బొమ్మలాగ నిలబడిపోయిన జైహింద్ బాబు తండ్రి మంచం దగ్గిర కూచ్చున్న చంద్రిని చూశాడు! తండ్రి మంచం కోడుకి తలకొట్టుకుని ఏడ్చింది చంద్రి. తలవంచుకుని అక్కడి నుంచి వచ్చేశాడు జైహింద్ బాబు!
రాజయ్యకి పదిహేను రోజులు విడవకుండా వచ్చింది జ్వరం! కొడుకూ, కూతురూ, తనే అయి ఆదుకుంది చంద్రి!
చివరకు ఎలా అయితేనేం, జ్వరం తగ్గింది. తన శక్తినంతా ఉపయోగించినా, తన శరీరంలో ఎడమ భాగం కదిలించలేకపోయాడు! ఆ భాగం కదలటం లేదని గుర్తించాడు!
చంద్రి డాక్టర్ ని పిలుచుకొచ్చి చూపించింది. 'పక్షవాతం' అని చెప్పాడు డాక్టర్! డాక్టర్ మాట వినగానే గుండె బాదుకుంటూ ఏడుపు మొదలుపెట్టింది నాగమ్మ, రాజయ్యకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి! ఇద్దరిలో ఎవరినెలా ఓదార్చాలో అర్థంకాక, తన మనసులో క్షోభనెవరితో చెప్పుకోవాలో అర్థంకాక కుమిలి కుమిలి ఏడ్చింది చంద్రి.....
ఆ వర్షంలో తను పోరి రాజయ్యను పంపటంవల్లే రాజయ్య ఇలా అయిపోయాడేమోననే ఆలోచన వదలటం లేదు నాగమ్మను! నాగమ్మ ఆ ఆలోచనను భరించలేకపోతోంది! రాజయ్య స్థితికి తను కారణం కాదని అనుకోకపోతే దాని మనసు స్థిమితపడటం లేదు!
"ఆ వెంకడే నామీద కసితో సేతబడి చేశాడు! అందుకే నా బతుకిట్టా భగ్గుమని పోనాది" అని ఏడుపు మొదలుపెట్టింది!
మంచంలో ఉన్న రాజయ్య "ఊరుకోయే!" అని కసిరాడు!
నాగమ్మ రెచ్చిపోయి "ఇంత సేసినా. నీకు ఆ మీదే బెమ! అసలు నాకు తెలవకుండా ఆణ్ని తోటలో ఎందుకు సేరనిచ్చావ్? ఆడికి కళ్ళు కుట్టి సేతబడి సేసేశాడు. అనుభయించు" అని మెటికలు విరిచింది.
వెంకడు చేతబడి చెయ్యబట్టే రాజయ్యకు పక్షవాతం వచ్చిందని అందరూ అంగీకరించారు! చుట్టుప్రక్కల అందరూ రాజయ్యను చూడటం..... అది చేతబడేననటం...... ఎప్పుడెప్పుడు. ఎక్కడెక్కడ.... ఎవరెవరికి, ఎవరెవరు చేతబళ్ళు చేశారో, ఆ చేతబళ్ళు ప్రభావం చేత ఏం జరిగిందో అవన్నీ కథలుగా చెప్పుకోవటం..... తిరుగు చేతబడి చేయమని సలహాలివ్వడం - ఇవన్నీ పరిపాటి అయిపోయాయి!
"అయ్యకి సేతబడి సేసి ఈ కాస్త తోటా ఊడలాక్కోవాలనుకుంటున్నాడు! చచ్చినా ఆణ్ని తోటలో అడుగెట్టనివ్వను" అని నాగమ్మ వెంకణ్ని తోటలోంచి వెళ్ళగొట్టింది!
పనిపాటలకలవాటుపడిన మనిషే గనుక తోటపనులన్నీ తనేచూసుకోసాగింది. వెంకడి బదులు తనకి తోడుగా ఉండటానికి నెలజీతం మీద మరో మనిషిని కుదుర్చుకుంది.
ఇదంతా ఎంత బాధగా ఉన్నా, రాజయ్య నోరుమెదపలేకపోతున్నాడు, మామూలుగానే రాజయ్య నాగమ్మకి ఎదురు చెప్పలేకపోయేవాడు. మంచంలో లేవలేకపడిఉండి, అన్నింటికీ నాగమ్మ మీద ఆధారపడి ఉన్న స్థితిలో నాగమ్మనేం ఎదిరించగలడు?
చంద్రి అసలేం చెప్పలేకపోతోంది. తల్లికి తన మీద ఎంత ప్రేమ ఉన్నా, మాటకి ఎదురుచెపితే మాత్రం ఊరుకోదు.
