Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 31


    బ్రహ్మాండమైన పార్టీ ఏర్పాటు చేసాడు రాజభూషణం. అనంగ్ వస్తూనే.
    "మృదుల వచ్చిందా?" అని అడిగాడు.
    "వస్తుందొస్తుంది. రిలాక్స్! వస్తున్నానని ఫోన్ చేసింది. ఈ నిముషమో, మరో నిముషమో వచ్చేస్తుంది."
    గ్లాసులో విస్కీ పోసి అనంగ్ కి అందిచ్చి, తనూ మరో గ్లాసులో పోసుకుని, అనంగ్ గ్లాస్ కి ఆనించి ఛీర్స్ చెప్పాడు రాజభూషణం పి.ఎ. ఇద్దరూ ఛీర్స్ చెప్పుకుంటూండగా ఫోటో తీసాడు. తనకింత ప్రత్యేక గౌరవం ఇచ్చినందుకానందించాడు అనంగ్.
    గిరిజన యువతి పళ్ళెంలో తినుబండారాలు వేసుకుని వాళ్ళ మధ్యకొచ్చింది. ఫోటోలు తీస్తూనే ఉన్నాడు పి.ఎ. గిరిజన యువతిని చూసి ముఖం చిట్లించుకుని స్వర్గానికి పోతూ పిల్లిని చంకన బెట్టుకెళ్ళినట్టు, ఇక్కడిక్కూడా గిరిజన యువతి ఎందుకండి!" అన్నాడు విసుగ్గా.
    "అదేంమాట దొరా! నాకేం తక్కువైంది" అమాంతం అతడి ఒళ్ళో పడిపోయింది. మెడచుట్టూ చేతులు వేసి అతని మొహాన్ని తన మొహంమీది కొంచింది. ఆ భంగిమల్లో రకరకాలు ఫోటోలు తీసేసాడు. పి.ఎ. గిరిజన యువతి తనమీద పడుతూండగా, ఫోటోలు తీసేటప్పుడు రాజభూషణం పక్కకి తప్పుకున్నాడని గమనించలేదు అనంగ్. గిరిజన యువతి చేతుల్లోంచి తనకు తన్ను తప్పించుకొనే ప్రయత్నంలో మునిగి వున్నాడు. ఈ రకంగా గంటసేపు గడిచింది పార్టీ. గిరిజన యువతితో ఉన్న అనంగ్ ఫోటోలు రకరకాల భంగిమల్లో పదికిపైగా సంపాదించగలిగాడు రాజభూషణం. ఇంచుమించు అన్ని ఫోటోల్లోనూ గిరిజన యువతి అనంగ్ బారి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తూన్నట్లుగా వచ్చింది పోజు. ఆమె ముఖంలో ఆ బాధ స్పష్టంగా కన్పిస్తోంది ఫోటోల్లో.
    "అనంగ్ సహజంగా విలాస పురుషుడు. అతడికెందరో ఆడ స్నేహితులున్నారు. అడవుల్లో గిరిజనులను కూడా చదువుకుని డిగ్రీలు తెచ్చుకుని- ఉద్యోగాలు చేసుకుంటూన్న తన గాళ్ ఫ్రెండ్స్ లాగే అనుకుని "గది కొస్తావా?" అని ధైర్యంగా అడిగేసాడు. రచయితకదాని గౌరవించి పార్టీయిచ్చిన నేరానికి నేను కూడా గిరిజనుల దెబ్బలు తినవలసి వచ్చింది." అని స్టేట్ మెంట్ యిచ్చాడు రాజభూషణం. ఈలోగా శేషాచలపతి గిరిజనుల్లో గ్రామ పెద్దల్ని డబ్బుతోను- కల్లు ముంతలతోనూ కొనేసాడు. వాళ్ళల్లో ఎవరికీ అనంగ్ మీద ప్రత్యేకమైన గౌరవం- సానుభూతి లేవు. నిస్సంకోచంగా అనంగ్ చుట్టూ తిరిగే అతని గాళ్ ఫ్రెండ్స్ లో ఏ ఒక్కరూ ముందుకొచ్చి అనంగ్ తప్పేమీ లేదని కోర్టులో సాక్ష్యం చెప్పలేదు.
    ఆ పరిస్థితుల్లో నిర్భయంగా బోనులో నిలబడి నిజం చెప్పింది మృదుల. "అనంగ్ గారు మంచి టాలెంట్ వున్న రచయిత. ఆయన ఇంటీరియర్ ట్రైబల్ విలేజి నేపథ్యంగా తీసుకుని నవల రాస్తానంటే ఆయన్ని నావెంట కనుకునూరు రమ్మని ఆహ్వానించాను. ఆయన నాతోనే బస్సులోనే ప్రయాణం చేసి నీలంపల్లివరకూ వచ్చారు. మూలాగ గుఱ్ఱాలమీద అడవి దారిలో రాలేక, శోవమ్మ వెంట నడచివస్తూ కేవలం కాకతాళీయంగా జీపులో వెళుతూన్న రాజభూషణంగారిని కలుసుకున్నారు అంతకు మించి జరిగిందానిలో అనంగ్ గారి ప్రమేయమేమీ లేదు. నాకు బాగా తెలుసు."
