పడుకుని ఉన్నవాడల్లా కళ్ళమీద నుంచి చెయ్యి తీసేసి తల పక్కకి తిప్పి చూసి అన్నాడు - "అమ్మ అంతా చెప్పేసిందన్నమాట."
"చెప్పింది. ఈ విషయం నాకు ఎందుకు చెప్పవొద్దన్నావో కూడా చెప్పింది" మోకాళ్ళమీద పక్కనే కూర్చుంటూ అన్నాను. "నేను ... నేనేం చెయ్యను?"
వెంటనే జవాబు చెప్పలేదు. నావైపు తదేకంగా చాలాసేపు చూశాడు. తరువాత చేయిసాచి పిలుస్తూ "ఇలా దగ్గిరకి రారా" అన్నాడు. వెళ్ళి ఆ చేతుల్లో మొహం దాచుకున్నాను. ఆ క్షణం చిన్నపిల్లవాడినే అయ్యాను. ఆ బలమైన చేతుల మధ్య నిజమైన నిశ్చింతని మొదటిసారి పొందాను.
"బాబూ! బాంధవ్యం కన్నా కర్తవ్యం గొప్పది. నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు..."
"కానీ ... కానీ నీకు తెలుసా నన్నా... రేపు ... రే... ప్రొ... ద్దు... న్నే నీకు..."
"నీ క్రింద ఆఫీసర్ చెప్పాడు. నేను బాధపడేది ఒకందుకే. మీ అమ్మగానీ ఆ రోజు నన్ను చూడటానికి రాకుండా వుండివుంటే ఈ నిజం శాశ్వతంగా బయటకు రాకుండా ఉండేది, తనకి అనవసరమైన వ్యధ తప్పి వుండేది."
నేను బాధగా అన్నాను- "తనకేనా నాన్నా వ్యధ? నాకు లేదా?"
"నేను నీకొకసారి చెప్పాను. తను తప్పు చేయటంలేదన్న నమ్మకం వున్న మనిషిని భయముగానీ, బాధగానీ ఏమీ చేయలేవు. అతడి దరిచేరవు. నా మార్గంపట్ల నమ్మకం వున్న నేను నెమ్మదిగా ఉరికంబంవైపు నడుస్తాను. నీ కర్తవ్యం మీద నమ్మకం వున్న నువ్వు నిబ్బరంగా తాడు బిగించు."
తలెత్తాను. "నాన్నా... 'కర్తవ్యం మీద నమ్మకం వున్న' అన్నావు. ఒకప్పుడైతే యీ పోలీసాఫీసర్ చాలా మామూలుగా నీ మెడకు తాడు బిగించి ఉండేవాడు. కనీ యిప్పుడు... యిప్పుడు నాకే 'కర్తవ్యం' అన్న మాటకు సరియైన అర్ధం తెలియటం లేదు. రేప్పొద్దున్న సూర్యోదయం అవుతూందంటేనే భయంగా ఉంది. నా కన్న తండ్రినే ఉరి తీయాల్ట. ... వేల వేల లక్ష్ముల పెద్ద అన్నయ్య శ్వాసని ఈ చేతుల్తో స్వయంగా ఆపు చేయాలట..."
"ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు! నీ బాధ కన్నతండ్రిని ఉరి తియ్యవలసి వస్తుందనా? గండ్రగొడ్డలిని ఉరి తియ్యాలనా?"
ఎంత చిన్న ప్రశ్న! కానీ సమాధానం మాత్రం మన రాజ్యాంగం అంత క్లిష్టమైనది!! ఈ వ్యవస్థ అంత పెద్దది!!!
జవాబు చెప్పటానికి తడుముకోలేదు.
"రెండోదే నాన్నా!"
ఆ కళ్ళు ఎప్పుడూ లేనంత ఉజ్వలమైన కాంతితో ప్రకాశించాయి.
"చాలు" అన్నాడు. "... నిన్ను చూస్తూంటే ఈ క్షణం నాకు గర్వంగా వుందిరా."
ఆ మాటలు నాకు అర్ధంకాలేదు. ఆ కంఠం ఒక నిండుతనంతో తిరిగి వినిపించింది.
