16
వర్షాకాలం - తుఫాను గాలులు వీస్తున్నాయి. నాలుగయిదు రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది.
ఆ వానలో, యీదరగాలిలో రాజయ్యను పనిలోకి రావద్దని చెప్పాడు వెంకడు.
దానికితోడు అంతకుముందు నాలుగయిదు రోజులనుంచీ అతనికి కొద్దిగా జ్వరంకూడా వస్తోంది. అంచేత బద్ధకించి ఇంట్లోనే పడుకున్నాడు.
నాగమ్మ అదిచూసి విసుక్కొంటూ "నువ్విట్టా పడుకుంటే తోట యేమయిపోవాల? ఎవడేనా ఆ కాసిని కూరానారా కోసుకుపోతే, మనకెట్టా గడుస్తది?" అని సతాయించటం మొదలుపెట్టింది.
తోటలో వెంకడున్నాడని చెప్పడానికి భయపడ్డాడు రాజయ్య.
"ఫరవాలేదు లేవే!" అన్నాడు జ్వర భారంతో.
"ఏం ఫరవాలేదూ! నీకు బాగోకుంటే నువ్వు పడుకో! నేనే పోతా! అని రుసరుసలాడుతూ బయలుదేరింది.
అక్కడితో హడలిపోయాడు రాజయ్య.
"వద్దులేవే! నేనే పోతా!" అని లేచి కంబళి కప్పుకొని పెద్దతాటాకులగొడుగు తీసుకొని బయలుదేరాడు.
నాగమ్మకి రాజయ్యపైన అభిమానం ఉంది. కానీ అంతమాత్రం జ్వరానికి ఆ కుటుంబాల్లో ఎవరూ పడుకోరు. నాగమ్మా పడుకోదు.
రాజయ్యకు జ్వరంగా ఉండి లేవలేకపోతే నాగమ్మ తనే బయలుదేరతానంటుంది. కానీ తోటని అలా దక్షతలేకుండా వదిలెయ్యనియ్యదు.
ఏదో పరాగ్గా ఆలోచిస్తూ నడుస్తున్నాడు రాజయ్య.
అదంతా మిట్టపల్లాలతో ఉన్న కంటోన్ మెంట్ ఏరియా...... వానలు పడటంతో అంతా బురదగా, రొచ్చుగా తయారయింది.
అలవాటయిన దారికదా అని చూసుకోకుండా నడుస్తున్నాడు రాజయ్య.
అతనికాలు జారింది.
ధన్ మని ఆ బురదలో పడిపోయాడు.
అతని చేతిలో తాటాకు గొడుగు ఎగిరి అల్లంత దూరాన పడింది.
అలా బురదలో పడిపోయిన రాజయ్య తనంత తను లేవలేకపోయాడు, కేకలు పెట్టినా ఆవర్షపు హోరులో ఎవరికీ వినిపించలేదు. పాపం, నడివయసు దాటిన రాజయ్య జ్వరంతో ఆ వర్షంలో ఆ బురదలో పడి ఉండవలసివచ్చింది. చలికి గడగడలాడిపోతూ ఓపికున్నప్పుడు అరుస్తూ అలా వుండిపోయాడు సాయంత్రం వరకు....
రాజయ్య ఎంతకూ రాకపోయేసరికి, కంగారుపడి నాగమ్మ బయలుదేరింది. దారిలో వంటిమీద తెలివిలేకుండా బురదలో పడిపోయి ఉన్న రాజయ్యను చూసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ లేవదియ్యబోయింది. దానివల్ల కాలేదు. కొయ్యబారినట్లు అయిపోయాడు రాజయ్య. నాగమ్మ గుండె బెదిరింది, గోలు గోలున ఏడుస్తూ గుడిసెల్లో వాళ్ళని నలుగురినీ పోగుచేసుకొచ్చింది. అందరూ కలిసి సాయంపట్టి రాజయ్యని ఇంట్లో చేర్చారు ఎలాగో.....
పాపం. వెంకడికి ఈ సంగతులేమీ తెలియవు. వర్షంగా ఉండటంవల్ల.... తను రావద్దనటంవల్ల తన తండ్రి రాలేదని అనుకున్నాడు. తండ్రికి తన మీద ఉన్న విశ్వాసానికి ఆనందించాడు.