    తన చెవులను తను నమ్మలేకపోయాడు అనంగ్. ఈ అమ్మాయిమీద దెబ్బ తీయాలనే కసితో వచ్చి రాజభూషణం ట్రాప్ లో ఇరుక్కుపోయాడు తను. ఈ గుడ్డి సమాజం ఏవైనా అనుకుంటుందమోనని లెఖ్కపెట్టకుండా బోనులో నిలబడి తనని కాపాడడానికి సాక్ష్యం చెప్పిందీవిడ.
    మృదుల స్వయంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పగానే శోవమ్మ- మరికొందరు మృదుల శిష్యులు కూడా జరిగిందేదో నిర్భయంగా నిజం చెప్పారు. రాజభూషణం ఇరికించిన ఊబిలోంచి బయట పడగలిగాడు అనంగ్.
    చదువుకోని ఆడవాళ్ళు, చదువుకున్న అమ్మలక్కలు- ఒకేరకంగా "విన్నావా! ఒక్కర్తే ఆనంగాడ్ని వెంటేసుకుని అడవుల్లోకి, కొండల్లోకి వడిపోయిందట. సిగ్గులేదు. పైగా బోనులో నిలబడి ఢంకా బజాయించి మరీ చెప్పుకుంటోంది. పెళ్ళి కూడా అయింది మరి. అవ్వ! ఆడపిల్లకుండవలసిన లక్షణాలేనా యివి? ఎలా పాడైపోతున్నారు? వెనకటి రోజులు కావు" అని ఇంకా వెనకటిరోజులే కొనసాగనందుకు బుగ్గలు నొక్కుకుని గుండెలు బాదుకున్నారు.
    మృదులని కసులుకుని "థాంక్స్" చెప్పాడు అనంగ్.
    "మీరు అంత నిర్భయంగా బోనులో నిలబడి నా తరపున సాక్ష్యం చెప్పబట్టే నేను బయటపడగలిగాను లేకపోతే నన్ను జైలుకు పంపేసి, రాజభూషణం తప్పుకునేవాడు. మెనీమెనీ "థాంక్స్" అన్నాడు.
    "నాకు మీరు థాంక్స్ చెప్పక్కరలేదు. ఈ సందర్భంలో మీరు తప్పు చెయ్యలేదని నాకు రూఢిగా తెల్సు. అందుకే నిజం చెప్పాను. ఒక్క విషయం అర్ధం చేసుకోండి. మనమంతా మధ్యతరగతి మేధావులం. ఎంత కష్టపడి యేం సంపాదించినా రాజభూషణంల్లాగ, శేషాచలపతిలాగ మారిపోలేము. పై వర్గం వాళ్ళతో చేతులు కలపాలని అఱ్ఱులు చాచి బోర్లాపడ్డం కంటే కిందివర్గం వాళ్ళకి చెయ్యందించి మనలో కలుపుకోవడం మంచిది. మీరూ ఆలోచించండి" నవ్వుతూ చెప్పింది మృదుల.
                                                                         *    *    *
    "నేనిదెంతమాత్రం సహించను. నాకు నీమీద ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావు" పిడికిళ్ళు బిగించి అటూ, ఇటూ తిరుగుతూ నిప్పుమీద ఉప్పులా చిటపటలాడుతున్నాడు భాగవతార్.
    "ఇప్పుడేం కొంప మునిగిందని ఇంత రెస్టులెస్ గా అయిపోతున్నావు?" శాంతంగా చిరునవ్వుతో అడిగింది మృదుల. ఆ చిరునవ్వు భాగవతార్ ఇరిటేషన్ ని మరింత ఎక్కువ చేసింది.
    "ఇంతకంటె ఇంకా ఏం కొంప మునగాలో నాకర్ధం కావడంలేదు. రోడ్డు మీద బయల్దేరుతే చాలు, కారులో వెళ్తూన్నా అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నన్ను వేలు పెట్టి చూపిస్తూ. "అదిగోరా! వాడి భార్యే ఒంటరిగా మరెవరితోనో అడవుల్లోబడి మారుమూల గ్రామాలకి ఫిక్ నిక్ కెళ్ళానని సగర్వంగా చెప్పుకుంటోంది. నిండు కోర్టులో బోనులో నిలబడి తన బోయ్ ఫ్రెండ్ కి అనుకూలంగా సాక్ష్యం కూడా చెప్పింది. ఆహ్హహ్హహ్హ" అని నవ్వుతున్నారు. నాకు తలతీసేసినట్లుగా ఉంది."
