Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 33


    "పూల్స్ దిగులు పడకండి. రేపీపాటికి మీ మధ్య ఉంటాను."
    హుషారుగా అంది ఆ అమ్మాయి.
    అంతా సద్దుమణిగాక ఒక వారకి కూచుని ఏదో పుస్తకం చదువుకోసాగింది ఆ అమ్మాయి.
    మౌనంగా అందరినీ చూడటం తప్ప అప్పటివరకూ ఎవరితోనూ మాట్లాడలేదు ఇళ. పలకరించినా సమాధానం చెప్పలేదు. అలాంటిది ఆ అమ్మాయిని చూసి "మీ పేరేమిటి? మీరెవరు?" అని పలకరించింది.
    "మీరెవరు?" అడిగింది ఆ అమ్మాయి. చూపుల్లో నిర్లక్ష్యం.
    "నేను...నా పేరు ఇళ."
    "ఓహో! ప్రమధపురిలో వెలసిన దుర్గామాతవా! చివరికి మఠప్రవేశం చేశావన్నమాట! ఏం తల్లీ! మీ దుర్గామాత సింహ వాహనం మీద సినిమాలో లాగా వచ్చి ఈ పోలీసుల మీద పిడుగులు కురిపించదా? ఈ కటకటాలు పగలగొట్టి నిన్ను తన చేతులమీద ఆకాశమార్గాన తీసుకుపోదా? అమాయకురాలైన మూఢభక్తులు విబూధి పంచటం తప్ప ఏమీ చెయ్యదా మీ దుర్గామాత?"
    ఆవేశంగా, కోపంగా, ఛీత్కారంతో అంది ఆ అమ్మాయి.
    ఇళ తలదించుకుని "దుర్గామాత అవన్నీ ఎందుకు చేస్తుందీ? నా పురాకృత పాప పుణ్య ఫలాలు నేను అనుభవించవలసిందే!" అంది. ఆ అమ్మాయికి చాలా ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా బాబాలు, అమ్మవార్లూ, వాళ్ళ దేవుళ్ళనీ, వాళ్ళ ఆస్థికత్వాన్ని హేళ చేస్తే సహించరు. చాలా తీవ్రంగా ఎదుర్కొంటారు. ఇళ ముఖంలో పసితనము, అమాయకత్వమూ, మాటలో నమ్రత, ఆ అమ్మాయితో తిరస్కారాన్ని కొంతవరకూ తగ్గించింది. అయినా కోపం పోలేదు.
    "పురాకృ పాపపుణ్యాలా? ఈ జన్మలో నువ్వేం చెయ్యలేదా?"
    "చేశానేమో! విదుషి అక్క ఏదో సినిమా కథలో తనవాళ్ళకోసం వ్యభిచరించిన తప్పుకంటే, నేను చాలా నీచంగా ప్రవర్తించానంది. నిజమేనేమో! దాని ఫలితం అనుభవిస్తున్నానేమో!"
    నివ్వెరపోయింది ఆ అమ్మాయి. ఈ రకంగా మాట్లాడే "బాబా"లను కానీ, "అమ్మ"లను కానీ, ఆ అమ్మాయి అప్పటివరకూ చూడలేదు. కోపం తగ్గుతోంది. గౌరవం కలుగుతోంది. కానీ మతం పేరిట అమాయకులను మోసంచేసేవారంటే సహజంగా ఉన్న తిరస్కారం పోవడంలేదు.
    "విదుషి అక్క అంటున్నావు, విదుషి నీకు బాగా తెలుసా?"
    "నా దగ్గరికి చాలాసార్లు వచ్చింది. మేము ఎన్నో విషయాలు మాట్లాడుకొనేవాళ్ళం!"
    "రాక్షసీ! అలాంటి విదుషిని మాయం చేశావా?"
    "నేను మాయం చెయ్యలేదు."
    "మరి ఎలా మాయం అయిందిట?"
    "నాకు తెలీదు. తెలిస్తే ఎలా యినా వెనక్కు తీసుకొచ్చేదానిని. మీకు తెలుసా విదుషి అక్క?"
    "తెలుసు. మా హేతువాద సంఘానికి కార్యదర్శి."
    "అంటే?"
