Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 32

    "నిజంగా.... నిజంగా.... నిజంగా."
    మృదులని చేతుల్లోకి ఎత్తుకుని గాలిలో గిర్రున తిప్పాడు భాగవతార్. అతని ఉత్సాహానికి పట్టపగ్గాలు లేవు. "సినిమాకి వెళదామా?" అడిగింది మృదుల. డబ్బుకి లోటు లేకపోయినా దంపతులిద్దరికీ ఒకేరోజు తీరిక ఉండకపోవడం వల్ల కలిసి సినిమాకి వెళ్ళే అవకాశాలు తక్కువగా వస్తాయి వాళ్ళకి.
    "వెళ్దాం. అట్నుంచి అటు ఏదేనా హోటల్ కెళ్ళి భోంచేసివద్దాం. వంటమనిషికీ పూట సెలవు." చాలారోజుల తరువాత దంపతులిద్దరూ సినిమాకెళ్ళేరు. సినిమా యేమిటనే ధ్యాస యిద్దరిలో ఎవరికీ లేదు. చిరుచీకట్లో మెత్తని సోఫాల్లో ఎ.సి. హాల్లో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని దగ్గిర దగ్గిరగా కూర్చోవడంలోనే థ్రిల్ ఇద్దరికీ. తెరమీద సినిమా జరుగుతూన్నంతసేపూ ఏదేదో వ్యాఖ్యానాలు చేస్తూ, తను నవ్వుతూ, భాగవతార్ ని నవ్విస్తూనే వుంది మృదుల. స్వర్గపు అంచుల్లో తేలిపోతున్నాడతడు. పెద్ద జరీ బోర్డరన్న వెంకటగిరి చీర కట్టుకుని, చిన్న జడ వేసుకుని, బొట్టూ, కాటుకా పెట్టుకున్న మృదులని ఎంత చూసినా తనివితీరటం లేదతనికి. సినిమా అయిపోయాక ఇద్దరూ హోటల్ సిద్దార్ధలో డిన్నర్ తీసుకున్నారు.
    "ఐస్ క్రీమ్ తింటే నాకు గొంతు పోతుంది" అంటూ స్పూన్ తో భాగవతార్ కి తన ప్లేట్ లో ఐస్ క్రీమ్ కూడా తినిపించసాగింది. నవ్వేడు భాగవతార్. ఎందుకంటే ఎవరు, ఎప్పుడు ఐస్ క్రీమ్ సర్వ్ చేసినా "నా గొంతు పోతుంది" అనడం మానడు భాగవతార్. తను గొప్ప సంగీత విద్వాంసుణ్ని అనే విషయం ఎప్పటికప్పుడు తన చుట్టుపక్కల వాళ్ళకి గుర్తు చేయకపోతే తోచదు. ఆరోజు మాత్రం మృదుల తినిపిస్తూన్న ఐస్ క్రీమ్ ఒద్దనకుండా తినేసాడు. ఆనందతరంగాల్లో తేలిపోతూ ఇంటికొచ్చారు దంపతులు.
    "ఈ వెంకటగిరి జరీ చీర ఇలాగే ఉంచుకోనా? నీకు చాలా ఇష్టం కదా? నేను చీరలో ఉంటే" కొంటెగా అడిగింది మృదుల బెడ్ రూమ్ లో.
    "అమ్మా! ఆశ. దీని పనైపోయింది. ఇప్పుడిహ చీరా వొద్దు, నీ నైటీ వొద్దు."
    మృదుల ఒంటిమీద చీర లాగేసాడు చిలిపిగా, "ఏయ్, ఏయ్" అని అడ్డు పడుతూన్నట్లు నటిస్తూనే అతనికి సహకరించింది. ఒకటిమీది బట్టలు ఒక్కొక్కటి తొలిగిపోతూంటే "అబ్బా నాకు సిగ్గేస్తోంది" అంటూ అతణ్ని హత్తుకుపోయింది. ఆ బరువుకి ఆమెతో సహా డబుల్ కాట్ మీదికి ఒరిగిపోయాడు.