"ప్రతి తండ్రీ తన కొడుకుని వళ్ళో పెట్టుకుని ఓనమాలు దిద్దిస్తాడు. మన కుటుంబాన్ని దురదృష్టం ముక్కలు చెక్కలు చేసింది. చిన్న వయసులోనే కొడుకుని కోల్పోయిన నేను, వాడెక్కడ పెరుగుతున్నాడో తెలియక ఇన్నాళ్ళూ బాధపడ్డాను. మొన్న అమ్మ నన్ను కలుసుకున్నాక, నువ్వింతవాడి వయ్యావని తెలిసి సంతోషించాను. ఆ తరువాత నువ్వొచ్చి ఆఖరి కోరిక ఏదయినా వుంటే తీరుస్తాను చెప్పమన్నావు. అప్పటివరకూ ఒక పోలీసాఫీసర్ గా మాత్రమే గుర్తించిన నిన్ను - మొదటిసారిగా నా కొడుకుగా నిండారా చూసుకున్నాను. ఒక ప్రతిష్టాకరమైన జైలుకు నువ్వు అధికారివి. నీ కళ్ళలో చట్టంపట్ల అపరిమితమైన నమ్మకం, దోషుల పట్ల విపరీతమైన కసి, ఇవే నాకు కనబడ్డవి. నా కొడుకుని కాస్త మరో విధంగా చూసుకోవాలనుకున్నాను. చిన్నప్పుడు మట్టిలో ఓనమాలు దిద్దించలేక పోయినందుకు ప్రతిగా, భగవంతుడు మరణించే ముందు నాకీ చివరి అవకాశం కల్పించాడనుకున్నాను. నిన్ను జనారణ్యంలోకి పంపించాను. నేననుకున్నట్టే నువ్వు కొన్ని జీవితపు చేదు పాఠాలు నేర్చుకున్నావు. అది చాలు. ఓంకారంతో ప్రారంభమైన నాదం విశ్వం అంతా శబ్దమై వ్యాపించినట్టు-ఈనాడు నీలో బయల్దేరిన అలజడి, ఒకనాటికి కార్యరూపం దాలుస్తుందని నాకు నమ్మకం ఉన్నది. ఈ క్షణం నా మనసు ఆనందంతో నిండి ఉంది. నా కొడుకు సరియైన పంధాలో ఆలోచించ గలుగుతున్నాడు.
నాయనా! నీకిదంతా వ్యర్ధ ప్రసంగంలా తోచినా సరే నన్ను మన్నించు. నా జీవితపు చివరి రాత్రి ఇది. ఇకముందు చెప్పాలన్నా నేను నీకు చెప్పలేను. చెప్పటానికి మిగిలి వుండను. కాబట్టి ఈ తండ్రి చెప్పదల్చుకున్నది చెప్పనీ.
బాధ పడుతున్నామనుకునే మనుష్యుల్లో నూటికి తొంభైశాతం మనుష్యుల బాధ కేవలం మానసికమైనదే. ఆ మానసిక బాధనే గొప్ప వ్యధగా రకరకాల కోణాల్లో వూహించుకుని వారు మరింత బాధపడుతూ ఉంటారు. తమ కన్నా 'నిజంగా' బాధపడేవారు తమ చుట్టూ కొన్ని లక్షలమంది ఉన్నారని గుర్తించరు వారు. ఆ నిజమైన బాధలు ఆకలి, రోగం, బీదరికం అన్నవి. కేవలం కాసింత చాడువుతప్ప మరేమీ తెలియని నేను, అన్నీ పోగొట్టుకుని కూడా ఈ రోజు ఈ విధంగా ఆలోచించగల్గుతున్నానంటే దానికి కారణం 'అడవే'. అడవి చుట్టూ వుండే బీదరికమే.
నీకు ఒక ఉదాహరణ చెపుతాను విను.