    "దేవుళ్ళూ, దెయ్యాలూ, చేతబడులూ, మంత్రతంత్రాలూ అంటూ జనాన్ని దోచుకునేవాళ్ళ గుట్టు బయటపెట్టడం మా పని! మనిషిని మించిన దేవుడు లేడనేది మా ఆదర్శం. చిన్న దొంగతనం చేస్తే అమాయకులని ఖైదు చేస్తుంది మన ప్రభుత్వం. నీలాగా జనాన్ని దోచుకునే వాళ్ళను ఏమీ చెయ్యదు, పైగా గౌరవిస్తుంది. విదుషి నీ మాయలో ఎలా పడిందో ఆశ్చర్యంగా ఉంది."
    "దేవుడు లేడా?"
    కళ్ళు పెద్దవిచేసి జీవితంలో ఎన్నడూ వినని మాట వింటున్నట్లు అడిగింది.
    "దేవుడంటే ఎవరూ? ఈ అమ్మవార్లూ, అయ్యవార్లూనూ? మీరంతా కొలిచి పూజలు చేసే దేవుడు ఏ ఆకాశంలోంచి ఊడిపడలేదు. ఆ దేవుడు మనిషి చేసిన రూపకల్పన. మానవ సమాజ నిర్మాణాన్ని బట్టే దేవుళ్ళు సమాజాలు కల్పిస్తూ వచ్చారు మనవాళ్ళు. సమాజంలో మాతృస్వామ్యం ఉన్నప్పుడు మాతృదేవతలు పోలేరమ్మ, మాకురమ్మ, దుర్గ వగైరా... ఆర్యుల రాకతో పితృస్వామ్యం వచ్చింది. అప్పుడు విష్ణువు, శివుడు వగైరా వెలిశారు. మాతృస్వామ్యం నశించి పితృస్వామ్యం స్థిరపడే రోజుల్లో సమాజంలో ఏర్పడిన ఘర్షణే, మాతృదేవతలకూ, దేవుళ్ళకూ కలిగిన ఘర్షణగా పురాణాల కెక్కింది. అంతవరకూ ఎందుకూ? నీ పేరుకు సంబంధించిన కథ నీకు తెలుసా? సుద్యుమ్నుడనే రాజు పార్వతీదేవి తపస్సు చేసుకుంటున్న వనంలోకి ప్రవేశించేసరికి స్త్రీగా మారిపోయాడట! అతడే ఇళ! నీ పేరు!
    పితృస్వామ్యం వస్తోన్న రోజుల్లో "ఆడవాళ్ళు చదువుకోకూడదు. తపస్సు చెయ్యకూడదు. బ్రహ్మచారిణులుగా ఉండకూడదు" మొదలైన ఆంక్షలన్నీ బయలుదేరాయి. ఆ రోజుల్లో స్త్రీలు తమ తపశ్చర్య కాపాడుకోవటానికి కల్పించిన కథ కావచ్చు. ఏదేమైనా అణగారిపోతున మాతృస్వామ్యం తనను తాను ఉద్ధరించుకొనే ప్రయత్నంలో అల్లిన కథ. ఈ విషయం అర్థం చేసుకోకుండా రాతి బొమ్మలకు పూజలు చేస్తున్నాం. దేవుడంటూ ఎవరైనా ఉంటే అది పూర్తిగా మనిషిలోని మంచితనం." కళ్ళు పెద్దవి చేసి చూసింది ఇళ. అంతకుముందు ఏనాడూ అలాంటి మాటలు వినలేదు. విదుషి కూడా ఇంత ఘాటుగా మాట్లాడలేదు. ఎందుకో ఆ అమ్మాయి అంటే గౌరవమే కలిగింది ఇళతో.
    "మీ పేరు"
    "సుహాసిని"
    "ఇంత మంచివారు ఇక్కడికి ఎలా వచ్చారు?"
    "ఇంతసేపటికి సుహాసిని స్నేహంగా నవ్వింది.
    "నేను మంచిదాన్నా? మిమ్మల్ని ఇంత తీవ్రంగా విమర్శించినా మంచిదాన్ననే అంటున్నారా?"
    "అవన్నీ మీ అభిప్రాయాలు! విదుషి అక్కడి కూడా ఇలాంటి అభిప్రాయాలే ఉండేవి. విదుషి అక్క మంచిది కాదా? అలాగే మీరూనూ."

 Previous Page Next Page