                                 *    *    *
    తెల్లవారుఝామున లేచి సంగీత సాధన చేసుకోవడం భాగవతార్ కి అలవాటు. ఎప్పుడో తప్ప ప్రొద్దెక్కి లేవడు. ఆరోజు అతను కళ్ళు తెరిచేసరికి ఉదయం తొమ్మిది దాటింది. లేవగానే గడియారంవైపు చూడలేదు భాగవతార్. ట్విన్ బెడ్ వైపు చూసేడు. మృదుల లేదక్కడ. బెడ్ రూమ్ అద్దాల కిటికీల తలుపులకి మందమైన తెరలున్నా పైనున్న వెంటిలేటర్స్ లోంచి సూర్యకిరణాలు లోపల్నించి చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి.
    అప్పుడు గడియారం చూసి, బద్దకంగా ఒళ్ళు విరుచుకుని, మంచం నుంచి లేచాడు. కాలం అంత తొందరగా పరిగెత్తడం అతనికి నచ్చలేదు. పేస్టు బ్రష్ మీద వేసుకుని, "రతిసుఖపారే- గతమపిసారే, మదన మనోహర వేషం" అని లో గొంతుతో హమ్ చేసుకుంటూ ఎటాచ్ డు బాత్రూమ్ లో కాలకృత్యాలు తీర్చుకుని, "మృదులా! కాఫీ" అన్నాడు హుషారుగా. ఈ రోజు నుంచీ సరికొత్త జీవితం ప్రారంభం కాబోతుంది తనకు.
    వంటమనిషి కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది అతని ఎదుట. భాగవతార్ ఉత్సాహం పొంగులమీద చన్నీళ్ళు జల్లినట్లయింది. అప్పుడే మృదుల మీద చిరాకు పడ్డానికి మనసురాక, కాఫీ కప్పందుకొని, "అమ్మగారేం చేస్తున్నారు?" అన్నాడు.
    "ఇంట్లో లేరు" తాపీగా చెప్పింది.
    భరించలేక పోయాడు భాగవతార్. నిన్న సాయంత్రమే అన్ని వాగ్దానాలు చేసి, అన్ని ఒట్లు పెట్టి, నిద్రలేవకుండానే బయలుదేరుతుందా! చేతిలో కాఫీకప్పు, విసురుగా గోడకేసి కొట్టాడు. 
    "ఈ మృదులని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. పుట్టింటికి పంపేస్తాను. విడాకులిచ్చేస్తాను...."
    ఈ దేశంలో సగటు మగవాడికి పరంపరంగా అలవాటైన బెదిరింపులన్నీ వల్లించేసాడు.
    అతడు బెదిరింపులన్నీ సాంతంగా విన్నాక అతడి చేతికి కవరందించింది వంటమనిషి. కవరుమీద రాసి ఉన్న పేరు చూస్తూనే అది మృదుల చేతిరాతని గుర్తు పట్టాడు అతని ఎడమకన్నదిరింది. గుండె ప్రళయం రాబోయే ముందు ఉఱుముల్లా కొట్టుకోసాగింది. కవరు పట్టుకున్న చెయ్యి వొణికింది.
    మృదులతో ఇన్నాళ్ళ సాహచర్యం ఆ ఉత్తరంలో ఏమిరాసుందో మనసు చెప్తోంది. ఉత్తరం చింపడానికి భయంగా ఉంది. ఏముందో తెలుసుకుని వెంటనే ఏదో ఒకటి చెయ్యమని మనసు తొందర పెడుతోంది. కవరు చింపాడు.
    "నా బుద్దావతారం."
