Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 31


    చాలా నాసిరకం ధాన్యం. ఎరుపు కలిసిన గోధుమరంగులో వుండి, గింజ ముట్టుకుంటే విరిగిపోతుంది.
    నామాలయ్య పంటలు పండించుకుంటున్నాడేకాని, తగిన ఎరువులు వేసి భూమిని సారవంతం చెయ్యటం లేదు. అంచేత భూమి ఏడాది తిరిగేసరికి నిస్సారమైపోతోంది. ఇలా కొనసాగితే, కొంతకాలానికి ఆ భూమిలో జొన్నలు కూడా పండవు.
    చిచ్చు ఆ భూములు తిరిగి చూశాడు కోయ యువకులతో!
    "ఈ భూముల్లో ఇంక వరి వేసి లాభం లేదు. ఈ మట్టిలో వేరుశనగ పండే అవకాశాలున్నాయి. నేల దున్నుకుని తగిన ఎరువులు వేసుకుంటే, మనకి బావి ఉంది కనుక మంచి పంట దిగుబడి కావచ్చు."
    "కానీ, మాకు ఎరువులు అప్పెవరిస్తారు? అప్పివ్వకుండా చేస్తానని శపథం చేశాడు నామాలయ్య. సునాయాసంగా ఆ శపథం నెగ్గించుకుంటాడు."
    నిరాశగా అన్నారు కోయ యువకులు.
    "ఏడిశాడు" ఒక్క మాటలో తేల్చేశాడు చిచ్చు.
    తనకి అలవాటయిన ధోరణిలో నుదుటిమీద పడ్డ జుట్టు పొగరుగా వెనక్కి విసురుకున్నాడు.
    "మీకు అప్పు నేనిప్పిస్తాను. ఎరువులకే గాడు మోటారుకి కూడా ఇప్పిస్తాను. ట్రాక్టర్ అద్దెకి తెప్పించుకునే అవకాశం నేను కల్పిస్తాను. ఈ ఊళ్ళో రెండేళ్ళ కిందట పెట్టిన అగ్రికల్చరల్ బ్యాంక్ లో మా సీనియర్ పనిచేస్తున్నాడు. మనకే సహాయం కావాలన్నా చేస్తాడు. నామాలయ్య మిమ్మల్నేమీ చెయ్యలేడు. ఎటొచ్చీ మీరు కొంత కాలం కష్టపడాలంతే! మీకు నేనున్నాను."
    చిచ్చు అంత దర్జాగా చెపుతోంటే, పైగా "మీకు నేనున్నాను" అంటోంటే అతడు కోయ వాళ్ళందరికీ నెమలి పింఛమూ, మురళి లేని గోవర్ధనోద్ధారకుడిలాగే కనిపించాడు.
    కోయ వాళ్ళలో ముసలివాళ్ళు మాత్రం "నామాలయ్య ఏదో యిస్తున్నాడు తీసుకుని పడుండక, ఎందుకొచ్చిన గొడవల్రా ఇయన్నీ?" అని సణిగారు.
    "పాండెహె! మన పొలాన్ని మనమే కవులుకిచ్చుకుని మన పొలాల్లో మనమే కూలీలుగా పని చేస్తున్నాం!
    సిగ్గూ శరమూ లేదు మనకి! కొన్నాళ్ళు కష్టపడితే, బతికినంత కాలమూ సుఖపడొచ్చు. మన పొలం! మన నేల!" ఉద్రేకంగా ఎదురు తిరిగారు యువకులు.
    ఈ పరిణామానికి నిర్ఘాంతపోయాడు నామాలయ్య. అప్పటివరకూ ప్రమధపురిలోనూ, అడవిలోని కోయ గ్రామాలలోనూ అతడి మాటకి ఎదురుండేది కాదు.
    ఇన్నాళ్ళకి చవటలుగా, మూర్ఖులుగా తన చేతి కీలుబొమ్మలుగా ఉన్న అడవుల్లోని కోయలు తననెదురిస్తున్నారు. మనసులో పళ్ళు నూరుకున్నాడు.