ఒక చెట్టుమీద ఆధారపడి వందమంది వున్నారనుకో! ఆ చెట్టు కేవలం పది కాయల్నే కాసిందనుకో... అవి దక్కిన పదిమందీ మరో నలభై ఒక్క మందికి, కనీసం తొక్కలు ఇస్తామని ఆశ పెట్టి కూడగట్టుకుంటే చాలు, యాభై ఒకటి- నలభై తొమ్మిది నిష్పత్తిలో వాళ్ళు నాయకులుగా ఎన్నికల్లో గెలుస్తారు. చెట్టుమీద అధికారం సంపాదిస్తారు. మన ప్రజాస్వామ్యం కూడా అలాటిదే. నలభై తొమ్మిది మందికి ఏమీ దక్కదు. నలభై ఒక్కరు మధ్యతరగతి మేధావులు. "కాస్త"కి ఆశపడి సంతృప్తి చెందేవారు. మిగతా పదిమందీ అసలు సౌఖ్యం అనుభవించేవారు.
ఈ పదిమందినీ మార్చగలిగేది కేవలం 'భయం' ఒక్కటే. అందుకే గొడ్డలి నా ఆయుధం అయింది. నలభై తొమ్మది మందికి నా చేతనైనంతలో నేను రక్షణ ఇవ్వగలిగాను. వాళ్ళ హక్కుల గురించి చెప్పగలిగాను.
ఈ రాత్రితో నా జీవితం ముగుస్తుంది. నీ చట్టం నన్ను చంపుతుంది.
నా ఆశయం నీకు నచ్చితే, నాయనా! మధ్యతరగతి మేధావుల్లో నేను చెప్పిన దాన్ని ప్రచారం చెయ్యి. నినాదాల వల్లా, కవిత్వాల వల్లా విప్లవం రాదు.
సమస్యని విపులంగా విప్పి చెప్పు. మరింకేదైనా పరిష్కారం వుందేమో వెతకమను. నీలాగా వారికి కూడా దొరకదు.
వారూ ఈ మార్గానికే వస్తారన్న నమ్మకం నాకుంది. ఈ దేశపు మేధావుల ఆలోచనా శక్తిమీద నాకు నమ్మకం వుంది. ఏ దేశపు విప్లవమైనా వారివల్లే వచ్చింది. నువ్వు వారికి తెలియజెప్పవలసిందల్లా మనకి కాస్త దూరంలో ఎంతోమంది అమాయకులు, కూలీలు, రైతులు ఎంత అన్యాయంగా నష్టపోతున్నారో చెప్పటమే.
నా కొడుకుగా నేను నిన్ను కోరుతున్నది అదే! నా వారసుడిగా నేను నీకిస్తున్నది కూడా ఒక్కటే... 'ఆలోచన'! వెళ్ళిరా నాయనా! చాలా రాత్రయింది మళ్ళీ ప్రొద్దునే నీ పని ప్రారంభమవుతుంది."
13
"ఏం భాయ్! ఏమిటింత హఠాత్ దర్శనం? ఇంతకాలం ఏమైపోయావ్? రేపు కూడా రావనే అనుకున్నాను" రాజారాం దూరం నుంచి హడావుడిగా వస్తూ అన్నాడు.
"అవును. రేపు కూడా శలవే" నిర్లిప్తంగా అన్నాను.
"రేప్రొద్దునే గండ్రగొడ్డలిని ఉరి తీస్తున్నాం తెలుసా నీకు? COPY OF THE LETTER మీ ఇంటికి పంపాను. అందిందా?"
"అందింది."
"సీనియర్ ఆఫీసర్ వి అయివుండీ ఇంత బృహత్కార్యక్రమం పెట్టుకుని నువ్వు లీవ్ పెట్టెయ్యటం ఏమీ బావోలేదు భాయీ."
ఇద్దరం ఉరితీత కంబం వైపు నడుస్తున్నాం. అక్కడ లివర్ లో ఒక జవాబు నూనెపోస్తూ, లివర్ మార్చగానే కాళ్ళక్రింద బల్ల క్రిందికి జరిగిపోతుందా లేదా అని చూస్తున్నాడు.
"నేను వెళ్ళొస్తాను" అన్నాను.
"వెళ్ళిరా, మాకెలాగూ తప్పదుకదా."