    నీకు ఎన్నో ఎన్నెన్నో వెరీవెరీ కిసెస్" - గుండెగతి తప్పింది భాగవతార్ కి. కొన్ని నిముషాలు ఉత్తరం వైపు చూపులు తిప్పలేకపోయాడు. చదవక తప్పదుకదా!
    "ఎంత మంచివాడివి నీవు. నాకోసం - నామీది ప్రేమతో- నన్ను ఒదులుకోలేక- నీకేమాత్రం ఇష్టంలేనివి ఎన్నెన్నో భరించావు. నేనేం చేసినా సహించావు. ఇదంతా నేనర్ధం చేసుకోలేదని అనుకోకు. నిజంగా నేను చెపుతున్నాను. నిన్ను నేను నిజంగానే ప్రేమించాను. ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. నిన్ను ఒదిలి వెళ్ళడం నాకిష్టంలేదు. అది నీకూ ఇష్టం ఉండదని నాకు తెలుసు. కాని నువ్వన్నట్లు ఎలాస్టిక్ లిమిట్ దాటి పోయింది. కన్నీళ్ళు నాకలవాటు లేదు కాని, లేకపోతే "కన్నీళ్ళతో విడిపోతున్నాను," అని రాసేదాన్ని, బావురుమని ఏడ్చేసి కళ్ళు తుడిచేసుకొని గుండె బరువు దింపేసుకోగలిగినవాళ్ళు ఎంత అదృష్టవంతులు? కన్నీళ్ళకి ఏ మాత్రం లొంగని మొండి మనసు అనుభవించే రంపపు కోత ఎవరూహించగలరు?
    "నాకెంత కష్టంగా ఉన్నా-నీకెంత ఇష్టం లేకపోయినా ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు నాకు. చిన్నచిన్న కష్టాలు- మనస్తాపాలు- లక్ష్యపెట్టే తత్వంకాదు నాది. అయినా నా కారణంగా మరొకరు బాధపడుతూంటే చూసి సహించలేను. నువ్వు మనసులో దారుణంగా నలిగిపోతూ నామీద ప్రేమతో అంతా సహిస్తున్నావు. అంతేకాని" భార్యాభర్తల్లో ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. వాళ్ళు లైఫ్ పార్టీనర్స్. పరస్పర గౌరవించుకుంటూ చేతనైతే సంహరించుకుంటూ సహజీవనం సాగించాలేగాని, ఒకరిని మరొకరు డామినేట్ చెయ్యకూడదు. ఆ అవసరం లేదు అని గ్రహించలేకపోయావు. ఈరకమైన ఆలోచనా ధోరణిలోకి నీ మనసు రావడంలేదు. నువ్వేకాదు. ఈ దేశంలోని ఏ సగటు మగవాడు అలా ఆలోచించడు. మగవాళ్ళేకాదు, ఆడవాళ్ళూ అలా ఆలోచించరు. భర్త "కాకి తెల్లగా వుందీ" అంటే మనసుకి తప్పని తెలిసినా ఏ మాత్రం ఖండించకుండా, "ఔనండీ! భలే తెల్లగా వుంది" అని ఒప్పేసుకుని భర్తమాట జవదాటని ఉత్తమ ఇల్లాలని పేరుతెచ్చేసుకుంటారు. ఒకవేళ నాబోటి వాళ్ళేవరయినా స్వతంత్రంగా ఆలోచించబోతే తరతరాలుగా భార్యలని డామినేట్ చెయ్యడానికి అలవాటుపడ్డ మగవాళ్ళు సహించలేరు. మగవాళ్ళేకాదు. ఈ పురుష నిర్మిత సమాజంలో ఉన్న - భూమ్మీద పడ్డ మరుక్షణంనుంచీ, బ్రెయిన్ వాష్ చెయ్యబడ్డ ఆడవాళ్ళు సహితం సహించలేరు. "చూశావా! ఎంతగయ్యాళిదో? మొగుడి మాట ఖాతరు చెయ్యదు." అనివాళ్ళే బుగ్గలు నొక్కుకుంటారు.