                            *    *    *    *


    "ఎక్కడికి?"
    నడుస్తున్న రాణి ఆగిపోయింది. వెనక్కి తిరిగి చిచ్చుని చూసింది.
    "నాతో చెప్పకూడదా?" కన్పించాడు చిచ్చు.
    "ఏం? నువ్వూ నాతో వస్తావా?"
    "రానిస్తే"
    "నేను తోటకి పోతున్నా! పూల కోసం!"
    కొండ దేవత ప్రఖ్యాతిలోకి వచ్చాక, ఆ దేవతకి దండల కోసం పూజకి పూల కోసం ప్రత్యేక తోట వేయించాడు నామాలయ్య. అయితే ఆ తోటలోకి అందరికీ ప్రవేశం లేదు.
    "మీ తోటలోకి నన్ను రానియ్యరుగా!"
    ఏదో సర్వనాశనమయిపోయినంత దిగులుగా అన్నాడు చిచ్చు.
    "నాతో వస్తే రానిస్తాను. ఎవరినీ రానియ్యరు."
    అంటే, తోటలో రాణితో ఏకాంతం ఉంటుందన్న మాట! విజిల్ వేశాడు ఉత్సాహంతో!
    రాణి పది వంకర్లు తిరిగిపోతూ "పో! పోకిరి వేషాలు!" అంది.
    చిచ్చు విజిల్ వేసింది రాణీని ఉద్దేశించి కాదు. తన మనసులో ఏదైనా ఆలోచన స్ఫురించినప్పుడల్లా, అలా విజిల్ వెయ్యటం చిచ్చు అలవాటు. మనసులో నవ్వుకున్నాడు. రాణితో తోటలోకి వచ్చాడు. తోట పెద్దది కాదుకానీ, అందంగానే ఉంది. చామంతులు, గులాబీలు, మల్లెలు, బొడడు మల్లెలు, మందారాలు, ఎర్ర గన్నేరులు మొదలైన పూలు చాలా ఉన్నాయి.
    పూలు కోస్తూ చిచ్చుని వీలుగా చూసి నవ్వింది రాణి.
    రాణి దగ్గిరగా వస్తే "పూలెవరికీ?" అంటూ మాట కలిపాడు.
    "ఇంకెవరికి? దేనికోసం!"
    "ఇంకా దేవి పూజ జరుగుతోందా?"
    చురుగ్గా చూసింది రాణి.
    "ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. పూజలెందుకు ఆగుతాయి?"
    "నువ్వు నిజంగా గొప్ప భక్తురాలివి."
    "ఏదో_"
    సిగ్గులు పోయింది.
    "అంతకంటే అందమైన దానివి."
    చెవి దగ్గిర గుసగుసగా అన్నాడు.
    "ఊ__"
    గారాలు పోయింది.
    "నిన్నొకటి అడుగుతాను, నిజం చెపుతావా?"
    "నువ్వేది అడిగినా నిజమే చెపుతాను."
    "జ్యోతి రహస్యం ఏమిటి?"
    "నిజం చెప్పెయ్యనా? మళ్ళీ ఎవరికీ చెప్పవుగా!"
    "చెప్పను. ఒట్టు!"
    "మరికాస్త ముందుకు వంగి, రాణీ చేతిలో చెయ్యి వేశాడు.
    "చెప్పేస్తున్నా మరి!"
    "చెప్పు. ప్లీజ్!"
    "ఇళ తన అనుచరులైన గూండాలతో జ్యోతి వ్యవహారం నడిపిస్తోంది. జ్యోతిని నడిపిస్తున్నదీ, మీ విదుషిని, ఇంకా కొంతమందినీ మాయం చేసిందీ ఇళ!"
    "బ్రహ్మ రాక్షసీ!" తనను తాను మరిచిపోయి, రాణిని కోపంగా, కసిగా వెనక్కి తోశాడు.
    దబ్బున మొక్కల మధ్య పడింది రాణి. దుమ్ము దులుపుకుంటూ లేచి మెటికలు విరుస్తూ అరిచింది.
    "సచ్చినోడా! నాతో నాలుగు మంచి మాటలాడి కూపీ లాగుదామనుకున్నావా? నేనంత పిచ్చిదాన్ననుకున్నావా? విదుషినీ, మిగిలినోళ్ళనీ ఇళే చంపింది. ఇళని జైల్లో పెడతారు. ఇళని ఉరి తీస్తారు."
    మెరుపులా అక్కడి నుండి మాయమయ్యాడు చిచ్చు.
                                              *    *    *    *

 Previous Page Next Page