మూలుగుతూ పడుకున్న తండ్రి దగ్గిరే కూచుంది చంద్రి-తండ్రిని ఆ దశలో చూసేసరికి చంద్రికి ఆగలేదు. తండ్రి తననెంతో అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. పాపం, ఇలా పడిపోయాడు. తండ్రి కోసం ఏడుస్తూ కూచున్న చంద్రికి. ఈవిషయం వెంకడికి తెలియపరచాలనే ఆలోచనే రాలేదు.
ఆ మరునాటికల్లా పెళ్ళుమంటూ జ్వరం ముంచుకొచ్చింది రాజయ్యకి. వంటిమీద స్పృహలేకుండా మూలుగుతున్నాడు. ఆ దశలో రాజయ్యని ఆస్పత్రిలో చేర్పించారు.
అప్పుడు తెలిసింది వెంకడికి అసలు సంగతి. గోడు గోడున ఏడుస్తూ ఆస్పత్రికొచ్చాడు.
"తోటలో నేనున్నాగా పిన్నీ! మళ్ళీ అయ్యనెందుకు పంపావ్! సూడు! ఎంత పని జరిగిందో?" అన్నాడు.
తను ఇంట్లోంచి వెళ్ళగొట్టిన వెంకణ్ని రాజయ్య తోటలో పెట్టుకున్నాడనేసరికి అంత దుఃఖంలోనూ మండిపోయింది నాగమ్మకి. పై పెచ్చు తన కారణంగానే రాజయ్య ఇలా అయిపోయాడని వెంకడంటూంటే భరించలేకపోయింది.
"శని మొఖమోడా! దీనికంతకీ నువ్వే కారణం. ఆ తోట మొత్తం కాజెయ్యాలని, నువ్వే ఏదో మంతరం పెట్టావు. కాకుంటే ఇన్నాళ్ళు మట్టీ, వానలో, వరదలో, ఎండనక, కొండనక తిరుగుతున్నాడు గందా, ఎప్పుడైనా కాలుజారిపడ్డాడా? ఫో! ఫో!" అని కసిరింది.
చంద్రి అంతా వింటూనే ఉంది, బాధపడింది. కానీ తండ్రి అలా ఉన్న స్థితిలో తల్లితో పోట్లాడటానికి తండ్రిని వదిలి వెంకడి దగ్గిరకొచ్చి వెంకణ్ని ఓదార్చటానికి ఓపిక లేకపోయింది.
బిక్క ముఖం వేసుకుని మనసులో కుమిలిపోతూ వెళ్ళిపోయాడు వెంకడు.
వెంకడు మంత్రం వేశాడనీ, అందుకే ఎన్నడూ లేనిది, రాజయ్య జారిపడి ఆస్పత్రిలో చేరవలసి వచ్చిందనీ, క్షణాలలో గుడిసెలన్నింటిలోనూ వార్త పాకింది. అందరూ ఆ వార్తని నమ్మారు.
కుతూహలంతో తనను ప్రశ్నలు వేసే తోటివారికి ఆ విషయాన్నే చిలువలు పలువలు చేర్చి చెప్పింది నాగమ్మ. అందరికీ చెప్పి చెప్పి, నాగమ్మ మనసులోనే ఆ విషయం ధ్రువపడిపోయింది. వెంకడి మంత్రం వల్లనే రాజయ్య ఆ స్తితికి వచ్చాడని మనసారా నమ్మేదశకు చేరుకుంది నాగమ్మ.
తండ్రి ఆరోగ్యం కోసం బెంగపడుతూ తండ్రి సంరక్షణలో ఉన్న చంద్రి ఈ విషయాలేవీ పట్టించుకోలేదు.
రాజయ్య జబ్బు సంగతి విని జైహింద్ బాబు కూడా చూడ్డానికి వచ్చాడు. నాగమ్మ అతడి రాకను సహించలేకపోయింది.
"తగుదునమ్మా, అని బిడ్డ పెళ్ళి సెడగొట్టి ఏ మొకమెట్టుకోని, ఈడకి సూట్టానికొచ్చావు? ఎల్లెల్లు? నా బిడ్డ గొంతు నులిమి నూతిలో పారేస్తా కాని, కట్టుదప్పి వరసలేని మనువు సేసుకోనియ్యను. సేసేయన్నీ సేసి. ఏ మెరగనోడిలాగ స్నేహితాలు సూపుదామనుకుంటున్నావా? మల్లా మా జోలికొచ్చినావంటే మరియాద దక్కదు, మా ఇంటికేసి రాబోకు! నీతో మంచీ, సెడ్డా మాకేం అక్కర్లేదు ఫో!" అని కసిరికొట్టింది.