    "నాకు తెలుసు తప్పకుండా స్త్రీ తన స్వతంత్ర వ్యక్తిత్వంతో నిలిచే రోజు వస్తుంది. అప్పటివరకూ మాలాగ ముందునడిచే వాళ్ళకి ఎదురు దెబ్బలు తప్పవు. ఈనాడు స్త్రీవిద్య అత్యంత సహజమైపోయింది. సమాజంలో, బాల్యవివాహాలు అనాగరికమని అందరూ ఒప్పుకుంటున్నారు. వితంతు వివాహాలని- కులాంతర వివాహాలని అభినందిస్తున్నారు. ఈ మార్పులన్నీ ఒక్కరోజులో రాలేదు. ఈ మార్పులకు కారణమైన ఎందరో, ఎన్నెన్నో ఆటుపోటులు ఎదుర్కొన్నాక- ఎన్నెన్నో సంఘర్షణలు చెలరేగేక- ఇన్నేళ్ళకి ఇవి అత్యంత సహజమైన ఆచారాలుగా సమాజంలో స్థిరపడిపోయాయి. ఇప్పటివరకూ వచ్చిన మార్పులు భౌతికమైనవి. మేం తేవాలనుకుంటున్న మార్పు మానసికమైనది. ఇది రావడానికి ఎంతకాలం పట్టినా ఫరవాలేదు. నేను, నా వారసులూ దీనికోసం ప్రయత్నిస్తూనే వుంటాం.  
    చెప్పానుకదూ! నాకారణంగా మరొకరు బాధపడితే నేను సహించలేను. నువ్వెంత క్షోభిస్తున్నావో అర్ధం చేసుకున్నాను. పాపం నీ అంతట నువ్వు నన్ను వెళ్ళిపొమ్మనలేవు. అందుకే నీకోసం నేనేవెళ్ళిపోతున్నాను. ఇప్పుడిహ ఎవ్వరూ నీవేపు వేలు చూపించి నవ్వారు. నువ్వు సిగ్గుతో తల దించుకోఖ్కరలేదు. అపరాధం చేసిన భార్యని (అపరాధమా?) శిక్షించి ఇంట్లోంచి తరిమేసిన భర్తగా సగర్వంగా రొమ్ము విరుచుకుని తిరగొచ్చు. అప్ కోర్స్, అప్పుడు నీ గౌరవం ఎంత పెరుగుతుందో నేనూహించలేను. ఇలాంటి విలువలు నాకర్ధం కావు.
    నిన్న నీకు బోల్డు అబద్ధాలు చెప్పాను. ఐయామ్ సారీ! వెళ్తూ వెళ్తూ, ఒక తియ్యని అనుభూతి వీడ్కోలు కానుకగా తీసుకుపోదామనుకున్నాను.
    కోపం తెచ్చుకోవు కదూ!
    నువ్వు నాకు ప్రెజెంట్ చేసిన ఎంగేజ్ మెంట్ రింగ్ నీ డ్రాయర్ లో పెట్టాను. మరో బుద్ధిమంతురాలైన పిల్లని పెళ్ళి చేసుకుంటూన్నప్పుడు ఆమెకి నా బహుమానంగా ఇయ్యి. నీక్కోపం వచ్చినా, ఇక్కడ చలం రాసిన మాటలు చెప్పాలని ఉంది. "భర్త హోదాలో ఉన్న మగవాడు భార్య ఎదురు తిరిగి సమాధానం చెప్తే సహించలేక తన శక్తి యుక్తులన్నీ ప్రయోగించి ఆమెని తన నీడగా మార్చేసుకుంటాడు. చివరికి ఆ నీడతో జీవించలేక స్వతంత్ర వ్యక్తిత్వంగల మరో ఆడదానికోసం వెంపర్లాడతాడు" ఎంతనిజం? ఈమాటలు.  

 Previous Page Next Page