మరొకసారి నిరాశ్రయుడైన వెంకడు చేసేదిలేక సరళను ఆశ్రయించాడు! సంగతి తెలుసుకున్న సరళ అతడ్ని తమ పొలంలో పాలేరుగా ఉండమంది.
సారధి కొద్దిగా సణుగుతూ "లేనిపోని నిందలొస్తాయక్కా" అనేశాడు!
సరళ తమ్ముడిముఖం నిశితంగా చూస్తూ "నిందలొస్తాయా? కొత్తగా ఏం వస్తాయిరా? పోనీ, ఈ అక్క దగ్గిర ఉండటం నీకు పరువు నష్టమనుకుంటే విడిగా ఉండు. ఇప్పుడు నువ్వు చదువుకున్న వాడివి! ఉద్యోగస్తుడివి" అంది.
గతుక్కుమన్నాడు సారధి! "అంత మాటనకు అక్కా నీ మేలు ఆలోచించి అన్నాను! ఈలోకం సంగతి నీకు తెలియదు" అన్నాడు.
నీరసంగా నవ్వింది సరళ!
"లోకం సంగతి నాకెందుకు తెలియదురా. అందరూ ఆ రోజు లేనిపోని నిందలు అంటగట్టి ఆ వెంకణ్ని గొడ్డును బాదినట్టు బాదుతోంటే పాపం, చచ్చినట్టు భరించాడు. నన్ను వాడి వెంట ఇంటిలోంచి బయటికి గెంటితే..... తనకు తినటానికి లేకపోయినా, నా భారం, నీ భారం కూడా నెత్తిమీద వేసుకుని తన వెంట తీసుకెళ్ళాడు! ఈనాడు నా పరిస్థితి చక్కబడి వాడు కొద్దిపాటి ఆశ్రయం కోరితే నిందలకు భయపడి పొమ్మని అనగలనా? నేను కూడా లోకంలో అందరితోపాటు దాన్నే అనుకుంటున్నావా?" అంది!
సారధి ఇంకేం మాట్లాడలేదు.
సరళ అక్కడితో వదిలిపెట్టలేదు!
"ఇందులో నా స్వార్ధం కూడా ఉంది సారధీ. వెంకడ్ని నా పొలంలో ఉంచితే ఏ పరిస్థితుల్లోనైనా వాడు ఆ పొలాన్ని వెయ్యి కళ్ళతో కాపాడతాడు. ఆ విశ్వాసం నాకుంది! చాలామంది చదువుకున్న వాళ్ళకంటే, పెద్దింటి వాళ్ళకంటే అమాయకుడయిన వాడి మనసుచాలా గొప్పది!
సారధి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. తమను ఆదుకున్నది జైహింద్ బాబు! వెంకడుకాదు. అలాంటప్పుడు తాము వెంకడికెందుకు కృతజ్ఞతలు చూపించాలి? వాడికేం కూలి మనిషి. తమదగ్గిర కాకపోతే, మరొకచోట కూలిపని చేసుకోగలడు! తన అక్క దేవత. ఆ సంగతి తనకు తెలుసు. కానీ, అంతకుముందే, ఎవరి కారణంగా నిందలపాలయిందో, అదే వ్యక్తిని తెచ్చి తమ పొలంలో పెట్టుకోడం దేనికి?
మనసులో యిలా ఆలోచించినా, అక్కముందు నిలిచి మరో మాట అనటానికి సాహసం కలగలేదు సారధికి.
ఆ ఇంటిలోంచి దూరంగా పోయినా చంద్రిని కలుసుకోవటం మానలేదు వెంకడు. వారానికో, పదిరోజులకో, ఒకసారి వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా చంద్రికి ఏదో ఒక బహుమానం తీసుకొచ్చేవాడు. అవి తీసుకోవటానికి చంద్రికి చాలా సిగ్గుగా ఉండేది.
"అన్నా! నిన్ను యింటిలోంచి అమ్మ పొమ్మంటూంటే నోరు మూసుకుని చూస్తూ కూచున్నాను. పాపిష్టిదాన్ని. నామీద కోపం ఉంచుకోకుండా, యింకా నాకోసం అవీ, ఇవీ తెస్తున్నావు నువ్వు. వద్దన్నా సుఖంగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు" అనేది.
చంద్రి అలా మాట్లాడితే, వెంకడు బాధపడేవాడు! "అదేంటి సెల్లే! నీ మనసు నాకు తెలవదా? నిన్ను సూడకపోతే నా పేనం నిలవదమ్మా!" అనేవాడు!