    మనచుట్టూ ఉన్న సమాజంలో సరికొత్త విలువల్ని రూపొందించుకొంటూ కొత్తబాటల్ని ఏర్పరుచుకుంటూ ముందుకుపోయే వాళ్లూ ఉన్నారు. తాతలనాటి బూజు పట్టిన సిద్ధాంతాలని పట్టుకు వెళ్ళాడుతూ సమాజాన్ని మరింత వెనక్కి గుంజేవాళ్ళూ ఉన్నారు. మనం మూర్ఖుల మాట లక్ష్యపెట్టఖ్కరలేదు లక్షమంది మూర్ఖుల అరుపులకంటె పదిమంది విజ్ఞుల ఉపదేశాలు గొప్పవి." మృదుల ఈ టోన్ లో మాట్లాడినప్పుడల్లా విభ్రాంతిలో మునిగిపోతాడు భాగవతార్. తనకు అందని ఏ శిఖరాగ్రంమీదనో నిలిచి మాట్లాడుతూన్నట్లు తోస్తుంది. కొన్నిసార్లు గౌరవం కలుగుతుంది. చాలాసార్లు భయం కలిగి అది ఇరిటేషన్ గా మారుతుంది. ఇపుడు రెండోదే జరిగింది.
    "నీకు, మీ కుటుంబం వాళ్ళకి సమాజం అంటే లక్ష్యం లేకపోవచ్చును. కాని సమాజంతో సంబంధం ఉన్న కళాకారుణ్ణి నేను. దాన్ని నిర్లక్ష్యం చేసి బ్రతకలేను. అనంగ్ తో కనుకనూర్ నువ్వెళ్ళినందుకే కుమిలి కుమిలి ఛస్తూన్నాను. అది చాలదన్నట్లు కోర్టులో బోనులో నిలబడి చాటుకుంటావా నీ ఘనకార్యాలు?"
    "ఇంతకీ నువ్వనేదేమిటి? నలుగురికీ తెలియకుండా_ బాహాటంగా చెప్పుకోకుండా_ ఏం చేసినా_ ఏం జరిగినా తప్పులేదని" అంతేనా!" ఎప్పటిలా అల్లరిగా నవ్వింది. ఎప్పట్లా ఆమె నవ్వుకి తనను తను మర్చిపోలేకపోయాడు భాగవతార్.
    "జోక్స్ చేయకు. నాకు జీవితంమీదే విరక్తి కలుగుతోంది, నువ్వీ ధోరణి మార్చుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు మరింత స్వేచ్చగా స్వతంత్రంగా నీ యిష్టంవచ్చినట్లు ఊరేగొచ్చు."
    నవ్వు ఆపేసింది మృదుల. కొన్ని నిముషాలు మౌనంగా ఉండి పోయింది అంతే. మళ్ళీ ఎప్పటిలా కాంతివంతమైన నవ్వు పెదవులమీద కొచ్చేసింది. భాగవతార్ మెడచుట్టూ చేతులు వేసి, గుండెమీద తల ఆనించి, "నువ్వు బాధపడకు. నేనేమాత్రం సహించలేనిది అదే. నువ్వెలా వుండమంటావో చెప్పు అలాగే ఉంటాను" అంది.
    తన చెవులు తను నమ్మలేకపోయాడు భాగవతార్. ఎంత ఇరిటేషన్ తో ఎంత తీవ్రంగా మాట్లాడాననుకున్నా, మృదుల తన మాట వింటుందన్న నమ్మకం అతనికే కోశానాలేదు.
    మృదుల రెండు చేతులూ చెక్కిళ్ళ కానించుకుని, "నిజంగానా!" అన్నాడు. పట్టరాని ఆనందంతో తళుక్కున మెరుస్తున్నాయి అతని కళ్ళు. అతని మొహంలో అంత వికాసం చూసి ఎన్నో రోజులైనట్లనిపించింది మృదులకి.
    "నిజంగా. నీ సంగీతం మీద ఒట్టు."
    "ఇదేం ఒట్టు."
    "ఎవరేనా తమకెంతో ఇష్టమైన దానిమీద ఒట్టు పెట్టుకుంటారు అందుకని ...."
    మరోసారి తళుక్కున మెరిసాయి భాగవతార్ కళ్ళు.
    "ఇహమీదట నువ్వు కరదీపిక - సంఘసేవ - అనుకుంటూ అక్కడికి - ఇక్కడికి తిరగడం మానెయ్యాలి."
    "మానేస్తాను."
    "ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతుంది. నేను పాటకచ్చేరీలకి వెళ్ళినప్పుడు నువ్వు కూడా నాతో రావాలి."
    "తప్పకుండా వస్తాను."
    "కొంచెంసేపు సందేహించి "నువ్వు జీన్స్, పాంట్స్, పంజాబీ డ్రెస్సులు మానేసి చీరలు కట్టుకోవాలి.
    "అలాగే"
    మతిపోతోంది భాగవతార్ కి. తనేం చెప్పినా మృదుల వెంటనే ఇలా ఒప్పేసుకోవడం అతనికి సంతోషంగానూ, భయంగానూ ఉంది. "నిజంగా నేనా?" అనుమానంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.

 Previous Page Next Page