Previous Page Next Page 
రక్షరేకు పేజి 34


    వెంకణ్ని బాధపెట్టలేక అతడు తెచ్చినవి తీసుకునేది.
    నాగమ్మ మీద మరో పిడుగు పడింది. రాజయ్య తోట వేసుకున్న స్థలం యజమానివచ్చి తన స్థలం తను స్వాధీనం చేసుకుంటానన్నాడు. నాగమ్మ లబోదిబోమని మొత్తుకుంది! తన దగ్గిర ఆ స్థలం కపులుకు తీసుకున్న రాజయ్య మంచమెక్కాడు గనుక. తన స్థలం తను స్వాధీనం చేసుకోవటములో తప్పు లేదన్నాడు యజమాని.....
    తన గతేం కావాలని అడిగిన నాగమ్మతో "ఇన్నాళ్ళు నువ్వు నా పొలం చేస్తున్నావా? ఇప్పటివరకూ ఏం చేస్తున్నావో అదే చేసుకో" అని దబాయించాడు.
    ఎంత నోరుగలదైనా ఆడది! నాగమ్మ ఒక్కర్తే ఏం చెయ్యలేకపోయింది. అప్పటివరకూ తమకు కొంత బాగా బతకటానికి ఆస్కారంగా ఉన్న తోట పోయింది. రాజయ్య మంచమెక్కాడు, నాగమ్మపని అన్ని విధాలా అధ్వాన్నమయింది!
    "అమ్మా! నేను ఎక్కడయినా పని కుదురుకోనా?" అడిగింది చంద్రి.
    బావురుమని ఏడ్చింది నాగమ్మ. తమ బిడ్డని మిగిలిన అందరిలా పాచిపనికి పంపించాలనే ఆలోచనకు రాజయ్య కూడా తట్టుకోలేకపోయాడు.
     "ఆ తోట అట్టా లాక్కోటం అన్నేయం. జయన్ననడిగితే వకీలు బాబుతో ఆలోచించి ఏదో సేస్తాడు. సరళమ్మ భూమి సరళమ్మకిప్పించలా?" అన్నాడు రాజయ్య.
    ఈ ఆలోచన నాగమ్మకి వచ్చింది. జయన్న అంతటి సమర్ధుడని నాగమ్మకీ తెలుసు.
    "ఒసేయ్! చంద్రీ! యెల్లి జయన్న బావనో సుట్టుపిలుసుకు రావే!" అని కూతుర్ని బ్రతిమాలింది.
    "బావిలోపడి చస్తాకాని బావతో మాట్లాడను. నేను నీ కూతుర్ని. కట్టుదప్పిన పనులు నేనెందుకు చేస్తాను?" పెంకిగా అంది చంద్రి.
    నాగమ్మ విధిలేక జైహింద్ బాబు ఇంటికెళ్ళింది. మంచంలో పడివున్న అన్నమ్మను ఆప్యాయంగా పలకరించింది.
    అన్నమ్మ ఆశ్చర్యపోయింది.
    "ఏంటే వదినా, ఆడ నా మావ అట్లా అయిపోయినాడు. ఈడ నువ్విట్లా అయిపోయినావు. ఏంటో ఎవరి అదురుట్టమూ బాగోనేదు" అని కన్నీళ్ళు పెట్టుకుంది నాగమ్మ.
    "మా జయన్న సదువయిపోతే మా కట్టాలు గట్టెక్కుతయి" ఆశగా అంది అన్నమ్మ.
    ఎప్పటిలా జైహింద్ బాబు చదువుని తీసిపారేస్తూ మాట్లాడలేదు నాగమ్మ.
    "జయన్న చాలా గొప్పోడొదినా! ఆడిలాంటోడు మనోల్లలో ఎవరులేరు" అంది.
    అన్నమ్మ పొంగిపోయింది. తన కొడుకుని అంతగా పొగిడిన నాగమ్మ అపరాధాలన్నీ క్షమించేసింది.
    "జయన్ననోసారి నాకు కనపడమనొదినా!" ప్రాధేయపడుతూ అడిగింది నాగమ్మ.
    "అయ్యో! అట్లాగే పంపుతా!" అంది అన్నమ్మ.
    కాసేపు రత్నమ్మతో అదీ ఇదీ మాట్లాడి తను నూరితెచ్చిన చింతకాయ పచ్చడి రత్నమ్మచేతిలో పెట్టి వెళ్ళిపోయింది నాగమ్మ.    
    తనను నాగమ్మరమ్మన్నదని తల్లి చెప్పగానే జైహింద్ బాబు వెళ్ళాడు.
    జైహింద్ బాబుని గుమ్మంలో చూడగానే చంద్రి రోషంతో "సిగ్గులేదూ! ఎందుకొచ్చావ్? ఛీకొట్టి పొమ్మన్నది మరిచిపోయావా? పౌరుషమున్నవాడివయితే మళ్ళీ ఈ ఇంటికి రావు" అంది.
    తెల్లబోయి నిలబడ్డాడు జైహింద్ బాబు.
