగా మానేసింది. యాంత్రికంగా ఎవరేం చెబితే అది చెయ్యటమే అలవాటు చేసుకుంది. కడుపులో ఉన్న వకుళకు భర్త దగ్గరకు పోక తప్పలేదు. కుటుంబపు ఇబ్బందులలాంటివి!
లేతవయసులో కాన్పు రావటంవల్ల వకుళకు చచ్చిబ్రతికినంత పనయింది... తన ప్రక్కన పడుకున్న తనకూతుర్ని చూస్తోంటే ఆడుకోవటానికి మంచి బొమ్మ దొరికినప్పుడు పసిపిల్లకు కలిగే ఉత్సాహం లాంటిది కలిగింది ఒక్కక్షణం. అంతలోనే శరీర బాధతో ఆ ఉత్సాహం కూడా కరిగిపోయింది.
ప్రసవమయి రెండు నెలలయినా వకుళ కోలుకోలేదు. పసిగుడ్డును వకుళ తల్లి సాకుతోంది. మంచంమీంచి లేస్తే కళ్ళు తిరిగి పడిపోతోంది వకుళ.
హైస్కూల్లో పిల్లలందరూ ఎక్స్ కర్షన్ కి వెళ్తున్నారట! వకుళ తమ్ముడు కూడా వెళ్తానని పేచీ మొదలుపెట్టాడు. మొదట వకుళతల్లి కొడుక్కి నచ్చచెప్పబోయింది. కాని అతడు మొండిగా ఏడుస్తోంటే, "పోనీ, వకుళా, మీ ఆయన్ని అడుగుతావుటే!" అంది.
మాట్లాడటానికి ఓపికలేని వకుళ "అలాగే!" అన్నట్లు తల ఊపింది...తూలుతూ తూలుతూ లేచివెళ్ళి భర్తను అడిగింది.
"మా తమ్ముడు ఎక్స్ కర్షన్ కి వెళ్తాట్ట! డబ్బు కావాలి!"
"డబ్బు! డబ్బు! డబ్బు! మీకందరికీ విరజిమ్మడానికి నేనిక్కడ రాసులు పోసుకుని కూచోలేదు. ఇప్పటికే నీ తెగులు మూలంగా ఎంత ఖర్చుపెట్టానో తెలుసా! ఛ! ఛ! ప్రాణానికి సుఖంలేదు!"
వకుళకు మాట్లాడే ఓపిక లేకపోయింది. ఓపిక ఉన్నా మాట్లాడగలిగేది కాదు.
"ఊ!, ఇంద తీసుకో!" ఎప్పటిలా డబ్బు తీసి అందించాడు.
జంకుతూనే అందుకోబోయింది. ఆ చెయ్యి పట్టుకుని మీదకు లాక్కున్నాడు.
కెవ్వున కేక పెట్టింది. పినాకపాణి ఆ కేకలను లక్ష్యపెట్టలేదు.
వకుళ తల్లికి హృదయ విధారకంగా వకుళ పెట్టే బొబ్బలు వినిపిస్తోనే ఉన్నాయి. ఏం చెయ్యాలో పాలుపోలేదు.
తలుపులు దబదబ బాదింది. పావుగంటకి కాని తలుపులు తెరుచుకోలేదు. తలుపులు తీసుకుని విసురుగా వెళ్ళిపోయాడు పినాకపాణి.
మంచంమీద స్పృహ లేకుండా వకుళ ... ఆ మంచం ప్రక్కనే క్రింద రెండు పదిరూపాయల నోట్లు.
"వకుళా!" అంటూ తల్లి ఏడుస్తూ కుదిపింది. వకుళ కళ్ళు తెరిచి అంతలో మూసుకుంది...ఆ రోజే వకుళకు రక్తస్రావం ఆరంభమయింది. వెంటనే హాస్పిటల్ లో చేర్పించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ రాత్రికే వకుళ శాశ్వతంగా కళ్ళుమూసింది.
పసిగుడ్డుని వళ్ళో వేసుకుని కూతురి శవం ముందు కూచుని కుమిలి కుమిలి ఏడుస్తోన్న వకుళ తల్లిని చూస్తోంటే ఎంత జాలి కలిగిందో, అంత కోపం కూడా వచ్చింది శారద తల్లికి.
"ఎందుకంతగా ఏడుస్తారు? ఊరుకోండి! ఒక పదేళ్ళు కళ్ళు మూసుకున్నారంటే, మీ మనవరాలు ఎదిగిపోతుంది. అప్పుడు మంచి సంబంధం చూసి పెళ్ళిచేసి మీరంతా సుఖంగా ఉండొచ్చు! నీచంగా డబ్బుకోసం వొళ్ళమ్ముకోవటం కాదు! పవిత్రంగా పెళ్ళి చెయ్యటం!"
"పెళ్ళి! పెళ్ళి! పవిత్రమైన పెళ్ళి.
సంఘంమీద, సంఘంలో మనుష్యులమీద, సంఘం ఏర్పరిచిన అర్ధంలేని ఆచారాలమీద ... ఆ ఆచారాలు సంస్కరించుకోలేని మనుష్యుల బలహీనత మీద ... కసితో మనసు భగ్గుమనగా అక్కడ నిలవలేక పారిపోయింది శారదతల్లి.
* సమాప్తం *