జైలు బాహ్య ద్వారం దగ్గిరకి వచ్చాను. నన్నుచూసి సెంట్రీ సెల్యూట్ చేసి తలుపు తెరిచాడు. బయటకు అడుగుపెట్టాను.
మరణించేవాళ్ళు ఎవరైనా లోపల ఉంటే, ముందురోజు రాత్రే జైలు బయట బంధువులు చేరటం మాకు కొత్తకాదు. కానీ ఇంతమంది జనాన్ని నేనెప్పుడూ చూడలేదు. బళ్ళలో వచ్చినవాళ్ళూ, నడిచి వచ్చిన వాళ్ళూ...
తల వంచుకుని నడుస్తున్నాను ఇంటివైపు.
'అన్నా' అన్నపిలుపు వినబడింది.
తలెత్తి చూశాను.
నారాయణ, లక్ష్మి, పక్కనే కుర్రవాడు.
ఊహించని రీతిలో నన్నక్కడ చూసి ఆ దంపతులు మొహాలు పట్టశక్యంగాని ఆనందంతో వెలిగిపోవటాన్ని ఆ చీకటిలో కూడా గమనించగలిగాను. నా దగ్గిరకి పరుగెత్తుకు వచ్చారు.
"ఎక్కడికి ఎల్లిపోయావన్నా. నీ కోసం ఎంత వెతికినామో! మా బిడ్డ నా దగ్గిరకొచ్చేసినాడు. అంతా నీ సలవే" అంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా కుర్రవాడిని నా కళ్ళమీదకు వంచుతూ 'మొక్కరా అన్నకి' ఈ అన్నే లేకుంటే యాభై ఏళ్ళొచ్చినా ఇంకా ఆ సిదానందం దగ్గిరే చాకిరీ చేస్తుండేటోడ్వి" అంటూ ముందుకు తోశాడు.
నేను చప్పున కాళ్ళను వెనక్కి తీసుకున్నాను.
లక్ష్మి ముందుకొచ్చి అన్నది- "అన్నా! పెద్దన్న పంపగా వచ్చినానన్నవ్ ఆ రోజు! ఇప్పుడు బహుశా పెద్దన్నని చూడటానికి లోపలికి పోయుంటవు. నీకు దెల్సినోళ్ళు ఎవరైనా వుంటే మమ్మల్ని కూడా లోపలికి పంపించు, తెల్లారితే పెద్దన్న మరి ఉండడంట."
నారాయణ భార్యని మందలించాడు.
"... ఎంత స్వార్ధమే ఎర్రిమొగవాఁ. ఇక్కడ యింతమంది జనం బయట యెదురు చూస్తూ ఉంటే నువ్వొక్కదానివే లోపలికి బోతావా?"
అంటూ నావైపు తిరిగాడు. "నువ్వు సెప్తే ఇనేటోళ్ళు ఎవరైనా లోపలుంటే పెద్దన్న నొకసారి చూపించమను బాబూ! ఆయన మా మడిసి... మా మధ్యలో వుండాల్సినోడు. ఒక్కసారి చూసుకుంటాము. చివరిసారి చేతులెత్తి దణ్ణం పెడతాం-"
ఆయన మా మనిషి- మా మధ్యలో వుండాల్సినోడు. ఇక్కడ ఇంతమంది జనం ఎదురు చూస్తూ వుంటే నువ్వొక దానివే లోనికి బోతావా-
మైకులో గీత ఇంకా వస్తూనే ఉంది.
పార్థా! ఫలాపేక్ష లేకుండా, చేయవలసిన పని చేసే కర్మయోగికీ, సన్యాసికి భేదమే లేదు. కర్మ సన్యాసం కంటే కర్మఫలం సన్యాసం గొప్పది. తనకు తనే మిత్రుడు, తనకు తానే శత్రువు, తనకు తాను గురువు అయినవాడు మాత్రమే గమ్యాన్ని సాదించగలుగుతాడు. అలా సాధించాలంటే తన నిర్ణయాలు తానే తీసుకోవలసి వుంటుంది.
....