    నాగమ్మ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ "రా జయన్నా దాని మాటలెక్కపెట్టకు, అదంతా నిన్ను పొమ్మన్నానని అక్కసులే పెద్దోల్లంగదా! కట్టుదప్పాలంటే భయంకాదూ! మీ అమ్మ మాత్రం కట్టు తప్పుద్దా? అట్లాగని రాకపోకలు మానుకుంటామా? ఈడ మనకెవరున్నారని? మీకు మేమూ, మాకు మీరూ......" అంది దీర్ఘాలు తీస్తూ.
    నాగమ్మకి తనతో ఏదో పని ఉందని అర్థమయిపోయింది జైహింద్ బాబుకి. అది ఆసరాగా తనను అవమానించినందుకు చంద్రి తల్లిమీద కసి తీర్చుకుంటోందని కూడా అర్థమయింది.
    నాగమ్మమీద జైహింద్ బాబు కేమీ కోపంలేదు. అందరికందరే! ఆ మూర్ఖత్వాలు అలాంటివి! ఎవరి మీద కోపం తెచ్చుకోగలడు తను?
    "ఇందులో పరాయివాళ్ళెవరు చంద్రీ! ఒక మాటన్నా అత్తే అనాలి. చేరదియ్యాలి!" అంటూ లోపలికి వచ్చి కూచున్నాడు.
    నాగమ్మ పొంగిపోయింది. "మా నాయనే!" అంటూ మెటికలు విరిచింది.
    చంద్రి చిరునవ్వుతో అతనినిచూసి చటుక్కున ముఖం తిప్పుకుంది!
    "జయన్నా! ఆ ముదనష్టపోళ్ళు ఇన్నాళ్ళు మా కట్టవూ కాదని ఆ తోటమాదంటన్నారు. నువ్వెట్లగయినా ఆ వకీలుబాబుతో చెప్పి మాతోట మాకిప్పించాలి!"
    తన గోడు చెప్పుకుంది నాగమ్మ..... రాజయ్య పక్షవాతంతో మంచమెక్కగానే ఆ తోట తనస్వాధీనం చేసుకుందుకు ఆ స్ధలం యజమాని ప్రయత్నించటం జైహింద్ బాబుకీ చాలా కోపం తెప్పించింది.
    ఆ తోటంతా రాజయ్య రెక్కల కష్టం. రాత్రనక పగలనక కష్టపడి బంజరు భూమిని బంగారంగా మార్చాడు. ఇప్పుడు దాన్ని లాక్కుని మంచమెక్కిన రాజయ్యని బికారిని చెయ్యాలనుకుంటున్నాడు యజమాని. ఈ షావుకార్లు బీదల రక్తం తాగి తమ ఇనప్పెట్టెలు నింపుకోవాలనుకుంటారు" అనుకున్నాడు ఆవేశంగా.
    "దిగులు పడకత్తా! వకీలు బాబుగార్ని కనుక్కుంటాలే! ఆయన న్యాయం చేస్తాడు" అన్నాడు.
    "మా నాయనే! నా తండ్రే! పది కాలాలపాటు చల్లగా వుండు. బాగా చదువుకొని పెద్ద దొరవుకా?" అని ఆశీర్వదించింది నాగమ్మ.
    ఆ ఆశీర్వాదంలో రెండవభాగం వింటున్నప్పుడు మనస్సు కలుక్కుమంది జైహింద్ బాబుకి. చంద్రివైపు భావగర్భితంగా చూసి అక్కడినుంచి వచ్చేశాడు.
    వ్యాసమూర్తిని కలుసుకొని సంగతి సందర్భాలన్నీ వివరించాడు జైహింద్ బాబు!
    "తోట చూస్తున్న మనిషిని తీసేసి యజమాని మరొకరికిస్తే మనం పోట్లాడవచ్చు. కానీ చేస్తున్న మనిషి మంచమెక్కితే యజమాని ఆ తోట స్వాధీనం చేసుకోవచ్చు. నాగమ్మ ఇప్పుడు అమాంతం వచ్చి తోట తనదంటే కుదరదు. రాజయ్య ఒక్కడే ఆ తోటచేసేవాడా? అతనితో కలసి తోటచేస్తున్న వాళ్లెవరూ లేరా?" అని అడిగాడు వ్యాసమూర్తి.
    "వెంకడూ, రాజయ్య కలిసే చేసుకొనేవాళ్ళు. దగ్గిర దగ్గిర ఈ రెండేళ్ళుగా అలాగే చూసుకొంటున్నారు"
    "వెంకడు, రాజయ్యకేమవుతాడు?"
    "కొడుకు!"
    "అయితే ఇకనేం? వెంకడు ఆ తోటను చేసుకొంటానని యజమానితో పోట్లాడవచ్చు. అప్పుడు ఆ తోట తీసుకొని మరొకరికివచ్చే అధికారం కాని, స్వాధీనం చేసుకొనే అధికారం కాని యజమానికి వుండదు"

 Previous Page Next Page